health city
-
దసరా నాటికి వరంగల్ హెల్త్ సిటీ
సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న వరంగల్ హెల్త్ సిటీ నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ఆర్అండ్బీ అధికారులను ఆదేశించారు. దసరా నాటికి పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. గ్రేటర్ పరిధితోపాటు, నగర శివారు ప్రాంత ప్రజలకు సూపర్ స్పెషాలిటీ సేవలు మరింత చేరువ చేసే లక్ష్యంతో ఏర్పాటు చేస్తున్న సనత్‌నగర్, ఎల్బీ నగర్, అల్వాల్ టిమ్స్ ఆసుపత్రుల నిర్మాణాలు వేగవంతం చేయాలని ఆదేశించారు. ఆయా పనుల పురోగతి, ఇతర అంశాలపై మంత్రి హరీశ్‌రావు బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించే దిశగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇందులో భాగంగా ఒక వైపు వైద్యం, మరోవైపు వైద్యవిద్యను విస్తృతం చేస్తున్నట్లు చెప్పా రు. వరంగల్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి పూర్తయితే మెడికల్ హబ్ గా మారుతుందన్నారు. ఇందులో అత్యా ధునిక వైద్య పరికరాలు సమకూర్చుతున్నట్లు చెప్పారు. అత్యాధునిక మాడ్యులర్ థియేటర్లు, ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందే అవకాశాలు లేకుండా ఎయిర్ హ్యాండ్లింగ్ యూనిట్స్ ఏర్పాటు చేయాలన్నారు. ఢిల్లీలోని ఎయిమ్స్ తరహాలో టిమ్స్ సేవలు ఉండాలన్నది సీఎం కేసీఆర్ సంకల్పమని చెప్పారు. ఒక్కొక్కటి వెయ్యి పడకలతో ఉన్న ఈ ఆసుపత్రులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి వచ్చేలా కృషి చేయాలని, 8 బోధనాస్పత్రుల నిర్మాణ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ ఏడాది ప్రారంభం కానున్న 9 వైద్య కాలేజీల డిజైన్లు రూపొందించాలని చెప్పారు. వరంగల్ హెల్త్ సిటీ, టిమ్స్ నిర్మాణాలకు వైద్య ఆరోగ్య శాఖ తరపున అన్ని చర్యలు పూర్తి చేసినట్లు తెలిపారు. కాబట్టి ఆర్అండ్బీ అధికారులు పనులు వేగవంతం చేయా లని, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా విస్తరించుకునే విధంగా నిర్మాణాలు ఉండాలని సూచించారు. ఈ సమీక్షలో వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ, ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్ శ్వేత మహంతి, డీఎంఈ రమేశ్‌రెడ్డి, ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు, వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్ కుమార్, సీఎం ఓఎస్డీ గంగాధర్, అరోగ్యశ్రీ సీఈవో విశాలాక్షి, ఆర్అండ్బీ ఈఎన్సీ గణపతిరెడ్డి, టీఎస్ఎంఎస్ఐడీసీ సీఈ రాజేందర్, నిమ్స్ డైరెక్టర్ బీరప్ప, ఇతర అధికారులు పాల్గొన్నారు. కొత్త ఈహెచ్ఎస్ విధానం వేగవంతం: హరీశ్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న నగదు రహిత ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్ఎస్)పై ఉద్యోగులు, టీచర్ల సంఘాల ప్రతినిధులతో చర్చించి, పది రోజుల్లో నివేదిక రూపొందించాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. ఈ మేరకు బుధవారం ఆయన ఆరోగ్యశ్రీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల వినతి మేరకు కొత్త ఈహెచ్ఎస్ విధానాన్ని ఈ ఆర్థిక సంవత్సరంలో తీసుకువస్తామని అసెంబ్లీలో ప్రకటించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో జరిగిన సమీక్షలో ఆ దిశగా చర్యలు వేగవంతం చేయాలని హరీశ్ రావు ఆరోగ్యశ్రీ సీఈవో విశాలాక్షిని ఆదేశించారు. ఆరోగ్యశ్రీ సేవలు ప్రజలకు మరింత చేరువ అయ్యేలా కృషి చేయాలని, అందుతున్న సేవల గురించి స్వయంగా వెళ్లి తెలుసుకోవాలని సూచించారు. వారానికి మూడు ఆసుపత్రులు సందర్శించాలని ఆదేశించారు. కాగా ఆరు వైద్య కళాశాలలకు అనుమతులు రావడం పట్ల మంత్రి సంతోషం వ్యక్తం చేశారు. -
ఇక ప్రజారోగ్యానికి మహర్దశ
దశాబ్దాలుగా సర్కారు వైద్యంపై పాలకులు చూపిన అంతులేని నిర్లక్ష్యం వల్ల ప్రజలు ప్రభుత్వ వైద్యంపై నమ్మకం కోల్పోయి, ప్రైవేటు వైద్యం వైపు మళ్లారు. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వం వైద్య రంగానికి విశేష ప్రాధాన్యం ఇస్తూ పేదలకు సర్కారు వైద్యం పట్ల మళ్లీ నమ్మకాన్ని కలిగిస్తోంది. పేదలకు ఉచితంగా నాణ్యమైన, ఆధునిక వైద్యం అందించాలనే ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ఆలోచనలు ఆచరణలోకి వస్తున్నాయి. ఒకవైపు ‘ఆరోగ్యశ్రీ’ పథకాన్ని అమలుచేస్తూ పేదలకు కార్పొరేట్ వైద్యాన్ని ఉచితంగా అందిస్తూనే... మరోవైపు ప్రభుత్వ వైద్య వ్యవస్థను బలోపేతం చేసేందుకు విప్లవాత్మక అడుగులు వేస్తున్నారు. హైదరాబాద్ నలు మూలలా నాలుగు తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్), వరంగల్‌లో హెల్త్ సిటీ, 33 జిల్లా కేంద్రాల్లో మెడికల్ కాలేజీల ఏర్పాటు వంటి చారిత్రక నిర్ణయాలతో ప్రభుత్వ వైద్య వ్యవస్థకు జీవం పోస్తున్నారు. కరోనా విలయతాండవం చేస్తున్న సమయంలో యుద్ధప్రాతిపాదికన గచ్చిబౌలిలో ఖాళీగా ఉన్న భవనాలను వినియోగించుకొని 1,500 పడకలతో మొదటి టిమ్స్ ఆసుపత్రిని తెలంగాణ ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చింది. వేలాదిమంది కరోనా రోగులకు ఈ ఆసుపత్రి వైద్యాన్ని అందించి జీవం పోసింది. ఇదే స్ఫూర్తితో నగరానికి మిగతా మూడు వైపులా కూడా టిమ్స్‌లు నిర్మించాలనే బృహత్తర ఆలోచనను ముఖ్య మంత్రి కేసీఆర్ చేశారు. ఈ నేపథ్యంలోనే ఏప్రిల్ 26వ తేదీన రూ. 2,679 కోట్లతో సనత్‌నగర్, అల్వాల్, ఎల్బీనగర్లో ‘తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్’ (టిమ్స్) నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. సనత్‌నగర్ పరిధిలోని ఎర్రగడ్డ చెస్ట్ హాస్పిటల్ ప్రాంగణంలో, ఎల్బీ నగర్‌లోని గడ్డి అన్నారం ఫ్రూట్ మార్కెట్ ప్రాంగణంలో, అల్వాల్‌లోని బొల్లారంలో టిమ్స్‌లు నిర్మాణం అవుతున్నాయి. ప్రతీ ఆసుపత్రిలో వెయ్యి పడకలు ఏర్పాటు చేయనున్నారు. ఇందులో 300 పడకలు ఐసీయూలో ఉంటాయి. అన్ని పడకలకు ఆక్సిజన్ సదుపాయం ఉంటుంది. ఒక్కో టిమ్స్ 13.71 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మితమవుతోంది. మొత్తం 30 విభాగాల్లో 200 మంది టీచింగ్ డాక్టర్లు, 500 మంది రెసిడెంట్ డాక్టర్లు సేవలు అందిస్తారు. ప్రతి టిమ్స్‌లో 16 ఆపరేషన్ థియేటర్లను ఏర్పాటు చేయనున్నారు. ఈ టిమ్స్ నిర్మాణం పూర్తి అయితే ప్రస్తుతం ఉన్న గాంధీ, ఉస్మానియా, నిమ్స్ ఆసుపత్రులపైన ఒత్తిడి తగ్గుతుంది. ఆయా ఆసుపత్రు ల్లోనూ వైద్య సేవలు మరింత మెరుగయ్యే అవకాశం ఉంటుంది. గ్రామస్థాయి నుంచి ప్రభుత్వ వైద్య రంగాన్ని బలోపేతం చేసి ప్రజలకు నమ్మకం కలిగించాలనేది ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన. బస్తీల్లో బస్తీ దవాఖానాలు అద్భుతంగా సేవలు అందిస్తున్నాయి. పల్లెల్లో పల్లె దవాఖానాల ఏర్పాటుకు ప్రభుత్వం నడుం బిగించింది. గతంలో మెడికల్ కాలేజీల ఏర్పాటు దశాబ్దాల కోరికగా ఉండేది. మెడికల్ కాలేజీల కోసం ఉద్యమాలు జరిగేవి. కానీ, ఇప్పుడు 33 జిల్లాల్లో 33 మెడికల్ కాలేజీల ఏర్పాటు కోసం ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. (చదవండి: భూ రికార్డుల ప్రక్షాళన ఎప్పుడు?) ఇక వరంగల్‌లో రూ.1,100 కోట్లతో ప్రభుత్వం నిర్మిస్తున్న హెల్త్ సిటీ కూడా ప్రభుత్వ వైద్య వ్యవస్థలో గొప్పగా నిలవబోతోంది. అలాగే ఇప్పటికే ఉన్న ఎంజీఎంతో పాటు కాకతీయ మెడికల్ కాలేజీని కలిపి వరంగల్ హెల్త్ సిటీ ఏర్పాటు చేయబోతున్నారు. ఉమ్మడి వరంగల్‌తో పాటు ఖమ్మం, కరీంనగర్ జిల్లాల ప్రజలు వైద్యం కోసం వరంగల్‌కు వస్తుంటారు. అందువల్ల హెల్త్ సిటీ నిర్మాణం చాలా మేలు చేయబోతోంది. ఈ విధంగా ప్రభుత్వం పేద ప్రజలకు రూపాయి ఖర్చు లేకుండా నాణ్యమైన వైద్యాన్ని అందించే బృహత్తర యజ్ఞాన్ని ప్రారంభించింది. (చదవండి: కోఠి కాలేజ్ భవితవ్యం ఏమిటి?) - డాక్టర్ ఎన్. యాదగిరి రావు వ్యాసకర్త జీహెచ్ఎంసీ అదనపు కమీషనర్ -
విశాఖలో అరుదైన శస్త్రచికిత్స
ఆరిలోవ (విశాఖ తూర్పు): విశాఖ హెల్త్‌సిటీలోని మెడికవర్ ఆస్పత్రి వైద్యులు కోమాలో ఉన్న మహిళకు అరుదైన శస్త్రచికిత్స చేసి ఆమెను బతికించారు. డాక్టర్ శివశంకర్ దలై ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు. రాజమహేంద్రవరం దరి సీతానగరానికి చెందిన సీహెచ్ సుబ్బలక్ష్మి (50) తీవ్ర తలనొప్పితో కోమాలోకి వెళ్లిపోయారు. ఆమెను కుటుంబ సభ్యులు విశాఖ మెడికవర్ ఆస్పత్రిలో చేర్పించారు. డాక్టర్ శివశంకర్ దలై ఆమెకు పరీక్షలు నిర్వహించి.. దమనుల్లో వాపు వచ్చి రక్తస్రావం జరిగినట్లు గుర్తించారు. ఆమె అనిరుజం అనే వ్యాధికి గురైందని, దానివల్ల మెదడుపై తీవ్ర ప్రభావం పడిందన్నారు. ఆమెకు వెంటనే ‘న్యూ ఫ్లో డైవర్షన్ ట్రీట్మెంట్’ పేరుతో ఆధునిక పద్ధతిలో శస్త్రచికిత్స చేసి.. మెదడులో రక్తస్రావాన్ని నియంత్రించినట్టు చెప్పారు. ప్రస్తుతం ఆమె మెదడులో రక్త ప్రసరణ క్రమపద్ధతిలో జరుగుతోందన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఇటువంటి శస్త్రచికిత్సను మొదటిసారిగా మెడికవర్ ఆస్పత్రిలో నిర్వహించినట్టు తెలిపారు. ఆపరేషన్ జరిగిన 96 గంటల్లోనే రోగి కోలుకుందన్నారు. ఈ సందర్భంగా సుబ్బలక్ష్మి బంధువులు ఆస్పత్రి వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు. -
విశాఖలోని ఆస్పత్రిపై కేసు నమోదు
ఆరిలోవ (విశాఖ తూర్పు): విశాఖ హెల్త్‌సిటీలోని గొలగాని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (జిమ్స్)లో అక్రమాల బాగోతం బట్టబయలైంది. కరోనా రోగుల నుండి ఇష్టారీతిన ఫీజులు వసూలు చేస్తున్న ఆస్పత్రి యాజమాన్యంపై కేసు నమోదైంది. ఆరిలోవ సీఐ ఇమాన్యుయేల్ రాజ్ తెలిపిన వివరాలు ప్రకారం.. హెల్త్‌సిటీలోని కార్పొరేట్ ఆస్పత్రుల్లో కరోనా రోగుల నుంచి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నట్లు వస్తున్న ఆరోపణలపై విచారించేందుకు విశాఖ జిల్లా కలెక్టర్ వినయ్‌చంద్ ముగ్గురు సభ్యులతో కూడిన ‘డిస్ట్రిక్ట్ లెవెల్ ఫ్లైయింగ్ స్క్వాడ్’ను ఏర్పాటు చేశారు. జిమ్స్‌లో ‘కుమార్స్ హాస్పిటల్ ప్రైవేట్ లిమిటెడ్’ పేరుతో నిర్వహిస్తున్న ఆస్పత్రిపై ఈ బృందం దర్యాప్తు చేపట్టింది. నేరుగా పలువురు కోవిడ్ పేషెంట్ల కుటుంబసభ్యులను సంప్రదించి వివరాలు సేకరించింది. వారిలో ఓ రోగి నుంచి సుమారు రూ.7 లక్షలు వసూలు చేసి, రూ.1.20 లక్షలకు మాత్రమే బిల్లు ఇచ్చినట్లుగా గుర్తించారు. డబ్బులు లేకపోవడంతో రూ.3 లక్షలకు షూరిటీగా చెక్కు తీసుకుని మృతదేహాన్ని అప్పగించారని మరో కుటుంబం ఆధారాలతో సహా వివరించింది. ఆ ఆధారాలతో ఈ నెల 6, 7 తేదీలలో జిమ్స్ ఆస్పత్రిని సందర్శించి రికార్డులు, బిల్లులు పరిశీలించారు. ఈ పరిశీలనలో బాధితులు చెప్పినవన్నీ నిజమేనని తేలింది. అంతేకాకుండా రెమ్‌డెసివర్ ఇంజక్షన్ల దుర్వినియోగానికి పాల్పడుతున్నట్లు గుర్తించారు. ఈ అక్రమాలన్నింటిపై ఫ్లయింగ్ స్క్వాడ్ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ‘డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్’ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ ఇమాన్యుయేల్‌రాజ్ తెలిపారు. ఇదిలా ఉండగా, హెల్త్‌సిటీలో చాలా ఆస్పత్రుల్లో ఇదే విధంగా దోపిడీ సాగుతోందని, వాటిపై కూడా కలెక్టర్ దృష్టి పెట్టాలని పలువురు కోరుతున్నారు. -
అమరావతిలో హెల్త్‌సిటీకి భూమిపూజ
అమరావతి: రాజధాని అమరావతిలో మరో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుకు బుధవారం భూమిపూజ జరిగింది. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం యర్రబాలెంలో ఇండో-యూకే ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హెల్త్ సిటీకి ఆ సంస్థ సీఈవో అజయ్ రాజన్ గుప్తా కుటుంబసభ్యులతో కలిసి భూమిపూజ చేశారు. మూడుదశల్లో 150 ఎకరాల్లో నిర్మించే ఆస్పత్రి నిర్మాణానికి మొత్తం రూ.1,700 కోట్లు పెట్టుబడి పెట్టనున్నారు. మొదటి దశలో రూ.500 కోట్ల వ్యయంతో 50 ఎకరాల్లో అత్యాధునిక ఆస్పత్రి నిర్మించనున్నారు. 2019లోపు తొలిదశ నిర్మాణాలు పూర్తి చేస్తారు. నిర్మాణానికి కావాల్సిన మౌలిక వసతులను సీఆర్డీఏ అధికారులు సమకూర్చుతారు. తొలిదశలో 250 పడకల ఆస్పత్రి నిర్మాణం చేయనున్నారు. ఇందులో 20 శాతం భూములిచ్చిన రైతులు, స్థానికులకు ఉచితంగా వైద్యం అందించనున్నారు. 2022 లోపు మూడు దశల్లో ఆస్పత్రి నిర్మాణం పూర్తి కానుంది. -
విశాఖలో అపోలో క్యాన్సర్ ఆస్పత్రి
♦ 6 నెలల్లో వైద్య సేవలు అందుబాటులోకి ♦ అపోలో చైర్మన్ ప్రతాప్ సి రెడ్డి సాక్షి, విశాఖపట్నం: విశాఖలోని హెల్త్‌సిటీలో ప్రపంచశ్రేణి ప్రమాణాలతో వంద పడకల క్యాన్సర్ ఆస్పత్రిని ఏర్పాటు చేయనున్నట్టు అపోలో ఆస్పత్రుల గ్రూప్ చైర్మన్ ప్రతాప్ సి రెడ్డి తెలిపారు. మరో ఆరు నెలల్లో వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. శుక్రవారం విశాఖలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నగర శివారులోని హెల్త్‌సిటీలో రూ.150 కోట్లతో ఎనిమిది ఎకరాల్లో నిర్మించిన ఆస్పత్రిని శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు లాంఛనంగా ప్రారంభిస్తారని చెప్పారు. 250 పడకలున్న ఈ ఆస్పత్రిలో ప్రముఖ వైద్య నిపుణులు, అత్యాధునిక వైద్య పరికరాలతో అన్ని స్పెషాలిటీ వైద్యసేవలు అందుబాటులో ఉంటాయన్నారు. భవిష్యత్తులో ఈ ఆస్పత్రిని విస్తరిస్తామన్నారు. గత ఏడాది రికార్డు స్థాయిలో 1.64 లక్షల పల్మనరీ సర్జరీలు చేశామన్నారు. అపోలో హాస్పిటల్స్ గ్రూప్ 35 దేశాలతో టెలిమెడిసిన్ కనెక్టివిటీ కలిగి ఉందన్నారు. గుండె శస్త్రచికిత్సలు విదేశాల్లో కంటే భారత్‌లోనే తక్కువ ఖర్చుతో అవుతున్నాయన్నారు. గుండె మార్పిడికి అమెరికాలో 6.5 లక్షల డాలర్లవుతుంటే భారత్‌లో 50 వేల డాలర్లకే జరగుతున్నాయని చెప్పారు. అందువల్ల ఇతర దేశాల నుంచి మనదేశానికే ఎక్కువ మంది హృద్రోగ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ చికిత్సలకు వస్తున్నారన్నారు. భారత్‌లో 2030 నాటికి గుండెజబ్బులు, క్యాన్సర్, షుగర్ వంటి అంటుయేతర వ్యాధుల(నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్)తో మరణించే వారి సంఖ్య 3.60 కోట్లకు చేరుకుంటుందని ప్రతాప్ సి రెడ్డి తెలిపారు. ఇది ఇతర దేశాలతో పోల్చుకుంటే 4 రెట్లు అధికమన్నారు. విలేకరుల సమావేశంలో అపోలో గ్రూప్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ హరిప్రసాద్, సీఈవో డాక్టర్ సందీప్ పాల్గొన్నారు. -
రాజధానిలో తొమ్మిది ప్రత్యేక నగరాలు
‘మాస్టర్‌ప్లాన్’లో ఇవే అమరావతికి ఆకర్షణలు సాక్షి, విజయవాడ బ్యూరో : రాజధాని మాస్టర్‌ప్లాన్‌లో వివిధ రంగాలకు సంబంధించి తొమ్మిది ప్రత్యేక (థీమ్ సిటీలు) నగరాలను ప్రతిపాదించారు. దేనికదే ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలనుకుంటున్న వీటిని అమరావతికే ఆకర్షణ అని చెబుతున్నారు. గవర్నమెంట్ సిటీ 564 హెక్టార్లలో నిర్మించే ప్రభుత్వ నగరంలో రెండు టౌన్‌షిప్‌లు నిర్మించనున్నారు. అసెంబ్లీ, సచివాలయం, ముఖ్యమంత్రి నివాసం, రాజ్‌భవన్, విభాగాధిపతుల కార్యాలయాలను ఈ నగరంలో నిర్మిస్తారు. అసెంబ్లీ భవనాన్ని అత్యద్భుత రీతిలో నిర్మించి పర్యాటకులను ఆకర్షించాలని ప్రతిపాదించారు. జస్టిస్ సిటీ ప్రభుత్వ నగరానికి దక్షిణం వైపున జస్టిస్ సిటీని నిర్మించనున్నారు. కోర్టులు, వాటి అనుబంధ సౌకర్యాలతో 566 హెక్టార్లలో ఈ నగరాన్ని ఏర్పాటు చేస్తారు. ఫైనాన్స్ సిటీ వాటర్‌ఫ్రంట్‌కు ఎదురుగా ఆర్థిక కార్యకలాల కేంద్రమైన సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్‌ను ఫైనాన్స్ సిటీ పేరుతో ఏర్పాటు చేస్తారు. 566 హెక్టార్లలో నిర్మితమయ్యే ఈ నగరంలో వాణిజ్య భవనాలు, బహుళ ప్రయోజన అభివృద్ధి కార్యకలాపాల కేంద్రాలుంటాయి. రాజధాని నగరంలోని అన్ని ప్రాంతాల వారు ఇక్కడికి చేరుకునేందుకు అనువుగా రెండు ఎంఆర్టీ (మెట్రో) లైన్లు ప్రతిపాదించారు. వాటర్‌ఫ్రంట్ ప్లాజా, రిక్రియేషనల్ ఐల్యాండ్ నగరంలో ప్రత్యేక ఆకర్షణలుగా తీర్చిదిద్దనున్నారు. వాటర్‌ఫ్రంట్ ప్లాజాలో రెండు ఐకానిక్ టవర్లుంటాయి. నాలెడ్జ్ సిటీ జస్టిస్, ఆర్థిక నగరాలకు దక్షిణం వైపు విద్య, విజ్ఞాన నగరాన్ని ప్రతిపాదించారు. నాలెడ్జ్ పార్కు, హౌసింగ్ యూనివర్సిటీ క్యాంపస్, పలు కళాశాలలతో 1,445 హెక్టార్లలో ఈ నగరం ఏర్పాటవుతుంది. 2050 నాటికి ఈ నగరంలో 1.20 లక్షల ఉద్యోగాల కల్పనతోపాటు 5,73,575 మంది నివాసం ఉండేలా తీర్చిదిద్దాలనేది లక్ష్యం. ఎలక్ట్రానిక్స్ సిటీ దక్షిణ భారతదేశంలోని ప్రముఖ ఐటీ, ఎలక్ట్రానిక్ పరిశ్రమలను ఈ నగరంలో నెలకొల్పాలని లక్ష్యం. 731 హెక్టార్లలో నిర్మించే ఈ నగరంలో 2,73,500 నైపుణ్య ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యం నిర్దేశించారు. హెల్త్ సిటీ 1,349 హెక్టార్లలో నిర్మించే హెల్త్ సిటీలో 1.5 లక్షల ఉద్యోగాలు కల్పించాలనేది లక్ష్యం. స్పోర్ట్స్ సిటీ క్రీడా నగరంలో భారీ స్టేడియాలు, ఈవెంట్ కేంద్రాలు, అంతర్జాతీయ స్థాయి క్రీడా కేంద్రాలను నెలకొల్పుతారు. 650 హెక్టార్లలో ఈ నగరాన్ని నిర్మిస్తారు. మీడియా సిటీ అనంతవరం సమీపంలో మీడియా, కల్చరల్ నగరాన్ని 677 హెక్టార్లలో నిర్మించనున్నారు. సాంస్కృతిక, కళా కేంద్రాలు ఏర్పాటు చేసి 1.5 లక్షల మందికి వాటిల్లో ఉద్యోగాలు కల్పించాలని పేర్కొన్నారు. టూరిజం సిటీ ఉండవల్లి గుహల మీదుగా కృష్ణానదికి అభిముఖంగా 531 హెక్టార్లలో పర్యాటక నగరాన్ని నిర్మిస్తారు. వాటర్ టూరిజం ప్రత్యేక ఆకర్షణగా తీర్చిదిద్దాలని ప్రతిపాదించారు. -
మనది హెల్దీరాబాద్!
-యాసీన్ హైదరాబాద్‌ను హెల్త్ సిటీ అని ఇప్పుడంటున్నారుగానీ... అలనాడెప్పుడో నగర పాలకులు దీన్ని హెల్త్ సిటీ చేసే పాలసీ పెట్టుకున్నారేమో అని నా అనుమానం. అందుకే మహా ఇంజినీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్యగారితో పాటు అనేక మంది డాక్టర్లనూ సంప్రదించి సిటీలోని అనేక ఏరియాలకు పోషకాహారాలకు సంబంధించిన పేర్లు పెట్టారేమోనని నా అభిప్రాయం. ఉదాహరణకు చిక్కడపల్లి తీసుకోండి. దాని అసలు పేరు చిక్కుడు ప్లస్ పల్లీలట. పల్లీలంటే మనం తినే వేరుశెనగలు కాదు. బిన్నిస్ పల్లీ, గోకరకాయ లాంటి బీన్స్ జాతి పల్లీలన్నమాట. అందుకే చిక్కుళ్లూ... పల్లీజాతి కూరగాయలు తింటే ఆరోగ్యానికి మంచిదనే స్ఫూర్తిని నింపడానికి సదరు లొకాలిటీకి చిక్కుడుపల్లీ అనే పేరు పెడితే కాలక్రమాన అదే చిక్కడ్పల్లీ అయ్యిందని అనేక మంది స్థానికుల ఉవాచ. ఇక నేరేడ్మెట్ విషయానికి వద్దాం. భవిష్యత్తులో మన సిటీ డయాబెటిస్ క్యాపిటల్ అవుతుందని ముందే ఊహించారో ఏమోగానీ... ‘అతిమూత్ర వ్యాధికి నేరేడు’ అని క్లాస్ రూమ్ పాఠాలు వీధులకూ చేరాలని ఆ ఏరియాకు ‘నేరేడ్మెట్’ అని పేరు పెట్టారు. వాళ్ల ఉద్దేశం ఏమిటంటే... నేరేడు పండ్లు ఎక్కువగా తింటే డయాబెటిస్ దరిచేరదని. కానీ... మన నగరవాసులు నేరేడు పండ్లను మరచిపోయి... బతుకు మెట్లను వేగంగా ఎక్కాలన్న ఉద్దేశంతో సెకండ్ హాఫ్‌నే పట్టుకున్నారు. ఈలోపు డయాబెటిస్ నగరంలో తిష్టవేసేసి ప్రపంచంలోనే హైదరాబాద్‌ను స్వీటెస్ట్ క్యాపిటల్‌గా మార్చేసింది. ఇక మరో దృష్టాంతానికి వద్దాం. నిజానికి అందంగా కనిపించే ఆపిల్ కంటే జాంపండ్లలోనే పోషకాలూ, విటమిన్లూ ఎక్కువ అనే ఉద్దేశంతో... జనాలు వాటిని విస్తృతంగా తినాలని ‘జాంబాగ్’ అనే మరో ఏరియాకు పేరు పెట్టి జామపండ్లను తగురీతిన సత్కరించారు. జామ ఆరోగ్యం కోసం తింటారో తినరో అని డౌటొచ్చి... ఉప్పుగూడ అనే మరో ప్రాంతానికి ఉప్పు పేరు పెట్టేసి... జాంపండు ముక్కలకు ఉప్పు రాసుకుని తినే అలవాటును మన సంస్కృతీ సంప్రదాయాల్లో భాగంగా చేసేశారు. అందుకే మన సిటీలోని తోపుడు బండ్ల మీద జాంపండ్లూ... ప్లస్ ఉప్పూకారం కనిపిస్తుంటాయి. అలాగే సితాఫల్‌మండీ ఏరియాలో సీతాఫలాలను పెద్ద ఎత్తున కుప్పలుబోసి మోతీదర్వాజా దగ్గర ముత్యాల కుప్పలకు దీటుగా అమ్మేవారట. ఇక ముషీరాబాద్‌లో నిన్నటి వరకూ రాజాడీలక్స్ అనీ, అంతకుముందు రహత్మహల్ అని పిలిచే సాయిరాజా సినిమాహాల్ వెనక ఉన్న భాగాన్ని అంగూర్బాగ్ అని పిలిచే వారట. అంతెందుకు మాంసాహారం కంటే శాకాహారం మంచిదనే ఉద్దేశంతోనే గడ్డీగాదం తింటే దీర్ఘాయుష్షు అనే కాన్సెప్టుతోనే గడ్డి అన్నారం అని పేరు పెట్టి ఆ పేరుకు న్యాయం జరిగేలా అక్కడ అన్నిరకాల పండ్లూ ఫలాలూ అమ్ముతుంటారని నా ఉద్దేశం. వీటన్నింటిని బట్టీ నాకు అనిపిస్తోందేమిటంటే... మహానుభావుడైన మహా ఇంజనీరు విశ్వేశ్వరయ్యగారి జ్ఞాపకార్థం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ అనే ఒకే ఒక కట్టడానికి విశ్వేశ్వరయ్య భవన్ అని పేరు పెట్టారుగానీ... సమస్త డాక్టర్ల గౌరవార్థం ‘హాకీమ్’ (వైద్యుడు) పేట అని ఒక పేట పేటనే నిర్మించారు. కానీ అప్పట్లో వీధుల పేర్లను గౌరవిస్తూ తిండి తినేవారు కాబట్టి హకీమ్పేటలోని వైద్యులకేమీ పనిలేక గాలి పనులైన గాలిమోటర్లు నడిపించడం, విమానాలెగరేయడం చేశారు, చేస్తున్నారు. ఆ తర్వాత నగరవాసులకు వీధిపేర్లను బట్టి ఆరోగ్య అలవాట్లు తప్పిపోయాయి కాబట్టి... సమస్త కార్పొరేటు ఆసుపత్రులకు మన హైదరాబాదే కేంద్రం అయ్యిందనిపిస్తోంది. -
హెల్త్‌సిటీగా విజయవాడ
జగ్గయ్యపేట నుంచి తిరువూరు వరకు పైప్‌లైన్‌తో కృష్ణా జలాలు పారిశ్రామిక ప్రగతిని పరుగులు తీయిస్తా ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం ఉపాధి అవకాశాలు పెంపొందిస్తా వైఎస్సార్ సీపీ విజయవాడ ఎంపీ అభ్యర్థి కోనేరు వెల్లడి ‘నాకు విజయవాడపై పూర్తి విజన్ ఉంది. కాళేశ్వరరావు మార్కెట్లోని సమస్యల దగ్గర్నుంచి బెంజిసర్కిల్‌లో ట్రాఫిక్ కష్టాల వరకు సమగ్ర అవగాహన ఉంది. జగ్గయ్యపేటలో సాగు, తాగునీటి సమస్య.. తిరువూరు ప్రాంతంలో ఫ్లోరైడ్ సమస్య ఉన్నాయని తెలుసు. జిల్లా ప్రజల స్థితిగతులు, ఆర్థిక పరిస్థితి, వ్యవసాయదారుల ఇబ్బందులు... ఇలా అన్నింటిపై ఉన్న అవగాహనతో విజన్ విజయవాడను రూపొందించుకున్నా. దీనికి అనుగుణంగానే ప్రజలకు సేవ చేయడానికి వారధిగా నిలిచే రాజకీయాలను ఎంచుకుని మీ ముందుకొచ్చా..’ అంటున్నారు వైఎస్సార్ సీపీ విజయవాడ లోక్‌సభ నియోజకవర్గ ఎంపీ అభ్యర్థి కోనేరు రాజేంద్రప్రసాద్. సాక్షి, విజయవాడ : ప్రజలకు, సమాజానికి సేవచేయాలనే తలంపుతో వైఎస్సార్ సీపీ ద్వారా రాజకీయ రంగప్రవేశం చేసిన కోనేరు రాజేంద్రప్రసాద్ విజయవాడ ఎంపీ అభ్యర్థిగా పోటీచేస్తున్న సంగతి తెలిసిందే. ప్రత్యర్థి పార్టీలకంటే ప్రచారపర్వంలో దూసుకెళుతున్న ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ముఖ్యంగా అభివృద్ధికోసం తాను రూపొందించుకున్న ప్రణాళికలు.. విజయవాడ లోక్‌సభ పరిధిలోని నియోజకవర్గాలవారీగా ప్రధాన సమస్యలు.. వాటికి తాను సూచించే ఆచరణాత్మక పరిష్కార మార్గాలు.. ఇలా పలు అంశాలను వెల్లడించారు. అవన్నీ ఆయన మాటల్లోనే... జన్మభూమి రుణం తీర్చుకోవడానికి వచ్చాను. ఇతర రాజకీయ పార్టీ నేతలను విమర్శించను. నన్ను విమర్శించేవారిని సైతం విమర్శించను. పాజిటివ్ రాజకీయాలతోనే ముందుకు సాగుతా. నన్ను గెలిపిస్తే ఏం చేస్తానో.. వైఎస్సార్ సీపీని అధికారంలోకి తెస్తే ప్రజలకు ఏం చేస్తానో చెప్పి మరీ ప్రజలను ఓట్లడుగుతున్నాను. వైద్యపరంగా ఉపాధి.. ముఖ్యంగా వైద్యపరంగా విజయవాడ నగరానికి మంచి పేరుంది. అనేక కార్పొరేట్ ఆస్పత్రులు, ప్రభుత్వాస్పత్రి, నిపుణులైన వైద్యులు ఎందరో ఉన్నారు. విజయవాడను హెల్త్ సిటీగా తీర్చిదిద్దితే ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. 15 వేల పడకలతో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, మెడికల్ కళాళాల, వైద్యానికి సంబంధించి అన్ని విభాగాలు, కోర్సులతో కలిపి యూనివర్సిటీ, స్కూల్‌ను ఏర్పాటుచేయడం నా లక్ష్యం. తద్వారా సుమారు 1.5 లక్షల మందికి ఉపాధి అవకాశాలు, సుమారు ఐదు వేల మందికి సొంతప్రాంతంలోనే నాణ్యమైన విద్య లభిస్తాయి. హెల్త్ సిటీకి అనుసంధానంగా ఫార్మా కంపెనీలు, ల్యాబ్‌లు ఇలా అనేకం ఏర్పాటుచేస్తాం. ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని జిల్లాల నుంచి వచ్చే రోగులకు ఉచిత వైద్యం హెల్త్ సిటీలో అందితే వాణిజ్యపరంగానూ నగరం పురోగతి సాధిస్తుంది. జిల్లా అభివృద్ధి కోసం ‘విజన్ విజయవాడ’ను రూపొందించుకున్నా. దీనికోసం పంచ ప్రణాళికలను సిద్ధం చేస్తున్నాను. డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరుస్తా.. విజయవాడ నగరంలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. మూడు ప్రధాన నీటి కాల్వల్లోకి 126 మురుగునీటి కాల్వలను అనుసంధానం చేశారు. ఒక మాస్టర్ ప్లాన్ రూపొందించి డ్రైనేజీ కాల్వలను దారిమళ్లించాలి. నీటి కాల్వల్లో చెత్త వేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. చెత్తను, నీటిని వేరుచేసేలా ప్లాంట్లు ఏర్పాటు చేయాలి. వేస్ట్ మేనేజ్మెంట్ ప్రకియ ద్వారా చెత్తను వినియోగిస్తే ఆదాయం కూడా పెరుగుతుంది. అప్పుడు స్వీయ నిధులతో నగరాన్ని మరింత అభివృద్ధి చేసుకోవచ్చు. ప్రజల గుండెల్లో వైఎస్సార్.. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డిని ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారు. వైఎస్సార్ సీపీకి బ్రహ్మరథం పడుతున్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ఇక్కడి ప్రజలకు ఎంతో నమ్మకం ఉంది. ఆయన పార్టీ ద్వారా ప్రజల మధ్యలోకి వెళ్లినప్పుడు మమ్మల్ని కూడా అదే అభిమానం, ఆప్యాయతలతో ఆదరిస్తున్నారు.. స్వాగతిస్తున్నారు. పార్లమెంట్ పరిథిలోని అన్ని ప్రాంతాల్లో ప్రచారం పూర్తిచేశాను. అక్కడి ప్రధాన సమస్యలను ప్రత్యక్షంగా చూశాను. నాకు కమిట్మెంట్ ఉంది. నా సేవల్ని మరింత విస్తరించాలని నిర్ణయించకున్నా. రాజకీయాలతో నిమిత్తం లేకుండా రానున్న రోజుల్లో మరింత బాధ్యతగా పనిచేయటానికి సిద్ధంగా ఉన్నాను. కోనేరు ట్రస్టుద్వారా నీరు.. శ్రీకాకుళం జిల్లాలో కోనేరు ట్రస్టుద్వారా వంశధార నుంచి 15 కిలోమీటర్ల పైప్‌లైన్ ఏర్పాటుచేసి వేలాది ఎకరాలకు సాగునీరందిస్తున్నాను. అవసరమైతే ఇక్కడా ప్రణాళిక రూపొందించేందుకు సిద్ధంగా ఉన్నాను. కృష్ణానది పక్కనే ఉన్న జగ్గయ్యపేట మొదలుకొని తిరువూరు వరకు నీటి సమస్య ఉంది. దీని పరిష్కారం కోసం పైప్లైన్లు ఏర్పాటు చేస్తే అటు తాగునీరు, ఇటు సాగునీటి అవసరాలు తీరతాయి. ఫ్లైవోవర్ల ఏర్పాటు.. మౌలిక వసతుల్లో భాగంగా దుర్గగుడి వద్ద, బెంజిసర్కిల్ వద్ద ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి తక్షణం ఫ్లైవోవర్లు నిర్మించాలి. మా పార్టీ అధికారంలోకి రాగానే తొలి్ర పాధాన్యతాంశంగా దీన్నే తీసుకుంటాం. రానున్న రోజుల్లో ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణానికి అనుగుణంగా మాస్టర్‌ప్లాన్ రూపొందించి అభివృద్ధి చేయాలి. బీఆర్టీఎస్ రోడ్డు వల్ల నగరానికి పెద్దగా ఉపయోగం చేకూరలేదనేది నా అభిప్రాయం. దానికి ఖర్చుచేసిన రూ. 152 కోట్ల నిధులతో 15 ఫ్లైవోవర్లు నిర్మించి ఉంటే ట్రాఫిక్ సమస్య సమసిపోయేది. బుడమేరుకు శాశ్వత పరిష్కారం.. నగరంలో మరో ప్రధాన సమస్య బుడమేరు ముంపు. దీనికి శాశ్వత పరిష్కారం చూసేలా అన్ని చర్యలు తీసుకుంటాం. అవుటర్ రింగ్‌రోడ్డు నిర్మాణం, పులిచింతల ప్రాజెక్టు నుంచి జిల్లా సాగునీటి అవసరాలకు అనుగుణంగా నీటి విడుదల, పోలంపల్లి రాజీవ్ మున్నేరు డ్యామ్ నిర్మాణం పూర్తి చేయిస్తాం. పారిశ్రామికాభివృద్ధి.. విజయవాడ ఆటోనగర్‌ను కేంద్రంగా చేసి విడిభాగాల తయారీ సెంటర్ల ఏర్పాటుకు ప్రోత్సాహం ఇస్తాం. రవాణాయేతర రంగాల్ని ప్రోత్సహించడం ద్వారా ఈ ప్రాంతాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తాం. దీంతోపాటు వృత్తివిద్య కోర్సుల్లో శిక్షణ ఇచ్చే సంస్థల్ని అవసరమైతే నా సొంత నిధులతో ఏర్పాటుచేసి వేలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తాను. -
' అభివృద్ధికి ఆమడ దూరంలో బెజవాడ'
రాష్ట్ర రాజకీయాలలో విజయవాడ నగరం కీలకపాత్ర పోషిస్తుందని, అయితే ఆ నగరం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందని విజయవాడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ అభ్యర్థి కోనేరు ప్రసాద్ శనివారం విజయవాడలో తెలిపారు.అందుకే తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తనను విజయవాడ పంపారని చెప్పారు. విజయవాడ నగరాన్ని హెల్త్ టూరిజం సెంటర్‌గా అభివృద్ధి చేస్తానని ఆయన విజయవాడ నియోజకవర్గ ప్రజలకు భరోసా ఇచ్చారు. నియోజకవర్గ పరిధిలో ముఫ్పై ఏళ్లపాటు ప్రజలకు ఎటువంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా ఉండేలా పని చేస్తానని ఆయన ప్రజలకు భరోసా ఇచ్చారు. నగరంలోని అన్ని రంగాలలో ప్రొఫిషనల్స్‌ను గ్రూప్‌గా తయారు చేసి విజయవాడను అభివృద్ధి చేస్తానన్నారు.