కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను రూపొందించేందుకు అన్ని చర్యలూ తీసుకుంటున్నామని చెబుతున్న పాలకులు ఆ దిశగా అమలు చేసేది శూన్యంగానే కనిపిస్తుంది. పాఠశాలల పునఃప్రారంభం నాటికే ప్రైవేటు పాఠశాలలకు పోటీగా పాఠ్య పుస్తకాలు, ఏకరూప దుస్తులు అందిస్తామని ఏటా చెప్పే పాలకులు దాన్ని అమలు చేయడంలో శ్రద్ధ చూపడం లేదు. దీంతో ఏటా విద్యార్థులకు అవస్థలు తప్పడం లేదు.
రామభద్రపురం(బొబ్బిలి): పాఠశాలలకు మౌలిక వసతుల సంగతి పక్కన పెడితే కనీసం విద్యార్థులు ధరించే యూనిఫారాలు, చదివేందుకు పాఠ్య పుస్తకాలైనా సకాలంలో అందించాల్సి ఉంది. కానీ ఆ పని కూడా పాలకులు చేయడం లేదు. దీంతో పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. చివరకు వచ్చేసరికి ఆ నెపాన్ని వేరే రూపంలో ఉపాధ్యాయులపై నెడుతూ పాలకులు పబ్బం గడుపుతున్నారు. మరో పది రోజుల్లో పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ఇప్పటి వరకు పాఠ్య పుస్తకాలుగాని, ఏకరూప దుస్తులుగాని మండల విద్యాశాఖ కార్యాలయాలకు చేరుకోలేదు. దీంతో అగమ్యగోచర పరిస్థితి నెలకొంది. ఏకరూప దుస్తుల విషయానికొస్తే గత విద్యా సంవత్సరానికి సంబంధించి విద్యా సంవత్సరం ఆఖరిలో ఫిబ్రవరి, మార్చి నెలల్లో విద్యార్థులకు పంపిణీ చేశారు. ఇదే పరిస్థితి ఈ ఏడాది కూడా తప్పేలా లేదు.
జిల్లాలో ప్రభుత్వ, ఎయిడెడ్ ప్రాథమిక పాఠశాలలు 2199, ప్రాథమికోన్నత పాటశాలలు 240, ఉన్నత పాఠశాలలు 378 ఉన్నాయి. వీటిలో ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు రెండు లక్షల 17వేల మంది ఉన్నారు. ఒకటో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు చదువుతున్న పిల్లలకు మాత్రమే ఏకరూప దుస్తులు ప్రభుత్వం అందిస్తుంది. వీరు లక్షా 61 వేల ఉన్నారు. ఒక్కో విద్యార్థికి రెండు జతల చొప్పున మూడు లక్షల 22 వేల దుస్తులు అవసరం ఉంది. పాఠశాలలు తెరిచే సరికే వీటిని పంపిణీ చేయాల్సి ఉంది.
నిబంధనల ప్రకారం ఆప్కో ద్వారా దుస్తులకు అవసరమైన క్లాత్ సరఫరా చేసి స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీలకు అప్పగించి వారి ద్వారానే స్థానికంగా ఉన్న దర్జీలతో దుస్తులు కుట్టించాలి. కానీ ప్రభుత్వం అలా చేయకుండా ప్రైవేటు సంస్థలకు ఆ బాధ్యత అప్పగించడంతో సకాలంలో ఏకరూప దుస్తులు అందడం లేదని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.ఈ కారణంగానే విద్యార్థులకు దుస్తులు విద్యా సంవత్సరం ఆఖరిలో అందుతున్నాయని పేర్కొంటున్నారు.
ఏకరూప దుస్తులు అందేనా?
Published Fri, Jun 2 2017 3:05 AM | Last Updated on Tue, Sep 5 2017 12:34 PM
Advertisement
Advertisement