కార్పొరేట్‌ దోపిడీ అంతింత కాదయా!  | Corporate Schools Do Not Follow Regulations | Sakshi
Sakshi News home page

కార్పొరేట్‌ దోపిడీ అంతింత కాదయా! 

Published Fri, Jul 3 2020 6:52 AM | Last Updated on Fri, Jul 3 2020 6:56 AM

Corporate Schools Do Not Follow Regulations - Sakshi

నగరంలోని అన్నమయ్య సర్కిల్‌ సమీపంలో ఉన్న ఓ కార్పొరేట్‌ విద్యాసంస్థలో ఒకటో తరగతి చదువుతున్న విద్యారి్థ దగ్గర పుస్తకాల పేరుతో యాజమాన్యం రూ.6,200  వసూలు చేసింది. ప్రస్తుతం లాక్‌డౌన్‌ సమయంలో బుక్స్‌ వాడడం లేదు కదా అని ప్రశి్నస్తే ఆన్‌లైన్‌లో క్లాసులు వింటూ బుక్స్‌ ఉపయోగించాలని సమాధానమిచ్చారు. గత్యంతరం లేక తల్లిదండ్రులు డబ్బులు చెల్లించారు. 

మినీబైపాస్‌లో ఉన్న మరో కార్పొరేట్‌ స్కూల్‌లో ఆరో తరగతి చదువుతున్న విద్యార్థి (ఒలంపియాడ్‌)కి ప్రమోషన్‌ పేరుతో రూ.5 వేలతో పాటు బుక్స్‌కు రూ.8,160 వసూలు చేశారు. అసలే కరోనా కష్టకాలంలో చేతిలో డబ్బులేకపోయినా అప్పు చేసి మరీ బుక్స్‌ కొనుగోలు చేయాల్సి వచ్చింది. అందులో టెక్ట్స్‌బుక్స్‌ లేవు. కేవలం నోట్‌ బుక్స్‌ పేరుతో వేలకు వేలు గుంజుతున్నారు. టెక్ట్స్‌ బుక్స్‌కు అదనం.  

సాక్షి, నెల్లూరు:  కరోనా విపత్తుతో ప్రజలు అల్లల్లాడుతుంటే మరో వైపు కార్పొరేట్‌ విద్యా సంస్థలు దోపిడీలకు తెగబడుతున్నాయి. వీరి ఆగడాలకు కళ్లెం వేసేందుకు ఓ వైపు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడతున్నా, జిల్లా విద్యాశాఖ అధికారుల అవినీతిని అడ్డం పెట్టుకుని కార్పొరేట్‌ విద్యా మాఫియా చెలరేగిపోతోంది.    

కరోనా కారణంగా తల్లిదండ్రులు ఉద్యోగాలు, ఉపాధి కోల్పోయి అరకొర వేతనాలతో బతుకు బండి లాగించడం కష్టంగా ఉన్న సమయంలో కార్పొరేట్‌ విద్యా సంస్థలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. 
నిబంధనలు ఉల్లంఘించి విద్యార్థులకు ఆన్‌లైన్‌ క్లాసుల నిర్వహణ పేరుతో గతం కంటే అధికంగా ఫీజులు వసూలు చేస్తున్నారు. 
ఆయా పాఠశాలల్లో పనిచేసే ప్రైవేట్‌ ఉపాధ్యాయులతో పాటు నాన్‌ టీచింగ్‌ స్టాఫ్‌కు కూడా అడ్మిషన్లకు టార్గెట్లు విధించి విద్యార్థులను చేరి్పంచే పని చేయిస్తున్నారు. 
విద్యార్థులను చేర్చుకొనే సమయంలో టెక్నో, ఈ టెక్నో, ఒలంపియాడ్‌ అంటూ ఆకర్షణీౖయెన పేర్లు చూపి గతేడాది మాదిరిగానే అధిక ఫీజులను వసూలు చేస్తున్నారు. 
కొత్త, పాత విద్యార్థులు తమ విద్యాసంస్థల్లోనే నోట్‌ బుక్‌లు, యూనిఫాం, షూస్, ఇతర మెటీరియల్‌ కొనాలని వేలకు వేలు గుంజుతున్నారు. టెక్ట్స్‌ బుక్స్‌కు మాత్రం అదనం.     

అనుమతి లేకున్నా.. 
జిల్లాలో 1,065 ప్రైవేట్, కార్పొరేట్‌ స్కూళ్లు ఉన్నాయి. వీటిలో 385 ప్రాథమిక, 287 ప్రాథమికోన్నత, 385 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ఆయా పాఠశాలల్లో 1.80 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. వీటితో పాటు అనుమతి లేని మరో 500 ప్రైవేట్, కార్పొరేట్‌ స్కూళ్లు నిర్వహిస్తున్నారు.

కరోనా మహమ్మరి విజృంభిస్తుంది. విద్యా సంస్థలకు లాక్‌డౌన్‌ అమలవుతున్న క్రమంలో పదో తగరతి, ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు కూడా రద్దు చేశారు. ఈ తరుణంలో జిల్లాలోని పలు కార్పొరేట్, ప్రైవేట్‌ విద్యాసంస్థలు విద్యార్థుల కోసం వేట మొదలు పెట్టారు.  
ఐఐటీ ఒలంపియాడ్, టెక్నో, కాన్సెప్‌్ట, ఈ–టెక్నో, ఈ–శాస్త్ర, కాన్వెంట్, పబ్లిక్‌ స్కూల్‌ వంటి ఆకర్షణీమైన పేర్లతో నిర్వహిస్తున్న అధిక విద్యాలయాల్లో పాఠశాల విద్యాశాఖ నిబంధనలు పాటించడం లేదు.  
కనీస వసతులు కూడా లేకుండా అపార్ట్‌మెంట్లలో పాఠశాలలు, కళాశాలల నిర్వహణ చేస్తున్నారు. అనుమతులు ఒక చోట ఉంటే.. మరో చోట విద్యా సంస్థలు నిర్వహిస్తున్నారు.  
గత ప్రభుత్వ హయాంలో కార్పొరేట్‌ స్కూళ్ల మాఫియా ఆగడాలకు అంతులేకుండా పోయింది. వీరు నిర్ణయించిందే స్కూల్‌ ఫీజు. నిబంధనలకు విరుద్ధంగా నోట్‌ బుక్స్, యూనిఫాం, షూస్‌ విక్రయాలు నిరాటంకంగా జరుగుతున్నాయి.  

నోట్‌ బుక్స్‌ వ్యాపారమే రూ.100 కోట్లు! 
జిల్లాలో విద్యా సంస్థలు విద్యార్థుల చేత ఏటా కొనిపించే నోట్‌ బుక్స్‌ వ్యాపారం రూ.150 కోట్ల పైమాటే. ఒలంపియాడ్‌ స్థాయి పాఠశాలల్లో 6,7 తరగతులకు రూ.8,160, 8 నుంచి 10వ తరగతులకు రూ.8,800 వంతున వసూలు చేస్తున్నారు.  

ఇక ఈ–టెక్నో, టెక్నో స్థాయి విద్యా సంస్థలు 6, 7 తరగతులకు రూ.6,200, 8 నుంచి 10వ తరగతులకు రూ.6,750 లెక్కన ముక్కు పిండి వసూలు చేస్తున్నారు.  
ఆయా విద్యా సంస్థల్లో చదువుతున్న విద్యార్థుల సంఖ్య ప్రకారం వారి వద్ద వసూలు చేస్తున్న మొత్తాన్ని లెక్కిస్తే సుమారు రూ.100 కోట్ల పైమాటే ఉంటుంని అంచనా. 

యూనిఫాం, షూస్‌ వ్యాపారం డబుల్‌ 
ఆయా పాఠశాలల్లో చదివే పిల్లలు తమ యూనిఫాం మాత్రమే కొనాలని షరతులు పెడుతున్నాయి. ఇందు కోసం ఏటా ఒక్కొ విద్యారి్థకి రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు వసూలు చేస్తున్నారు. ఈ లెక్కన సుమారు రూ.200 కోట్లు ఉంటుందని అంచనా.   

ఫీజుల గుంజుడు  
జిల్లాలో కార్పొరేట్, ప్రైవేట్‌ పాఠశాలలు, కళాశాలల్లో అధికంగా ఫీజులను గుంజుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఐఐటీ ఒలంపియాడ్, టెక్నో, కాన్సెప్ట్, ఈ–టెక్నో, ఈ–శాస్త్ర, కాన్వెంట్, పబ్లిక్‌ స్కూల్‌ తదితర ఆకర్షణీయ పేర్లతో భారీగా ఫీజులు వసూలు చేస్తున్నారు.  
కొన్ని కార్పొరేట్‌ స్కూళ్లలో ఒలంపియాడ్‌ పేరుతో 6వ తరగతి చదివే విద్యారి్థకి రూ.80 వేలు వంతున వసూలు చేస్తున్నారు. 
ప్లేక్లాస్‌ చదివే విద్యార్థి నుంచి స్కూల్‌ను బట్టి రూ.20 వేల నుంచి రూ.1.5 లక్షల వరకు ఫీజులు పిండుతున్నారు.  
ఆరో తరగతి విద్యార్థికి అయితే రూ.80 వేల నుంచి రూ.1.5 లక్షల వరకు ఫీజులు వసూలు చేస్తున్నారు. 
విద్యార్థి జాయిన్‌ చేసిన వారం రోజుల నుంచే అడ్మిషన్‌ నంబర్‌ కోసం 60 శాతం ఫీజులు చెల్లించాలంటూ విద్యార్థుల తల్లిదండ్రులపై తీవ్రంగా ఒత్తిడి పెంచుతున్నారు. 
సామాన్యులు సకాలంలో ఫీజులు చెల్లించకపోతే వారిని నానా రకాలుగా మాటలతో ఇబ్బందులు పెడుతున్న ఘటనలు ఉన్నాయి. పిల్లల భవిష్యత్‌ కోసం గత్యంతరం లేక కార్పొరేట్‌ మాఫియా ఒత్తిడితో అప్పులు తెచ్చి మరీ ఫీజులు చెల్లిస్తున్నారు.  

ఫీజులకు ప్రభుత్వం కళ్లెం వేస్తున్నా..  
వివిధ రకాల పేర్లతో రూ.లక్షల్లో ఫీజులు దండుకుంటున్న కార్పొరేట్‌ విద్యా సంస్థల భరతం పట్టేందుకు ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది.  
వసతులు ఏర్పాటు చేయకుండా నిబంధనలు పాటించకుండా ఇష్టారాజ్యంగా విద్యాసంస్థలు నిర్వహిస్తూ ఆగడాలకు పాల్పడుతున్న యాజమాన్యాలకు ముకుతాడు వేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది.  
కార్పొరేట్, ప్రైవేట్‌ విద్యాసంస్థల్లో వసతులు, వనరుల సమగ్ర సమాచారాన్ని ఫొటోలతో అన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయాలని ఏపీ పాఠశాలల ఫీజు రెగ్యులేటరీ మానిటరింగ్‌ కమిషన్‌ ఆదేశించింది.  
అయితే తమ బండారాలు బయట పడతాయన్న సాకుతో కార్పొరేట్‌ మాఫియా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తోంది. 
ప్రభుత్వం కార్పొరేట్‌పై చర్యలు తీసుకుంటుంటే జిల్లా విద్యాశాఖ అ«ధికారులు మాత్రం ఆ సెక్టార్‌కు దాసోహమై తనిఖీలు చేయడం మానేశారు. దీంతో ఆ విద్యాసంస్థల యాజమాన్యాలు మాత్రం తమ తీరును మార్చుకోకుండా యథావిధిగా దోపిడీ చేస్తున్నారు.   

అమలు కానీ నిబంధనలు  
పదో తరగతి లోపు విద్యార్థుల నుంచి ఏటా రూ.15 వేల వరకు ఫీజులు వసూలు చేసేందుకు అవకాశం ఉంది. పలు పాఠశాలల్లో రూ.80 వేలు కూడా వసూలు చేస్తున్నారు 
జీఓ నంబర్‌ 1  1984 ప్రకారం విద్యార్థులకు వసతులు క్రీడాప్రాంగణాన్ని ఏర్పాటు చేయాలి 
జీఓ నంబర్‌ 88/2008 ప్రకారం 200 మంది విద్యార్థులు ఉంటే క్రీడా ప్రాంగణాన్ని ఏర్పాటు చేయాలి. 
అగ్ని ప్రమాదాల నుంచి  నుంచి రక్షణ చర్యలు తీసుకోవాలి. 
2009 విద్యాహక్కు చట్టాన్ని అనుసరించి ప్రైవేట్‌ విద్యాసంస్థల్లో 25 శాతం పేద విద్యార్థులకు ఉచిత విద్యనందించాలి.   

పుస్తకాలు అమ్మితే చర్యలు 
నెల్లూరు (టౌన్‌): కార్పొరేట్, ప్రైవేట్‌ పాఠశాలల్లో పాఠ్యపుస్తకాలు అమ్మితే చర్యలు తీసుకుంటామని డీఈఓ జనార్దనాచార్యులు ఒక ప్రకటనలో హెచ్చరించారు. కొంత మంది అమ్ముతున్నట్లు విద్యార్థుల తల్లిదండ్రులు తమ దృష్టికి తీసుకు వచ్చారని చెప్పారు. ఈ ప్రభుత్వ ఉత్తర్వులను ఏ పాఠశాల యాజమాన్యమైన ఉల్లంఘించినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.     

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement