ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఆయనొక సీనియర్ పొలిటీషియన్. కొన్నేళ్ళ క్రితం రాజకీయ సన్యాసం తీసుకున్నట్లు ప్రకటించారు. కాని కొంతకాలం క్రితం మళ్ళీ యాక్టివ్‌గా మారారు. కర్నాటక ఎన్నికల్లో ప్రచారం చేసి సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. ఏపీలో కాంగ్రెస్ భూస్థాపితం అయిందనే విషయం అందరికీ తెలిసిందే. అందుకే తన సొంత నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించుకునేందుకు రకరకాల ప్లాన్స్ వేస్తున్నారాయన. ఇంతకీ ఆ నేత ఎవరు? ఆయన వేస్తున్న ప్లాన్ ఏంటి?
కొన్నేళ్ళ క్రితం రాజకీయ సన్యాసం తీసుకుని మళ్ళీ యాక్టివ్‌గా మారిన ఈ రాజకీయ నాయకుడి పేరు నీలకంఠాపురం రఘువీరారెడ్డి. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని మడకశిర నియోజకవర్గం నుంచి మూడుసార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా కూడా పనిచేశారు. అయితే 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో మడకసిర ఎస్సీ రిజర్వుడు సీటుగా మారిపోయింది. 2009లో కల్యాణదుర్గం నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు.
రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో భూ స్థాపితం కావడంతో విభజన తర్వాత రాజకీయ సన్యాసం తీసుకుంటున్నట్లు ప్రకటించారు రఘువీరారెడ్డి. అయితే కర్నాటక ఎన్నికల సమయంలో అక్కడ ప్రచారం చేసి మళ్ళీ కాంగ్రెస్‌లో యాక్టివ్‌గా మారారు. ప్రస్తుతం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో సభ్యుడయ్యారు. తన రాజకీయ ఉనికి కోసం పాకులాడుతున్న రఘువీరారెడ్డి.. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటైనా సాధించేందుకు ఓ మాస్టర్ ప్లాన్ వేసినట్లు సమాచారం.
ఎస్సీ రిజర్వ్‌డ్ మడకశిర నియోజకవర్గంలో తన ముఖ్య అనుచరుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్‌ను బరిలో దించాలని భావిస్తున్నారు. ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేందుకు పక్క రాష్ట్రాల నేతలతో రఘువీరారెడ్డి సంప్రదింపులు జరుపుతున్నట్లు కాంగ్రెస్ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేసిన రఘువీరారెడ్డికి అక్కడి కాంగ్రెస్ పెద్దలతో సంబంధాలు ఉన్నాయి.
దీన్ని ఆసరాగా చేసుకుని మడకశిర నియోజకవర్గంలోని అన్ని మండలాలకు కర్నాటక మంత్రులను ఇంఛార్జులుగా తీసుకురావాలన్న ఆలోచనతో ఉన్నట్లు చెబుతున్నారు. మడకశిర ఆంధ్ర - కర్నాటక సరిహద్దు ప్రాంతంలో ఉంటుంది. ఇక్కడి ప్రజలు కన్నడ భాష కూడా మాట్లాడుతారు. దీంతో కర్నాటక రాష్ట్రానికి చెందిన ముఖ్య నేతలను మడకశిరకు తీసుకొచ్చి అన్నివిధాలుగా ఉపయోగించుకోవాలని రఘువీరారెడ్డి భావిస్తున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment