సరస్వతీ బిడ్డలం చదువు‘కొనలేం’..
వేలూ లక్షలు ఖర్చు పెట్టి కార్పొరేట్ స్కూళ్లలో ఖరీదుగా చదువు‘కొన’లేదు. మాసిపోయిన బెంచీలూ మసిబారిన గోడల నీడలో తప్ప. అడగకుండానే అన్నీ సమకూర్చే డాడీ, అడుగుకో ఆనందం కొనుక్కొచ్చే మమ్మీ అంటే తెలియదు. కాయకష్టంతో దోస్తీ చేసే అమ్మానాన్నలు తప్ప. అయినా ఈ చిన్నారులు చిన్నబోలేదు. చింత పడలేదు. పేదరికాన్ని మోస్తూనే ఉన్నారు. సరస్వతీ కటాక్షాన్ని సాధిస్తూనే ఉన్నారు. చెమట చిందిస్తూనే ఉన్నారు.
చదువులో విజయాలు లిఖిస్తూనే ఉన్నారు. కాసింత ఆసరా దొరికితే... కాసింత ధైర్యం అందితే... ఈ పేదింటి రత్నాలు ఎన్నెన్ని కాంతులు విరజిమ్ముతాయో... మరెన్ని వెలుగులు ప్రసరిస్తాయో... విధి ‘రాత’ను మారుద్దామా? వీరి ‘రాత’కు తోడవుదామా? ఈ విద్యాకుసుమాలకు బాసటగా నిలవాలన్నా.. ఆర్థికంగా ఆదుకోవాలన్నా 9705347881, 9010234568 నెంబర్లలో సంప్రదించండి.
స్పందించే హృదయం కోసం ఎదురుచూపులు
పేదింట విద్యా కుసుమాలు విరబూశాయి. చదువుల తోటలో మార్కుల పంట పండిస్తున్నాయి. కూలి చేస్తేనే పూట గడిచే కుటుంబాలైనా.. చదువులో రాణిస్తున్నారు. ఆర్థిక సమస్యలు వెనక్కి లాగుతున్నా.. ఏమాత్రం నిరుత్సాహపడలేదు. సర్కారు బడులలో చదివినా... కార్పొరేట్ విద్యార్థులకు దీటుగా మార్కులు సాధించి... ప్రశంసలు అందుకుంటున్నారు. తాజాగా విడుదలైన పదో తరగ తి ఫలితాల్లో ఉత్తమ మార్కులు సాధించి ఆదర్శంగా నిలిచారు. ఆర్థికంగా ఎవరైనా చేయూతనిస్తే... ఉన్నత చదువులు అభ్యసించి లక్ష్యాన్ని అందుకుంటామని చెబుతున్నారు. జీవితంలో నిలదొక్కుకున్నాక తమలాంటి పేద బిడ్డలకు బాసటగా నిలుస్తామని హామీ ఇస్తున్నారు.
ఇస్త్రీ చేస్తూనే..
ముషీరాబాద్ : ప్రతిభకు పేదరికం అడ్డు కాదని నిరూపించింది రామ్‌నగర్‌కు చెందిన శ్రుతి. ఈ బాలిక టెన్త్‌లో 9.3 పాయింట్స్ సాధించింది. ఆంధ్ర మహిళా సభ బాలికల పాఠశాలలో పదో తరగతి చదివి...9.3 మార్కులతో పాఠశాల టాపర్‌గా నిలిచింది. రాంనగర్‌లోని గిరిశిఖర అపార్ట్‌మెంట్‌లో వాచ్‌మెన్‌గా పని చేస్తున్న యాదగిరి, లక్ష్మీల రెండో సంతానం శ్రుతి. వీరిది వరంగల్ జిల్లా మద్దూర్ మండలం డెక్కల్. నాలుగేళ్ల క్రితం పిల్లల చదువు, బతుకుదెరువు కోసం హైదరాబాద్ వచ్చి అపార్ట్‌మెంట్‌లో వాచ్‌మెన్‌గా బతుకు వెళ్లదీస్తున్నారు.
శ్రుతి అక్క ఇంటర్ రెండో సంవత్సరం చదువుతుండగా, తమ్ముడు ఏడో తరగతి. వీరి ముగ్గురు స్కూల్ ఫీజులు, పుస్తకాలు, డ్రెస్‌లకే యాదగిరి కుటుంబం ఏటా దాదాపు రూ.లక్ష ఖర్చు చేస్తోంది. ఆర్థిక ఇబ్బందులతో ప్రభుత్వ పాఠశాలలో తన విద్యాబ్యాసాన్ని కొనసాగించిందీ బాలిక. తల్లి అదే అపార్ట్‌మెంట్‌లో ఇస్త్రీ చేస్తూ కుటుంబానికి చేదోడు వాదోడుగా నిలుస్తోంది. సెలవుల్లో, తీరిక సమయంలో శ్రుతి కూడా అమ్మకు సాయపడుతూ ఉంటుంది. బాసర త్రిబుల్ ఐటీలో సీటు కోసం దరఖాస్తు చేసుకున్నారు. పాలిటెక్నిక్ పరీక్ష కూడా రాస్తోంది. దాతలు సహకరిస్తే ఉన్నత చదువులు చదువుతానని చెబుతోంది.
అమ్మకు సహాయంగా...
గచ్చిబౌలి: శేరిలింగంపల్లి మండలంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల్లో మొదటి స్థానంలో నిలిచింది నలందేశ్వరి. శ్రీకాకుళం జిల్లా వంగర మండలం కొత్తపేటకు చెందిన బురిడి శివనాయుడు, దమయంతి దంపతులు తమ ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకును తీసుకొని కొన్నేళ్ల క్రితం బతుకుదెరువు కోసం నగరానికి వలస వచ్చారు.శేరిలింగంపల్లిలోని పాపిరెడ్డినగర్ కాలనీలో ఉంటున్నారు. శివనాయుడు వాచ్‌మెన్. దమయంతి రోడ్డు పక్కన డబ్బాలో కిరాణా సామాను అమ్ముతూ జీవనం సాగిస్తున్నారు.
వీరి రెండోకూతురు నలందేశ్వరి 7 నుంచి పదోతరగతి వరకు స్థానిక జిల్లా పరిషత్ హైస్కూల్‌లో చదివింది. పదో తరగతిలో 9.8 శాతం మార్కులు సాధించింది. పాఠశాల ముగిసిన తరువాత నిత్యం మియాపూర్‌లోని పోతుకూచి సోమసుందర సోషల్ వెల్ఫేర్ అండ్ చారిటబుల్ ట్రస్టుకు వెళ్లి చదువుకునేది. ఇంజినీరింగ్ చేసి... కలెక్టర్ కావాలన్నదే తన లక్ష్యమని నలందేశ్వరి చెబుతోంది. సెలవుల్లో ఇంటి వద్ద ఉన్నప్పుడు కిరాణా డబ్బాలో ఉండి అమ్మకు సాయం చేసేదాన్నని చెప్పింది. ఉపాధ్యాయులు..పోతుకూచి సోమసుందర సోషల్ వెల్ఫేర్ అండ్ చారిటబుల్ ట్రస్టు సహకారం మరిచిపోలేనిదని తెలిపింది.
సాయం చేస్తే...రాణిస్తా..
సికింద్రాబాద్: నిరుపేద కుటుంబంలో పుట్టి... ప్రభుత్వ పాఠశాలలో చదివి... పదో తరగతిలో 9.3 మార్కులు సాధించి కళాశాల విద్యను అభ్యసించడానికి ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తోంది శాంతినగర్‌లోని శేషాపహడ్ మురికివాడకు చెందిన ఆర్.సుప్రజ. వరంగల్ జిల్లా నుంచి ఉపాధి కోసం నగరానికి వచ్చిన ఆర్.యేషోబు ఆటోడ్రైవర్. ఆయన భార్య రజిత ఇళ్లలో పనులు చేసుకుంటూ బతుకు బండిని లాగిస్తున్నారు. ఈ దంపతులకు ఇద్దరు సంతానం. వీరి పెద్దకుమార్తె ఆర్.సుప్రజ సమీపంలోని లాలాపేట ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుకుంది.
ఇటీవల వెల్లడించిన ఫలితాల్లో 9.3 మార్కులు సాధించింది. తల్లికి తోడుగా ఇళ్లలో పనులకు వెళుతూనే అత్యధిక మార్కులు సాధించింది సుప్రజ. తన తల్లిదండ్రుల ఆదాయం అంతంత మాత్రమేనని. తాను బాగా చదువుకుని మంచి ప్రభుత్వ ఉద్యోగం చేయాలన్న సంకల్పంతోనే 9.3 మార్కులు తెచ్చుకున్నానని తెలిపింది. తనను ఆదుకుని మంచి కళాశాలలో చదివించేవారు ఉంటే ఇంటర్‌లో సైతం మంచి మార్కులు సాధించి రికార్డు నెలకొల్పాలని ఉందని తెలిపింది. బాగా చదువుకుని టీచర్ ఉద్యోగం చేయాలన్నది తన ఆకాంక్ష గా సుప్రజ పేర్కొంది.
నాన్న కల నెరవేరుస్తా...
మూసాపేట: మూసాపేటకు చెందిన ఎమ్‌డీ వాజిద్ సనత్ నగర్‌లోని ఓ ప్రైవేటు కంపెనీలో పని చేస్తున్నారు. భార్య షాహిన్ గృహిణి. నెలకు రూ.8 వేల జీతంతో ఐదుగురు పిల్లలను ఉన్నత చదువులు చదివిస్తున్నారు. అద్దె గదిలో నివాసం ఉంటూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. పంచశీల స్కూల్‌లో చదివిన చిన్న కుమార్తె ముస్కాన్ ఫాతిమా 9.8 మార్కులతో పాఠశాలటాపర్‌గా నిలిచింది. ‘నాన్న పదో తరగతి వరకే చదువుకున్నారు. ఇంట్లో ఒక డాక్టర్ ఉండాలన్న నాన్న కలను నిజం చేయడమే నా లక్ష్యం. ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో మంచి మార్కులు సాధించా’నని సంతోషం వ్యక్తం చేస్తోందీ బాలిక.
అమ్మ కష్టమే ఆసరాగా...
మెహిదీపట్నం: అటు తల్లి.. ఇటు గురువుల అంచనాలను అందుకుంటూ ప్రభుత్వ పాఠశాలలో చదివి... ఇంగ్లీషు మీడియంలో పదో తరగతిలో 9.8 జీపీఏ తెచ్చుకున్నాడు తాళ్లగడ్డకు చెందిన సాయి ఫణీంద్ర కుమార్. ఆది నుంచీ ప్రణాళికాబద్ధంగా చదువుతూ ఉత్తమ ఫలితాలు సాధించాడు. ఫణీంద్ర 11 ఏళ్ల వయసులోనే తండ్రి శంకర్ మరణించాడు.తల్లి దుర్గ సంరక్షణలో క్రమశిక్షణతో పెరిగాడు. మూడో తరగతి నుంచి కార్వాన్ కుల్సుంపూర ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ వచ్చాడు.
‘అమ్మ ఇళ్లలో పనులు చేస్తూ... ఏ లోటూ రాకుండా చూసుకొని చదివించింది. పాఠశాలలో ఉపాధ్యాయులు ‘నీకు మంచి ర్యాంక్ వస్తుందని... చదవాలని’ ప్రోత్సహించారు. నేను 9 జీపీఏ అంచనా వేశా. నాకు 9.8 రావడం పట్ల అమ్మతో పాటు గురువులంతా ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో సివిల్ ఇంజినీర్ కావడమే నా కల’ అంటున్నాడీ బాలుడు.
ఐఏఎస్ లక్ష్యం...
కాటేదాన్: నిజామాబాద్ ప్రాంతానికి చెందిన దిలీప్ కుటుంబంతో కలసి నగరానికి వ లస వచ్చాడు. స్థానికంగా ఓ బ్యాటరీ ఫ్యాక్టరీలో డ్రైవర్‌గా పని చేస్తూ... అద్దె ఇంట్లో ఉంటున్నారు. ఆయనకు ఓ కూతురు, కుమారుడు సంతానం. కుమార్తె ప్రియాంక మైలార్‌దేవ్‌పల్లి ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదివి.. 9 జీపీఏ సాధించింది. రాజేంద్రనగర్ మండలంలోనే టాపర్‌గా నిలిచింది. మంచి ఫలితాలు సాధించిన తమ కుమార్తెను ఉన్నత చదువులు చదివించేందుకు ప్రోత్సహిస్తానని తండ్రి దిలీప్ పేర్కొన్నాడు. కలెక్టర్ కావాలనేది తన లక్ష్యమని ప్రియాంక వివరించింది.
చెరుకు బండే.. బతుకు బండీ
రాయదుర్గం: చెరుకుబండి నడిస్తేనే వారి బతుకుబండి సాగుతుంది. వచ్చిన కొద్దిపాటి మొత్తంతో తన కూతురును చదివించి ఉత్తమ ఫలితాల సాధనకు ఆ తల్లిదండ్రులు కృషి చేశారు చిలుకూరు సమీపంలోని మేడిపల్లికి చెందిన నర్సింగరావు, విజయలక్ష్మి దంపతులు. తమ ముగ్గురు ఆడపిల్లలతో 13 ఏళ్ల క్రితం రాయదుర్గానికి వలస వచ్చారు. స్థానికంగా సీజన్‌లో చెరుకుబండి నడపడం, ఆ తర్వాత కూలీ పనులు చేస్తూ ఆ తల్లిదండ్రులు తమ బిడ్డలను చదివిస్తున్నారు.
వీరి రెండో కూతురు సాయి ప్రసన్న పదో తరగతిలో 9.3 జీపీఏ సాధించింది. పేదింటి నుంచి వచ్చినా కష్టపడి చదివి ఆమె మంచి మార్కులు సాధించిందని స్థానిక నాగార్జున ఉన్నత పాఠశాల కరస్పాండెంట్ భరత్ కుమార్ తెలిపారు. ముగ్గురు పిల్లలు నాగార్జున ఉన్నత పాఠశాలలో చదువుకుంటున్నారని, కరస్పాండెంట్ భరత్ కుమార్ పిల్లల ీఫీజుల విషయంలో అండగా నిలిచారని ఆ తల్లిదండ్రులు తెలిపారు. ఇంజినీర్‌ను కావాలన్నదే తన లక్ష్యమని సాయిప్రసన్న తెలిపింది.
పాలు అమ్ముతూనే...
కుత్బుల్లాపూర్ మండలం ప్రగతి నగర్‌లో వాచ్‌మెన్‌గా పనిచేసే శ్రీనివాస్, ఉదయ్‌లక్షి్ష్మల కుమారుడు నాగసతీష్. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదివి... 9 జీపీఏ సాధించాడు. ఉదయం 5 గంటల నుంచి ఇంటింటికి తిరిగి పాల ప్యాకెట్లు వేస్తూ కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉంటూనే చదువు కొనసాగించాడా కుర్రాడు. తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించి...శ్రద్ధగా చదివి మంచి మార్కులు సాధించాడు. ఇదిలా ఉండగా...తన ఉన్నత చదువులకు ఆర్థిక సాయం చేసేందుకు సినీ నటి రజిత ముందుకువచ్చారని నాగసతీష్ తెలిపాడు. ఇంటర్‌లో మంచి మార్కులు సాధించి...ఇంజినీర్ కావాలన్నదే తన లక్ష్యమని చెప్పాడు.
ఇంజినీర్‌నవుతా..
మూసాపేట: మహబూబ్‌నగర్ జిల్లా కల్వకుర్తికి చెందిన శ్రీనివాస్‌గౌడ్, అంజమ్మ దంపతులు పదేళ్ల క్రితం హైదరాబాద్‌కు వలస వచ్చారు. కూకట్‌పల్లి ఆర్టీసి డిపో ఎదురుగా ఇండ్లీ బండి నడిపిస్తుంటారు. వీరికి ముగ్గురు కుమార్తెలు. మూసాపేట డివిజన్ ప్రగతినగర్‌లోని శ్రీసాయి విద్యానికేతన్ స్కూల్‌లో చదివిన స్వప్న పదో తరగతిలో 9.5 పాయింట్స్ సాధించింది.
ఈ దంపతుల ఇద్దరు కుమార్తెలు బీటెక్, డిప్లమో చదివిస్తున్నాడు. స్కూల్ టాపర్‌గా నిలిచిన చిన్న కుమార్తె స్వప్న ఇంజినీర్‌ను అవుతానని...తల్లిదండ్రులను కంటికి రెప్పలా చూసుకుంటానని చెబుతోందీ బాలిక. ఎంత కష్టం వచ్చినా ముగ్గురు కుమార్తెలను మంచిగా చదివిస్తానని, తను పడుతున్న కష్టం కూతుళ్లు పడకూడదని శ్రీనివాస్‌గౌడ్ అంటున్నారు.
డాక్టర్ కావాలనుంది..
మలక్‌పేట: మలక్‌పేట్ సలీం నగర్‌లోని గురుకుల పాఠశాల విద్యార్థిని దావల యామిని పదో తరగతిలో 9 జీపీఏ సాధించింది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన దావల దుర్గారావు, సీతామహాలక్ష్మి దంపతులు జీవనోపాధి కోసం పదేళ్ల క్రితం నగరానికి వలస వచ్చారు. మన్సూరాబాద్‌లోని సాయినగర్ గుడిసెల్లో నివాసం ఉంటున్నారు. దుర్గారావు ప్లంబర్‌గా... సీతామహాలక్ష్మి గురుకుల పాఠశాలలో క్యాజువల్ లేబర్‌గా పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు.
ఇంటి పనుల్లో తల్లికి తోడుగా ఉంటూనే చదువులో మంచి ప్రతిభ కనబరిచిందీ విద్యార్థిని. ఈ సందర్భంగా యామిని మాట్లాడుతూ.. మెడిసిన్ చదువుకుని... పేదలకు సేవచేసి ఉత్తమ డాక్టర్‌గా పేరు తెచ్చుకుంటానని తెలిపింది. మంచి మార్కులు సాధించేలా ప్రోత్సహించినతల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు రుణపడి ఉంటానని తెలిపింది.
అమ్మ కష్టం వృథా కానివ్వను
జగద్గిరిగుట్ట: జగద్గిరిగుట్ట శ్రీనివాస్‌నగర్‌లో ఉండే రజిత కుమార్తె ఉమ జగద్గిరిగుట్టలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదివింది. పబ్లిక్ పరీక్షల్లో 9 జీపీఏ సాధించింది. ఉమ తండ్రి చిన్నప్పుడే మరణించడంతో తల్లి రజిత బిడ్డను కష్టపడి చదివించింది. వ చ్చిన అరకొర జీతంలో కుటుంబాన్ని పోషిస్తూ.. కొడుకు, కూతురును చదివిస్తోంది. తమ కూతురు చదువుకు ఎవరైనా దాతలు సహ కరించాలని రజిత కోరుతోంది. ఇంజినీర్‌ను కావడమే తన ధ్యేయమని.. తన తల్లి పడిన కష్టానికి ప్రతిఫలంగా... బాగా చదివి... సమాజానికి సేవ చేయాలని ఉందని ఉమ చెబుతోంది.