మనది హెల్దీరాబాద్!
-యాసీన్
హైదరాబాద్‌ను హెల్త్ సిటీ అని ఇప్పుడంటున్నారుగానీ... అలనాడెప్పుడో నగర పాలకులు దీన్ని హెల్త్ సిటీ చేసే పాలసీ పెట్టుకున్నారేమో అని నా అనుమానం. అందుకే మహా ఇంజినీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్యగారితో పాటు అనేక మంది డాక్టర్లనూ సంప్రదించి సిటీలోని అనేక ఏరియాలకు పోషకాహారాలకు సంబంధించిన పేర్లు పెట్టారేమోనని నా అభిప్రాయం.
ఉదాహరణకు చిక్కడపల్లి తీసుకోండి. దాని అసలు పేరు చిక్కుడు ప్లస్ పల్లీలట. పల్లీలంటే మనం తినే వేరుశెనగలు కాదు. బిన్నిస్ పల్లీ, గోకరకాయ లాంటి బీన్స్ జాతి పల్లీలన్నమాట. అందుకే చిక్కుళ్లూ... పల్లీజాతి కూరగాయలు తింటే ఆరోగ్యానికి మంచిదనే స్ఫూర్తిని నింపడానికి సదరు లొకాలిటీకి చిక్కుడుపల్లీ అనే పేరు పెడితే కాలక్రమాన అదే చిక్కడ్‌పల్లీ అయ్యిందని అనేక మంది స్థానికుల ఉవాచ.
ఇక నేరేడ్‌మెట్ విషయానికి వద్దాం. భవిష్యత్తులో మన సిటీ డయాబెటిస్ క్యాపిటల్ అవుతుందని ముందే ఊహించారో ఏమోగానీ... ‘అతిమూత్ర వ్యాధికి నేరేడు’ అని క్లాస్ రూమ్ పాఠాలు వీధులకూ చేరాలని ఆ ఏరియాకు ‘నేరేడ్‌మెట్’ అని పేరు పెట్టారు. వాళ్ల ఉద్దేశం ఏమిటంటే... నేరేడు పండ్లు ఎక్కువగా తింటే డయాబెటిస్ దరిచేరదని. కానీ... మన నగరవాసులు నేరేడు పండ్లను మరచిపోయి... బతుకు మెట్లను వేగంగా ఎక్కాలన్న ఉద్దేశంతో సెకండ్ హాఫ్‌నే పట్టుకున్నారు. ఈలోపు డయాబెటిస్ నగరంలో తిష్టవేసేసి ప్రపంచంలోనే హైదరాబాద్‌ను స్వీటెస్ట్ క్యాపిటల్‌గా మార్చేసింది.
ఇక మరో దృష్టాంతానికి వద్దాం. నిజానికి అందంగా కనిపించే ఆపిల్ కంటే జాంపండ్లలోనే పోషకాలూ, విటమిన్లూ ఎక్కువ అనే ఉద్దేశంతో... జనాలు వాటిని విస్తృతంగా తినాలని ‘జాంబాగ్’ అనే మరో ఏరియాకు పేరు పెట్టి జామపండ్లను తగురీతిన సత్కరించారు. జామ ఆరోగ్యం కోసం తింటారో తినరో అని డౌటొచ్చి... ఉప్పుగూడ అనే మరో ప్రాంతానికి ఉప్పు పేరు పెట్టేసి... జాంపండు ముక్కలకు ఉప్పు రాసుకుని తినే అలవాటును మన సంస్కృతీ సంప్రదాయాల్లో భాగంగా చేసేశారు. అందుకే మన సిటీలోని తోపుడు బండ్ల మీద జాంపండ్లూ... ప్లస్ ఉప్పూకారం కనిపిస్తుంటాయి.
అలాగే సితాఫల్‌మండీ ఏరియాలో సీతాఫలాలను పెద్ద ఎత్తున కుప్పలుబోసి మోతీదర్వాజా దగ్గర ముత్యాల కుప్పలకు దీటుగా అమ్మేవారట. ఇక ముషీరాబాద్‌లో నిన్నటి వరకూ రాజాడీలక్స్ అనీ, అంతకుముందు రహత్‌మహల్ అని పిలిచే సాయిరాజా సినిమాహాల్ వెనక ఉన్న భాగాన్ని అంగూర్‌బాగ్ అని పిలిచే వారట. అంతెందుకు మాంసాహారం కంటే శాకాహారం మంచిదనే ఉద్దేశంతోనే గడ్డీగాదం తింటే దీర్ఘాయుష్షు అనే కాన్సెప్టుతోనే గడ్డి అన్నారం అని పేరు పెట్టి ఆ పేరుకు న్యాయం జరిగేలా అక్కడ అన్నిరకాల పండ్లూ ఫలాలూ అమ్ముతుంటారని నా ఉద్దేశం.
వీటన్నింటిని బట్టీ నాకు అనిపిస్తోందేమిటంటే... మహానుభావుడైన మహా ఇంజనీరు విశ్వేశ్వరయ్యగారి జ్ఞాపకార్థం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ అనే ఒకే ఒక కట్టడానికి విశ్వేశ్వరయ్య భవన్ అని పేరు పెట్టారుగానీ... సమస్త డాక్టర్ల గౌరవార్థం ‘హాకీమ్’ (వైద్యుడు) పేట అని ఒక పేట పేటనే నిర్మించారు. కానీ అప్పట్లో వీధుల పేర్లను గౌరవిస్తూ తిండి తినేవారు కాబట్టి హకీమ్‌పేటలోని వైద్యులకేమీ పనిలేక గాలి పనులైన గాలిమోటర్లు నడిపించడం, విమానాలెగరేయడం చేశారు, చేస్తున్నారు. ఆ తర్వాత నగరవాసులకు వీధిపేర్లను బట్టి ఆరోగ్య అలవాట్లు తప్పిపోయాయి కాబట్టి... సమస్త కార్పొరేటు ఆసుపత్రులకు మన హైదరాబాదే కేంద్రం అయ్యిందనిపిస్తోంది.