న్యూఢిల్లీ: పరీక్షలు రద్దు అయిన నేపథ్యంలో ఖాళీ సమయాన్ని సృజనాత్మకంగా, నిర్మాణాత్మకంగా ఉపయోగించుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సీబీఎస్‌ఈ 12వ విద్యార్థులకు ఉద్బోధించారు. ‘పరీక్షలు రద్దు అయినందుకు చాలా సంతోషిస్తున్నట్లు కనిపిస్తోంది’ అంటూ వారితో చమత్కరించారు. పరీక్షల గురించి ఎప్పుడూ టెన్షన్ పడవద్దని సూచించారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో గురువారం కేంద్ర విద్యా శాఖ నిర్వహించిన ఒక ఆన్‌లైన్ ఇంటరాక్షన్ కార్యక్రమంలో ప్రధాని అకస్మాత్తుగా ప్రత్యక్షమై అందరినీ ఆశ్చర్యానందాలకు గురి చేశారు.
‘పరీక్షలను రద్దు చేయడంతో మీ ఆనందానికి హద్దులు లేనట్లు కనిపిస్తోంది’ అన్నారు. పరీక్షలు జరుగుతాయేమోనని ఆందోళన పడ్డారా? అన్న ప్రధాని ప్రశ్నకు విద్యార్థులు అవునని సమాధానమివ్వడంతో.. ‘అయితే పరీక్షలంటే ఆందోళన వద్దు అంటూ నేను రాసిన ఎగ్జామ్ వారియర్ పుస్తకం సత్ఫలితాలను ఇవ్వలేదన్నమాట’ అని వ్యాఖ్యానించారు. పరీక్షలు రద్దవడంతో ఈ ఖాళీ సమయాన్ని ఎలా గడపాలనుకుంటున్నారని విద్యార్థులను ప్రశ్నించారు. ‘ఐపీ ఎల్, చాంపియన్స్ లీగ్ చూస్తారా? ఒలింపిక్స్ కోసం ఎదురు చూస్తున్నారా?’ అని ప్రశ్నించారు. ఆరోగ్యంగా ఉండడానికి ఏం చేస్తున్నారని వారిని ప్రశ్నించారు. ఆరోగ్యమే మహాభాగ్యం అనే మం త్రాన్ని సదా గుర్తుంచుకోవాలన్నారు. పరీక్షల రద్దు నిర్ణయంతో ఊరట పొందామని పలువురు విద్యార్థులు ప్రధానికి తెలిపారు.
‘రద్దు నిర్ణయం వెలువడే వరకు ప్రిపరేషన్‌తో బిజీబిజీగా ఉండి ఉంటారు కదా!’ అన్న ప్రధాని మాటకు.. గువాహటికి చెందిన ఒక విద్యార్థి స్పందిస్తూ.. ‘పరీక్షలను పండుగలా భావించాలని గతంలో మీరు చెప్పిన విషయం గుర్తుంది’ అని చెప్పాడు. టాపర్‌గా ఉండాలనుకుని కష్టపడి చదివానని మరో విద్యార్థి తెలిపాడు. విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే పరీక్షలను రద్దు చేయాలని నిర్ణయించామని ప్రధాని తెలిపారు.
75 ఏళ్ల భారత స్వాతంత్య్రంపై ఒక వ్యాసం రాయమని ప్రధాని విద్యార్థులకు సూచించారు. పలువురు తల్లిదండ్రులు ప్రధానితో తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ‘పిల్లలు చాలా ఒత్తిడితో ఉన్నారు. పరీక్షల రద్దు సరైన సమయంలో తీసుకున్న సరైన నిర్ణ యం’ అని ఒక పేరెంట్ వ్యాఖ్యానించారు. కరోనా విజృంభణ నేపథ్యంలో సీబీఎస్‌ఈ 12వ తరగతి పరీక్షలను రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.
ఏ ప్రక్రియను అనుసరిస్తారు..?
రెండు వారాల్లో తెలపండి: సుప్రీంకోర్టు
12వ తరగతి ఫలితాల వెల్లడికి ఏవిధమైన ప్రక్రియను అవలంబిస్తారో రెండు వారాల్లో తెలపాలని సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈలను సుప్రీంకోర్టు ఆదేశించింది. న్యాయవాది మమత శర్మ దాఖలు చేసిన పిటిషన్‌ను గురువారం విచారించి, ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment