కేంద్రీయ విద్యాలయాలకే డిమాండ్ | demand for central education | Sakshi
Sakshi News home page

కేంద్రీయ విద్యాలయాలకే డిమాండ్

Published Mon, Jan 13 2014 3:42 AM | Last Updated on Sat, Sep 2 2017 2:34 AM

demand for central education

 ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌లైన్: కార్పొరేట్ స్కూళ్ల కన్నా కేంద్రీయ విద్యాలయాలకే డిమాండ్ ఉందని రాష్ట్ర రెవెన్యూ శాఖామంత్రి ఎన్.రఘువీరారెడ్డి అన్నారు. నాణ్యైమైన విద్య అందించడం వల్లే ఎక్కువ మంది కేంద్రీయ విద్యాలయాల వైపు మొగ్గు చూపుతున్నారని తెలిపారు. ఒంగోలులోని దామచర్ల సక్కుబాయమ్మ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలకు సమీపంలో 9.26 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించనున్న కేంద్రీయ విద్యాలయ భవనాలకు ఆదివారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మొక్కలు నాటారు. అనంతరం విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులనుద్దేశించి రఘువీరారెడ్డి మాట్లాడారు. దేశంలోనే పేరు ప్రఖ్యాతి గాంచిన విద్యాలయంగా కేంద్రీయ విద్యాలయం పేరొందిందన్నారు. 2007లో 600 మంది పేద విద్యార్థులతో ప్రారంభించిన ఈ విద్యాలయంలో ప్రస్తుతం ఒక్కో సీటుకు పదిమంది పోటీ పడుతున్నారని చెప్పారు. విద్యార్థులను మంచి ప్రయోజకులుగా తీర్చిదిద్దే వాతావరణం కేంద్రీయ విద్యాలయంలో ఉందన్నారు.
 
  భవనాల నిర్మాణాలకు ప్రభుత్వం రూ. 18 కోట్లు ఖర్చు చేస్తోందని, జిల్లాకు అదనంగా మరో కేంద్రీయ విద్యాలయం మంజూరైనట్లు తెలిపారు. దీన్ని తాము ఖర్చుగా భావించడం లేదని, విద్యార్థులపై పెట్టుబడిగా భావిస్తున్నట్లు స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా 30 లక్షల మందికి నాణ్యమైన ఉచిత విద్య అందిస్తున్న ఘనత కేంద్రీయ విద్యాలయాలకే దక్కుతుందని రఘువీరా అన్నారు. ఒంగోలు పార్లమెంటు సభ్యుడు మాగుంట శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశానికి గతంలో ఎంపీ కోటా కింద రెండు సీట్లు కేటాయించేవారని, ప్రస్తుతం ఆ సంఖ్య ఆరుకు పెంచారని తెలిపారు. కలెక్టర్ విజయకుమార్ మాట్లాడుతూ 5 ఎకరాల స్థలంలో కొత్త భవనాలను నిర్మిస్తున్నట్లు తెలిపారు. రెండో కేంద్రీయ విద్యాలయం కోసం మంగమూరు వద్ద స్థలాన్ని చూసినట్లు చెప్పారు. మూడో కేంద్రీయ విద్యాలయం మంజూరైతే మార్కాపురం డివిజన్‌లో ఏర్పాటు చేస్తామన్నారు. ప్రస్తుతం ఒంగోలులోని కేంద్రీయ విద్యాలయంలో 864 మంది విద్యార్థులు ఉన్నారన్నారు. జిల్లా జడ్జి రాధాకృష్ణ మాట్లాడుతూ పాత గురుకులాలను గుర్తుకు తెచ్చేవిధంగా కేంద్రీయ విద్యాలయం ఉందన్నారు. కార్యక్రమంలో కొండపి శాసనసభ్యుడు జీవీ శేషు, కేంద్రీయ విద్యాలయం ప్రిన్సిపాల్ సీహెచ్ ప్రసాదరావు, డీఆర్‌డీఏ పీడీ పద్మజ, డీఈఓ రాజేశ్వరరావు, నగర పాలక సంస్థ కమిషనర్ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
 
 12 తహసీల్దార్ కార్యాలయాల నిర్మాణానికి 8 కోట్లు
 జిల్లాలో 12 తహసీల్దార్ కార్యాలయాల నిర్మాణాలకు రూ. 8 కోట్లు విడుదల చేసినట్లు రెవెన్యూశాఖ మంత్రి రఘువీరారెడ్డి తెలిపారు. ఆధునికీకరించిన కలెక్టర్ క్యాంపు కార్యాలయ భవనాన్ని మునిసిపల్ శాఖామంత్రి మానుగుంట మహీధర్‌రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం శాసనసభ్యులు, జిల్లా అధికారులను ఉద్దేశించి రఘువీరారెడ్డి మాట్లాడారు. రెండు మాసాల్లోనే క్యాంపు కార్యాలయాన్ని పూర్తిచేయడంపై కలెక్టర్ విజయకుమార్‌ను ప్రత్యేకంగా అభినందించారు.  
 
 ఎన్నికల్లో లైఫ్ రిస్క్ తీసుకున్న కలెక్టర్
 కలెక్టర్ విజయకుమార్ తొలి పోస్టింగ్ అనంతపురం జిల్లా పెనుకొండలో సబ్ కలెక్టర్‌గా చేశారని, 1997-1998లో జరిగిన ఎన్నికల్లో లైఫ్ రిస్క్ తీసుకొని విధులు నిర్వర్తించారని మంత్రి రఘువీరారెడ్డి అభినందించారు. రిగ్గింగ్ జరిగినట్లు గుర్తించి రాత్రికి రాత్రే 78 పోలింగ్ కేంద్రాల్లో రీ పోలింగ్ నిర్వహించారని, బెదిరింపులు వచ్చినా వాటిని లెక్క చేయలేదన్నారు. సమావేశంలో శాసనమండలి సభ్యుడు జూపూడి ప్రభాకర్, శాసనసభ్యులు బీఎన్ విజయ్‌కుమార్, జీవీ శేషు, ఆమంచి కృష్ణమోహన్, దగ్గుబాటి వెంకటేశ్వరరావు, ముక్కు ఉగ్రనరసింహారెడ్డి, ఆదిమూలపు సురే శ్, జిల్లా జడ్జి రాధాకృష్ణ, ఎస్పీ ప్రమోద్‌కుమార్ తదితరులు  పాల్గొన్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement