విశాఖలో అపోలో క్యాన్సర్ ఆస్పత్రి
♦ 6 నెలల్లో వైద్య సేవలు అందుబాటులోకి
♦ అపోలో చైర్మన్ ప్రతాప్ సి రెడ్డి
సాక్షి, విశాఖపట్నం: విశాఖలోని హెల్త్‌సిటీలో ప్రపంచశ్రేణి ప్రమాణాలతో వంద పడకల క్యాన్సర్ ఆస్పత్రిని ఏర్పాటు చేయనున్నట్టు అపోలో ఆస్పత్రుల గ్రూప్ చైర్మన్ ప్రతాప్ సి రెడ్డి తెలిపారు. మరో ఆరు నెలల్లో వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. శుక్రవారం విశాఖలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నగర శివారులోని హెల్త్‌సిటీలో రూ.150 కోట్లతో ఎనిమిది ఎకరాల్లో నిర్మించిన ఆస్పత్రిని శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు లాంఛనంగా ప్రారంభిస్తారని చెప్పారు. 250 పడకలున్న ఈ ఆస్పత్రిలో ప్రముఖ వైద్య నిపుణులు, అత్యాధునిక వైద్య పరికరాలతో అన్ని స్పెషాలిటీ వైద్యసేవలు అందుబాటులో ఉంటాయన్నారు. భవిష్యత్తులో ఈ ఆస్పత్రిని విస్తరిస్తామన్నారు.
గత ఏడాది రికార్డు స్థాయిలో 1.64 లక్షల పల్మనరీ సర్జరీలు చేశామన్నారు. అపోలో హాస్పిటల్స్ గ్రూప్ 35 దేశాలతో టెలిమెడిసిన్ కనెక్టివిటీ కలిగి ఉందన్నారు. గుండె శస్త్రచికిత్సలు విదేశాల్లో కంటే భారత్‌లోనే తక్కువ ఖర్చుతో అవుతున్నాయన్నారు. గుండె మార్పిడికి అమెరికాలో 6.5 లక్షల డాలర్లవుతుంటే భారత్‌లో 50 వేల డాలర్లకే జరగుతున్నాయని చెప్పారు. అందువల్ల ఇతర దేశాల నుంచి మనదేశానికే ఎక్కువ మంది హృద్రోగ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ చికిత్సలకు వస్తున్నారన్నారు. భారత్‌లో 2030 నాటికి గుండెజబ్బులు, క్యాన్సర్, షుగర్ వంటి అంటుయేతర వ్యాధుల(నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్)తో మరణించే వారి సంఖ్య 3.60 కోట్లకు చేరుకుంటుందని ప్రతాప్ సి రెడ్డి తెలిపారు. ఇది ఇతర దేశాలతో పోల్చుకుంటే 4 రెట్లు అధికమన్నారు. విలేకరుల సమావేశంలో అపోలో గ్రూప్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ హరిప్రసాద్, సీఈవో డాక్టర్ సందీప్ పాల్గొన్నారు.