విద్యార్థుల అభీష్టమే ఫైనల్
సాక్షి, అమరావతి: కేంద్ర ప్రభుత్వం బుధవారం ఆమోదించిన నూతన విద్యా విధానం కేవలం మార్గదర్శకమే తప్ప విధిగా అమలుచేయాలన్న విధానపత్రం కానేకాదని న్యాయనిపుణులు, విద్యారంగ ముఖ్యులు స్పష్టం చేస్తున్నారు. విద్యార్థి కేంద్రంగా, విద్యార్థి అభీష్టం మేరకు మాత్రమే ఇది అమలుకావాల్సి ఉంటుందన్నది కొత్త విధానం సారాంశంగా స్పష్టమవుతోందని వారంటున్నారు. కొత్త విద్యా విధానం ద్వారా కేంద్రం మాతృభాషలో బోధనను తప్పనిసరి చేసిందంటూ కొన్ని పత్రికలు గురువారం ప్రచురించాయి. అయితే, న్యాయనిపుణులు మాత్రం అలా ఎక్కడా కేంద్రం చెప్పలేదని స్పష్టం చేస్తున్నారు. ఆంగ్ల మాధ్యమంలో బోధించాలంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అమలుకాబోదన్నట్లుగా కూడా ఆయా పత్రికలు అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తూ కథనాలు ప్రచురించడాన్ని వారు తప్పుబడుతున్నారు. వారేమంటున్నారంటే..
ఏ విధానాన్నీ రుద్దే పరిస్థితి ఉండదు
‘జాతీయ విద్యా విధానం అన్నది మార్గదర్శక సూత్రాలు కలిగిన డాక్యుమెంట్ మాత్రమే. అది ప్రతి రాష్ట్రానికీ అన్వయించే పరిస్థితులు, పాటించే పరిస్థితులు ఉంటే.. పాటించవచ్చు. రాష్ట్రాల పరిస్థితులు మేరకు, వారి వారి ఆకాంక్షల ప్రకారం దీన్ని పాటించవచ్చు. విద్య అన్నది కేంద్ర, రాష్ట్రాల ఉమ్మడి జాబితాలో ఉన్నందున కొత్త విద్యావిధానం అమలుకావాలంటే రాష్ట్రాల తోడ్పాటు కూడా అవసరమని కేంద్రం అందులో స్పష్టంగా చెప్పింది.
అందువల్ల ఎవ్వరి మీద కూడా దీన్ని బలవంతంగా రుద్దజాలమని కేంద్రం చెప్తోంది. కొత్త విద్యావిధానంలో ఇచ్చిన సూచనలు అన్నీ కూడా విద్యార్థుల అభీష్టాల మీద ఆధారపడి ఉంటాయి. ప్రైవేటు స్కూళ్లలోనూ తెలుగు మీడియం పెట్టాలని ఇటీవల ఏపీ ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ వేస్తే దాన్ని డివిజన్ బెంచ్ కొట్టేసింది. ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాల హక్కులకు భంగం కలిగించలేమని చెప్పింది. అంటే.. కొత్త విద్యావిధానం అన్నది సాధ్యాసాధ్యాల మీద ఆధారపడి ఉంటుంది’.. అని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం రాజ్యాంగ నిపుణుడు ఒకరు వ్యాఖ్యానించారు.
తప్పనిసరి కానే కాదు
‘ఏ పత్రంలోనైనా సాధ్యమైనంత వరకు, సాధ్యమైతే అని పేర్కొంటే అదెప్పుడూ తప్పనిసరి (మేండేటరీ) కాదు. కొత్త విధానంలో కూడా మాధ్యమం విషయంలో ‘యాజ్‌పార్ యాజ్ ప్రాక్టికబుల్’ అని పేర్కొన్నారు. ఆంగ్ల మాధ్యమం విషయంలో రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం కూడా మాధ్యమం మాతృభాషలోనే ఉండాలన్నది మేండేటరీ కాదు అది మార్గదర్శకమే అని హైకోర్టు కూడా స్పష్టంచేసింది. కానీ, విద్యార్థుల అభీష్టం మేరకు మాధ్యమాన్ని అమలుచేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. ఆ ప్రకారమే ప్రభుత్వం మాధ్యమంపై విద్యార్థుల అభిప్రాయాన్ని కోరితే 96 శాతానికి పైగా ఆంగ్ల మాధ్యమానికే ఆప్షన్ ఇచ్చారు. తెలుగు మీడియంను కోరుకున్న వారు 3.05 శాతం మంది ఉండగా ఇతర భాషా మాధ్యమాన్ని కోరుకున్న వారు 0.78 శాతం మంది ఉన్నారు. రాష్ట్రంలో కూడా విద్యార్థులు కోరుకున్న మాధ్యమమే అమల్లోకి వస్తుంది’.. అని మరో న్యాయనిపుణుడు అభిప్రాయపడ్డారు.
దేనినీ రుద్దడంలేదని కేంద్రం స్పష్టీకరణ
కేంద్రం ఒక పాలసీ పెట్టాలంటే దాన్ని ఎన్ఫోర్సు చేయదు. రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతోనే చేస్తుంది. ఇది అందరూ భాగస్వాములై అమలుచేయాల్సిన కార్యక్రమం తప్ప ఏదో ఒక ప్రభుత్వం ద్వారా అయ్యేది కాదు. నూతన విద్యావిధానం డాక్యుమెంటులో కూడా తాము ఏ భాషనూ రుద్దబోమని కేంద్రం చెప్పింది. ఆయా రాష్ట్రాలు సాధ్యాసాధ్యాలను చూసుకుని అమలుచేయాలని కేంద్రం సూచించింది. ముఖ్యంగా విద్యార్థి అభీష్టం ఏమిటో చూడమని స్పష్టంచేసింది.’ అని విద్యారంగ నిపుణుడు ఒకరు చెప్పారు.
సీఎం వైఎస్ జగన్ అమలుచేయనున్న అంశాలే కొత్త విధానంలోనూ..
రాష్ట్ర పాఠశాల విద్య, ఉన్నత విద్యాశాఖ అధికారులకు సీఎం వైఎస్ జగన్ పలు సమావేశాల్లో సూచించిన అంశాల్లో కొన్ని కేంద్ర నూతన విద్యావిధానంలో ఉండడం విశేషం. అవి..
► పాఠశాల విద్యలో నర్సరీ, పీపీ–1, పీపీ–2లను స్కూళ్లకు అనుసంధానం చేయాలని ఇంతకుముందే అధికారులను ఆదేశించి కార్యాచరణ చేపట్టారు.
► నూతన విద్యావిధానంలో పేర్కొన్న లెర్నింగ్ టు లెర్న్ అనేది ఇంతకుముందు అధికారుల సమావేశాల్లో సీఎం సూచించారు.
► పాఠశాల విద్యలో సెమిస్టర్ విధానం గురించి కూడా సీఎం ఇంతకుముందే అధికారులకు సూచనలు చేశారు. దాని ప్రకారం అధికారులు చర్యలు కూడా ప్రారంభించారు.
► డిగ్రీని నాలుగేళ్లుగా చేస్తూ ఒక ఏడాది ఇంటర్న్‌షిప్‌ను తప్పనిసరి చేసే ప్రణాళికను రూపొందింపజేశారు. యూజీసీ.. మూడేళ్లే డిగ్రీ ఉండాలంటే మూడేళ్లలోనే 10 నెలల పాటు ఇంటర్న్‌షిప్ ఉండేలా ప్రణాళిక సిద్ధంచేశారు.
► రాష్ట్రంలో పాఠశాల, ఉన్నత విద్యల నియంత్రణ, పర్యవేక్షణల కమిషన్లను ఏర్పాటుచేశారు.
► ఉన్నత విద్య పాఠ్య ప్రణాళికను పూర్తిగా మార్పు చేయించి అవుట్‌కమ్ బేస్డ్ పాఠ్య ప్రణాళికను తయారుచేయించారు.
► క్రెడిట్ బ్యాంకు అని నూతన విద్యావిధానంలో ఉండగా దానిని ఇంతకు ముందే రాష్ట్రం పెట్టింది.
పేదల జీవితాల్లో వెలుగులు
ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంతో పేద, బడుగు, బలహీన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపవచ్చు. ఏపీలో దాని అమలు పేద, మధ్య తరగతి విద్యార్థులకు దన్నుగా నిలుస్తోంది. – డాక్టర్ జి.మమత, అసిస్టెంట్ ప్రొఫెసర్, జేఎన్టీయూ అనంతపురం
ఇంగ్లిష్ వచ్చిన వారికే ఉద్యోగాలు
ప్రస్తుతం అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోనూ పిల్లలు ఇంగ్లిష్ మీడియం కావాలని కోరుతున్నారు. దాని ప్రాధాన్యతను తల్లిదండ్రులు తెలుసుకోవడంవల్లే తమ పిల్లల్ని ఆ మాధ్యమంలో చదివించాలనే నిశ్చితాభిప్రాయంతో ఉన్నారు. – పి. అశోక్‌కుమార్ రెడ్డి, ప్రధానోపాధ్యాయుడు, తాటిచెర్ల గ్రామం, అనంతపురం రూరల్ మండలం
ఆంగ్ల మాధ్యమాన్ని కొనసాగిస్తే మంచిది
రాష్ట్రంలో తల్లిదండ్రులు, విద్యార్థులు ఎక్కువమంది ఆంగ్ల మాధ్యమాన్ని కోరుకుంటున్నందున ఎవరికీ నష్టం జరగకుండా ఆంగ్ల మాథ్యమాన్ని కూడా కొనసాగిస్తే మంచిది. – జోసెఫ్ సుధీర్‌బాబు, ఎస్టీయూ అధ్యక్షుడు
కేంద్ర విధానం రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనను ప్రతిబింబిస్తోంది
నూతన విద్యావిధానంలో 3–6 సం.ల వయస్సున్న విద్యార్థులను ప్రీ ప్రైమరీ దశ కింద చేర్చడం చూస్తుంటే ఇదివరకే మన సీఎం చెప్పిన ప్రీ ప్రైమరి–1.. ప్రీ ప్రైమరీ–2 లకు పోలి ఉన్నట్లుగా ఉంది. ఇది పరిణితి చెందిన మన ప్రభుత్వ ఆలోచనకు నిదర్శనం. – కోమటిరెడ్డి రెడ్డి శివశంకర్, జి. చంద్రశేఖర్.. మోడల్ స్కూల్స్ ప్రోగ్రెసివ్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు
అట్టడుగు వర్గాలకు ఆంగ్ల బోధనతోనే ప్రయోజనం
ప్రభుత్వ పాఠశాలల్లో మొదటి నుంచే ఇంగ్లిష్ బోధన ఉంటే అట్టడుగు జాతులకు ఎంతో ప్రయోజనం. ప్రపంచంలో ఎక్కడ ఉద్యోగం చేయాలన్నా ఇంగ్లిష్ ఎంతో అవసరం. సీఎం వైఎస్ జగన్ ముందుచూపుతో ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. – పీటీ నరసింహారెడ్డి, రిటైర్డ్ ఎంఈఓ. అనంతపురం జిల్లా
ఆంగ్ల మాధ్యమమే కావాలి
నూతన విద్యావిధానంలో మాధ్యమాన్ని ఎంచుకునే స్వేచ్ఛను విద్యార్థికిచ్చారు. రాష్ట్రంలో తల్లిదండ్రుల నుంచి ఇటీవల సేకరించిన అభిప్రాయాల్లో 96 శాతం ఆంగ్లమాద్యమమే కావాలని కోరారు. మేమంతా మా ఆంగ్ల మాధ్యమ బోధననే కోరుకుంటున్నాం. – చింతల వెంకటసతీష్, 2వ తరగతి బాలిక తండ్రి, విజయనగరం
ఆంగ్లంతోనే బడుగులకు న్యాయం
ప్రాథమిక విద్య నుంచి ప్రభుత్వం అమలుచేస్తున్న ఆంగ్ల మాధ్యమం బహుజన వర్గాలకు అద్వితీయ అవకాశం. ఇంగ్లిష్ మీడియంలో చదవకపోవడంవల్ల ఇప్పటికీ నాకు దానిపై పట్టులేదు. రానున్న తరానికి ఆ సమస్య రాకూడదు. – బంకపల్లి శివప్రసాద్, టీచర్ ఎంపీపీఈ స్కూల్, గంట్యాడ మండలం, విజయనగరం జిల్లా
ఆంగ్ల మాధ్యమంతోనే భవితకు భరోసా
ఆంగ్లంపై పట్టులేని కారణంగా ఎంతోమంది తమ అవకాశాలను చేజార్చుకుంటున్నారు. ఆంగ్ల మాధ్యమం కోరుకున్న ప్రతి పిల్లవాడు ఆంగ్లంలో విద్యను అభ్యసించే అవకాశం రావాలి. తద్వారా భవితకు భరోసా ఉంటుంది. – గెద్ద సత్యన్నారాయణ, 4వ తరగతి విద్యార్ధి తండ్రి, బొండపల్లి, విజయనగరం జిల్లా
విద్యార్థి కోరుకున్న మాధ్యమమే మంచిది
నూతన విద్యావిధానాన్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదించినా అమలులో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక పరిస్థితులు, వనరులు దృష్టిలో పెట్టుకుని అమలుచేస్తాయి. రాష్ట్రంలో 96 శాతానికి పైగా విద్యార్థులు, తల్లిదండ్రులు ఆంగ్ల మాధ్యమం కోరుకున్నారు. ఆ మేరకు ఆంగ్ల మాధ్యమం పెడుతూనే ఇతర మాధ్యమాలు కోరుకున్న వారికి ఉంటే అనుకున్న లక్ష్యాలు నెరవేరుతాయి.– కత్తి నరసింహారెడ్డి, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ
ఇంగ్లిష్ అనివార్యం
ప్రతి విద్యార్థి ఆంగ్లంలో భావవ్యక్తీకరణ నైపుణ్యాలు పెంపొందించుకోవడం అనివార్యం. ప్రాథమిక స్థాయిలో నేర్చుకునే భాష జీవితాంతం ఉంటుంది. అంతర్జాతీయ స్థాయిలో పోటీపడాలంటే ఇంగ్లిష్‌లో పట్టు సాధించాలి. –డాక్టర్ మాధవి, అసిస్టెంట్ ప్రొఫెసర్, ఎస్కేయూ