corporate schools
-
కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా తయారైన ప్రభుత్వ పాఠశాలలు
-
స్కూళ్లల్లో దోపిడీ షురూ..! జోరుగా ముందస్తు అడ్మిషన్లు
సాక్షి, సిటీబ్యూరో: అప్పుడే ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్లలో 2023–24 విద్యాసంవత్సరానికి అడ్మిషన్లు జోరందుకున్నాయి. ప్రస్తుత విద్యా సంవత్సరం ముగియక ముందే స్కూళ్ల యాజమాన్యాలు వచ్చే విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు మొదలు పెట్టాయి. ముందస్తు› ప్రవేశాల పేరుతో విద్యార్థుల తల్లిదండ్రుల నిలువు దోపిడీ ప్రారంభమైంది. టెక్నో, ఈ టెక్నో, ఈ స్మార్ట్ అంటూ రకరకాల పేర్లతో అడ్మిషన్ల దందాకు దిగాయి.కొన్ని పాఠశాలలు ముందస్తు సీట్ బుక్ చేసుకుంటే ఫీజులో రా యితీ అని తల్లిదండ్రులను మభ్యపెడుతున్నారు. నిబంధనల ప్రకారం విద్యా సంవత్సరం ముగిశాక వచ్చే విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు చేసుకోవాల్సి ఉంటుంది. నిబంధనల ఉల్లంఘన యథేచ్ఛగా కొనసాగుతున్నా విద్యాశాఖాధికారులు నిద్రమత్తులో జోగుతుండడం విమర్శలకు తావిస్తోంది. సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ స్కూళ్లలో తీవ్ర పోటీ సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ స్కూళ్లల్లో ప్రవేశాలకు తీవ్ర పోటీ నెలకొంది. ఎల్కేజీ, యూకేజీ సీట్లకు అధిక డిమాండ్ ఉండగా, అతర్వాత తరగతుల్లో సీట్ల ఖాళీలును బట్టి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఫీజులు, అడ్మిషన్ ఫీజు విషయం పక్కకు పెడితే ..అసలు సీటు దక్కడం అనే ప్రశ్నార్ధకంగా తయారైంది. ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కూడా ఆయా స్కూల్లో పూర్తయినట్లు తెలుస్తోంది. ఒక్కో దరఖాస్తుకు రూ. 1000 నుంచి 2 వేల వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం. ఆయా స్కూల్స్‌లో సీట్లకు రెండింతలు దరఖాస్తులు రావడంతో ప్రతి సీట్‌కు తీవ్ర పోటీ నెలకొన్నట్లు తెలుస్తోంది. ఇష్టారాజ్యమే... కార్పొరేటు, ప్రైవేటు స్కూల్స్‌లో అడ్మిషన్ల ప్రక్రియ ఇష్టారాజ్యంగా తయారైంది. నిబంధనలు పాటించని యాజమాన్యాలపై విద్యాశాఖాధికారులు చర్యలు తీసుకోకపోవడంతో వారి ఆగడాలకు అడ్డూ..అదుపూ లేకుండా పోతోంది. నర్సరీ నుంచి పదవ తరగతి వరకూ ముందస్తు అడ్మిషన్లకు తెరలేపి.. అందిన కాడికి దండుకుంటున్నాయి. కేవలం నర్సరీకే రూ. 30 వేల నుంచి రూ. 50 వేల వరకూ ఫీజులు వసూలు చేస్తూ తల్లిదండ్రుల నడ్డి విరుస్తున్నారు. స్కూల్ యూనిఫాం, పుస్తకాలు ముడిపెట్టి ముందుగానే అడ్మిషన్ ఫీజు చేలిస్తేనే సీటు గ్యారంటì హామీ ఇవ్వడం పరిపాటిగా తయారైంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఏ విద్యా సంస్థ కూడా డొనేషన్లు వసూలు చేయకూడదు. కనిపించని నోటీసు బోర్డు తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తు బాగుండాలని ప్రైవేటు స్కూల్స్ వైపు మొగ్గుచూపుతున్నారు. దీని ఆసరాగా తీసుకున్న కార్పొరేట్, ప్రై వేటు స్కూల్స్ యాజమాన్యాలు నిబంధనలకు నీళ్లొదిలేశాయి. నిబంధనల ప్రకారం పాఠశాలల్లో తాము వసూలు చేసే ఫీజు వివరాలను తరగతుల వారీగా నోటీసు బోర్డులో ఉం చాలి. కానీ, ఈ నిబంధన ఏ ఒక్క పాఠశాలలో కూడా అమలవుతున్న దాఖలాలు కనిపించడం లేదు. ప్రైవేటు టీచర్లకు టార్గెట్ కార్పొరేట్, ప్రై వేటు స్కూళ్లలో అడ్మిషన్లకు యజమాన్యాలు ఆయా సూళ్లలో పనిచేస్తున్న టీచర్లకు సైతం టార్గెట్ పెడుతున్నాయి. ఒక్కొక్కరికి 10 నుంచి 15 అడ్మిషన్లు చేయించాలని ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. టార్గెట్ పూర్తి చేయకుంటే వచ్చే విద్యాసంవత్సరంలో ఉద్యోగానికి ఎసరు తప్పని పరిస్థితి నెలకొంది. ఇదీ చదవండి: Andhra Pradesh: బోధనలో నవశకం -
ప్రాణాలు తీస్తున్న ఫీజులు
సాక్షి, హైదరాబాద్/సాక్షి, రంగారెడ్డి జిల్లా: అడ్డూ అదుపూ లేని కార్పొరేట్ కాలేజీల దోపిడీ, ధనదాహం విద్యార్థుల ప్రాణాల మీదకు తెస్తోంది. ఫీజులు చెల్లించలేని నిస్సహాయ పరిస్థితుల్లో, ప్రైవేటు కాలేజీల వేధింపులు భరించలేక, తల్లిదండ్రుల ఆవేదన చూడలేక బలవన్మరణాలకు, ఆత్మహత్యాయత్నాలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో కొందరు ప్రాణాలు కోల్పోతున్నారు. ఫీజు చెల్లించలేదని ఇంటర్ సర్టిఫికెట్లు ఇవ్వకపోవడంతో శుక్రవారం హైదరాబాద్ రామాంతపూర్ నారాయణ కాలేజీలో ఓ విద్యార్థి నేత ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం సృష్టించింది. మాదాపూర్‌లోని మరో కాలేజీలో కొన్ని నెలల క్రితం విద్యార్థి ఆందోళనకు దిగే వరకు సర్టిఫికెట్లు ఇవ్వకపోవడం గమనార్హం. రంగారెడ్డి జిల్లాలో ఫీజు చెల్లించే వరకు క్లాసులకు రావొద్దంటూ ఓ విద్యార్థిని వేధించడంతో, విద్యార్థి తీవ్ర మానసిక వేదనకు గురై మీడియాను ఆశ్రయించాడు. ఇలాంటి సంఘటనలెన్నో జరుగుతున్నా ఇంటర్ బోర్డు కానీ, విద్యామంత్రిత్వ శాఖ కానీ స్పందించిన దాఖలాల్లేవని, కిందిస్థాయి సిబ్బంది మొదలు ఉన్నతాధికారుల వరకు ముడుపులు అందడం వల్లే కార్పొరేట్ కాలేజీల ఆగడాలకు అడ్డుకట్ట పడటం లేదని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. నిబంధనలు ఉల్లంఘించి నిర్వహణ రాష్ట్రంలో 1,606 ప్రైవేటు కాలేజీలున్నాయి. వీటన్నింటికీ ఇంటర్ బోర్డు అనుబంధ గుర్తింపు (అఫ్లియేషన్) ఇస్తుంది. ఇప్పటివరకు 1480 కాలేజీలు అఫ్లియేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నాయి. వీటిల్లో 643 కాలేజీలకు అనుమతులిచ్చారు. వీటిల్లో సింహభాగం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే ఉన్న కార్పొరేట్ కాలేజీలే కావడం విశేషం. అఫ్లియేషన్ ఇచ్చేటప్పుడు అనేక అంశాలను ఇంటర్ బోర్డు పరిశీలించాల్సి ఉంటుంది. కాలేజీకి 8 వేల చదరపు అడుగుల స్థలం ఉండాలి. ఆటస్థలం తప్పనిసరి. లేబొరేటరీతో పాటు సెక్షన్‌కు ఇద్దరు అధ్యాపకులుండాలి. 9 సెక్షన్లకు మించి ఉండకూడదు. ప్రతి సెక్షన్లో 88 సీట్లు అనుమతిస్తారు. భవనానికి ఫైర్ సేఫ్టీ సర్టిఫికెట్ ఉండాలి. కానీ చాలా కాలేజీలు ఈ నిబంధనలేవీ పట్టించుకోవడం లేదు. ఇష్టారాజ్యంగా అదనపు సెక్షన్లు నడుపుతున్నారు. ప్రాక్టికల్స్ చేయించిన పాపాన పోవడం లేదు. సైన్స్ గ్రూపులతో పాటు, ఆర్ట్స్, కామర్స్ గ్రూపులూ ఉండాలి. కానీ కార్పొరేట్ కాలేజీల్లో అసలీ గ్రూపులే ఉండటం లేదు. ఇక ఒకటీ అరా కాలేజీల్లో మినహా ఆటస్థలం అనేదే ఉండటం లేదు. కొన్ని కాలేజీలకు ఒకచోట పర్మిషన్ ఉంటే మరోచోట నిర్వహిస్తున్నారు. అరకొరగా ఉండే అధ్యాపక సిబ్బందికి అతి తక్కువ వేతనాలిస్తూ, ఫీజుల విషయంలో విద్యార్థుల్ని మానసిక ఒత్తిడికి గురిచేస్తూ అమానవీయంగా వ్యవహరిస్తున్నారు. ఆలస్యమైతే అంతే.. ప్రైవేటు జూనియర్ కాలేజీల ఫీజులపై కచ్చితమైన చట్టం లేకపోవడం కార్పొరేట్ కాలేజీల పాలిట వరంగా మారింది. ఐఐటీ, నీట్ ఫౌండేషన్ అంటూ భారీయెత్తున ప్రచారంతో కాలేజీలు విద్యార్థులను ఆకర్షిస్తున్నాయి. పేద, మధ్యతరగతి తల్లిదండ్రులు కూడా తమ పిల్లల భవిష్యత్తుపై ఆశతో అనేక కష్టాలు పడుతూ ఆయా కాలేజీల్లో చేర్పిస్తున్నారు. దీన్ని అవకాశంగా తీసుకుని కాలేజీలు ఫీజులు పిండేస్తున్నాయి. కాలేజీని బట్టి కనీస వార్షిక ఫీజు రూ.60 వేలుంటే, గరిష్టంగా రూ.3 లక్షల వరకు వసూలు చేస్తున్నారు. చేరిన వెంటనే ఫీజులో సగం కట్టాలంటూ ఒత్తిడి తెస్తున్నారు. మిగతా మొత్తం రెండు నెలల్లో చెల్లించాలంటున్నారు. వారం రోజులు ఆలస్యమైనా విద్యార్థులకు నరకం చూపిస్తున్నారు. ఫీజు చెల్లించకపోతే క్లాసులో నిలబెడుతున్నారని, క్లాసు నుంచి బయటకు వెళ్లిపొమ్మంటూ అందరిలో అవమానిస్తున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తల్లిదండ్రులకు పదేపదే మెసేజ్‌లు పెడుతూ వేధిస్తున్నారు. క్లాసులకు హాజరుకానివ్వడం లేదు. చివరి అస్త్రంగా కోర్సు పూర్తి చేసుకున్న విద్యార్థులకు.. ఉన్నత తరగతుల్లో చేరేందుకు అవసరమైన సర్టిఫికెట్లు ఇవ్వకుండా వేధింపులకు పాల్పడుతూ బలవంతపు వసూళ్లకు దిగుతున్నారు. ఆ సంస్థ గుర్తింపు రద్దు చేయాలి కార్పొరేట్ కాలేజీల ధన దాహం పేద విద్యార్థులకు శాపంగా మారింది. రామంతాపూర్ నారాయణ కాలేజీ ఉదంతమే దీనికి నిదర్శనం. చాలా కాలేజీలు విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వకుండా వేధిస్తున్నాయి. ఇంటర్ బోర్డు తక్షణమే స్పందించాలి. ఈ తరహా దుర్మార్గాలకు అడ్డుకట్ట వేయాలి. నారాయణ కాలేజీలో ఆత్మహత్య ప్రయత్నంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలి. నారాయణ సంస్థ గుర్తింపు రద్దు చేయాలి. – ప్రవీణ్‌రెడ్డి (ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి) రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన నారాయణ సంస్థలతో పాటు ఇతర కార్పొరేట్ విద్యా సంస్థలు ఫీజుల కోసం విద్యార్థులను వేధించడం దారుణం. రామంతాపూర్ నారాయణ కళాశాల వేధింపులు విద్యార్థుల ప్రాణాల మీదకు తెచ్చాయి. వేధింపులకు పాల్పడుతున్న విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపడతాం. ఇప్పటికైనా ప్రభుత్వం, ఇంటర్ బోర్డు అధికారులు.. కార్పొరేట్ కాలేజీల దోపిడీని అడ్డుకోవాలి. – టి. నాగరాజు (ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి) ముడుపుల ఆరోపణలపై విచారణ జరపాలి నారాయణ, చైతన్య కాలేజీలు నడిపే హాస్టళ్ళకు అనుమతుల్లేవని ఇంటర్ బోర్డే తేల్చి చెప్పింది. అయినా ఆ కాలేజీలు య«థేచ్ఛగా హాస్టళ్లు నడుపుతుంటే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. బోర్డు అధికారులకు వారినుంచి ముడుపులు అందుతున్నాయనే ఆరోపణలున్నాయి. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలి. – మాచర్ల రామకృష్ణ గౌడ్ (తెలంగాణ ఇంటర్ విద్య పరిరక్షణ కమిటీ కన్వీనర్) చదవండి: అగ్గి రాజేసిన ఫీజు -
40 శాతం పెరిగే..
బాచుపల్లిలోని ఓ ఇంటర్నేషనల్ స్కూల్లో లలిత్ ప్రస్తుతం 9వ తరగతి చదువుతున్నాడు. ఫస్ట్‌క్లాస్‌లో చేరేప్పుడే ఏటా ఎంత ఫీజు పెరుగుతుందో అప్పుడే చెప్పారు. ఈ మేరకు ఏటా 25 శాతం పెరుగుదలతో తల్లిదండ్రులు ఫీజులు చెల్లిస్తున్నారు. 2019లో రూ.3.10 లక్షలు కట్టారు. 2020, 2021లో ఫీజులు పెంచలేదు. కానీ 2022లో ఏకంగా రూ.4.50 లక్షలు అన్నారు. రాష్ట్రంలోని బడ్జెట్ స్కూళ్ళలో 2019లో (కోవిడ్ కన్నా ముందు) కనిష్టంగా రూ.17 వేల నుంచి గరిష్టంగా రూ.33 వేల వరకూ వార్షిక ఫీజులున్నాయని తల్లిదండ్రులు చెబుతున్నారు. ఇప్పుడవి రూ.25 వేల నుంచి రూ.55 వేల వరకూ పెరిగాయి. ఎల్కేజీ నుంచి 6వ తరగతి వరకూ రూ. 25 వేలు, ఆ తర్వాత టెన్త్ వరకూ రూ.55 వేల వరకూ తీసుకుంటున్నారు. స్కూలును బట్టి ఫీజుల్లో హెచ్చుతగ్గులున్నాయి. సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు స్కూళ్లలో పెరిగిన ఫీజులు తల్లిదండ్రులను బెంబేలెత్తిస్తున్నాయి. ఓ మాదిరి బడ్జెట్ స్కూళ్ల నుంచి కార్పొరేట్ స్కూళ్ల వరకు ఫీజులు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోయాయి. రాష్ట్రవ్యాప్తంగా ఫీజులు సగటున 40 శాతం మేర పెరిగినట్లు తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నాయకులు చెబుతున్నారు. ఫీజులు, పుస్తకాలు, ఇతరత్రా ఖర్చులు కలిపి ఓ మాదిరి స్కూల్లో సగటున రూ.40 వేలు, కార్పొరేట్ స్కూలైతే రూ.4 లక్షల వరకు వార్షిక ఫీజు లేకుండా అడ్మిషన్ దొరికే పరిస్థితి లేదని అంటున్నారు. కోవిడ్ కాలంలో జరిగిన నష్టాన్ని భర్తీ చేసుకునేలా పాఠశాలలు ఫీజుల పెంపునకు శ్రీకారం చుట్టాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు డీజిల్ ధర పెరుగుదలను సాకుగా చూపిస్తూ బస్సు ఫీజుల్ని కొన్ని యాజమాన్యాలు రెట్టింపు చేశాయి. ఇక పుస్తకాలు, యూనిఫామ్‌లకయ్యే ఖర్చు వీటికి అదనం. కాగా జూన్ ఆరంభం నుంచి కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ముందే 50 శాతం మేర ఫీజులు కట్టేయాలంటూ స్కూళ్లు ఒత్తిడి చేస్తున్నాయి. దీంతో తాము అప్పులు చేయాల్సి వస్తోందని కొందరు తల్లిదండ్రులు తెలిపారు. నియంత్రణ ఏదీ? ► ఫీజుల నియంత్రణకు 2016లో ఆచార్య తిరుపతి రావు కమిటీని ప్రభుత్వం నియమించింది. తెలంగాణ వ్యాప్తంగా 10,800 ప్రైవేటు స్కూళ్ళలో చదువుతున్న 32 లక్షల మంది విద్యార్థుల పరిస్థితిని ఈ కమిటీ పరిశీలించింది. తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్, గుజరాత్, పశ్చిమబెంగాల్, పంజాబ్, ఉత్తరప్రదేశ్ సహా 15 రాష్ట్రాల్లో అక్కడి ప్రభుత్వాలు ఫీజుల నియంత్రణకు తెచ్చిన చట్టాలను కమిటీ పరిశీలించి కొన్ని సిఫారసులు చేసింది. ► దీనిప్రకారం ప్రతి స్కూలు 10 శాతం లోపు ఫీజు పెంచుకోవచ్చు. ఈ పరిమితి దాటి ఫీజులు పెంచే స్కూళ్లు తాము చేసిన ఖర్చు (స్కూలు అభివృద్ధికి, సౌకర్యాల కల్పనకు) ప్రతి పైసాకు లెక్క చూపాలి. బ్యాంకు ద్వారా ఆన్లైన్ లావాదేవీలు జరిగినట్లు ఆధారాలు చూపాలి. వీటిని ఫీజుల రెగ్యులేటరీ కమిటీ పరిశీలిస్తుంది. అవకతవకలుంటే భారీ జరిమానాకు, అవసరమైతే స్కూలు గుర్తింపు రద్దుకు కమిటీ సిఫారసు చేస్తుంది. ► ఈ విధానం అమలు చేస్తే చాలా స్కూళ్ళు 10 శాతం లోబడే ఫీజులు పెంచే వీలుంది. 2018లో తిరుపతి రావు కమిటీ దీనికోసం ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను తయారు చేసింది. దాదాపు 4,500 స్కూళ్ళు తమ ఖర్చులను ఆన్లైన్ ద్వారా చూపాయి. ఇవన్నీ 10 శాతానికి పైగా ఫీజులు పెంచుకునేందుకు అర్హత పొందాయి. అయితే ఈ విధానం ఆ తర్వాత కనుమరుగైంది. ► గత ఏడాది రాష్ట్ర మంత్రివర్గ ఉప సంఘం తిరుపతిరావు కమిటీ సిఫారసులతో పాటు మరికొన్ని అంశాలను జోడించి ప్రభుత్వానికి ఓ నివేదిక ఇచ్చింది. కానీ ఇప్పటివరకు ఫీజుల నియంత్రణ దిశగా అడుగులు పడలేదు. దీంతో ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తున్నాయి. ప్రభుత్వ బడుల వైపు మొగ్గు కోవిడ్ కారణంగా చితికిపోయిన కుటుంబాలుప్రస్తుత పరిస్థితుల్లో తమ పిల్లల్ని ప్రైవేటు స్కూళ్లు మాన్పించి, ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చేందుకు ఇష్టపడుతున్నాయి. పైగా సర్కారీ బడుల్లో ఈ ఏడాది నుంచి ఇంగ్లిష్ మీడియం కూడా అందుబాటులోకి వస్తుండం, కోవిడ్ కేసులు పెరిగి ప్రైవేటు స్కూళ్ళు మూతపడితే తాము కట్టే ఫీజులూ వృధా అవుతాయనే ఆలోచనతో ప్రభుత్వ స్కూళ్ళలో చేర్పిస్తున్నాయి. ఈ కారణంగా ప్రభుత్వ బడుల్లో ప్రవేశాలు ఇప్పటికే లక్ష దాటాయి. హైదరాబాద్‌లోని ఒక స్కూల్లో (ఐఏఎస్ ఫౌండేషన్ ప్రత్యేక స్కూలు) నిశాంత్ ప్రస్తుతం 8వ తరగతి చదువుతున్నాడు. 2019లో వార్షిక ఫీజు రూ. 3.50 లక్షలు ఉంది. ఇప్పుడే ఏకంగా రూ.4.10 లక్షలు కట్టమన్నారు. మొత్తం ఫీజు ఒకేసారి కడితే కొంత తగ్గిస్తామన్నారు. 2019లో డీజిల్ ధర లీటర్ రూ.68 ఉంది. ఇప్పుడు రూ.98 అయింది. పాఠశాల బస్సు ఫీజులు 2019లో దూరాన్ని బట్టి రూ.22 నుంచి రూ.48 వేల వరకూ ఉండగా.. ఇప్పుడివి రూ.28 వేల నుంచి రూ.58 వేల వరకూ పెరిగాయి. అప్పులు చేసే పరిస్థితిని నివారించాలి కరోనా నష్టాల పేరుతో ఈ సంవత్సరం ప్రైవేటు స్కూళ్ళు సగటున 40 శాతం మేర ఫీజులు పెంచాయి. డీజిల్ ధరలు పెరిగాయని బస్సు ఫీజులూ విపరీతంగా పెంచారు. పేద, మధ్య తరగతి వర్గాలు పిల్లల చదువు కోసం అప్పులు చేసే దారుణమైన పరిస్థితిపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి. ఫీజుల నియంత్రణకు కఠిన చట్టాలు తేవాలి. – టి.నాగరాజు (ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి) ఒకేసారి పెంచేశారు మా పిల్లాడి స్కూల్లో ఫీజు ఒకేసారి 40 శాతం పెంచారు. కోవిడ్ సమయంలో బకాయి పడిన మొత్తంతో పాటు ఈ ఏడాది ఫీజు సగం ఇప్పుడే కట్టమంటున్నారు. బతిమిలాడితే ఒక నెల గడువు ఇచ్చారు. ఫీజు కట్టడం కోసం అప్పు చేయాల్సిన పరిస్థితి ఉంది. – గుర్రం రామకృష్ణ (విద్యార్థి తండ్రి, మల్లెపల్లి, రఘునాథపాలెం మండలం, ఖమ్మం జిల్లా) -
ఫిట్నెస్ లేని స్కూల్ బస్సులు 75 శాతం
సాక్షి, అమరావతి: స్కూల్ బస్సుల ఫిట్నెస్ సర్టిఫికెట్లు (ఎఫ్‌సీ) రెన్యువల్ చేయించుకునే విషయంలో ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల యాజమాన్యాలు నిరాసక్తంగా వ్యవహరిస్తున్నాయి. రాష్ట్రంలో 75 శాతం స్కూల్ బస్సులకు ఫిట్నెస్ సర్టిఫికెట్లు తీసుకోలేదు. కరోనా పరిస్థితులతో దాదాపు ఏడాదిన్నర తరువాత పాఠశాలలను ఇటీవల పునఃప్రారంభించారు. గత ఏడాది కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు లాక్డౌన్ విధించడంతో స్కూల్ బస్సుల ఫిట్నెస్ సర్టిఫికెట్లు రెన్యువల్ చేయించుకునే విషయంపై కేంద్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. కాగా, రెన్యువల్ గడువు అక్టోబర్ 31వ తేదీతో ముగియనుంది. కానీ ఇప్పటికీ చాలా యాజమాన్యాలు బస్సుల ఫిట్నెస్ సర్టిఫికెట్ల రెన్యువల్‌పై ఏమాత్రం ఆసక్తి చూపించడం లేదు. కరోనా మూడో వేవ్ వస్తుందా, రాదా అనేదానిపై స్పష్టత వచ్చేవరకు ఈ విషయంలో వేచిచూసే ధోరణి అవలంభిస్తున్నాయి. 6,444 బస్సులకు ఎఫ్‌సీలు రాష్ట్రంలో మొత్తం 25,236 స్కూల్ బస్సులు ఉన్నాయి. కాగా వాటిలో సెప్టెంబర్ 30 నాటికి కేవలం 6,444 బస్సులకు మాత్రమే ఫిట్నెస్ సర్టిఫికెట్లు రెన్యువల్ చేయించారు. 18,792 బస్సులకు ఇంతవరకు ఫిట్నెస్ సర్టిఫికెట్లు రెన్యువల్ చేయలేదు. ఫిట్నెస్ సర్టిఫికెట్లు పొందిన స్కూల్ బస్సుల వివరాలు జిల్లాల వారీగా ఇలా ఉన్నాయి. -
కార్పొరేట్ బడులెప్పుడు?
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గతనెల 16 నుంచి స్కూళ్లు, జూనియర్ కాలేజీల్లో ప్రత్యక్ష తరగతుల నిర్వహణకు ప్రభుత్వం ఆదేశాలిచ్చినా ప్రైవేటు, కార్పొరేట్ యాజమాన్యాలు వాటిని పట్టించుకోవడం లేదు. అక్కడక్కడా కొన్ని బడ్జెటరీ స్కూళ్లు, కాలేజీలు తప్ప కార్పొరేట్ సంస్థల్లో తరగతులను నిర్వహించడం లేదు. ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీలు పనిచేస్తున్నా ప్రైవేటు సంస్థలు మాత్రం పట్టించుకోవడం లేదు. కేవలం తమ విద్యార్థులకు ఆన్లైన్లో పాఠాలు వినిపించి వాటినే తరగతులుగా చూపిస్తున్నాయి. కాలేజీలు, స్కూళ్లను తెరవకున్నా ఒక్కో విద్యార్థి వద్ద రూ.1 లక్ష నుంచి రూ.2 లక్షల వరకు వసూలు చేస్తున్నాయి. ఎవరైనా ప్రశ్నిస్తే బెదిరింపులకు దిగుతున్నాయి. సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. రాష్ట్రంలో 16 వేల వరకు ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలుండగా వాటిలో 29,61,689 మంది విద్యార్థులున్నారు. 2,500కు పైగా ఉన్న ప్రైవేటు జూనియర్ కాలేజీల్లో ఫస్టియర్, సెకండియర్ కలిపి 6 లక్షల మంది వరకు విద్యార్థులున్నారు. 90 శాతానికిపైగా సంస్థల్లో ఆన్లైన్ మంత్రాన్నే జపిస్తున్నారు. చాలా ప్రైవేటు యాజమాన్య పాఠశాలలను తెరవడం లేదు. కొన్నిచోట్ల తెరిచినా కొన్ని తరగతులకే పరిమితం చేస్తున్నారు. కార్పొరేట్ సంస్థలు ఆమేరకు కూడా స్కూళ్లు తెరవడం లేదు. ఆన్లైన్ పాఠాలంటూ విద్యార్థులనుంచి భారీగా ఫీజులు వసూలు చేస్తున్నాయి. కొన్ని సంస్థల్లో మాత్రం ఆన్లైన్ లైవ్ పాఠాలను ప్రారంభించారు. కొన్ని కాలేజీలు తమ సిబ్బందితో కొన్ని పాఠాలను ముందుగా రికార్డు చేయించి వాటినే విద్యార్థులకు వాట్సప్, ఇతర మార్గాల్లో పంపి చూసి చదువుకోండని చెబుతున్నాయి. స్మార్ట్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ఇతర పరికరాలున్న వారు పాఠాలను వినగలుగుతున్నా.. శారీరక, మానసిక ఇబ్బందులకు గురవుతున్నారు. చాలామంది విద్యార్థులు తరగతులు లేక, ఆన్లైన్లో వినే అవకాశాల్లేక ఇబ్బందులు పడుతున్నారు. ఫీజులు చెల్లిస్తేనే టీసీలు కరోనా సమయంలో ఆన్లైన్ పాఠాలు కూడా లేకపోవడంతో పలువురు విద్యార్థులు ఆయా సంస్థల్లో మానేసి వేరే సంస్థల్లో చేరాలనుకున్నా ప్రైవేటు, కార్పొరేట్ సంస్థలు ససేమిరా అంటున్నాయి. తమకు పూర్తి ఫీజు చెల్లిస్తేనే టీసీలు ఇస్తామని చెబుతున్నాయి. అసలు స్కూళ్లు లేక, పాఠాలు లేనప్పుడు ఫీజులు ఎందుకు చెల్లించాలని ప్రశ్నిస్తే బెదిరింపులకు దిగుతున్నాయి. వేతనాలకు ఎగనామం.. ఉద్యోగాలు తీసివేత కరోనా సమయంలో కాలేజీల్లో తరగతుల నిర్వహణ ఆగిపోవడంతో పలు ప్రైవేటు, కార్పొరేట్ సంస్థల యాజమాన్యాలు సిబ్బందికి వేతనాలు ఇవ్వకుండా ఎగ్గొట్టాయి. వేతనాల గురించి ఒత్తిడి చేసిన వారిని ఉద్యోగాల నుంచి తొలగించాయి. ఇప్పుడు ఆఫ్‌లైన్ తరగతుల నిర్వహణకు తగిన సిబ్బంది లేకపోవడంతో పలుసంస్థలు స్కూళ్లు తెరవకుండా కాలక్షేపం చేస్తున్నాయి. తొలగించిన సిబ్బందిని తిరిగి పిలిచినా వారు రావడానికి విముఖత చూపుతున్నారు. ఫలితంగా ఆయా సంస్థల్లో నిపుణులైన, అర్హతలు కలిగిన సిబ్బంది లేరు. దీంతో ఎలాంటి సామర్థ్యాలు లేనివారితోనే ఆయా సంస్థలు ఆన్లైన్ అంటూ నెట్టుకొస్తున్నాయి. ఆఫ్‌లైన్ తరగతులు నిర్వహిస్తే సిబ్బంది జీతభత్యాలతోపాటు నిర్వహణ ఖర్చులు కూడా ఉంటాయి. ఆన్లైన్ అయితే పెద్దగా జీతాలు చెల్లించాల్సిన అవసరం, నిర్వహణ ఖర్చులు లేకపోవడంతో ఎక్కువ సంస్థలు ప్రత్యక్ష తరగతులకు మొగ్గుచూపడం లేదు. ఫీజులు మాత్రం యథాతథంగానే వసూలు చేస్తున్నాయి. విద్యార్థులకు తమ పుస్తకాలు, ఇతర మెటీరియల్‌ను బలవంతంగా అంటగడుతున్నాయి. కరోనాలో అద్దెభవనాలు ఖాళీచేసిన సంస్థలు ప్రత్యక్ష తరగతులను నిర్వహించడానికి కోవిడ్ ప్రొటోకాల్ నిబంధనలు పాటించాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది. తరగతికి 20 మందికి మించకుండా ఉండాలని స్పష్టం చేసింది. పలు ప్రైవేటు, కార్పొరేట్ యాజమాన్యాలు తమ విద్యాసంస్థలను అద్దె భవనాల్లో కొనసాగిస్తూ వస్తున్నాయి. కరోనా కారణంగా వాటికి అద్దెలు చెల్లించక ఖాళీ చేశాయి ఇప్పుడు ప్రత్యక్ష తరగతుల నిర్వహణకు మళ్లీ ఆయా భవనాలను తీసుకోవాల్సి ఉంది. గతంలో అద్దె భవనాల్లో లెక్కకు మించి విద్యార్థులు కూర్చోబెట్టేవి. ఇప్పుడు కోవిడ్ నిబంధనలు పాటించాల్సి రావడంతో ప్రత్యక్ష తరగతుల నిర్వహణకు స్వస్తి చెబుతున్నాయి. ర్యాంకులకోసం పరిమిత సంఖ్యలో విద్యార్థులకు పాఠాలు కొన్ని కార్పొరేట్ సంస్థలు తమ స్కూళ్లు, కాలేజీల్లో మెరిట్ విద్యార్థుల వరకు ప్రత్యక్ష తరగతులు నిర్వహిస్తున్నాయి. జేఈఈ, నీట్ వంటి పోటీ పరీక్షల్లో ర్యాంకుల కోసం మెరిట్ విద్యార్థులను పరిమిత సంఖ్యలో రప్పించి ప్రత్యేక సిబ్బందితో పాఠాలు చెప్పిస్తున్నాయి. కేవలం ర్యాంకులు వచ్చాయని ప్రచారం చేసుకునే వ్యాపార దృక్పథంతోనే అవి వ్యవహరిస్తున్నాయి. -
‘కార్పొరేట్’కు దీటుగా..
కెరమెరి (ఆసిఫాబాద్): కడెర్ల రంగయ్య.. సావర్‌ఖెడా గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో 2010లో ప్రధానోపాధ్యాయుడిగా చేరారు. అదే గ్రామంలో ఇల్లు అద్దెకు తీసుకుని కుటుంబంతో సహా ఉంటున్నారు. పాఠశాలలో చేరినప్పుడు 48 మంది విద్యార్థులు ఉండేవారు. విద్యార్థుల తల్లిదండ్రులను ఒప్పించి చాలా మంది పిల్లలను సర్కారు బడిలో చేర్పించారు. దీంతో ప్రస్తుతం 280 విద్యార్థులు ఉన్నారు. ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్లకు తీసిపోని స్కూల్‌ను తీర్చిదిద్దారు. ఈ పాఠశాలలో చదివిన 70 మంది విద్యార్థులు గురుకులాల్లో, ఆరుగురు చుక్కా రామయ్య ట్రస్ట్‌లో సీట్లు సాధించారు. ప్రొజెక్టర్ ద్వారా తరగతులు చెబుతారు. సావర్‌ఖెడాలో ఎఫ్ఎం సావర్‌ఖెడా కార్యక్రమాన్ని ప్రారంభించారు. గుడిలో మైక్ పెట్టి రోజూ పాఠాలు బోధిస్తున్నారు. ఘర్ బన్‌గయా విద్యాలయ, ప్రేయర్ ఎట్ చౌరస్తా వంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. రోజూ ఉదయం 9 గంటలకు ఇళ్లల్లోనే విద్యార్థులు నిల్చుని ప్రార్థన చేస్తుంటారు. గ్రామంలో మద్యపాన నిషేధం కోసం రంగయ్య ఒక రోజు నిరాహర దీక్ష చేపట్టి మద్యపాన నిషేధం అమలయ్యేలా చూశారు. డ్రాపౌట్లు తగ్గడంతో బాల్యవివాహాలు తగ్గాయి. రంగయ్య సతీమణి వీణ కూడా గ్రామంలో రెండేళ్ల పాటు విద్యార్థులకు ఉచితంగా విద్యా బోధన చేశారు. రంగయ్య కూతురు అక్షర అదే పాఠశాలలో 1 నుంచి 5వ తరగతి చదువుకుంది. కుమారుడు అభిరాం ఇదే పాఠశాలలో 3వ తరగతి చదువుతున్నాడు. డ్రాయింగ్ షీట్లపై పాఠాలు రాసి గ్రామంలోని ఇళ్ల గోడలపై అతికించారు రంగయ్య. ఉదయం లేవగానే విద్యార్థులు గోడపై ఉన్న పాఠాలను చదువుకుంటున్నారు. మరింత ఉత్సాహం జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపిక కావడం చాలా సంతోషంగా ఉంది. ఉపాధ్యాయులు, గ్రామస్తులు, విద్యార్థులు, స్నేహితుల సహకారంతో ఈ అవార్డుకు ఎంపికయ్యాను. ఈ అవార్డు వారికే అంకితం. మరింత ఉత్సాహంగా పనిచేసేందుకు ఈ అవార్డు ఎంతో దోహదపడుతుంది. – కడెర్ల రంగయ్య, ప్రధానోపాధ్యాయుడు -
ఇప్పుడు కూడా కార్పొరేట్ యాజమాన్యాల కక్కుర్తి..!
ప్రైవేటు ఉద్యోగి అయిన సురేశ్ కుమారుడు వర్షిత్. ఓ కార్పొరేట్ స్కూల్లో 8వ తరగతి చదువుతున్నాడు. వార్షిక ఫీజు రూ.77 వేలు. అందులో ఇప్పటికే రూ.35 వేలు కట్టేశారు. కరోనా ఎఫెక్ట్‌తో ఉద్యోగం కోల్పోయి ఇబ్బందులు పడుతున్నామని,ఫీజు తగ్గించాలని ప్రిన్సిపాల్‌ను కోరినా ప్రయోజనం లేదు. మొత్తం చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నారు. ఫీజు కట్టకుంటే హాల్ టికెట్ ఇవ్వబోమని, పరీక్షలు రాయనివ్వమని అంటున్నారు. దీంతో ఏం చేయాలో అర్థంకాక సురేశ్ అప్పుల వేటలో పడ్డారు. సాక్షి, హైదరాబాద్: ఇంతటి కరోనా సమయం లోనూ రాష్ట్రంలోని కార్పొరేట్ స్కూళ్లు, కాలేజీల దోపిడీ కొనసాగుతోంది. ఏదో ఒకలా ఫీజులు వసూలు చేసేందుకు అన్ని మార్గాల్లో ప్రయత్నాలు జరుగుతున్నాయి. టెన్త్ పరీక్షలు రద్దయినా.. మిగతా తరగతులకు పరీక్షలు ఉంటాయని విద్యార్థుల తల్లిదండ్రులకు మెసేజీలు పెడుతున్నాయి. ఫీజులు పూర్తిగా కట్టాలని ఒత్తిడి తెస్తున్నాయి. ఫీజుల కోసం టీచర్లతో ఫోన్లు చేయించడం, వినకుంటే పరీక్షలు రాయనివ్వబోమని, పైతరగతికి పంపబోమని బెదిరించడం చేస్తున్నాయి. అసలే కరోనా ప్రభావంతో ఆదాయం తగ్గి, ఖర్చులు పెరిగి ఇబ్బందులు పడుతున్న తల్లిదండ్రులు.. చివరికి అప్పులు చేసైనా ఫీజులు కడుతున్నారు. మరోవైపు పలు కాలేజీలు ఇంటర్ విద్యార్థులకు జేఈఈ కోచింగ్ పేరిట ప్రత్యక్ష బోధనకు రావాలని ఒత్తిడి తెస్తున్నాయి. వినకుంటే తల్లిదండ్రులను వేధిస్తున్నాయి. ‘ఫీజు’ బాధలో లక్షల మంది తల్లిదండ్రులు కరోనా ఎఫెక్ట్, లాక్డౌన్ పరిస్థితులతో సుమారు లక్షన్నర వరకు ప్రైవేటు టీచర్లు, లెక్చరర్లు, మరో 2 లక్షల మంది వరకు ఇతర రంగాల వారు ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు దూరమయ్యారు. కుటుంబం గడవటమే కష్టంగా మారిన పరిస్థితుల్లో వారు పిల్లల ఫీజుల కోసం తంటాలు పడాల్సి వస్తోంది. పరీక్షల తర్వాత టీసీ తీసుకునేప్పటి వరకు ఫీజుల సొమ్మంతా చెల్లిస్తామంటున్నా యాజమాన్యాలు ఒప్పుకోవడం లేదు. ఇప్పుడు కడితేనే పిల్లలకు హాల్ టికెట్లు ఇస్తామని, పరీక్షలు రాయనిస్తామని అంటున్నాయి. టెన్త్ విద్యార్థులపైనా.. పదో తరగతి విద్యార్థులకు ప్రభుత్వం పరీక్షలు రద్దు చేసింది. ఫార్మేటివ్ అసెస్మెంట్–1 (ఎఫ్ఏ) మార్కుల ఆధారంగా ఫైనల్ మార్కులు ఇచ్చే ఆలోచనలు చేస్తోంది. స్కూళ్లు ఇదే అదనుగా ఫీజు మొత్తం వసూలు చేసుకునే పనిలో పడ్డాయి. ఫీజులు కడితేనే ఎఫ్ఏ–1 మార్కులను ప్రభుత్వానికి పంపుతామని బెదిరిస్తున్నాయి. దీంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. సిబ్బంది అంతంతే.. అయినా పూర్తి ఫీజులు రాష్ట్రంలో 1,586 ప్రైవేటు జూనియర్ కాలేజీలుంటే అందులో కార్పొరేట్ కాలేజీలే 700పైగా ఉన్నాయి. ప్రైవేటు స్కూళ్లు 10,807 ఉంటే.. అందులో 4 వేల వరకు బడా ప్రైవేటు స్కూళ్లు, మరో 2 వేల వరకు కార్పొరేట్ స్కూళ్లు, మిగతావి చిన్న పాఠశాలు. కాలేజీల్లో క్యాంపస్, బ్రాంచీని బట్టి రూ.50 వేల నుంచి రూ.1.85 లక్షల వరకు ఫీజు వసూలు చేస్తున్నాయి. స్కూళ్లలో రూ.20 వేల నుంచి రూ.లక్ష వరకు వసూలు చేస్తున్నాయి. అయితే కరోనా కారణంగా.. చాలా స్కూళ్లు, కాలేజీలు 75 శాతం సిబ్బందిని తొలగించి, మిగతా 25 శాతం మందితోనే క్లాసులు చెప్తున్నాయి. ప్రత్యక్ష బోధన మొదలైనా వారిని తిరిగి విధుల్లోకి తీసుకోలేదు. ఈ 25 శాతం మంది సిబ్బందికి కూడా అరకొర వేతనాలే చెల్లిస్తున్నాయి. కానీ విద్యార్థుల నుంచి మాత్రం పూర్తి ఫీజులు వసూలు చేస్తున్నాయి. ఇంత జరుగుతున్న విద్యా శాఖ గానీ, ప్రభుత్వంగానీ పట్టించుకోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విద్యార్థుల నుంచి నెలవారీ ట్యూషన్ ఫీజులు తీసుకోవాలంటూ గతంలో జీవో 46 జారీ చేసినా.. అది అమలుకాలేదు. అసలు స్కూళ్లలో ఎందరు టీచర్లు ఉన్నారు, ఎందరిని తొలగించారు, ఆన్లైన్ బోధన ఎంత మంది చేశారు, విద్యార్థులకు ఏ మేర పాఠాలు జరుగుతున్నాయన్న దానిపై విద్యాశాఖ పట్టించుకున్న దాఖలాలు లేవన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలోని బడా, కార్పొరేట్ స్కూళ్లు, కాలేజీల్లో అడ్డగోలు ఫీజుల వసూళ్లపై ఇటు పాఠశాల విద్యా శాఖకు, అటు ఇంటర్ బోర్డుకు రోజూ పదుల సంఖ్యలో ఫిర్యాదులు కూడా వస్తున్నాయి. ఇప్పటికైనా ఫీజుల విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకుని, తగిన చర్యలు చేపట్టాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. చదవండి: ఇసుక తోడేళ్ల రాక్షసం..కాపు కాసి కత్తిపోట్లు..! -
వేధించే స్కూళ్లకు పాఠం
సాక్షి, హైదారబాద్: ‘కారణం చెప్పకుండా పిల్లల్ని ఒక్కసారిగా చదువుకి దూరం చేస్తే.. తల్లిదండ్రుల మనసు ఎంత క్షోభిస్తుందో అర్థం చేసుకోండి’ అంటూ ఆమె చెమర్చిన కళ్లతో ప్రశ్నిస్తుంటే.. నగరంలో పలువురు తల్లిదండ్రుల కళ్లు తడిదేరాయి. ఎందరో మధ్యతరగతి పేరెంట్స్‌కి పిల్లల కోసం చదువు‘కొనే’ తమ కష్టాలు గుర్తొచ్చాయి కార్పొరేట్ స్కూళ్ల కాఠిన్యంపై ధ్వజమెత్తారు సినీ సెలబ్రిటీ జంట శివబాలాజీ, స్వప్నమాధురి దంపతులు. కొన్ని స్కూళ్ల యాజమాన్యాల నిర్వాకాలను తప్పనిసరి భరించే ఎందరో పేరెంట్స్‌కు భిన్నంగా సిటీలో తొలిసారిగా స్కూల్‌పై ఈ తరహా పోరాటం చేసిన పేరెంట్స్‌గా, స్కూల్ నుంచి తీసేసిన వందలాది మంది పిల్లలకు అండగా నిలిచారు.. తీసేసిన పిల్లల్ని తిరిగి చేర్చుకునేలా చేసి గెలిచారు. ఈ నేపథ్యంలో స్వప్నమాధురితో సంభాషించినప్పుడు.. పంచుకున్న విషయాలు ఆమె మాటల్లోనే.. ♦ప్రీ మిడ్‌టర్మ్ పరీక్షల కోసం రివిజన్స్ జరుగుతున్న సమయంలో.. స్కూల్లో ఎనిమిదేళ్లుగా చదువుతున్న మా పిల్లల్ని ఆకస్మికంగా ఆన్లైన్ క్లాసులకు దూరం చేశారు. కారణం ఏంటని ఫ్రంట్ ఆఫీస్ వాళ్లకి ఫోన్ చేసి అడిగాం. అకౌంట్ డిపార్ట్మెంట్ని కాంటాక్ట్ చేయమన్నారు. అక్కడ నుంచీ రిప్లై లేదు. ♦మన సైడ్ నుంచి ఏ తప్పు ఉండకూడదని కంటిన్యూగా ఫోన్స్ చేస్తున్నా ‘నో రెస్పాన్స్’.. ఫ్రంట్ ఆఫీస్‌కి కాల్ చేసి ఫోన్ చేసి, మెయిల్‌కి రిప్లై రావడం లేదంటే.. ఫీజు విషయమై ఉంటుందన్నారు. (శివ బాలాజీ ఫిర్యాదుపై హెచ్ఆర్సీ స్పందన) ♦ఏదైనా సరే మాకు చెప్పాలి కదా.. ఏదీ చెప్పకుండా సడెన్‌గా ఇలా చేయడం ఏమిటనడిగితే ప్రిన్సిపాల్‌తో మాట్లాడిస్తామని చెబుతూ వచ్చారు. అదీ జరగలేదు. ♦కొంత మంది తల్లిదండ్రులు గ్రూప్‌గా ఏర్పడి ఫీజులు తగ్గించమని అడగడం, ఆ గ్రూప్‌లో నేనూ ఉండటం వల్లే ఇలా చేశారని ఆ తర్వాత వారి స్పందన ద్వారా అర్థమైంది. ఫీజు తగ్గించమని అడగడం తప్పా? ♦కరోనా కారణంగా ప్రస్తుతం చాలా మంది ఆర్థిక పరిస్థితులు బాగోలేవు. ఆన్లైన్ క్లాసులంటే.. ల్యాప్ టాప్ కొనాలి. పనులు మానేసి కొన్ని గంటల పాటు సమయాన్ని పిల్లలతో గడపాలి.. ఇవన్నీ సమస్యలున్నాయి. కాబట్టి ఫీజు తగ్గించమని అడగడానికి వందల మంది పేరెంట్స్ కలిసి గ్రూప్‌గా ఏర్పడ్డారు. ♦ఆ గ్రూప్‌లో నన్నూ యాడ్ చేశారు. మేమైతే ఫస్ట్ టర్మ్ ఫీజు పూర్తిగా కట్టేశాం అయినా కానీ కట్టలేని వారి గురించీ ఆలోచించాలి కదా.. అందులోనూ వీరెవరూ మొత్తం ఫీజు కట్టం అనలేదు. కాస్త తగ్గించమన్నారంతే. ♦వాళ్లకు కనీసం రెస్పాన్స్ ఇవ్వాలి కదా? తగ్గిస్తున్నామనో.. తగ్గించమనో చెప్పాలి కదా? జూన్‌లో గ్రూప్ తరఫున మెయిల్ పెడితే ‘మీరు గ్రూప్‌గా అడిగితే అసలు మేం కన్సిడర్ చేయం’ అంటూ ఆగస్టు 12న రిప్లై వచ్చింది. ♦దాంతో పర్సనల్‌గా డైరెక్టర్, ప్రిన్సిపాల్‌ని అడ్రస్ చేస్తూ ఒక లెటర్ రాశాం. పేరెంట్స్‌ని తప్పుగా చూడవద్దు. ఈ సమస్య లేకపోతే ఎవరూ ఇలాంటి రిక్వెస్ట్ పెట్టేవారు కాదు అంటూ నచ్చజెప్పే ప్రయత్నం చేశాం. ♦విచిత్రమేమిటంటే నేనేమీ నా పిల్లల ఫీజు విషయంలో తగ్గించాలని అడగలేదు. అయినా నా పిల్లలతో పాటు గ్రూప్‌లో ఉన్న వందలాది మంది పిల్లల్ని క్లాసులకు దూరం చేశారు. పైగా..‘మిగతా పేరెంట్స్‌ని ఫీజు కట్టకుండా ఆపుతున్నారు మీ మీద యాక్షన్ తీసుకుంటా’మంటూ మాకు మెయిల్ పెట్టారు. ♦నా పిల్లల్ని ఎందుకు తీశారు? కమ్యూనికేషన్ ఎందుకు బ్లాక్ చేసేశారు? మొత్తం ఫీజు కట్టేశాక కూడా నా తప్పు ఏమిటి? ఒక పేరెంట్‌గా నేను అడిగితే నా మీద పర్సనల్‌గా ఎందుకు యాక్షన్ తీసుకుంటామంటున్నారు? అంటూ ప్రశ్నలు అడిగితే రిప్లై లేదు. దాదాపు 3 వారాల పాటు చూసి ఇక వేరే గత్యంతరం లేక మానవ హక్కుల కమిషన్ని ఆశ్రయించాం. హక్కులేమీ లేవా? పిల్లలను స్కూల్లో చదివించే తల్లిదండ్రులకు తమకంటూ కొన్ని హక్కులు ఉంటాయి కదా. ‘మీ వైపు నుంచి ఈ తప్పు జరిగింది.. దాంతో మీ పిల్లల్ని తీసేస్తున్నాం’ అంటూ నోటిస్ ఇచ్చి దానికి స్పందించకపోతే అప్పుడు యాక్షన్ తీసుకోవచ్చు. ►అంతేగాని ఏకపక్షంగా చెప్పాపెట్టకుండా తీసేసి ఎందుకు అలా చేయాల్సి వచి్చందో కూడా సమాచారం ఇవ్వకపోతే ఎలా? ‘ఈ విషయంలో స్కూల్ తప్పేమీ లేదని తేలింది. స్వప్పమాధురి, శివబాలాజీ మీడియా పబ్లిసిటీ కోసమే డ్రామా ఆడుతున్నారు’ అంటూ మిగిలిన పేరెంట్స్‌ను తప్పుదారి పట్టించేలా స్కూల్ నుంచి మెయిల్స్ పెట్టారు. పిల్లల భవిష్యత్‌తో డ్రామాలు ఆడతామా? అంత అవసరం మాకేంటి? వదిలేది లేదు.. ప్రస్తుతం చాలా మంది తీసేసిన పిల్లల్ని తిరిగి క్లాసుల్లోకి తీసుకున్నారు. అయినప్పటికీ దీన్ని వదిలేది లేదు. మా పిల్లల్ని ఎందుకు తీసేశారు? మాకు కారణం కావాలి. మాకు నగరం నుంచి తెలుగు రాష్ట్రాల నుంచి ఫోన్లు వస్తున్నాయి.. ఎందరో తల్లిదండ్రులు ఫోన్ చేస్తూ కరోనా నేపథ్యంలో తమ కష్టాలు, స్కూళ్ల యాజమాన్యాలతో తమకు ఏర్పడుతున్న సమస్యలు చెబుతున్నారు. వారందరికీ మనోధైర్యం ఇచ్చేలా హెచ్ఆర్సీ జడ్జిమెంట్ రావాలి. ప్రతి స్కూల్‌కి ఇదొక పాఠం అవ్వాలి. కష్టపడి పిల్లల్ని చదివించే పేరెంట్స్‌ని అవస్థలు పెట్టడం తప్పు అని స్కూల్స్ తెలుసుకోవాలి. -
‘కార్పొరేట్’ దందా!
దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన వర్షశ్రీ చైతన్యపురిలోని ఓ కార్పొరేట్ స్కూల్లో పదో తరగతి చదువుతోంది. ప్రతిరోజు ఆన్ లైన్ క్లాస్‌లకు హాజరవుతోంది. రెండ్రోజుల క్రితం ఆన్ లైన్ క్లాస్ పూర్తయ్యే సమయంలో ‘స్కూల్లో మాడ్యూల్స్ అందుబాటులో ఉన్నాయి. ఒక్కో పుస్తకం రూ.1,500 డబ్బులు చెల్లించి వాటిని తీసుకొని ప్రాక్టీస్ చేసుకోవాలి’అని క్లాస్ టీచర్ సూచించారు. దీంతో మాడ్యూల్స్ కొనుగోలు చేసేందుకు వర్షశ్రీ తల్లిని ఒత్తిడి చేసి స్కూల్‌కు వెళ్లి మాడ్యూల్స్ కొనుగోలు చేసింది. సాక్షి, హైదరాబాద్ : కరోనా వేళ ప్రైవేటు పాఠశాలలు సరికొత్త వ్యాపారాన్ని మొదలుపెట్టాయి. కోవిడ్–19 కారణంగా పాఠశాలలు మూత బడటంతో విద్యార్థులకు ఆన్ లైన్ లో బోధన సాగిస్తున్న యాజమాన్యాలు.. ఇప్పుడు అభ్యసనా కార్యక్రమాల కింద ప్రత్యేకంగా మాడ్యూల్స్ రూపొందించి విక్ర యిస్తున్నాయి. వాస్తవా నికి పాఠ్య పుస్తకాల్లో ఉన్న అంశాలనే ఇందులో ప్రస్తావించినప్ప టికీ.. ముఖ్యమైన అంశాలను వరుసగా చేర్చి పుస్తక రూపంలో మాడ్యూల్స్ పేరిట తీసుకు వస్తున్నాయి. కొన్ని పాఠశాలలు ఒక్కో సబ్జె క్టుకు ఒక్కో మాడ్యూల్‌ను రూపొందిం చగా... మరికొన్ని పాఠశాలలు లాంగ్వేజెస్ ను ఒక పుస్తకంగా, మిగతా సబ్జెక్టులను మరో పుస్త కంగా తీసుకువచ్చాయి. వీటి ధర లను రూ.1,500–3,000 వరకు నిర్ధేశించి విద్యా ర్థులకు అంటగడుతున్నాయి. హైస్కూల్ విద్యార్థులకే... ప్రస్తుతం పాఠశాలల్లో ఎక్కువగా హైస్కూల్ పిల్లలకే ఈ మాడ్యూల్స్ రూపొందించాయి. 8, 9, 10 తరగతుల విద్యార్థుల సబ్జెక్టుల ఆధారంగా ఈ స్పెషల్ బుక్స్‌ను అందు బాటులోకి తెచ్చారు. ఈ పుస్తకాలను పాఠశాల యాజమాన్యాలే ముద్రిస్తుండటంతో వారు నిర్ధేశించిన ధరలే అచ్చు రూపంలో వస్తున్నాయి. విద్యార్థులకు పాఠ్యాంశం అభ్యసన కార్యక్రమాల కోసం ప్రత్యేక ప్రాక్టీస్ మంచిదే అయినా.. ఇంతపెద్ద మొత్తంలో ధరలు నిర్ధేశించి దండుకోవడాన్ని విద్యార్థుల తల్లిదండ్రులు తప్పుపడుతున్నారు. రూ.వంద కూడా వెలకట్టలేని పుస్తకాలపై వేల రూపాయలు డిమాండ్ చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రైౖ వేటు పాఠశాలలపై విద్యాశాఖ అజమాయిషీ కోల్పోతోందని, ఫలితంగా యాజమాన్యాలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ అన్నింటినీ వ్యాపార కోణంలో సాగిస్తున్నాయని తల్లిదండ్రులు మండిపడుతున్నారు. -
ఆన్లైన్ పాఠాలతో ఒత్తిడి
సాక్షి, సిటీబ్యూరో: ప్రణీత్ పదో తరగతి స్టూడెంట్. చాలా చురుకైన విద్యార్థి. అతడు ఎక్కడ ఉంటే అక్కడ సందడిగా ఉంటుంది. కానీ కొద్ది రోజులుగా అతడు మౌనంగా ఉంటున్నాడు. ఇంట్లో ఎవరితోనూ మాట్లాడటం లేదు. సాధారణంగా ఉదయం ఆరింటికి నిద్రలేచి చక్కగా రెడీ అయి స్కూల్‌కు వెళ్లేవాడు. ఇప్పుడు ఉదయం 8 గంటలు దాటినా లేవలేకపోతున్నాడు. నిద్ర కళ్లతోనే కంప్యూటర్ ముందు కూర్చుని ఆన్లైన్ తరగతులకు హాజరవుతాడు. అతడి ప్రవర్తనలో వచ్చిన మార్పుతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. మానసిక నిపుణులను సంప్రదించారు. సహజమైన స్కూల్ వాతావరణానికి భిన్నంగా ఆన్లైన్ పాఠాలకు హాజరుకావడంతో తీవ్రమైన ఒత్తిడికి గురైనట్లు మానసిక వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇలా.. ఒక్క ప్రణీత్ మాత్రమే కాదు. చాలా మంది పిల్లలు ఇలాంటి మానసిక స్థితినే ఎదుర్కొంటున్నారు. నగరంలోని అనేక ప్రాంతాల్లో ప్రైవేట్ స్కూళ్లు ప్రస్తుతం ఆన్లైన్ క్లాస్‌లను నిర్వహిస్తున్నాయి. కొన్ని స్కూళ్లలో ఒకటో తరగతి నుంచే ఈ బోధన కొనసాగుతుండగా మరికొన్ని స్కూళ్లు 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఆన్లైన్ తరగతులను నిర్వహిస్తున్నాయి. కరోనా మహమ్మారి కారణంగా నెలకొన్న పరిస్థితులతో పిల్లల చదువులే కాకుండా విద్యాసంస్థల మనుగడ కూడా ఇప్పుడు ఆన్‌లైన్‌పై ఆధారపడి ఉండడం గమనార్హం. ఈ నేపథ్యంలో నిర్వహిస్తున్న కంప్యూటర్ పాఠాలు పిల్లలపై ఒత్తిడిని తీవ్రతరం చేస్తున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బోధనా పద్ధతిలో మార్పు అవసరమని సూచిస్తున్నారు. క్లాస్ రూమ్ తరహాకు భిన్నంగా ఇష్టాగోష్టి పద్ధతిలో ఆన్లైన్ విద్యాబోధన ఉండాలని అభిప్రాయడుతున్నారు. వికాసంపై వేటు.. ♦ ఆన్లైన్ క్లాసులతో పిల్లలు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు కంప్యూటర్‌కు అతుక్కుపోతున్నారు. కొంతమంది మొబైల్ ఫోన్లలో క్లాసులకు హాజరవుతున్నారు. దీంతో కేవలం ఒక డివైజ్‌పై దృష్టి సారించి గంటల తరబడి కూర్చోవడం వల్ల పిల్లల సృజనాత్మకత దెబ్బతింటుంది. ♦ చాలా మంది పిల్లలు కళ్లు పొడిబారడం, తలనొప్పి, వెన్నెముక నొప్పి వంటి శారీరక ఇబ్బందులకు గురవుతున్నట్లు డాక్టర్లు చెబుతున్నారు. ♦ మెదడు తీవ్రమైన ఒత్తిడికి గురవుతుంది. ♦ కొత్త విషయాలను నేర్చుకొనే సామర్థ్యం దెబ్బతింటుంది. ♦చాలా మంది పిల్లలు కంప్యూటర్ ముందు కూర్చున్నప్పటికీ టీచర్లు చెప్పే పాఠాలను అర్థం చేసుకోలేకపోతున్నారు. ఏకాగ్రత లోపిస్తుందని మానసిక వైద్యులు అభిప్రాయపడుతున్నారు. పిల్లల భాగస్వామ్యం తప్పనిసరి.. విశాలమైన తరగతి గదిలో తోటి విద్యార్థులతో కలిసి చదువుకొనే వాతావరణానికి భిన్నంగా నట్టింట్లో కంఫ్యూటర్, మొబైల్ ఫోన్, ట్యాప్ లాంటివి ముందేసుకొని టీచర్లు చెప్పే పాఠాలను వినడం, నేర్చుకోవడం పిల్లలకు ‘శిక్ష’గానే ఉంటుంది. కానీ కోవిడ్ కారణంగా అనివార్యంగా మారిన ఈ విద్యాబోధనను ‘చక్కటి శిక్షణ’గా మార్చేందుకు పిల్లల భాగస్వామ్యాన్ని పెంచడం తప్పనిసరి. ఇందుకోసం ‘టీచర్ పాఠం చెబుతుంటే పిల్లలు వినడం’ అనే పద్ధతికి భిన్నంగా ఏదైనా ఒక అంశంపై వీడియో పాఠాలను చూపించి ఆ తర్వాత దానిపై పిల్లలతో చర్చ నిర్వహిస్తే ఎక్కువగా నేర్చుకొంటారని, పిల్లల భాగస్వామ్యం పెరుగుతుందని పేర్కొంటున్నారు. మార్కులే ప్రామాణికం కాదు మార్కుల కోసమే చదివించడం అనే దృక్పథం నుంచి తల్లిదండ్రులు, విద్యాసంస్థలు మారాలి. పిల్లల్లో సృజనాత్మకతను, జిజ్ఞాసను పెంచేవిధంగా కొత్త విషయాలను తెలుసుకోవడంలో ఆసక్తి కలిగించే విధంగా విద్యాబోధన ఉంటే ఆన్లైన్ అయినా ఎలాంటి ఇబ్బంది ఉండదు. తోటి విద్యార్థులు, టీచర్లతో కలిసి చదువుకోవడం అనే ఒక సమష్టి కార్యక్రమంగా విద్యాబోధన ఉండాలి. గంటల తరబడి కంప్యూటర్ ముందు కూర్చోబెట్టడం సరైన విద్యావిధానం కాదు. – డాక్టర్ వీరేందర్, మానసిక వైద్య నిపుణులు -
ఆన్లైన్ విద్యతో లక్ష్యాలు నెరవేరేనా!
కరోనాతో రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు మూతపడ్డ సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విద్యా సంవత్సరాన్ని కోల్పోకుండా ప్రభుత్వంతోపాటు ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలు విభిన్న మార్గాల్లో విద్యార్థులకు విద్యను అందిస్తున్నాయి. ప్రధానంగా ఆన్లైన్ బోధనపై నిపుణులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఆన్లైన్ బోధన వల్ల ప్రయోజనం ఉండదని కొంతమంది చెబుతుండగా, మరికొందరు అదొక్కటే మార్గమంటున్నారు. సాక్షి, అమరావతి: కరోనాతో పాఠశాలలు మూతపడటంతో ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలు ఆన్లైన్ బాట పట్టాయి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం విద్యా వారధి పథకం ద్వారా విద్యార్థులకు బోధనను అందిస్తోంది. ఇందులో భాగంగా దూరదర్శన్ సప్తగిరి చానెల్ ద్వారా వివిధ సబ్జెక్టుల పాఠాలను టీచర్లతో బోధిస్తోంది. మరోవైపు ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలు సెల్ఫోన్లు, ట్యాబ్‌లు, కంప్యూటర్ల ద్వారా విద్యా బోధన చేస్తున్నాయి. బోధన పేరుతో విద్యార్థులపై ఒత్తిడిని పెంచుతున్నాయి. అంతేకాకుండా ఫీజులను కూడా అధికంగా వసూలు చేస్తూ విద్యార్థులు, వారి తల్లిదండ్రులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. మూడు మార్గాల్లో బోధన ► పిల్లలకు అనుగుణంగా హైటెక్, లోటెక్, నోటెక్ వినియోగించి బోధన సాగిస్తున్నాం. ఆన్లైన్లో మొత్తం సిలబస్‌ను, పాఠ్యపుస్తకాలను ఎన్సీఈఆర్టీ దీక్ష ప్లాట్ఫామ్లో పొందుపరిచాం. ► స్పోకెన్ ఇంగ్లిష్ కోర్సు కింద వెబ్‌నార్ శిక్షణ నిర్వహిస్తున్నాం. టీచర్లు, పిల్లలకు అనుగుణంగా ‘అభ్యాస’ అనే యాప్ రూపొందించాం. ► లో టెక్నాలజీ ఉన్నవారు దూరదర్శన్, ఆకాశవాణిల ద్వారా పాఠాలు వినేలా చేస్తున్నాం. దూరదర్శన్ ద్వారా 1.80 లక్షల మంది విద్యార్థులు తమ అభ్యసనాన్ని కొనసాగిస్తున్నారు. ► 1 నుంచి 6 తరగతి వరకు ఉన్న పిల్లలకు విద్యావారధి కింద 18 లక్షల వర్క్ బుక్స్ అందించాం. నోటెక్ (టెక్నాలజీ అందుబాటులో లేనివారు) విద్యార్థులకు వాహనాలు, టీచర్ల ద్వారా బోధన చేస్తున్నాం. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు బోధన ఇలా.. ► ప్రభుత్వ పాఠశాలల్లో ఎక్కువ మంది పిల్లలు గ్రామీణ, నిరుపేద వర్గాలకు చెందిన వారే. దీంతో ప్రభుత్వం ఆయా విద్యార్థుల పరిస్థితులకు అనుగుణంగా బోధిస్తోంది. టెక్నాలజీ సౌకర్యం ఉన్నవారికి ఆన్లైన్లో పాఠ్యపుస్తకాలను అందుబాటులో ఉంచింది. ► మరికొందరికి టీవీలు, వీడియోల ద్వారా పాఠ్యాంశాలను అందిస్తోంది. ► డిజిటల్ (సెల్‌ఫోన్, ట్యాబ్, ల్యాప్‌టాప్, కంప్యూటర్) పరికరాలు లేని వారికి వర్క్ బుక్స్ అందించి వారికి వారానికి ఒకటి రెండు రోజులు స్కూళ్లలో టీచర్ల ద్వారా సందేహాలను నివృత్తి చేస్తోంది. కొంతవరకైనా స్కూళ్లు తెరవడం మంచిది ► సప్తగిరి చానెల్ ద్వారా బోధించడం, వర్క్ బుక్స్ ఇవ్వడం వల్ల విద్యా సంవత్సరానికి సంబంధించి కొంత గ్యాప్ పూడుతుంది. ► కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలలు డిజిటల్ బోధనతోపాటు పుస్తకాలను పంపిణీ చేస్తున్నాయి. ► మామూలు విద్యా సంవత్సరంలో కంటే ఎక్కువగా ఆన్లైన్లో బోధిస్తున్నాయి. ఈ అంశం ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల పిల్లల మధ్య వ్యత్యాసాన్ని పెంచుతుంది. కాబట్టి ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకోవాలి. ► పూర్తిగా కరోనా లేని ప్రాంతాలను గుర్తించి షిప్ట్‌ల పద్ధతిలో పాఠశాలలను నడపాలి. ► ఆన్లైన్ బోధనలతోపాటు డిస్టెన్స్ ఎడ్యుకేషన్ విధానం ఉండాలి. ► సిలబస్‌ను అవసరం మేరకు తగ్గించాలి. – జి.హృదయరాజు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఏపీటీఎఫ్ ఆన్లైన్ బోధన.. తరగతి బోధనకు ప్రత్యామ్నాయం కాలేదు ► పాఠశాలలు ప్రారంభమయ్యే అవకాశం లేదు కాబట్టి ఆన్లైన్ బోధన ద్వారా ఈ పరిస్థితిని అధిగమించవచ్చని కొన్ని ప్రయత్నాలు మొదలుపెట్టారు. అయితే ఆన్లైన్ బోధన.. తరగతి బోధనకు ప్రత్యామ్నాయం కాలేదు. ఆన్లైన్ క్లాసుల కంటే ఉన్నంతలో టీవీ చానెల్ ద్వారా చెప్పడం వల్ల కొంత ఉపయోగం ఉంటుంది. – బాబుల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి యూటీఎఫ్ ఆన్లైన్ బోధనతో ప్రయోజనం లేదు ► పాఠశాల విద్యకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అద్భుతంగా ఉన్నాయి. ► సరైన జాగ్రత్తలు తీసుకుని పాఠశాలలు తెరవాలి. మాస్కులు, గ్లౌజులు కచ్చితంగా పెట్టుకు రావాలని విద్యార్థులకు సూచించాలి. అవసరమైతే వాటిని ప్రభుత్వమే అందించాలి. ► ఆన్లైన్ బోధన వల్ల పూర్తి ప్రయోజనం లేదు. – కె.టి.శేఖర్, పేరెంట్, కాకినాడ -
బొటనవేలు తెగొద్దు!
అనగనగా ఒక ఏకలవ్యుడూ, అతని కుడిచేతి బొటనవేలు వృత్తాంతం తరతరాలుగా వింటున్నదే. భారతమంత వయ సున్న ఈ ప్రాచీన కథ ఇప్పుడు మరింత ప్రాసంగికతను సంత రించుకున్నట్టు కనిపిస్తున్నది. శ్రమజీవులకు చదువుసంధ్యలు నిషేధించిన అలిఖిత రాజ్యాంగపు వేల సంవత్సరాల ఏలు బడిలో.. ఎప్పుడో ఒక్కసారి, ఒక్కడే ఏకలవ్యుడు. అందరికీ చదువుకునే హక్కును ప్రసాదించిన వర్తమాన లిఖిత రాజ్యాంగ పాలనలో ఏటేటా సమానావకాశాల బొటనవేళ్లు తెగిపడుతున్న ఎందరెందరో అనేకలవ్యులు. సామాజిక అసమానత్వం ఇంకా కొనసాగుతూనే ఉన్నది. ఇక్కడ వెనుకబడిన వారిలో అత్యధిక శాతం ప్రజలు ఆర్థికంగా వెనుకబడిపోయారు. ఆర్థిక అసమానత్వం ఇప్పుడు దినదిన ప్రవర్ధమానంగా వర్ధిల్లుతూనే ఉన్నది. వీటికి తోడుగా ఇప్పుడు డిజిటల్ అసమానత్వమనే నవీన యుగరీతి శిరమెత్తుతున్న ప్రమాదకర సంకేతాలు కనిపిస్తున్నాయి. అదే జరిగితే సాంఘి కంగా, ఆర్థికంగా వెనుకబడినవారే డిజిటల్ పరిజ్ఞానంలోనూ వెనుకబడతారు. ఒక సరికొత్త బానిస వ్యవస్థగా ఘనీభవిస్తారు. డిజిటల్ వేదికపై భాగ్యవంతుల పిల్లలతో సమానంగా అభాగ్య యువతకు కూడా అవకాశాలు కల్పిస్తే ఆగామి కాల పురోగామి దళంగా సాంఘిక, ఆర్థిక రంగాల్లోనూ వారు పైకి ఎగబాకుతారు. ‘డిజిటల్ డివైడ్’ను బద్దలుకొట్టడానికి ఇదే సరైన అదును. కరోనా మహమ్మారి ఏ ప్రపంచ దేశాన్నీ విడిచిపెట్టలేదు. ఏ జీవన రంగాన్నీ కటాక్షించలేదు. విద్యారంగం కూడా మినహా యింపు కాదు. మార్చి నెల నుంచి పిల్లలు బడిముఖం చూడలేదు. ఎప్పుడు చూడగలుగుతారో ఇదమిత్థంగా ఎవరూ చెప్పలేకపోతున్నారు. ఏదో అద్భుతం జరిగి తక్షణమే ఏ వ్యాక్సినో, ఔషధమో మార్కెట్లోకి ఓ నెల రోజుల్లోపల వస్తే సెప్టెంబర్ మాసం నుంచి పాఠశాలలు ప్రారంభం కావచ్చు. మరి అద్భుతం జరగకపోతే విద్యా సంవత్సరం ఏం కావాలి? ఒక సంవత్సరాన్ని కోల్పోవడమేనా? అకడమిక్ క్యాలెండర్ నుంచి 2020ని డిలీట్ చేయడమేనా? ఈ ప్రశ్నలు అన్ని దేశాల్లోనూ తలెత్తాయి. ఇందుకు సమాధానంగా ముందుకు వచ్చిందే ‘ఆన్లైన్’ విద్యావిధానం. ఆన్లైన్ విద్యాబోధనను అమలులోకి తేవాలంటే విద్యా ర్థులకు వాళ్ల ఇంటి దగ్గర ఒక కంప్యూటర్ ఉండాలి. లేదంటే ఒక ట్యాబ్ లేదా స్మార్ట్‌ఫోన్, ఎప్పుడూ ఎడతెగక పారే కరెంటు, తెప్పలుగా సిగ్నల్స్ నిండిన ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి. విద్యార్థికి ఏకాంత భంగం కలుగకుండా ఒక ప్రత్యేక గది ఉంటే మరీ మంచిది. ఇక పాఠశాల వైపు నుంచి ఉపాధ్యాయుల సన్నద్ధత కూడా ముఖ్యం. ఆన్లైన్ మాధ్యమానికి అనుగుణంగా బోధనా ప్రణాళికను డిజైన్ చేసుకోవాలి. క్లాస్ రూమ్‌లో టీచర్ ఎదురుగా ఉన్నప్పుడు చచ్చినట్టు వినే పరిస్థితి ఇక్కడ ఉండదు. కనుక పాఠ్యాంశాన్ని ఆసక్తికరంగా చెప్పగలిగే సాధనాలను జోడించుకోవాలి. విద్యార్థుల సందేహాల నివృత్తికి అవకాశం ఉండదు. సాధారణ సందేహాలను ముందుగానే ఊహించి సమా ధానాలను పొందుపరిచేవిధంగా పాఠ్య ప్రణాళిక రూపొందాలి. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఈ బోధన జరగాలి. ఆన్లైన్ విద్యావిధానానికి విద్యార్థులూ, పాఠశాలలూ, ప్రభుత్వాలూ ఏమేరకు సన్నద్ధమై ఉన్నాయో చూడాలి. యునెస్కో లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా దరిదాపు 150 కోట్లమంది విద్యార్థులపై కరోనా ప్రభావం పడింది. ఇందులో 83 కోట్లమందికి ఇంటి దగ్గర కంప్యూటర్ లేదు. 60 కోట్లమందికి ఇంటర్నెట్ సౌలభ్యం లేదు. ఆఫ్రికా ఖండంలోని సహారా ఎడారి ప్రాంత దేశాల్లో 90 శాతం మందికి కంప్యూటర్ అందుబాటులో లేదు. దాదాపు ఆరుకోట్ల మంది నివసించే ప్రాంతాలకు మొబైల్ నెట్వర్క్ కూడా లేదు. ఇక భారతదేశం విషయానికి వస్తే 2018 నాటి నేషనల్ శాంపిల్ సర్వే ప్రకారం 11 శాతం ఇళ్లలో కంప్యూటర్ ఉన్నది. 24 శాతం మందికి సొంత స్మార్ట్ఫోన్లు ఉన్నాయి. పట్టణాల్లో 42 శాతం మందికి, గ్రామాల్లో నూటికి పదిహేను మందికి ఇంటర్నెట్ అందుబాటులో ఉన్నది. భార తీయ సమాజపు పైశ్రేణిలో ఉన్న 20 శాతం మంది గృహాల్లోనే 27.6 శాతం కంప్యూటర్లు ఉన్నాయి. 50.5 శాతం ఇంటర్నెట్ కనెక్షన్లు వీరికే ఉన్నాయి. అట్టడుగున ఉన్న 20 శాతం జనాభాకు 2.7 శాతం కంప్యూటర్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అవి కూడా వృత్తి, ఉద్యోగాల రీత్యా అందుబాటులో ఉన్నవి మాత్రమే. 8.9 శాతం ఇంటర్నెట్ కనెక్షన్లు మాత్రమే అందు బాటులో ఉన్నాయి. ఈ డిజిటల్ డివైడ్‌లో అంతర్లీనంగా ఉన్న జెండర్ డివైడ్, రూరల్–అర్బన్ డివైడ్ మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దేశంలో ఆన్లైన్ తరగతుల ప్రారంభానికి సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒక కచ్చితమైన నిర్ణయాన్ని ఇంకా తీసుకోనేలేదు. అందుకు సంబంధించిన మార్గదర్శకాలను కూడా ఇంకా రూపొందించనే లేదు. ఈలోగానే ఆన్లైన్ బోధన పేరుతో ప్రైవేట్ స్కూళ్లు ప్రారంభించిన హడావుడితో సమాజంలో కల్లోలం బయల్దేరింది. కరోనా మహమ్మారి ఫలితంగా వేలాది చిన్న, మధ్యతరహా పరిశ్రమలు మూతపడ్డాయి. పెద్ద పరిశ్రమలు– కార్పొరేట్ సంస్థలు సైతం ఎంతోమందిని ఉద్యోగాల నుంచి తొలగించాయి. ఉద్యోగా లున్నవారి జీతాల్లో కోత పడింది. ప్రభుత్వ ఉద్యోగులకు సైతం ఈ కోత తప్పలేదు. నిర్మాణ రంగం, హోటల్ పరిశ్రమ, వినోదరంగం, టూరిజం వగైరాలన్నీ స్తంభించిపోయాయి. లక్ష లాది కుటుంబాలు పెను సంక్షోభపు తుపాను ధాటికి విల విల్లాడుతున్నాయి. ఈ విపత్కర పరిస్థితుల్లో మూలిగే నక్కపై తాటిపండులాగా ఫీజులకోసం ప్రైవేట్ స్కూళ్ల నుంచి వచ్చి పడుతున్న హుకుమ్నామాలతో తల్లిదండ్రులు తీవ్ర మానసిక క్షోభకు గురవుతున్నారు. అటు ప్రైవేట్ స్కూళ్ల దోపిడీకి ముడుపు కట్టలేక ఇటు పిల్లలను చదువులకు దూరం చేయలేక సతమత మవుతున్నారు. ఈ ప్రైవేట్ స్కూళ్లు హడావుడి చేస్తున్న ఆన్లైన్ చదువుల నాణ్యత ప్రమాణాలను తెలుసుకోవడానికి ప్రముఖ ఉపా ధ్యాయ సంఘం యు.టి.ఎఫ్. ఒక సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో భాగంగా ఆన్లైన్లో అభ్యసిస్తున్న తొమ్మిదివేల మంది విద్యార్థులను పలకరించింది. వీరిలో కేవలం 3.6 శాతం విద్యార్థులు మాత్రమే ఆన్లైన్ పాఠాలు అర్థమవుతున్నాయని చెప్పారు. 27.7 శాతం మంది కొంచెంకొంచెంగా అర్థమవు తున్నాయని చెప్పారు. 68.7 శాతం మంది ఏమాత్రం అర్థం కావడం లేదని చెప్పారు. ఆన్లైన్ బోధనా ప్రణాళిక మీద ఎటువంటి కసరత్తు ఈ పాఠశాలలు చేయలేదని సర్వే నిరూ పించింది. శవాలను పీక్కుతినే రాబందుల రెక్కల చప్పుడు లాగా ప్రైవేట్ స్కూళ్ల ఆన్లైన్ హడావుడి అంతా ఫీజులను పిండుకోవడంకోసమేనని తేలిపోయింది. దేశంలో సరళీకృత ఆర్థిక విధానాలను అమలుచేయడం ప్రారంభించిన తర్వాత వైద్యరంగంలో ప్రవేశించినట్టుగానే విద్యారంగంలో కూడా వ్యాపార సంస్కృతి ప్రవేశించింది. క్రమంగా వ్యాపార సంస్కృతి పరిధిని కూడా దాటి మెజారిటీ ప్రైవేట్ విద్యాసంస్థలు సంపాదన పిచ్చిలో కూరుకుని పోయాయి. ప్రాథమిక విద్యను స్వయంగా నిర్వహించవలసిన ప్రభుత్వం ఆ బాధ్యతల నుంచి తప్పుకోవడం ఇదే కాలంలో ఊపందుకుంది. మౌలిక వసతులను పూర్తిగా నిర్లక్ష్యం చేసి పాఠశాలలను పాడుపెట్టడం, ఉపాధ్యాయులను బోధనేతర పనులకు నియోగించడం మొదలైన కారణాల ఫలితంగా ప్రభుత్వ పాఠశాలలు పూర్తిగా ప్రజల విశ్వాసాన్ని కోల్పో యాయి. ఈ వ్యాపార పాఠశాలల ప్రచార పటాటోపానికి జనం లొంగిపోయారు. సేవా దృక్పథంతో దశాబ్దాల పాటు పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న సంప్రదాయ ప్రైవేట్ పాఠశా లలు కూడా ఈ వ్యాపార పాఠశాలల ప్రభ ముందు నిలవలేక పోయాయి. క్రైస్తవ మిషనరీలు స్థాపించిన విద్యాసంస్థలు, సేవా భావంతో ఏర్పాటైన ట్రస్టులు నిర్వహించే పాఠశాలలు, సరస్వతీ విద్యామందిరాలు ఎటువంటి వ్యాపార ధోరణి అవలంబించ కుండానే అత్యున్నత విద్యాప్రమాణాలను నెలకొల్పగలిగాయి. ఇప్పుడు కూడా కొందరు వ్యక్తులు, సంస్థలూ వ్యాపార ధోరణికి దూరంగా నడుపుతున్న విద్యాసంస్థలు లేకపోలేదు. కానీ వాటి సంఖ్య బహు స్వల్పం. మొత్తం ప్రైవేట్ స్కూళ్లలో తొంబై శాతానికి పైగా వ్యాపార సంస్థల సామ్రాజ్యమే. ఒక దశలో ఈ వ్యాపార పాఠశాలల్లో చేరే విద్యార్థుల సంఖ్య ప్రభుత్వ పాఠశాలల్లో చేరేవారి సంఖ్యను కూడా దాటేసింది. దీంతో ఇవి మరింత చెలరేగిపోవడం ప్రారంభించాయి. కరోనా సంక్షోభ కాలంలో ట్యూషన్ ఫీజు కంటే ఒక్క పైసా ఎక్కువ వసూలు చేయరాదని తెలంగాణ ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ, ఆన్లైన్ క్లాసులకు ట్రాన్స్‌పోర్టు ఫీజును కూడా హైదరాబాద్‌లోని కొన్ని ప్రైవేట్ స్కూళ్లు వసూలు చేస్తున్న వార్తలు వెలుగుచూశాయి. ఈ వికృత క్రీడకు స్వస్తి చెప్పాలంటే ప్రాథమిక విద్యారంగంలో ప్రభుత్వ పాఠశాలలను పటిష్టం చేయడమే మార్గం. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన నాడు–నేడు కార్యక్రమం ఫలితంగా రాష్ట్రంలో ఈ విద్యాసంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు జోరందుకోనున్నది. తెలంగాణలో పెద్ద సంఖ్యలో ప్రారంభించిన గురుకుల పాఠశాలలు కూడా సత్ఫలి తాలను అందిస్తాయి. కరోనా సంక్షోభం మరికొన్ని మాసాలపాటు కొనసాగే అవ కాశాలు కనిపిస్తున్నందువలన విద్యా సంవత్సరాన్ని పరిరక్షిం చడం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు త్వరలోనే ఆన్లైన్ చదు వులపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నది. ఇప్పుడున్న సూచనల ప్రకారం, బహుశా గ్రీన్ సిగ్నల్ ఇవ్వవచ్చు. విద్యా సంవత్సరాన్ని పరిరక్షించడంతోపాటు పేద, మధ్యతరగతి వర్గాల విద్యార్థులు వివక్షకు గురికాకుండా చూడవలసిన బాధ్యత కూడా ప్రభుత్వాలదే. ఆన్లైన్ బోధనా ప్రణాళిక ప్రభుత్వ–ప్రైవేట్ పాఠశాలలకు కామన్‌గా ఉండాలి. దానికి పూర్తి సన్నాహాలు ప్రభుత్వాల ఆధ్వర్యంలోనే జరగాలి. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు చదివే విద్యార్థులు ఆన్లైన్ పాఠా లపై శ్రద్ధపెట్టలేరని నిపుణులు చెబుతున్నారు. ఆ వయసు పిల్లలు మొబైల్/ట్యాబ్‌లకు త్వరగా అడిక్ట్ అవడంతోపాటు అనారోగ్య సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉందని చెబు తున్నారు. అందువల్ల ప్రాథమిక (1 నుంచి 5) విద్యార్థులకు రికార్డెడ్ పాఠాలను టీవీ చానళ్ల ద్వారా ప్రసారం చేయడం మేలు. ఇందుకోసం అందుబాటులో ఉన్న కొన్ని చానెళ్లను అద్దెకు తీసుకోవడమో, ఫైబర్‌నెట్‌వర్క్‌ను ఉపయోగించుకొని ఎడ్యుకేషన్ చానళ్లను ప్రారంభించడమో చేయవలసి ఉంటుంది. ఆపై తరగతుల విద్యార్థుల్లో స్తోమత లేని పిల్లలకు డిజిటల్ ఉపకరణాలను అందుబాటులో ఉంచే సమస్యను అధిగమిం చవలసి ఉంటుంది. లేనట్లయితే ఇప్పుడు ఏర్పడే డిజిటల్ అస మానతలు ముందు ముందు పరిష్కరించలేని స్థాయికి చేరు కుంటాయి. ఈ సంధి కాలాన్ని విద్యారంగంలో సంస్కరణల కోసం కూడా వినియోగిం చుకోవచ్చునని మరికొందరు నిపు ణులు సూచిస్తున్నారు. ఇప్పుడు మనం అనుసరిస్తున్న ఉపా ధ్యాయ కేంద్రక పాఠ్య ప్రణాళిక స్థానంలో విద్యార్థి కేంద్రక పాఠ్యప్రణాళికను ప్రవేశ పెట్టాలన్న సూచనలు వస్తున్నాయి. ఈ విధానం వలన విద్యార్థుల్లో సృజనశీలత పెరుగుతుందని చెబు తున్నారు. ఇప్పుడు ప్రారంభించే ఆన్లైన్ విధానాన్ని అవసర మైన మేరకు భవిష్యత్‌లో కొనసాగిస్తూనే, క్లాస్‌రూమ్‌లో సమష్టి విద్యాభ్యాసాన్ని కూడా కొనసాగించాలి. సమష్టి విధానం వల్ల ఏర్పడే ‘సోషల్ కేపిటల్’కు మరేదీ సాటిరాదు. వ్యాసకర్త: వర్ధెల్లి మురళి muralivardelli@yahoo.co.in -
రెండో తరగతికి లక్షపైనే...
బోడుప్పల్‌లోని సిద్ధార్థ స్కూల్లో తన కుమారుడిని రెండో తరగతిలో చేర్పించేందుకు ఓ వ్యక్తి వెళ్లాడు. క్లాసులు..టీచర్ల వివరాలు మాట్లాడిన తరువాత ఫీజు గురించి చెబితే అతని కళ్లు బైర్లు కమ్మాయి. రూ. లక్ష వరకు చెల్లించాలని చెప్పారు. అదేమని అడిగితే ఆన్లైన్ క్లాస్..ల్యాప్‌టాప్..బుక్స్..డ్రెస్.. ట్రాన్స్పోర్ట్ ఇలా కబుర్లు చెప్పారు. వామ్మో..ఇంకా మొదలే కాని స్కూలుకు ఇంత ఫీజా.. వద్దులే బాబూ అనుకొని సారథి హైస్కూల్‌కు వెళ్లాడు. అక్కడా అదే పరిస్థితి. ఉప్పల్‌లోని శ్రీచైతన్య స్కూల్లో విచారించాడు. రూ.38,500 చెప్పారు. ట్యూషన్ ఫీజు మాత్రమే వసూలు చేయాలని ప్రభుత్వం చెప్పింది కదా అని అడిగితే మాకేం తెలియదు సార్.. ఫీజు కట్టాల్సిందే అని నిర్లక్ష్యంగాసమాధానం ఇచ్చారు. డబ్బుచెల్లిస్తేనే ఆన్లైన్ క్లాసులతోచదువులు మొదలవుతాయి. సాక్షి, సిటీబ్యూరో (హైదరాబాద్): కార్పొరేట్, ప్రైవేట్ విద్యా సంస్థలు కరోనా కాలంలోనూ కనికరంలేకుండా ప్రవర్తిస్తున్నాయి. ప్రభుత్వ ఆదేశాలను తుంగలో తొక్కుతూ ఫీజుల కోసం విద్యార్థుల తల్లిదండ్రులపై జులం ప్రదర్శిస్తున్నాయి. విద్యాశాఖలో ఉన్న పర్యవేక్షణ లేమి ఈ విద్యా సంస్థలకు కలిసి వస్తోంది. ఆన్లైన్ క్లాసులు, అడ్మిషన్ల పేరుతో ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థలు యథేచ్ఛగా తమ దందా కొనసాగిస్తున్నాయి. ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం.46కు తూట్లు పొడుస్తున్న అనేక విద్యా సంస్థలు వివిధ రకాల పేర్లు చెప్పి అందినకాడికి ఫీజులు వసూలు చేస్తున్నాయి. ఎవరైనా తల్లిదండ్రులు తాము నిర్దేశించిన ఫీజులు చెల్లించకపోతే ఆన్లైన్ క్లాసులకు సంబంధించిన యూజర్ ఐడీలు, పాస్వర్డ్స్ ఇవ్వమంటూ ఎస్సెమ్మెస్‌లు పంపించి బెదిరిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఏం చేయాలో? ఎవరికి ఫిర్యాదు చేయాలో? అర్థం కాక తల్లిదండ్రులు తలలు పట్టుకుంటున్నారు. తాజా విద్యా సంవత్సరంపై ప్రభుత్వం నుంచి స్పష్టత రాకపోవడం ఈ విద్యా సంస్థలకు కలిసి వచ్చే అంశంగా మారిపోయింది. దీంతో సొంత సిలబస్‌లో ఆన్లైన్ క్లాసుల్ని మొదలెట్టి, యథేచ్ఛగా కొనసాగించేస్తున్నాయి. ‘సాక్షి టీవీ’ నిఘాలో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. (వారు కంపార్టుమెంటల్ పాస్) రెండో తరగతికి రూ.లక్షపైనే... బోడుప్పల్‌లోని సిద్ధార్థ స్కూల్ వ్యవహారం ప్రైవేట్ స్కూళ్ల వ్యవహారానికి ఓ మచ్చుతునక మాత్రమే. ఆ పాఠశాలకు రెండో తరగతిలో చేరే విద్యార్థి తండ్రిగా వెళ్లిన ‘సాక్షి’ ప్రతినిధికి అక్కడి ఉద్యోగులు చెప్పిన ఫీజుల లెక్క అవాక్కయ్యేలా ఉంది. అడ్మిషన్ మొదలుకొని వివిధ ఫీజుల కింద రూ.లక్ష డిమాండ్ చేశారు. ఆ ఫీజులో కాస్త తగ్గించమని కోరగా.. ఆ పాఠశాల ఉద్యోగుల నుంచి స్పందన కరువైంది. సమీపంలోని సారథి హైస్కూల్లోనూ రెండో తరగతి విద్యార్థికి స్కూలు ఫీజు కింద రూ.60 వేలు, యాక్టివిటీ ఫీజు కింద మరో రూ.40 వేలు కలిపి రూ.లక్షగా చెప్పారు. దీనికి అదనంగా రవాణా, పుస్తకాలు తదితరాలు అదనంగా ఉంటాయని ఉంటాయని స్పష్టం చేశారు. ఉప్పల్‌లోని శ్రీచైతన్య స్కూల్లో ట్యూషన్ ఫీజుగా రూ.31 వేలు, పుస్తకాలు, యూనిఫాం తదితరాలకు మరో రూ.7,500 చెల్లించాలని అక్కడి ఉద్యోగులు చెప్పారు. మిగిలిన రెండు స్కూళ్ల కంటే ఇక్కడ తక్కువే అయినా.. సామాన్యుడికి మాత్రం భారమే. కేవలం ఈ మూడే కాదు.. నరగంలోని దాదాపు ప్రతి ప్రైవేట్, కార్పొరేట్ స్కూల్లోనూ ఫీజుల తీరుతెన్నులు ఇలానే ఉన్నాయి. పాత స్టూడెంట్స్ నుంచి మరోలా.. కొత్తగా చేరాలని భావించిన విద్యార్థుల నుంచి వసూళ్లు ఇలా ఉంటే.. ఇప్పటికే తమ విద్యార్థులుగా ఉన్న వారి నుంచి ఈ స్కూళ్లు మరోలా పిండుకుంటున్నాయి. దీనికోసం ఆన్లైన్ క్లాసుల పేరును వాడుకుంటున్నాయి. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రస్తుత విద్యా సంవత్సరంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయినప్పటికీ ఈ విద్యా సంస్థలు తమ సొంత సిలబస్‌తో ఆన్లైన్ క్లాసుల్ని మొదలెట్టేశాయి. ఫీజుల పేరుతో ప్రతి పైసా ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నాయి. జరుగుతున్నవి ఆన్లైన్ క్లాసులే అయినప్పటికీ యాజమాన్యాలు మాత్రం ఫీజుల వసూళ్లలో తగ్గట్లేదు. ట్యూషన్ ఫీజు, బిల్డింగ్ ఫీజు, స్కూలు యూనిఫాం ఫీజు, స్కూలు డెవలప్మెంట్ ఫీజు, ట్రాన్స్పోర్ట్ ఫీజు... ఇలా అందినకాడికి విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి దండుకుంటున్నాయి. ఇవి చాలవన్నట్లు ఆన్లైన్ క్లాసుల కోసం ప్రత్యేక సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసిన ల్యాప్‌టాప్, ట్యాబ్‌లు తమ వద్దే కొనాలంటూ కొత్త మెలిక పెడుతున్నాయి. వీటిలో ఏ ఫీజు చెల్లించకపోయినా, పుస్తకాలు కొనకపోయినా ఆన్లైన్ క్లాసుల యూజర్ ఐడీ, పాస్వర్డ్ ఇవ్వమని, పరీక్షలు రాయనిచ్చేది లేదంటూ ఎస్సెమ్మెస్‌లు, ఫోన్‌కాల్స్ ద్వారా తల్లిదండ్రుల్ని బెదిరిస్తున్నాయి. వారి బాధలు వర్ణనాతీతం... నగరానికి ఎన్నో ఏళ్ల క్రితం వలసవచ్చిన బడుగుజీవులు ఎందరో ఉన్నారు. తమ పిల్లలు తమలా కాకుండా ఉన్నత విద్యను అభ్యసించాలన్నది వీరి కల. దీనికోసం కడుపుకట్టుకుని పిల్లల్ని సమీపంలో ఉన్న ప్రైవేట్ స్కూళ్లలో చేర్పిస్తున్నారు. ఇలాంటి వారు ప్రస్తుతం కరోనా కోరల్లో చిక్కుకుని ఉపాధి, ఆదాయం కోల్పోయారు. ఈ పరిస్థితుల్లో మూలిగే నక్కపై తాటికాయ అన్నట్లు ప్రైవేట్ స్కూళ్ల వ్యవహారం మరో షాక్ ఇస్తోంది. ఇన్నాళ్లు ఏదో ఒక రకంగా ఫీజులు చెల్లిస్తూ వస్తున్నామని, ప్రస్తుత కరోనా పరిణామాలతో అది సాధ్యం కావట్లేదని వాపోతున్నారు. ఇదిలా ఉండగా.. తల్లిదండ్రులు వ్యయప్రయాసలకు ఓర్చినా.. ఆన్లైన్ క్లాసులు విద్యార్థులకు కొత్త సవాళ్లు విసురుతున్నాయి. టీచర్లు బోర్డు వైపు తిరిగి బోధిస్తున్న ఈ ఆన్లైన్ క్లాసులు విద్యార్థులకు అర్థం కావట్లేదు. వీరికి సందేహాలు వస్తే తీర్చే నాథులే కరువయ్యారు. ఈ ఇబ్బందులు అదనం... ఈ ఆన్లైన్ క్లాసుల కోసం గంటల తరబడి ఫోన్లు, ట్యాబ్స్, ల్యాప్టాప్స్ చూస్తున్న పిల్లల కళ్లు, వెన్నుముకలపై తీవ్ర ప్రభావం ఉంటోంది. అనేక మంది చిన్నారులు తల, నడుము నొప్పులతో బాధపడుతున్నారు. ఇంటర్నెట్లో ప్రవేశించినప్పుడు అనేక మంది చిన్నారులకు అశ్లీల సైట్ల పాప్అప్స్, బూతు బొమ్మలు కనిపిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. దీంతో ఆ క్లాసులు జరిగినంత సేపూ తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు తమ పని మానుకుని పిల్లల వద్దే కూర్చోవాల్సి వస్తోంది. ఒకే కుటుంబంలో ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్నప్పుడు తల్లిదండ్రులకు భారం పెరుగుతోంది. వారికి కచ్చితంగా ఒక్కో ఫోన్ లేదా ట్యాబ్ సమకూర్చాల్సి వస్తోంది. ఒకే సమయంలో ఆన్లైన్ క్లాసులు కావడంతో ఇది తప్పట్లేదు. కూలినాలీ చేసుకుని జీవించే కుటుంబాల్లో కనీసం స్మార్ట్ ఫోన్ కూడా ఉండట్లేదు. దీంతో వీరి పిల్లలు విద్యకు దూరం కావాల్సి వస్తోంది. ఈ ట్యూషన్ ఫీ అంతా కట్టమంటున్నారు కరోనా కష్టకాలంలో స్కూళ్లలో ఫీజులు పెంచవద్దని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. కేవలం ట్యూషన్ ఫీజు వసూలు చేయాలని ఆదేశించారు. కానీ విద్యా సంస్థలు మాత్రం లాస్ట్ ఇయర్ ఫీజు రూ.75 వేలను చెల్లించమంటున్నారు. దాన్ని ట్యూషన్ ఫీజు కింద చూపించి కట్టమని ఫోర్స్ చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ ఫీజు మొత్తాన్నే ఈ ఏడాది కూడా చెల్లించాలని.. అది కూడా తొమ్మిది వాయిదాల్లో కట్టాలంటున్నారు. ఈ విషయంలో ఎంత చెప్పినా స్కూల్ యాజమాన్యాలు రాజీపడటం లేదు. – ఓ విద్యార్థి తండ్రి ఈ క్లాసులు ఏం రీచ్ అవుతాయి? ప్రభుత్వం జస్ట్ జీవో ఇచ్చి వదిలేసింది.మానిటరింగ్ ఏంలేదు. స్కూల్ నుంచి మామూలుగా ఒత్తిడి ఉంటుంది. అప్పుడు ఉన్న ఫీజునే ఇప్పడు మంత్లీ పే చేయమంటున్నారు. ఈ విషయంలో స్కూల్ వాళ్లుడిమాండ్ చేస్తున్నారు. ఫస్ట్ రూ.20 వేలు, రూ.30 వేలు కట్టాలంటున్నారు. కడితేనే బుక్స్ అంటున్నారు. బుక్స్ లేకుండా క్లాసులు చెప్పడమేంటి.. వాళ్లు చెప్పినా ఏం రీచ్ అవుతుంది. అసలు నెక్ట్స్ క్లాసు బుక్స్ ఏం ఉంటాయోతెలియకుండా ఎలా..? అదేమంటే బుక్స్ లేకుండా క్లాసులు చెబుతున్నాం.. నోట్స్ ఫ్రిపేర్ చేయండని చెబుతున్నారు. – ఓ విద్యార్థి తల్లి ఛాన్స్ ఇవ్వడం లేదు.. ఆన్లైన్ క్లాసుల్లో టీచర్లు చెప్పేది ఏం అర్థం కావడం లేదు. డౌట్స్ అడుగుదామంటే అసలు ఛాన్స్ ఇవ్వడం లేదు. వాళ్ల మానాన వాళ్లు చెప్పుకుంటూ వెళ్లుతున్నారు. కానీ క్లాసు లాస్ట్‌లో చెబుతాంటున్నారు. ఏమీ ఉండటం లేదు. అర్థం కావడం లేదని చాలా చెప్పాం. కానీ క్లాసుకు టైమ్ అయిపోతుందని చెప్పుకుంటూ వెళ్తున్నారు. – ఓ విద్యార్థి పేరెంట్స్‌కు కష్టమే.. ఎల్కేజీ వాళ్లకు కూడా ఆన్లైన్ పాఠాలు చెబుతున్నారు. పెద్ద క్లాసు వాళ్లు అంటే వింటారు. కానీ చిన్నపిల్లలకు ఏం అర్థం అవుతుంది. వీళ్లకేమీ అర్థమవుతుంది. ఇది పేరెంట్స్‌కు చాలా బర్డెన్. చేసే పనులను మానుకుని పిల్లలతో పాటు కూర్చుకోవాల్సి వస్తుంది. స్క్రీన్ టైమ్ ఎక్కువ అవడం వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. పాఠాలు మర్చిపోతారనే భయంతోనే ఆన్లైన్ క్లాసుల్లో కూర్చోపెట్టాల్సి వస్తుంది. – ఓ విద్యార్థి తల్లి బ్యాక్ పెయిన్ వస్తోంది ఆన్లైన్ క్లాసులతో పిల్లలకు బ్యాక్ పెయిన్ వస్తుంది. అంతేగాకుండా ఐ సైట్ ప్రాబ్లమ్ వస్తుంది. నాకు ముగ్గురు పిల్లలు. ముగ్గురికి డివైజ్ ఇవ్వాలంటే కొంచెం కష్టమే.. చిన్న పిల్లలకు క్లాసులంటే టూ మచ్. వాళ్లకి ఏం అర్థమవుతుంది. మేడమ్ ఫాస్ట్ ఫాస్ట్‌గా చెబుతున్నారు. నేను మళ్లీ చెప్పాల్సి వస్తుంది. - ఓ విద్యార్థిని తల్లి ఫోన్ లేక పాఠాలు సాగడం లేదు చేతన్‌బాగ్ స్కూల్లో మా అబ్బాయి టెన్త్ చదువుతున్నాడు. ఫోన్ ద్వారానే క్లాసులు జరుగుతున్నాయి. ఫోన్ తీసుకోవాలంటే ఇబ్బందిగా ఉంది. ఫోన్ లేక పాఠాలు ఆగిపోయాయి. పక్కింటికి వెళ్లాలంటే.. కరోనా వల్ల ఎవరూ రానివ్వడం లేదు. ఇలా కాకుండా ప్రతి ఇంటికి టీవీ ఉంటుంది. దాన్లో చెబితే ఇంత టెన్షన్ ఉండదు కదా.. మరి మా పరిస్థితి ఏంటి..? – విద్యార్థి తల్లి, చేతన్‌బాగ్ -
ఫీ‘జులుం’పై కొరడా
సాక్షి, హైదరాబాద్: ఆన్లైన్ క్లాసుల పేరుతో నిబంధనలకు విరు ద్ధంగా ఫీజులు వసూలు చేస్తున్న కార్పొరేట్ స్కూళ్లపై విద్యాశాఖ కొరడా ఝళిపి స్తోంది. జీవో నంబర్ 46కు విరుద్ధంగా హైదరాబాద్‌లోని పలు కార్పొరేట్ స్కూళ్లు ఫీజులు వసూలు చేస్తున్నాయని, విద్యా ర్థుల తల్లిదండ్రులపై ఒత్తిడి తీసుకొస్తున్నట్లు విద్యాశాఖకు ఇటీవల భారీ సంఖ్యలో ఫిర్యా దులు అందాయి. దీంతో అధికారు లు గురువారం రంగంలోకి దిగారు. గత ఏడాది నిర్దేశించిన ట్యూషన్ ఫీజుకు మించి వసూలు చేస్తున్న పాఠశాలల్లో ఆకస్మిక తని ఖీలు చేశారు. హైదరాబాద్‌లో 11, రంగా రెడ్డిలో 13, మేడ్చల్ జిల్లాలో 6 కార్పొరేట్ పాఠ శాలలకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఫీజు రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. విద్యా సంవత్సరం మొదలు కాకున్నా.. గ్రేటర్ పరిధిలోని రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో సుమారు ఏడు వేల ప్రైవేట్ స్కూళ్లు ఉన్నాయి. వాటిలో 15 లక్షల మంది విద్యార్థులు చదువు తున్నారు. 60% మంది విద్యార్థులు కేవలం ఇంటర్నేషనల్, కార్పొరేట్ స్కూళ్లలోనే చదువుతు న్నారు. దేశవ్యాప్తంగా కరోనా ఉధృతి ఇంకా కొన సాగుతూనే ఉంది. ఇప్పటి వరకు విద్యా సంవత్సరం ప్రారంభం కాలేదు. ఈ ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభమవుతుందో లేదోకూడా ఇప్పటివరకు స్పష్టత లేదు. కానీ నగరంలోని పలు ఇంట ర్నేషనల్, కార్పొరేట్ స్కూళ్లు ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తు న్నాయి. విద్యార్థుల సామర్థ్యా లను పరిగణనలోని తీసుకోకుండా ఎల్కేజీ విద్యార్థులకు కూడా ఆన్లైన్ తరగతులు చేపడుతున్నాయి. ఆన్లైన్లో క్లాసు వినాలంటే స్కూల్ యూనిఫారం ధరించాలనే నిబంధన కూడా విధించాయి. ఆన్లైన్ పాఠాల పేరుతో తమ వద్దే పుస్తకాలు సహా ల్యాప్ టాప్‌లు, ఎలక్ట్రానిక్ పరికరాలను కొనుగోలు చేయాలని నిబంధన విధిస్తున్నాయి. ఫిర్యాదులు వెల్లువెత్తడంతో.. ఫస్ట్ టర్మ్ ఫీజు చెల్లించాల్సిందిగా తల్లిదం డ్రులపై పాఠశాలల యాజమాన్యాలు ఒత్తిడి తెస్తున్నాయి. కొన్ని స్కూళ్లయితే ఏకంగా స్నాక్స్, ట్రావెలింగ్, లైబ్రరీ, స్పోర్ట్స్ చార్జీలు కూడా వసూలు చేస్తున్నాయి. కరోనా నేపథ్యంలో ట్యూషన్ ఫీజు మినహా మరే ఇతర ఫీజులు వసూలు చేయవద్దని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఇంటర్నేషనల్, కార్పొరేట్ స్కూళ్లు పట్టించుకోవడం లేదు. యథేచ్ఛగా వసూళ్లకు పాల్పడుతున్నాయి. ఇందుకు నిరాకరించిన తల్లిదండ్రులను అడ్మిషన్ క్యాన్సల్ చేస్తామని బెదిరిస్తున్నాయి. దీంతో కొంత మంది తల్లిదండ్రులు ఆయా యాజమాన్యాల ఒత్తిళ్లకు తలొగ్గి వారు అడిగినంత ఫీజులు చెల్లిస్తున్నారు. మరికొంత మంది విద్యాశాఖకు ఫిర్యాదు చేస్తుండటంతో అధికారులు స్పందించారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తూ అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తున్న కార్పొరేట్ స్కూళ్లకు షోకాజ్ నోటీసులు జారీ చేస్తున్నారు. ఆన్లైన్ తరగతులకు అనుమతి ఇవ్వలేదు ఆన్లైన్ తరగతులు నిర్వహించేందుకు హైదరాబాద్ జిల్లాలో ఏ ఒక్క స్కూల్‌కూ అనుమతి ఇవ్వలేదు. అధికారికంగా ఇప్పటివరకు విద్యా సంవత్సరం ప్రారంభం కాలేదు. ఆన్లైన్ తరగతుల పేరుతో ఎవరైనా తల్లిదండ్రులపై ఒత్తిడి తెస్తే యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటాం. నిబంధనలు అతిక్రమించిన స్కూళ్లను సీజ్ చేయడానికి కూడా వెనుకాడం. – వెంకటనర్సమ్మ, డీఈఓ, హైదరాబాద్ -
కార్పొరేట్ స్కూళ్ల ఆన్లైన్ దందా
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ విసిరిన పంజాతో చిన్నారులు బడి అడుగులు మాని ఆన్లైన్ చదువుల బాట పట్టారు. దీనిని ఆసరాగా చేసుకున్న కార్పొరేట్ స్కూళ్ల యాజమాన్యాలు పుస్తకాలు, స్టేషనరీతోపాటు ట్యాబ్స్, ల్యాప్‌ట్యాప్స్ సైతం తమ వద్దే కొనుగోలు చేయాలని తల్లిదండ్రులను ఒత్తిడి చేస్తున్నాయి. తమ దగ్గర కొనుగోలు చేసిన ఎలక్ట్రానిక్ ఉపకరణాల్లో తమ పాఠశాల, సిలబస్‌కు అనుగుణంగా ఉండే యాప్స్, పాఠాలు సులభంగా యాక్సెస్ చేసేందుకు అనువైన సాఫ్ట్వేర్ ఉంటుందని నమ్మిస్తున్నాయి. అయితే ఈ పరిణామం పలువురు విద్యార్థుల తల్లిదండ్రులకు భారంగా పరిణమిస్తోంది. (ఇంటర్లో గ్రేస్ మార్కులు) మీ పిల్లలు మార్కులు కోల్పోతారంటూ... ప్రవీణ్ కుమార్తె ఓ కార్పొరేట్ పాఠశాలలో ఆరో తరగతి చదువుతోంది. ఇటీవల పాఠశాల యాజమాన్యం తమ వద్ద ట్యాబ్లెట్ కొనుగోలుచేయాలని, ఆరునెలల ఫీజును చెల్లించాలని అతనికి సందేశం పంపించింది. ఇక సుకుమార్ పిల్లలు సైతం మరో కార్పొరేట్ పాఠశాలలో 7,8 తరగతులు చదువుతున్నారు. వారి పాఠశాల యాజమాన్యం కూడా తమ వద్దే్ద ల్యాప్‌ట్యాప్, స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలని కబురు పంపింది. ఇలా పలు పాఠశాలల యాజమాన్యాలు ఎలక్ట్రానిక్ ఉపకరణాలను విధిగా తమ వద్ద కొనుగోలు చేయాల్సిందేనని తల్లిదండ్రులపై ఒత్తిడి చేస్తున్నాయి. లేనిపక్షంలో మీ పిల్లలు గ్రేడ్లు, మార్కులు కోల్పోవాల్సి వస్తుందని..చదువులో వెనకబడతారని హెచ్చరికలు జారీచేస్తుండడం గమనార్హం. ఇదో తరహా వ్యాపారం.. ఇటీవల మనోహర్‌కు తన కుమార్తె 8వ తరగతి చదివే పాఠశాల నుంచి మెసేజ్ వచ్చింది. ట్యాబ్లెట్ ద్వారా విద్యార్థిని పాఠాలు వినేందుకు రూ.25 వేల ఫీజు చెల్లించాలని కోరింది. ఇందులో రూ.7500 ట్యాబ్లెట్ ఖర్చు అని పేర్కొంది. ఫీజు చెల్లించని పక్షంలో ట్యాబ్లెట్ ఇవ్వబోమని చెప్పింది. ఈ ట్యాబ్లెట్లో పాఠ్యాంశాలకు సంబంధించి ప్రీ లోడెడ్ కంటెంట్, అత్యుత్తమ సాఫ్ట్వేర్ ఉందని నమ్మించింది. ఈ ట్యాబ్లెట్ భవిష్యత్‌లో ఈ–ఎగ్జామ్స్ రాసేందుకు కూడా ఉపయుక్తంగా ఉంటుందని పేర్కొనడం గమనార్హం. అంతటా అదే సీన్.. ప్రైవేటు పాఠశాలలే కాదు.. కేంద్రీయ విద్యాలయాలు సైతం ఇదే రీతిన ఎలక్ట్రానిక్ గ్యాడ్జట్ల వ్యాపారానికి తెరలేపడం గమనార్హం. ల్యాప్ట్యాప్లయితేనే మేలని..ఫోన్ల ద్వారా అయితే స్పష్టత ఉండదని కొన్ని పాఠశాలల యాజ మాన్యాలు చెబుతున్నాయి. పాఠశాలల నయా వ్యాపారంతో ఇద్దరు ముగురు పిల్లలున్న వారికి మూడు ల్యాప్‌ట్యాప్ లు కొనుగోలు చేయడం గగనమౌతోంది. తాజా ట్రెండ్ నేపథ్యంలో తెలంగాణా రికగ్నైజ్డ్ స్కూల్స్ మేనేజ్మెంట్స్ అసోసియేషన్ (టీఆర్ఎస్ఎంఏ) కూడా రంగంలోకి దిగింది. ఎలక్ట్రానిక్ ఉపకరణాలు కొనుగోలు చేయాలనుకున్న తల్లిదండ్రులకు లోన్లు ఇప్పిస్తున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. ఇంత జరుగుతున్నా... జిల్లా విద్యాశాఖ అధికారులు మాత్రం తమకు పాఠశాలల యాజమాన్యా లు చేస్తున్న ఎలక్ట్రానిక్ గాడ్జెట్ల వ్యాపారంపై తమకు ఎ లాంటి ఫిర్యాదులు అందలేదని పేర్కొనడం గమనార్హం. -
సొమ్ములిస్తే మార్కులేస్తాం..
భీమవరం: కరోనా వైరస్ కొన్ని విద్యాసంస్థలకు కాసుల వర్షం కురిపిస్తోంది. ఎక్కువ మార్కులతో ఉత్తీర్ణత చేయిస్తామంటూ కొన్ని కార్పొరేట్, ప్రైవేటు విద్యాసంస్థలు విద్యార్థుల నుంచి పెద్ద మొత్తంలో సొమ్ములు గుంజుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. జిల్లాలోని ఒక కార్పొరేట్ విద్యాసంస్థ తమ విద్యార్థుల నుంచి సొమ్ములు వసూలుకు సంబంధించి ఫోన్లో మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కోవిడ్–19 కారణంగా మార్చి 22వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థలు మూతపడిన సంగతి తెలిసిందే. దీంతో పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు బ్రేక్ పడింది. కరోనా వైరస్ విజృంభిస్తుండడంతో 6వ తరగతి నుంచి 9వ తరగతి వరకు పరీక్షలు నిర్వహించకుండా విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేస్తున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. 10వ తరగతి పరీక్షలను జూలై నెలలో నిర్వహిస్తామని ముందుగా ప్రకటించి ఆ మేరకు షెడ్యూల్‌ను కూడా విడుదల చేశారు. వైరస్ రోజురోజుకు విస్తరిస్తుండడంతో విద్యార్థులందరినీ ఒకచోట చేర్చి పరీక్షలు నిర్వహించడం వల్ల ఇబ్బందులు వస్తాయని భావించిన ప్రభుత్వం పదవ తరగతి పరీక్షలను రద్దు చేసింది. జిల్లా వ్యాప్తంగా సుమారు 50 వేల మంది పదో తరగతి విద్యార్థులు ఉండగా వీరిలో సుమారు 390 ప్రైవేటు హైసూ్కల్స్‌లో 17 వేల మందికి పైగా పదో తరగతి విద్యార్ధులున్నారు. సమ్మెటివ్ ఎస్సెస్మెంట్ పరీక్ష ఫలితాల ఆధారంగా గ్రేడ్ల నిర్ణయం పదో తరగతి విద్యార్థులకు పబ్లిక్ పరీక్షలు నిర్వహించకపోవడంతో విద్యాశాఖ ఇంతకు ముందు విద్యార్థులకు నిర్వహించిన ఫార్మటివ్ ఎస్సెస్మెంట్(ఎఫ్ఏ), సమ్మెటివ్ ఎస్సెస్మెంట్(ఎస్ఏ) పరీక్షల మార్కులు ఆధారంగా విద్యార్థులకు గ్రేడ్లు నిర్ణయించాలని ఆదేశాలిచ్చింది. కొన్ని ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థలు పదో తరగతి విద్యార్థుల నుంచి పెద్ద మొత్తంలో సొమ్ములు వసూలుచేసి ఎక్కువ మార్కులు వేయడానికి కార్యాచరణ రూపొందించినట్లు తెలిసింది. విద్యా సంవత్సరం ప్రారంభం అయిన నాటి నుంచి విద్యార్థులకు నాలుగు ఫార్మటీవ్ ఎస్సెస్మెంట్, ఒక సమ్మెటివ్ అస్సెస్మెంట్ పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. ఈ పరీక్షా ప్రశ్నాపత్రాలను ఆయా పాఠశాలల్లోని ఉపాధ్యాయులే తయారుచేస్తారు. అలాగే పరీక్షల అనంతరం వాటిని అక్కడి ఉపాధ్యాయులే వేల్యూయేషన్ చేసి మార్కులు వేస్తారు. వాటిని విద్యాశాఖ ఆన్లైన్ సీఎస్ఈ సైట్‌ను అప్లోడ్ చేస్తుంటారు. ప్రస్తుత విద్యాసంవత్సరం పూర్తిగా క్లాసులు జరగకపోవడంతో ఎఫ్ఏ పరీక్షలు మూడు నిర్వహించగా ఎస్ఏ పరీక్ష ఒకటి నిర్వహించారు. ఎస్ఏ పరీక్షలు నిర్వహించినా ఇంతవరకు వాటిని సీఎస్ఏ సైట్లో అప్లోడ్ చేయలేదని తెలిసింది. ఎఫ్ఏ, ఎస్ఏ పరీక్షల మార్కులు ఆధారంగా గ్రేడ్లు నిర్ణయించడంతో కొన్ని ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థలు తమ విద్యార్థులకు ఫోన్లు చేసి గతంలో మీరు ఎఫ్ఏ పరీక్ష సరిగా రాయలేదని ప్రస్తుతం ఎస్ఏ పరీక్షలో అత్యధిక మార్కులు రాకుంటే మంచి గ్రేడ్ వచ్చే అవకాశం లేనందున సొమ్ములిస్తే మంచి మార్కులు వేస్తామంటూ బేరాలు పెట్టినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ విధంగా ఒక్కొక్క విద్యార్ధి నుంచి రూ.5 వేలు నుంచి రూ.8 వేలు వరకు వసూలు చేస్తున్నట్లు విద్యార్థుల తల్లిదండ్రుల ద్వారా తెలిసింది. గతంలో రాసిన ఎస్ఏ పరీక్ష పత్రం స్థానంలో సొమ్ములు ఇచ్చిన విద్యార్థులతో మళ్లీ జవాబులు రాయించి పాతపేపర్ల స్థానంలో వీటిని పెట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. సొమ్ముల వసూలుపై ఎవరికైనా ఫిర్యాదు చేస్తే తమ బిడ్డల భవిష్యత్తు పాడవుతందనే భయంతో తల్లిదండ్రులు నోరు మెదపడం లేదు. ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు భీమవరం ప్రాంతంలోని ఒక కార్పొరేట్ స్కూల్లో విద్యార్థుల నుంచి సొమ్ములు వసూలు చేస్తున్నారనే ప్రచారంలో వాస్తవం లేదు. అక్కడ డీఐతో విచారణ చేయించాం. ఎక్కడైనా ఇటువంటి అవకతవకలకు పాల్పడితే ఆయా విద్యాసంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటాం. పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు నిర్వహించక పోవడంతో ఎఫ్ఏ, ఎస్ఏ పరీక్ష మార్కుల ఆధారంగానే విద్యార్థులకు గ్రేడ్ నిర్ణయించే అంశంపై ప్రభుత్వం ఇంకా స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదు. – సీవీ రేణుక, జిల్లా విద్యాశాఖాధికారిణి -
కార్పొరేట్ దోపిడీ అంతింత కాదయా!
నగరంలోని అన్నమయ్య సర్కిల్ సమీపంలో ఉన్న ఓ కార్పొరేట్ విద్యాసంస్థలో ఒకటో తరగతి చదువుతున్న విద్యారి్థ దగ్గర పుస్తకాల పేరుతో యాజమాన్యం రూ.6,200 వసూలు చేసింది. ప్రస్తుతం లాక్డౌన్ సమయంలో బుక్స్ వాడడం లేదు కదా అని ప్రశి్నస్తే ఆన్లైన్లో క్లాసులు వింటూ బుక్స్ ఉపయోగించాలని సమాధానమిచ్చారు. గత్యంతరం లేక తల్లిదండ్రులు డబ్బులు చెల్లించారు. మినీబైపాస్‌లో ఉన్న మరో కార్పొరేట్ స్కూల్లో ఆరో తరగతి చదువుతున్న విద్యార్థి (ఒలంపియాడ్)కి ప్రమోషన్ పేరుతో రూ.5 వేలతో పాటు బుక్స్‌కు రూ.8,160 వసూలు చేశారు. అసలే కరోనా కష్టకాలంలో చేతిలో డబ్బులేకపోయినా అప్పు చేసి మరీ బుక్స్ కొనుగోలు చేయాల్సి వచ్చింది. అందులో టెక్ట్స్‌బుక్స్ లేవు. కేవలం నోట్ బుక్స్ పేరుతో వేలకు వేలు గుంజుతున్నారు. టెక్ట్స్ బుక్స్‌కు అదనం. సాక్షి, నెల్లూరు: కరోనా విపత్తుతో ప్రజలు అల్లల్లాడుతుంటే మరో వైపు కార్పొరేట్ విద్యా సంస్థలు దోపిడీలకు తెగబడుతున్నాయి. వీరి ఆగడాలకు కళ్లెం వేసేందుకు ఓ వైపు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడతున్నా, జిల్లా విద్యాశాఖ అధికారుల అవినీతిని అడ్డం పెట్టుకుని కార్పొరేట్ విద్యా మాఫియా చెలరేగిపోతోంది. ►కరోనా కారణంగా తల్లిదండ్రులు ఉద్యోగాలు, ఉపాధి కోల్పోయి అరకొర వేతనాలతో బతుకు బండి లాగించడం కష్టంగా ఉన్న సమయంలో కార్పొరేట్ విద్యా సంస్థలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. ►నిబంధనలు ఉల్లంఘించి విద్యార్థులకు ఆన్లైన్ క్లాసుల నిర్వహణ పేరుతో గతం కంటే అధికంగా ఫీజులు వసూలు చేస్తున్నారు. ►ఆయా పాఠశాలల్లో పనిచేసే ప్రైవేట్ ఉపాధ్యాయులతో పాటు నాన్ టీచింగ్ స్టాఫ్‌కు కూడా అడ్మిషన్లకు టార్గెట్లు విధించి విద్యార్థులను చేరి్పంచే పని చేయిస్తున్నారు. ►విద్యార్థులను చేర్చుకొనే సమయంలో టెక్నో, ఈ టెక్నో, ఒలంపియాడ్ అంటూ ఆకర్షణీౖయెన పేర్లు చూపి గతేడాది మాదిరిగానే అధిక ఫీజులను వసూలు చేస్తున్నారు. ►కొత్త, పాత విద్యార్థులు తమ విద్యాసంస్థల్లోనే నోట్ బుక్‌లు, యూనిఫాం, షూస్, ఇతర మెటీరియల్ కొనాలని వేలకు వేలు గుంజుతున్నారు. టెక్ట్స్ బుక్స్‌కు మాత్రం అదనం. అనుమతి లేకున్నా.. జిల్లాలో 1,065 ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లు ఉన్నాయి. వీటిలో 385 ప్రాథమిక, 287 ప్రాథమికోన్నత, 385 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ఆయా పాఠశాలల్లో 1.80 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. వీటితో పాటు అనుమతి లేని మరో 500 ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లు నిర్వహిస్తున్నారు. కరోనా మహమ్మరి విజృంభిస్తుంది. విద్యా సంస్థలకు లాక్డౌన్ అమలవుతున్న క్రమంలో పదో తగరతి, ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు కూడా రద్దు చేశారు. ఈ తరుణంలో జిల్లాలోని పలు కార్పొరేట్, ప్రైవేట్ విద్యాసంస్థలు విద్యార్థుల కోసం వేట మొదలు పెట్టారు. ►ఐఐటీ ఒలంపియాడ్, టెక్నో, కాన్సెప్‌్ట, ఈ–టెక్నో, ఈ–శాస్త్ర, కాన్వెంట్, పబ్లిక్ స్కూల్ వంటి ఆకర్షణీమైన పేర్లతో నిర్వహిస్తున్న అధిక విద్యాలయాల్లో పాఠశాల విద్యాశాఖ నిబంధనలు పాటించడం లేదు. ►కనీస వసతులు కూడా లేకుండా అపార్ట్మెంట్లలో పాఠశాలలు, కళాశాలల నిర్వహణ చేస్తున్నారు. అనుమతులు ఒక చోట ఉంటే.. మరో చోట విద్యా సంస్థలు నిర్వహిస్తున్నారు. ►గత ప్రభుత్వ హయాంలో కార్పొరేట్ స్కూళ్ల మాఫియా ఆగడాలకు అంతులేకుండా పోయింది. వీరు నిర్ణయించిందే స్కూల్ ఫీజు. నిబంధనలకు విరుద్ధంగా నోట్ బుక్స్, యూనిఫాం, షూస్ విక్రయాలు నిరాటంకంగా జరుగుతున్నాయి. నోట్ బుక్స్ వ్యాపారమే రూ.100 కోట్లు! జిల్లాలో విద్యా సంస్థలు విద్యార్థుల చేత ఏటా కొనిపించే నోట్ బుక్స్ వ్యాపారం రూ.150 కోట్ల పైమాటే. ఒలంపియాడ్ స్థాయి పాఠశాలల్లో 6,7 తరగతులకు రూ.8,160, 8 నుంచి 10వ తరగతులకు రూ.8,800 వంతున వసూలు చేస్తున్నారు. ►ఇక ఈ–టెక్నో, టెక్నో స్థాయి విద్యా సంస్థలు 6, 7 తరగతులకు రూ.6,200, 8 నుంచి 10వ తరగతులకు రూ.6,750 లెక్కన ముక్కు పిండి వసూలు చేస్తున్నారు. ►ఆయా విద్యా సంస్థల్లో చదువుతున్న విద్యార్థుల సంఖ్య ప్రకారం వారి వద్ద వసూలు చేస్తున్న మొత్తాన్ని లెక్కిస్తే సుమారు రూ.100 కోట్ల పైమాటే ఉంటుంని అంచనా. యూనిఫాం, షూస్ వ్యాపారం డబుల్ ఆయా పాఠశాలల్లో చదివే పిల్లలు తమ యూనిఫాం మాత్రమే కొనాలని షరతులు పెడుతున్నాయి. ఇందు కోసం ఏటా ఒక్కొ విద్యారి్థకి రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు వసూలు చేస్తున్నారు. ఈ లెక్కన సుమారు రూ.200 కోట్లు ఉంటుందని అంచనా. ఫీజుల గుంజుడు జిల్లాలో కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో అధికంగా ఫీజులను గుంజుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఐఐటీ ఒలంపియాడ్, టెక్నో, కాన్సెప్ట్, ఈ–టెక్నో, ఈ–శాస్త్ర, కాన్వెంట్, పబ్లిక్ స్కూల్ తదితర ఆకర్షణీయ పేర్లతో భారీగా ఫీజులు వసూలు చేస్తున్నారు. ►కొన్ని కార్పొరేట్ స్కూళ్లలో ఒలంపియాడ్ పేరుతో 6వ తరగతి చదివే విద్యారి్థకి రూ.80 వేలు వంతున వసూలు చేస్తున్నారు. ►ప్లేక్లాస్ చదివే విద్యార్థి నుంచి స్కూల్‌ను బట్టి రూ.20 వేల నుంచి రూ.1.5 లక్షల వరకు ఫీజులు పిండుతున్నారు. ►ఆరో తరగతి విద్యార్థికి అయితే రూ.80 వేల నుంచి రూ.1.5 లక్షల వరకు ఫీజులు వసూలు చేస్తున్నారు. ►విద్యార్థి జాయిన్ చేసిన వారం రోజుల నుంచే అడ్మిషన్ నంబర్ కోసం 60 శాతం ఫీజులు చెల్లించాలంటూ విద్యార్థుల తల్లిదండ్రులపై తీవ్రంగా ఒత్తిడి పెంచుతున్నారు. ►సామాన్యులు సకాలంలో ఫీజులు చెల్లించకపోతే వారిని నానా రకాలుగా మాటలతో ఇబ్బందులు పెడుతున్న ఘటనలు ఉన్నాయి. పిల్లల భవిష్యత్ కోసం గత్యంతరం లేక కార్పొరేట్ మాఫియా ఒత్తిడితో అప్పులు తెచ్చి మరీ ఫీజులు చెల్లిస్తున్నారు. ఫీజులకు ప్రభుత్వం కళ్లెం వేస్తున్నా.. వివిధ రకాల పేర్లతో రూ.లక్షల్లో ఫీజులు దండుకుంటున్న కార్పొరేట్ విద్యా సంస్థల భరతం పట్టేందుకు ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. ►వసతులు ఏర్పాటు చేయకుండా నిబంధనలు పాటించకుండా ఇష్టారాజ్యంగా విద్యాసంస్థలు నిర్వహిస్తూ ఆగడాలకు పాల్పడుతున్న యాజమాన్యాలకు ముకుతాడు వేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ►కార్పొరేట్, ప్రైవేట్ విద్యాసంస్థల్లో వసతులు, వనరుల సమగ్ర సమాచారాన్ని ఫొటోలతో అన్లైన్లో అప్లోడ్ చేయాలని ఏపీ పాఠశాలల ఫీజు రెగ్యులేటరీ మానిటరింగ్ కమిషన్ ఆదేశించింది. ►అయితే తమ బండారాలు బయట పడతాయన్న సాకుతో కార్పొరేట్ మాఫియా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తోంది. ►ప్రభుత్వం కార్పొరేట్‌పై చర్యలు తీసుకుంటుంటే జిల్లా విద్యాశాఖ అ«ధికారులు మాత్రం ఆ సెక్టార్‌కు దాసోహమై తనిఖీలు చేయడం మానేశారు. దీంతో ఆ విద్యాసంస్థల యాజమాన్యాలు మాత్రం తమ తీరును మార్చుకోకుండా యథావిధిగా దోపిడీ చేస్తున్నారు. అమలు కానీ నిబంధనలు పదో తరగతి లోపు విద్యార్థుల నుంచి ఏటా రూ.15 వేల వరకు ఫీజులు వసూలు చేసేందుకు అవకాశం ఉంది. పలు పాఠశాలల్లో రూ.80 వేలు కూడా వసూలు చేస్తున్నారు ►జీఓ నంబర్ 1 1984 ప్రకారం విద్యార్థులకు వసతులు క్రీడాప్రాంగణాన్ని ఏర్పాటు చేయాలి ►జీఓ నంబర్ 88/2008 ప్రకారం 200 మంది విద్యార్థులు ఉంటే క్రీడా ప్రాంగణాన్ని ఏర్పాటు చేయాలి. అగ్ని ప్రమాదాల నుంచి నుంచి రక్షణ చర్యలు తీసుకోవాలి. ►2009 విద్యాహక్కు చట్టాన్ని అనుసరించి ప్రైవేట్ విద్యాసంస్థల్లో 25 శాతం పేద విద్యార్థులకు ఉచిత విద్యనందించాలి. పుస్తకాలు అమ్మితే చర్యలు నెల్లూరు (టౌన్): కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలల్లో పాఠ్యపుస్తకాలు అమ్మితే చర్యలు తీసుకుంటామని డీఈఓ జనార్దనాచార్యులు ఒక ప్రకటనలో హెచ్చరించారు. కొంత మంది అమ్ముతున్నట్లు విద్యార్థుల తల్లిదండ్రులు తమ దృష్టికి తీసుకు వచ్చారని చెప్పారు. ఈ ప్రభుత్వ ఉత్తర్వులను ఏ పాఠశాల యాజమాన్యమైన ఉల్లంఘించినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
కార్పొరేట్ స్కూళ్లు, జూనియర్ కాలేజీలకు ముకుతాడు
సాక్షి, అమరావతి: అనుమతులకు భిన్నంగా, ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్న కార్పొరేట్, ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీల అక్రమాలకు ఇక అడ్డుకట్ట పడనుంది. ఈ మేరకు ప్రభుత్వం కాలేజీల్లో విద్యార్థుల సంఖ్యను పరిమితం చేయడంతో పాటు తగిన సదుపాయాలు ఉంటేనే అనుమతులు ఇచ్చేలా కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. అడ్మిషన్లను ఆన్లైన్లో నిర్వహించడం, ఫీజుల నియంత్రణ వంటి అనేక సంస్కరణలకు చర్యలు చేపట్టింది. అలాగే ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్లూ నిబంధనల ప్రకారం నడిచేలా చర్యలు తీసుకుంటోంది. మరోపక్క జూనియర్ కాలేజీల్లో అడ్మిషన్లను కూడా ఆన్లైన్లో ఇంటర్‌బోర్డు నిర్వహించేలా చర్యలు చేపడుతోంది. దీంతో కాలేజీల అడ్డగోలు అడ్మిషన్లకు అడ్డుకట్ట పడుతుంది. ఒక్కో సెక్షన్లో 40 మందికి మాత్రమే జూనియర్ కాలేజీల్లో ప్రతి సెక్షన్లో 40 మందినే పరిమితం చేస్తూ ప్రభుత్వం ఈ నెల 13న జీఓ 23ను విడుదల చేసింది. గతంలోని జీఓలను సవరిస్తూ పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బి.రాజశేఖర్ ఈ ఉత్తర్వులను విడుదల చేశారు. దీని ప్రకారం కాలేజీలో సెక్షన్‌కు 40 మంది చొప్పున కనిష్టంగా 4, సదుపాయాలను అనుసరించి గరిష్టంగా 9 సెక్షన్లకు అనుమతిస్తారు. గతంలో చంద్రబాబు సీఎంగా ఉండగా 2002 మే 13న జీఓ 12ని విడుదల చేసి ప్రతి సెక్షన్లో 88 మందిని చేర్చుకోవచ్చని అనుమతులిచ్చారు. దీంతో అనేక సమస్యలు ఎదురయ్యాయి. ఈ నేపథ్యంలో సెక్షన్ల వారీగా విద్యార్థుల సంఖ్యను పరిమితం చేస్తూ పాత జీఓను సవరించి ప్రభుత్వం తాజాగా జీఓను విడుదల చేసింది. మాధ్యమిక శిక్షా అభియాన్, సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) నిబంధనల ప్రకారం కూడా తరగతికి 40 మంది మాత్రమే ఉండాలన్న నిబంధనల ప్రకారం ఈ మార్పులు చేపట్టింది. – ప్రతి ప్రైవేట్ జూనియర్ కాలేజీకి సెక్షన్‌కు 40 మంది చొప్పున 4 సెక్షన్లను మంజూరు చేస్తారు. కనిష్టంగా 160 మంది విద్యార్థుల వరకు మాత్రమే అనుమతి ఉంటుంది. – భవనాలు, ఫ్యాకల్టీ, తరగతి గదులు, ల్యాబ్‌లు, ఇతర వసతి సదుపాయాలన్నీ కల్పిస్తే గరిష్టంగా సెక్షన్‌కు 40 మంది చొప్పున 9 సెక్షన్లకు అనుమతిస్తారు. – ఎంపీసీ, బైపీసీ మాత్రమే కాకుండా ఇక నుంచి తప్పనిసరిగా కామర్స్, ఆర్ట్స్ అండ్ హ్యూమానిటీస్ కోర్సులు కూడా నిర్వహించాలి. – నిబంధనల ప్రకారం అన్ని సదుపాయాలూ ఉంటేనే ఆన్లైన్ అనుమతి – ఇప్పటికే దీనిపై బోర్డు నోటిఫికేషన్‌ను కూడా విడుదల చేసి దరఖాస్తులను ఆన్లైన్లో అందించాలని స్పష్టం చేసింది. – ఇప్పటివరకు పలు కార్పొరేట్ జూనియర్ కాలేజీలు తమ ఇష్టానుసారం విద్యార్థులనుచేర్చుకోవడం, విద్యార్థులకు సరిపడ తరగతి గదులు లేకుండా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటి ప్రాథమిక సదుపాయాలు కూడా లేకుండానే కొనసాగుతూ వచ్చాయి. ఇకనుంచి వీటికి కళ్లెం పడనుంది. –నిబంధనల ప్రకారం అన్ని సదుపాయాలూ ఉంటేనే అన్లైన్ అనుమతి – రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ కోర్సులు నిర్వహించే కాలేజీల యాజమాన్యాలు తప్పనిసరిగా ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలన్నిటినీ పాటించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అప్పుడే వాటికి ఇంటర్మీడియెట్‌బోర్డు 2020–21 అనుమతులు మంజూరు చేయనుంది. ఇప్పటికే దీనిపై బోర్డు సవివరమైన నోటిఫికేషన్‌ను కూడా విడుదల చేసి దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలని కాలేజీలకు సూచించింది. కాలేజీల ఏర్పాటు, అదనపు సెక్షన్లను నెలకొల్పడానికి ఉండాల్సిన సదుపాయాల గురించి స్పష్టంచేసింది. అందుకు సంబంధించిన అధికారిక డాక్యుమెంట్లను కూడా ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి. ఈ సదుపాయాలుండాల్సిందే: – ఆన్లైన్ దరఖాస్తు ఫారం ‘హెచ్‌టీటీపీఎస్://బీఐఈ.ఏపీ.జీఓఈ.ఐఎన్’లో పొందుపరిచిన ఇంటర్మీడియెట్‌బోర్డు దరఖాస్తుతో పాటు సదుపాయాలపై సంబంధిత డాక్యుమెంట్లను అప్లోడ్ చేయాలని స్పష్టంచేసింది. – కాలేజీ భవనం, తరగతి గదులు, ల్యాబ్‌లు, లైబ్రరీ, ఆటస్థలం తదితరాల ఫొటో ఇమేజ్‌లను జియో ట్యాగింగ్ ద్వారా అప్లోడ్ చేయాలి. – బోర్డు వాటన్నిటినీ పరిశీలించనుంది. వీటిని ప్రజలకు తెలిసేలా పబ్లిక్ డొమైన్లో ఉంచుతుంది. సదుపాయాలు లేనట్లుగా గుర్తిస్తే చర్యలు తీసుకుంటుంది. – అదనపు సెక్షన్లకు వీలుగా ఆర్సీసీ భవన వసతి, అదనపు తరగతులకు గదులు ఉండాల్సిందే. – భవనపు రిజిస్టర్డ్ లీజ్ డీడ్, సొంత భవనమైతే సంబంధిత రిజిస్టర్డ్ డాక్యుమెంట్లు, ఆటస్థలం కూడా ఉండాలి. – అనుమతి ఉన్న భవన నిర్మాణ ప్లాన్, ఫైర్ సేఫ్టీ సర్టిఫికేట్, శానిటరీ, స్ట్రక్చరల్ సౌండ్‌నెస్ సర్టిఫికేట్లతో పాటు సంబంధిత అధికారవర్గాల నిరభ్యంతర పత్రాలను కాలేజీలు బోర్డు పరిశీలనకు సమర్పించాల్సి ఉంటుంది. – పార్కింగ్ స్థలం, బోధన, బోధనేతర సిబ్బంది వివరాలు, వారి అర్హతలకు సంబంధించిన వివరాలనూ సమర్పించాలి – బోర్డునుంచి ఎలాంటి అనుమతి లేకుండా యాజమాన్యాలు కొత్తగా ఎలాంటి సెక్షన్లను తెరిచేందుకు వీలులేకుండా చర్యలు చేపట్టారు. అడ్డగోలు ఫీజులకూ అడ్డుకట్ట: ప్రైవేట్ కాలేజీలు సాగిస్తున్న ఫీజుల దందాలకు కూడా ప్రభుత్వం అడ్డుకట్ట వేయనుంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే పాఠశాల విద్యా నియంత్రణ పర్యవేక్షణ కమిషన్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. జస్టిస్ ఆర్.కాంతారావు నేతృత్వంలోని ఈ కమిషన్ పాఠశాల విద్యలో ప్రమాణాల పెంపుతోపాటు, పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లో నిబంధనల మేరకు సదుపాయాలుండేలా చర్యలు చేపట్టింది. స్కూళ్లు నిర్ణీత ఫీజులు మాత్రమే వసూలు చేసేలా కార్యాచరణ ప్రారంభించింది. ఇందుకు సంబంధించి మంగళవారం నోటిఫికేషన్ కూడా ఇచ్చింది. 2020–21 విద్యా సంవత్సరం నుంచి ఫీజులను నిర్ధారించనుంది. ఇందుకోసం యాజమాన్యాలు తప్పనిసరిగా తమ వివరాలను కమిషన్‌కు సమర్పించాలి. లేకపోతే ఆ సంస్థలకు ఫీజు వసూలుకు అనుమతి ఉండదు. – అన్ని ప్రైవేట్ అన్ ఎయిడెడ్ స్కూళ్లు, కాలేజీల యాజమాన్యాలు ఫీజుల ప్రతిపాదనలకు సంబంధించిన సమాచారాన్ని కమిషన్ వెబ్సైట్‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఏపీఎస్ఈఆర్ఎంసీ.ఏపీ.జీఓవీ.ఐఎన్’ కు ఆన్లైన్ ద్వారా నిర్ణీత ఫార్మాట్లో షెడ్యూళ్లలో సమర్పించాలి. ఇందుకు జూన్ 9 వరకు గడువిచ్చారు. యాజమాన్యాల ప్రతిపాదనలు, ఇతర వివరాల ఆధారంగా ఫీజులను నిర్ణయిస్తారు. –మొదటి త్రైమాసికానికి సంబంధించిన ట్యూషన్ ఫీజు మాత్రమే వసూలు చేయాలి. – అధిక ఫీజులు వసూలు చేసినా, కాలేజీలు, స్కూళ్లు తెరవకుండానే ఫీజులు వసూలు చేసినా చర్యలు తప్పవు. – ప్రతి ప్రయివేటు అన్ ఎయిడెడ్ స్కూలు, కాలేజీ తమ సంస్థల భవనాలు, తరగతి గదులు, ల్యాబ్‌లు ఇతర సదుపాయాలను జియో ట్యాగింగ్ యాప్ ద్వారా కమిషన్ వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి. – కాలేజీ, పాఠశాల గుర్తింపు వివరాలు, సెక్షన్లు , బిల్డింగ్ వివరాలు , గత ఏడాది ఫీజుల వివరాలు , ఉద్యోగుల వివరాలు , కిచెన్ హాస్టల్ వివరాలు, వచ్చిన ఫీజులు. ఖర్చుల వివరాలు , ఇతర డాక్యుమెంట్లు అప్లోడ్ చేసేలా నిబంధనలు విధించారు. -
ఇంటర్నేషనల్ స్కూళ్లపై యమా క్రేజ్
సాక్షి, అమరావతి: గత దశాబ్దన్నర కాలంగా దేశీయ విద్యా రంగం కొత్త పుంతలు తొక్కుతూ సరికొత్త రూపు సంతరించుకుంటోంది. కాన్వెంట్లు పోయి కార్పొరేట్ స్కూళ్లు వచ్చాయి. ఇప్పుడు ఆ ట్రెండ్‌లోను మార్పులు చోటుచేసుకుంటున్నాయని తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. తల్లిదండ్రులు ఇంటర్నేషనల్ స్కూళ్ల వైపు మొగ్గుచూపుతున్నారని ప్రముఖ సంస్థ ఐఎస్సీ(ఇంటర్నేషనల్ స్కూల్ కన్సల్టెన్సీ) తన తాజా నివేదికలో వెల్లడించింది. ఏడేళ్ల వ్యవధిలో దేశంలో ఇంటర్నేషనల్ స్కూళ్ల సంఖ్య రెండింతలవడమే అందుకు నిదర్శనమని పేర్కొంది. అలాగే ఇంటర్నేషనల్ స్కూళ్ల సంఖ్యలో మన దేశం ప్రపంచంలోనే రెండోస్థానంలో ఉందని, వాటి ట్యూషన్ ఫీజుల టర్నోవర్ ఏకంగా రూ.8,615 కోట్లకు చేరిందని వెల్లడించింది. అత్యున్నత స్థాయి విద్యా ప్రమాణాలు అందించాలనే తాపత్రయంతో ధనిక వర్గాలే కాకుండా ఎగువ మధ్యతరగతి వర్గాలు కూడా తమ పిల్లల్ని ఇంటర్నేషనల్ స్కూళ్లలో చేర్పిస్తున్నారు. ఐఎస్సీ తాజా నివేదిక ప్రకారం ఇంటర్నేషనల్ స్కూళ్ల సంఖ్యలో చైనా మొదటి స్థానంలో నిలవగా.. మనం రెండో స్థానం దక్కించుకున్నాం. విదేశీ విద్యపై మోజుతోనే.. గత 15 ఏళ్లుగా ఉన్నత విద్య కోసం మన దేశం నుంచి విదేశాలకు వెళ్తున్న విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. దీంతో పాఠశాల విద్య కూడా ఇంటర్నేషనల్ సిలబస్‌లో ఉంటే మంచిదనే భావన తల్లిదండ్రుల్లో పెరుగుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో 2012 నాటికి దేశంలో ప్రథమ శ్రేణి నగరాలకే పరిమితమైన ఇంటర్నేషనల్ స్కూళ్లు ఇప్పుడు చిన్న నగరాలకు కూడా విస్తరించాయి. ఇవి ఎక్కువగా కేంబ్రిడ్జ్ ప్రైమరీ, సెకండరీ, అడ్వాన్స్డ్ ప్రోగ్రాం కోర్సులు అందిస్తున్నాయి. అంతర్జాతీయంగా విశేష గుర్తింపున్న ‘ఇంటర్నేషనల్ జనరల్ సర్టిఫికెట్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్’ కోర్సులో పరీక్షలు నిర్వహిస్తున్నాయి. ప్రస్తుతం దేశంలో ఇంటర్నేషనల్ స్కూళ్లలో చదువుతున్న వారిలో 63.40 శాతం భారతీయులు కాగా మిగిలినవారు విదేశీయుల పిల్లలు. విదేశీ దౌత్యవేత్తలు, కార్పొరేట్ సంస్థల్లో పనిచేస్తున్న విదేశీయుల పిల్లలు దాదాపు 36 శాతం ఉన్నారు. భారీగానే ఫీజులు మన దేశంలోని ఇంటర్నేషనల్ స్కూళ్లలో ఏడాదికి ఒక్కో విద్యార్థికి రూ. 2.87 లక్షల నుంచి రూ. 7.17 లక్షల వరకు ట్యూషన్ ఫీజుగా వసూలు చేస్తున్నారు. అయితే ఇతర దేశాలతో పోలిస్తే మన దగ్గర తక్కువేనని ఐఎస్సీ నివేదిక పేర్కొంటుంది. మన దేశంలో ఇంటర్నేషనల్ స్కూళ్ల సగటు వార్షిక ఫీజు రూ. 2.36 లక్షలు కాగా.. చైనాలోరూ. 11.29 లక్షలు, యూఏఈలో రూ. 5.79 లక్షలుగా ఉంది. మున్ముందు దేశంలో ఇంటర్నేషనల్ స్కూళ్ల ప్రాభవం మరింతగా పెరుగుతుందని ఐఎస్సీ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఐఎస్సీ 1994 నుంచి ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నేషనల్ స్కూళ్లకు సంబంధించిన డేటాను సేకరిస్తూ విశ్లేషిస్తోంది. -
అనుమతి లేకుండా టాలెంట్ టెస్ట్
సాక్షి, విజయనగరం క్రైమ్: విద్యాశాఖ నుంచి ఎటువంటి అనుమతుల్లేకుండా ఆకాష్, పిట్జీ వంటి కార్పొరేట్ విద్యాసంస్థలు టాలెంట్ టెస్ట్ నిర్వహించడం గందరగోళానికి దారితీసింది. పరీక్ష రాసేందుకు ఒక్కో విద్యార్థి నుంచి 500 రూపాయలను ఆన్లైన్ ద్వారా వసూలు చేశారు. ఐదో నుంచి పదో తరగతి విద్యార్థులకు జిల్లా కేంద్రంలో ఆదివారం పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. విశాఖకు చెందిన ఈ కార్పొరేట్ విద్యాసంస్థలు విద్యాహక్కు చట్టం, బాలల హక్కులను తుంగలో తొక్కి పరీక్షలు నిర్వహిస్తున్నాయన్న విషయం తెలుసుకున్న జాతీయ మానవ హక్కుల సంఘ ప్రతినిధులు సత్తి అచ్చిరెడ్డి, తదితరులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆరా తీశారు. అక్కడ నుంచి జిల్లా విద్యాశాఖాధికారులతో ఫోన్లో మాట్లాడగా...పరీక్షల నిర్వహణకు ఎటువంటి అనుమతుల్లేవని చెప్పడంతో అందరూ అవాక్కయ్యారు. విషయం తెలుసుకున్న ఎస్ఎఫ్ఐ నాయకులు స్థానిక తోటపాలెంలో ఉన్న పరీక్ష కేంద్రమైన ఫోర్ ఎస్ డిగ్రీ కళాశాల వద్దకు చేరుకుని నిరసన వ్యక్తం చేశారు. హాల్‌టికెట్ చూపిస్తున్న విద్యార్థి పరీక్ష నిర్వహిస్తున్న ఇన్విజిలేటర్లను ప్రశ్నించగా వారి వద్ద నుంచి సరైన సమాధానం రాకపోవడంతో పరిస్థితి ఉద్రిక్తతకు దారితీసింది. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఎస్ఎఫ్ఐ నాయకులను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా మానవహక్కుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్. అచ్చిరెడ్డి మాట్లాడుతూ, అన్ని జిల్లా కేంద్రాల్లోనూ ఇదే తంతు జరుగుతున్నా ఏ ఒక్కరూ దీనిపై దృష్టి సారించకపోవడం విచారకరమన్నారు. కార్పొరేట్ మాయాజాలంలో పడి విద్యార్థుల భవిష్యత్, స్వేచ్ఛను హరించవద్దని తల్లిదండ్రులకు సూచించారు. కార్పొరేట్ విద్యాసంస్థలు ప్రభుత్వం నిర్ణయించిన ఫీజుల మేరకే ఎంట్రన్స్, మోడల్ టెస్ట్‌లు వంటివి నిర్వహించుకోవాలే తప్ప అధిక రుసుం వసూలు చేయకూడదన్నారు. విద్యాశాఖ, పోలీస్, ఎస్ఎఫ్ఐ సహకారంతో పరీక్షను నిలిపివేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో సింహాద్రిస్వామి, విద్యార్థులు పాల్గొన్నారు. -
ఫీజుల నియంత్రణ.. ఓ పదేళ్ల పాత మాట
హైదరాబాద్ నగరం నడిబొడ్డున మంచి పేరున్న ఓ ఇంజనీరింగ్ కాలేజీలో వార్షిక ఫీజు రూ.78 వేలు మాత్రమే. ఇక సాధారణ ఇంజనీరింగ్ కాలేజీలో అయితే కనీస వార్షిక ఫీజు రూ.35 వేలే. అదే నగరంలోని ఆ కాలేజీకి రెండు కిలోమీటర్ల పరిధిలోని ఓ కార్పొరేట్ స్కూల్లో పదో తరగతి చదివే విద్యార్థి వార్షిక ఫీజు రూ.85 వేలు. అంటే ఇంజనీరింగ్ కంటే పదో తరగతి చదివే విద్యార్థి ఫీజే ఎక్కువ. పోనీ విద్యార్థులకు సదుపాయాలు, టీచర్ల వేతనాల విషయంలో ఇంజనీరింగ్ కాలేజీకంటే ఎక్కువగానే కల్పిస్తున్నారా? అంటే అదీ చెప్పలేని పరిస్థితే. కనీసం స్కూల్లోని విద్యా ర్థులందరికీ నాణ్యమైన విద్య అందుతోందా? అంటే అదీ లేదు. మొన్నటి పదో తరగతి పరీక్షల్లో ఆ స్కూల్‌కు చెందిన చాలామంది విద్యార్థులు ఫెయిలయ్యారు. అందులో శ్రీవర్ధన్ అనే విద్యార్థి ఉన్నాడు. అతని తండ్రి రాజేందర్‌రెడ్డి ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేసే ఉద్యోగి. వరంగల్ నుంచి బతుకుదెరువు కోసం వచ్చిన తన కొడుకును కార్పొరేట్ స్కూల్లో చేర్చాడు. అప్పులు చేసి మరీ చదివించినా ఫలితం లేకుండా పోయింది. సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో ఇలా అనేకమంది తండ్రులు తమ పిల్లలను బాగా చది వించాలన్న తపనతో కార్పొరేట్, పేరున్న ప్రైవేటు స్కూళ్లలో చేర్చి ఆర్థికంగా అప్పులపాలు అవుతున్నారు. రాష్ట్రంలో 10,526 ప్రైవేటు పాఠశాలలు ఉంటే అందులో 30,77,884 మంది విద్యార్థులు చదువుతున్నారు. అందులో 3,487 కార్పొరేట్, టాప్ పాఠశాలలు ఐఐటీ, ఒలంపియాడ్, టెక్నో, కాన్సెప్ట్, ఈ–టెక్నో, ఈ–శాస్త్ర, కాన్వెంట్, పబ్లిక్ స్కూల్ వంటి 62 రకరకాల పేర్లతో రూ.లక్షల్లో కేపిటేషన్ ఫీజులు, డొనేషన్లు వసూలు చేస్తున్నాయి. చివరకు నర్సరీ నుంచే ఐఏఎస్ పాఠాలు? అంటూ దోపిడీకి పాల్పడుతున్నాయి. ఈ తంతు ఏళ్ల తరబడి కొనసాగింది.. కొనసాగు తూనే ఉంది. ఎలాంటి శాస్త్రీయత లేకుండానే ఫీజులు వసూలు చేస్తున్నా స్కూల్ ఫీజుల నియంత్రణ ఇప్పటికీ అమలుకు నోచుకోవడం లేదు. 25 శాతం ఫీజుల పెంపు.. ప్రభుత్వం వద్దన్నా రాష్ట్రంలో ప్రముఖ ప్రైవేటు పాఠశాలలు, కార్పొరేట్ స్కూళ్లు ఈసారి 25% వరకు ఫీజులను పెంచే శాయి. అయినా ఫీజుల నియంత్రణ రాష్ట్రంలో అమలుకు నోచుకోవడం లేదు. ప్రభుత్వం ఉత్తర్వులు ఇస్తే కోర్టు కేసులు.. ఆ తర్వాత ఇష్టారాజ్యంగా పెంపు ఏటా ఇదే తంతు. పోనీ ఆ ఫీజుల వసూలు, పెంపులో ఏమైనా శాస్త్రీయత ఉంటుందా? అంటే అదీ లేదు. యాజమాన్యాల ఇష్టారాజ్యం కొనసాగుతున్నా అడ్డుకట్ట పడక తల్లిదండ్రులు వాపోతున్నారు. పిల్లలను బాగా చదివించాలన్న ఆశలతో అప్పులు చేసి మరీ ఫీజులను చెల్లించక తప్పడం లేదు. శాస్త్రీయత ఎక్కడ..? ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల నియంత్రణ కాదు.. వాటి ఖరారులోనే శాస్త్రీయ విధానం లేదు. ప్రభుత్వాలు గత పదేళ్లుగా అనేక చర్యలు చేపట్టినా న్యాయ వివాదాల్లోనే అవన్నీ చిక్కుకున్నాయి. ఫీజులను కట్టడి చేయాలన్న ఆలోచన ప్రభుత్వానికి ఉన్నా అధికారులు దానిని పక్కాగా చేపట్టేలా చేయడంలో విఫలం అవుతున్నారు. ఫలితంగా పలు సందర్భాల్లో వృత్తి విద్యా కాలేజీల తరహాలో ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీని ఏర్పాటు చేసి పాఠశాలల ఫీజులను నియంత్రించాలని, యాజమాన్యాల ఆదాయ వ్యయాలను బట్టి ఫీజులను ఖరారు చేయాలనే ఆలోచన చేసినా, వాటిని పకడ్బందీగా చేయడంలో విఫలం కావడంతో ఆ ఉత్తర్వులు న్యాయ వివాదాల్లో చిక్కుకున్నాయి. ప్రతిసారీ ఏదో ఒక కారణంతో.. రాష్ట్రంలో ప్రైవేటు స్కూల్ ఫీజుల నియంత్రణ ఒక్కోసారి ఒక్కో కారణంతో ఆగిపోతోంది. 2009లో ఫీజుల నియంత్రణకు ప్రభుత్వం జీవో 91, 92లను జారీ చేసింది. దాని ప్రకారం జిల్లా స్థాయిలో జిల్లా ఫీజుల నియంత్రణ కమిటీలను (డీఎఫ్ఆర్సీ) ఏర్పాటు చేసి ఫీజులను ఖరారు చేయాలని పేర్కొంది. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఏటా గరిష్టంగా రూ.24 వేలు, ఉన్నత పాఠశాలల్లో రూ.30 వేలు ట్యూషన్ ఫీజును మాత్రమే వసూలు చేసుకోవచ్చని వెల్లడించింది. ఆ ఉత్తర్వులపై ప్రైవేటు పాఠశాలలు హైకోర్టును ఆశ్రయించాయి. డీఎఫ్ఆర్సీల ఏర్పాటు సరిగ్గా లేదని, జిల్లా స్థాయిలో ఫీజుల ఖరారు కుదరదని 2010లో హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఆ తర్వాత విద్యా హక్కు చట్టం అమల్లోకి వచ్చింది. దీంతో ప్రభుత్వం జీవో 41, 42లను జారీ చేసింది. అందులో ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో పట్టణ ప్రాంతాల్లో అయితే ఏడాదికి గరిష్టంగా రూ.9 వేలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.7,800 వసూలు చేయాలని పేర్కొంది. ఉన్నత పాఠశాలల్లో పట్టణాల్లో రూ.12 వేలు, గ్రామాల్లో రూ.10,800లకు మించి వసూలు చేయవద్దని పేర్కొంది. అయితే ఆ జీవోపైనా 2016లో యాజమాన్యాలు కోర్టును ఆశ్రయించాయి. దీంతో వాటి అమలు ఆగిపోయింది. హైకోర్టులో పిల్.. ఆపై కమిటీ.. 2016లో ఫీజుల నియంత్రణపై ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ప్రైవేటు పాఠశాలలు ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తుంటే మీరేం చేస్తున్నారంటూ తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. విద్యాశాఖ ఫీజుల నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలపై అధ్యయనం చేసేందుకు అధికారుల కమటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ నివేదికను ప్రభుత్వానికి విద్యాశాఖ పంపించింది. ఆ తర్వాత ప్రభుత్వం మాజీ వైస్ చాన్స్‌లర్ తిరుపతిరావు నేతృత్వంలో కమిటీని 2017 మార్చిలో నియమించింది. ఆ కమిటీ కూడా పలు సిఫారసులు చేసింది. ప్రైవేటు స్కూళ్లు ఏటా ఫీజులను 10 శాతంలోపు పెంచుకోవచ్చని, అందుకు ఎలాంటి అనుమతులు తీసుకోవాల్సిన అవసరం లేదని కమిటీ నివేదించడంతో ప్రభుత్వం ఆ నివేదికను పక్కన పెట్టింది. దానిపై నిర్ణయం తీసుకునే వరకు ఫీజులను పెంచవద్దని 2018 ప్రారంభంలో ఉత్తర్వులు జారీ చేసింది. దానిపై యాజమాన్యాలు కోర్టును ఆశ్రయించాయి. దీంతో ఫీజుల నియంత్రణ ఆగిపోయింది. ఆదాయ వ్యయాలను బట్టి నిర్ణయించేలా? ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో ఫీజుల నియంత్రణకు ప్రభుత్వం పక్కా చర్యలు చేపట్టాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. పాఠశాలలు ఇష్టారాజ్యంగా కాకుండా పాఠశాలల ఆదాయ వ్యయాలను బట్టి ఫీజులను నిర్ణయించే వ్యవస్థను అందుబాటులోకి తేవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అప్పుడే ఫీజుల నిర్ణయం, వసూళ్లలో శాస్త్రీయత ఉంటుందని, ఆదాయ వ్యయాలను బట్టి ఫీజులు నిర్ణయిస్తే భారం కూడా తగ్గే అవకాశాలే ఎక్కువగా ఉంటాయని పేర్కొంటున్నారు. -
అమ్మఒడి పథకం ఆమోదయోగ్యమే..
సాక్షి, చిత్తూరు : సీఎం జగన్ ప్రవేశపెట్టిన అమ్మఒడి పథకం అందరికీ ఆమోదయోగ్యంగా ఉందని ఆంధ్రప్రదేశ్ ప్రైవేటు స్కూల్స్ మేనేజ్మెంటు అసోసియేషన్ (అపుస్మా) జిల్లా సభ్యులు అన్నారు. మంగళవారం ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడారు. కేవలం ప్రభుత్వ పాఠశాలకు మాత్రమే అమ్మఒడి పథకం అమలు చేయాలనే కొందరి వాదన సరికాదన్నారు. పలు రంగాల్లో రాణిస్తున్న 90 శాతం మంది ప్రైవేటు స్కూళ్లల్లో చదువుకుని వచ్చిన వారే అని వెల్లడించారు. కూలీ పని చేసుకుని జీవనం సాగించే వారు తమ పిల్లలను ప్రైవేటు స్కూళ్లలో చదివిస్తున్నారన్నారు. ప్రభుత్వ పాఠశాలలను తాము కించపరచడం లేదని అభిప్రాయపడ్డారు. నిబంధనలు పాటించకుండ ఉన్న కార్పొరేట్ స్కూళ్లను అధికార యంత్రాంగం కట్టడి చేయాలని కోరారు. ప్రతి తల్లి ఖాతాలో రూ.15 వేలు ఏడాదికి జమచేస్తామని చెప్పడం హర్షణీయమన్నారు. సమావేశంలో సభ్యులు ఎస్ఎస్కే రాజా, గోపాలకృష్ణమూర్తి, తేజోమూర్తి, రమణ తదితరులు పాల్గొన్నారు. -
పిల్లలను చేర్చితేనే జీతాలు
గుంటూరు ఎడ్యుకేషన్: కార్పొరేట్ విద్యాసంస్థల ఆగడాలకు హద్ధు అనేది లేకుండా పోతోంది. ప్రతి ఏటా విద్యాసంవత్సరం ప్రారంభానికి ముందుగా అడ్మిషన్లు చేపట్టడం సాధారణమే అయినా ప్రస్తుతం కార్పొరేట్, ప్రైవేటు పాఠశాలలు, జూనియర్ కళాశాలల యాజమాన్యాలు అవలంభిస్తున్న తీరుతో బోధన, బోధనేతర సిబ్బంది గగ్గోలు పెడుతున్నారు. ప్రభుత్వం ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకూ పాఠశాలలకు, జూన్ మొదటి వారం వరకూ జూనియర్ కళాశాలలకు వేసవి సెలవులు ప్రకటించింది. అయితే గత విద్యాసంవత్సరం ముగిసి, సెలవులు మొదలైన ఏప్రిల్ 24 నుంచి ఉపాధ్యాయులతో పాటు అధ్యాపకులకు, బోధనేతర సిబ్బందికి సెలవులు ఇవ్వకుండా అడ్మిషన్ల పేరుతో ఇంటింటికీ పంపడం ప్రారంభించారు. బోధన, బోధనేతర సిబ్బందికి వారి స్థాయి, హోదాను బట్టి టార్గెట్లు విధించి, అడ్మిషన్ తెస్తేనే వేతనం, లేకపోతే చివాట్లు పెట్టే పద్ధతి ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా కొనసాగుతోంది. ప్రభుత్వ రంగంలోని పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కళాశాలల్లో బోధన, బోధనేతర వృత్తి చేపట్టాలనే లక్ష్యంతో బీఈడీ, డీఎడ్, ఎంఈడీ, ఎమ్మెస్సీ విద్యార్హతలు కలిగిన విద్యావంతులు ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలను సాధించలేక, విధి లేని పరిస్థితుల్లో ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఉద్యోగాలను చేస్తున్నారు. కుటుంబ ఆర్థిక పరిస్థితుల ప్రభావంతో ఎంతటి పని భారాన్నైనా తట్టుకుని వెళుతుండగా, ఏడాదిలో 10 నెలలు సజావుగా సాగుతున్న పరిస్థితుల్లో వేసవి సెలవుల్లో వారికి గడ్డు కాలం ఎదురవుతోంది. మే నెలలో ఇచ్చిన టార్గెట్ ప్రకారం అడ్మిషన్లు చేసిన వారికే జూన్ నెలలో వేతనం ఇస్తామని కార్పొరేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు స్పష్టం చేయడంతో ఉపాధ్యాయులు, సిబ్బంది పరిస్థితి దిక్కుతోచని విధంగా మారింది. గుంటూరు నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా క్యాంపస్‌లు కలిగి ఉన్న శ్రీ చైతన్య, నారాయణ, భాష్యం, ఎన్నారై అకడమీ తదితర కార్పొరేట్ విద్యాసంస్థల మధ్య నెలకొన్న తీవ్రమైన పోటీ నేపథ్యంలో ఆయా సంస్థల్లో పని చేస్తున్న బోధన, బోధనేతర సిబ్బంది అడ్మిషన్ల వేటలో సమిధలుగా మారుతున్నారు. మండు టెండల్లో ఇంటింటికీ తిరుగుతూ తల్లిదండ్రులకు తమ విద్యాసంస్థల ప్రగతి గురించి వివరించి, కరపత్రాలు, బ్రోచర్లు ఇచ్చి వస్తున్నారు. అడ్మిషన్ కోసం వెళ్లిన సమయంలో అడ్మిషన్ ఖరారు చేసేందుకు కొంత మొత్తం ఫీజును వసూలు చేసేందుకు తల్లిదండ్రుల కాళ్లా, వేళ్లా పడి ప్రాధేయపడాల్సి వస్తోంది. జిల్లా కేంద్రంతో పాటు తెనాలి, నరసరావుపేట, మంగళగిరి, సత్తెనపల్లి, బాపట్ల వంటి పట్టణాల్లోని ప్రైవేటు పాఠశాలలు, జూనియర్ కళాశాలలు ఈ విధంగా అడ్మిషన్ల డ్రైవ్ నిర్వహిస్తున్నాయి. ముఖ్యంగా మహిళా ఉపాధ్యాయినులు అడ్మిషన్ల కోసం ఇంటింటికీ తిరుగుతూ భద్రత లేని ఉద్యోగం చేస్తున్నారు. ఎండల కారణంగా సాయంత్రం 7.00 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకూ సుదూర ప్రాంతాలకు సైతం వెళ్లి అడ్మిషన్లు కోసం ఇంటింటికీ తిరుగుతున్నారు. ఇటీవల గుంటూరు నుంచి చౌడవరం గ్రామానికి అడ్మిషన్ల కోసం వెళ్లిన ఓ ఉపాధ్యాయిని జాతీయ రహదారిపై ప్రమాదానికి గురై, ఆస్పత్రి పాలైంది. అడ్మిషన్ పేరుతో తెస్తున్న అధిక ఒత్తిడి భరించలేక నగరానికి చెందిన ఒక ఉపాధ్యాయుడు పక్షవాతానికి గురై మంచం పట్టారు. ఆయా క్యాంపస్‌లలో ప్రిన్సిపాళ్లు, డీన్లు, ఏజీఎం, డీజీఎంల వరకూ ఎవరి స్థాయిలో వారు అడ్మిషన్ల కోసం తీవ్రమైన ఒత్తిడి తీసుకువస్తుండటంతో సిబ్బంది ఉద్యోగం మానేస్తున్నారు. అడ్మిషన్ తెస్తేనే జీతం చెల్లిస్తామని, లేకుంటే లేదని బెదిరిస్తున్న సంఘటనలపై బయటకు చెప్పుకోలేక ఆందోళన చెందుతున్నారు. కార్పొరేట్ యాజమాన్యాల తీరుతో తీవ్ర కలత చెందుతున్న మధ్య తరగతి ఉద్యోగులు, ఉపాధ్యాయులు వేరే దారి లేక, ఒక్కో సారి తల్లిదండ్రులు పెడుతున్న చివాట్లను భరిస్తున్నారు. ఫిర్యాదు చేసినాపట్టించుకోవడం లేదు అడ్మిషన్లు చేస్తేనే జీతం, సెలవులు ఇస్తామని కార్పొరేట్, ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు ఉపాధ్యాయులను వేధిస్తున్నాయి. ప్రస్తుతం మే నెల వేతనం చెల్లించే పరిస్థితులు లేవని కార్పొరేట్ స్కూళ్లలో పని చేస్తున్న టీచర్లు మా దృష్టికి తెచ్చారు. తీవ్రమైన పని ఒత్తిడితో భద్రత లేని ఉద్యోగాలను చేస్తుండగా, మరో వైపు అడ్మిషన్ల కోసం టార్గెట్లు విధించి వేధిస్తున్నారు. పీఆర్వోల చేత చేయించాల్సిన అడ్మిషన్లను బోధన, బోధనేతర సిబ్బందితో చేయిస్తున్నారు. కార్పొరేట్, ప్రైవేటు విద్యాసంస్థల ఆగడాలపై గతంలో ధర్నాలు, ఆందోళనలు చేసి, అధికారులకు విజ్ఞప్తులు చేసినా పట్టించుకున్న దాఖలాలు లేవు.– వానపల్లి సుభాని, జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రైవేటు టీచర్స్, లెక్చరర్స్ యూనియన్ -
‘కార్పొరేట్’ గాలం!
మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని భగీరథకాలనీకి చెందిన లావణ్య చదువులో మేటి. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుకున్న ఈ బాలిక ఈసారి పదో తరగతి పరీక్ష ఫలితాల్లో 9.8 జీపీఏతో ఉత్తీర్ణత సాధించింది. మధ్యతరగతి కుటుంబానికి చెందినందున ప్రైవేట్ కాలేజీలో చదువుకునే ఆర్థికస్తోమత లేదు. ఇది తెలుసుకున్న ఓ వ్యక్తి లావణ్య తండ్రి కృష్ణకుమార్‌కు ఫోన్ చేసి ‘నేను హైదరాబాద్‌కు చెందిన ఓ కార్పొరేట్ కాలేజీ నుంచి మాట్లాడుతున్నాను. మీ కూతురిని మా కాలేజీలో చేర్పిస్తే చదువుకయ్యే ఖర్చునంతా మేమే భరిస్తాం..’ అని హామీ ఇచ్చారు. దీంతో కార్పొరేట్ చదువు ఉచితంగా అందుతుందనే ఉద్దేశంతో ఆ తండ్రి అందుకు అంగీకరించారు. ఇలా ఉత్తమ ఫలితాలు సాధించిన ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులందరికీ ఇలాంటి ఫోన్‌కాల్స్ వస్తూనే ఉన్నాయి. వారి ప్రతిభను తెలుసుకున్న ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాతో పాటు హైదరాబాద్‌కు చెందిన కార్పొరేట్, ప్రైవేట్ జూనియర్ కాలేజీల ఏజెంట్లు విద్యార్థుల ఫోన్ నంబర్లు సేకరించి ఆయా కాలేజీల్లో అడ్మిషన్లు తీసుకునేలా గాలం వేస్తున్నారు. సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: జిల్లాలో అప్పుడే ఇంట ర్మీడియెట్ అడ్మిషన్ల హడావుడి మొదలైంది. ప్రస్తుతం ఆయా కాలేజీల పోటాపోటీ ప్రచారాలు.. ఫోన్ కాల్స్‌తో అడ్మిషన్ల ప్రక్రియ ఊపందుకుంది. విద్య వ్యాపారంలో ట్రెండ్ మార్చిన కార్పొరేట్ కాలేజీలు వినూత్న పద్ధతిలో మొదలుపెట్టాయి. పదో తరగతి చదువుతున్న విద్యార్థుల వివరాలు స్థానిక పాఠశాలల నుంచి తెప్పించుకున్న కాలేజీ యాజమాన్యాలు.. అడ్మిషన్ల కోసం తల్లిదండ్రులకు ఫోన్లు చేస్తూ ఆకర్షించేందుకు శతవిధాలా యత్నిస్తున్నాయి. విద్యార్థుల ఇళ్లకు వెళ్లి అడ్మిషన్లు చేయించుకునేందుకు జిల్లాలో ప్రధాన పట్టణాలు, మండల కేంద్రాల్లో డిగ్రీ పూర్తి చేసిన కొందరిని నియమించుకున్నాయి. కొందరిని వేతనాల వారీగా, ఇంకొందరిని పర్సంటేజీల రూపంలో డబ్బు చెల్లిస్తున్నాయి. మరికొన్ని కాలేజీలైతే.. ఏకంగా తమ ఏజెంట్లకు ప్రచారకర్తల పదవులతో గుర్తింపు కార్డులూ జారీ చేసేశాయి. కేవలం ఉమ్మడి జిల్లా పరిధిలోని మహబూబ్‌నగర్, వనపర్తి, నాగర్‌కర్నూల్, జోగుళాంబ గద్వాల, నారాయణపేట జిల్లా కేంద్రాల్లో బడా కాలేజీ యాజమాన్యాలు ఇప్పటికే పదుల సంఖ్యలో ఏజెంట్లను నియమించుకోవడం గమనార్హం. ఇప్పటికే రంగంలో దిగిన ఆయా కాలేజీల ఏజెంట్లు అడ్మిషన్లతో హోరెత్తిస్తున్నారు. ఈ విషయంలో లక్ష్యాలను నిర్దేశించుకుని.. విద్యా సంవత్సరం ప్రారంభం అయ్యేలోగా వాటిని పూర్తి చేసేలా కసరత్తు చేస్తున్నారు. ఇటీవల విడుదలైన పదో తరగతి పరీక్ష ఫలితాల్లో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా నుంచి 41,364 మంది విద్యార్థులు పాసయ్యారు. వీరిలో చాలావరకు ప్రైవేట్ కా>లేజీల వైపే మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో 110 ప్రైవేట్ జూనియర్ కాలేజీలు ఉన్నాయి. జిల్లాకు చెందిన ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలు గ్రూపుతో పాటు విద్యార్థులకు ఇచ్చే ఇతర పరీక్షల శిక్షణను బట్టి ఏడాది రూ. పది వేల నుంచి రూ.40వేల వరకు ఫీజు వసూలు చేస్తున్నాయి. పాలమూరు టు హైదరాబాద్! స్థానికంగా ఉన్న ప్రైవేట్ కాలేజీలే గాక హైదరాబాద్‌కు చెందిన పలు కార్పొరేట్ కాలేజీలు సైతం పాలమూరు జిల్లాపై దృష్టి సారించాయి. పదో తరగతి పరీక్ష ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులను గుర్తించి వారిని తమ కాలేజీల్లో చేర్పించుకునేందుకు ఏజెంట్లను నియమించుకున్నాయి. మంచి ఫలితాలు సాధించిన వారికి ఉచిత విద్య, వసతి వల వేస్తున్నాయి. మిగతా విద్యార్థులకు వచ్చిన జీపీఏను బట్టి ఫీజు వసూలు చేస్తున్నాయి. సాధారణంగా ఎంపీసీ విద్యార్థులు ఎంసెట్, ఐఐటీ, ఏఐఈఈఈ, జేఈఈ, ఎన్ఈటీ, సీఏ కోర్సుల వైపు మొగ్గు చూపుతారు. బైపీసీ విద్యార్థులు బీ–ఫార్మసి, ఎంబీబీఎస్, బీయూఎంఎస్, కోర్సుల వైపు; ఎంపీసీ, సీఈసీ విద్యార్థులు సీఏ, సివిల్స్ కోసం యత్నిస్తుంటారు. వీరిలో సంబంధిత కోర్సులు.. వాటి కాలానికనుగుణంగా ఫీజు వసూలు చేస్తున్నాయి. ఇంటర్మీడియెట్‌లో కేవలం ఫస్టియర్ వరకే ఎంసెట్, ఐఐటీ ఎంట్రెన్స్ శిక్షణ తీసుకోవాలనుకుంటున్న విద్యార్థులను ‘ఇన్కేర్’ బ్యాచ్‌గా విభజించి రూ.1.05లక్షల నుంచి రూ. 1.4లక్షల వరకు ఫీజు నిర్ణయించుకున్నాయి. అదే జిల్లాకు చెందిన ప్రైవేట్ కాలేజీలయితే సాధారణ ఫీజుతోపాటు అదనంగా మరో రూ.40వేలు తీసుకుంటున్నాయి. వీరికి రెండో సంవత్సరంలో ఎలాంటి శిక్షణ ఉండదు. ఐఐటీ, ఏఐఈఈఈ ఎంట్రెన్స్ శిక్షణ తీసుకోవాలనుకుంటున్న విద్యార్థులను ‘స్పార్క్’ బ్యాచ్‌గా విభజించి ఫస్టియర్‌తో పాటు సెకండియర్ సగం విద్యా సంవత్సరం వరకు శిక్షణ ఇస్తారు. వీరి నుంచి హైదరాబాద్‌కు చెందిన కార్పొరేట్ కాలేజీలు ఏటా రూ.1.25లక్షలు, జిల్లాకు చెందిన కాలేజీలు రూ.50వేల వరకు ఫీజు వసూలు చేస్తున్నాయి. చదువులో వెనకబడిన వారిని రెగ్యులర్ బ్యాచ్‌గా విభజించి కేవలం వార్షిక పరీక్షలో పాస్ అయ్యేలా బోధిస్తారు. వీరి నుంచి కార్పొరేట్ కాలేజీలైతే రూ.60వేల నుంచి రూ.లక్ష.. జిల్లాకు చెందిన కాలేజీలు అదనంగా రూ.20వేల వరకు వసూలు చేస్తారు. మెరిట్ విద్యార్థులను ‘జూనియర్ ఫాస్ట్ ట్రాక్’ బ్యాచ్ కింద చేర్చి.. వారికి ఐఐటీ, ఏఐఈఈఈ, జేఈఈ, ఎన్ఈటీ ఎంట్రెన్స్‌కు శిక్షణ ఇస్తారు. వీరి నుంచి ఏటా రూ. 1.35లక్షల వరకు ఫీజు నిర్ణయించారు. రూ.5వేలకే సీటు బుకింగ్ నాణ్యమైన విద్య.. అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తామంటూ పదో తరగతి విద్యార్థులు.. వారి తల్లిదండ్రులను ఆకర్షిస్తున్న హైదరాబాద్‌కు చెందిన కార్పొరేట్, ప్రైవేట్ కాలేజీలు రూ.ఐదు వేలకే అడ్మిషన్ ఖాయం చేసేస్తున్నాయి. టెన్త్ ఫలితాల్లో సాధించిన జీపీఏను బట్టి విద్యార్థులకు ఫీజు మినహాయింపు ఉంటుందని చెబుతున్నాయి. జిల్లాలోని ప్రభుత్వ కాలేజీల్లో నాణ్యమైన విద్య అందకపోవడం.. చెప్పుకోదగ్గ కాలేజీలు లేకపోవడం.. తల్లిదండ్రులందరూ తమ పిల్లలను పెద్ద కాలేజీల్లో చదువు చెప్పించాలనే ఆశను ఆసరాగా చేసుకుని పలు కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ఇలా గాలం వేస్తున్నాయి. కాలేజీలు పునఃప్రారంభమైన తర్వాత సీట్లు దొరుకుతాయో లేదోనని విద్యార్థుల తల్లిదండ్రులూ ఇప్పట్నుంచే సీట్లు ఖరారు చేసుకుంటున్నారు. కాగా, కార్పొరేట్ విద్యాసంస్థలు ఒక్కో ఏజెంట్‌కు ప్రతి అడ్మిషన్‌పై రూ.ఐదు వేల నుంచి రూ.పది వేల వరకు చెల్లిస్తున్నాయి. జిల్లాకు చెందిన ప్రైవేట్ కాలేజీలు మాత్రం రూ.2,500 నుంచి రూ.నాలుగు వేల వరకు (విద్యార్థులు చెల్లించే ఫీజును బట్టి) ఇస్తున్నాయి.