సాక్షి, హైదరాబాద్: కోవిడ్ విసిరిన పంజాతో చిన్నారులు బడి అడుగులు మాని ఆన్‌లైన్ చదువుల బాట పట్టారు. దీనిని ఆసరాగా చేసుకున్న కార్పొరేట్ స్కూళ్ల యాజమాన్యాలు పుస్తకాలు, స్టేషనరీతోపాటు ట్యాబ్స్, ల్యాప్‌ట్యాప్స్ సైతం తమ వద్దే కొనుగోలు చేయాలని తల్లిదండ్రులను ఒత్తిడి చేస్తున్నాయి. తమ దగ్గర కొనుగోలు చేసిన ఎలక్ట్రానిక్ ఉపకరణాల్లో తమ పాఠశాల, సిలబస్‌కు అనుగుణంగా ఉండే యాప్స్, పాఠాలు సులభంగా యాక్సెస్ చేసేందుకు అనువైన సాఫ్ట్‌వేర్ ఉంటుందని నమ్మిస్తున్నాయి. అయితే ఈ పరిణామం పలువురు విద్యార్థుల తల్లిదండ్రులకు భారంగా పరిణమిస్తోంది. (ఇంటర్‌లో గ్రేస్ మార్కులు)
మీ పిల్లలు మార్కులు కోల్పోతారంటూ...
ప్రవీణ్ కుమార్తె ఓ కార్పొరేట్ పాఠశాలలో ఆరో తరగతి చదువుతోంది. ఇటీవల పాఠశాల యాజమాన్యం తమ వద్ద ట్యాబ్లెట్ కొనుగోలుచేయాలని, ఆరునెలల ఫీజును చెల్లించాలని అతనికి సందేశం పంపించింది. ఇక సుకుమార్ పిల్లలు సైతం మరో కార్పొరేట్ పాఠశాలలో 7,8 తరగతులు చదువుతున్నారు. వారి పాఠశాల యాజమాన్యం కూడా తమ వద్దే్ద ల్యాప్‌ట్యాప్, స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలని కబురు పంపింది. ఇలా పలు పాఠశాలల యాజమాన్యాలు ఎలక్ట్రానిక్ ఉపకరణాలను విధిగా తమ వద్ద కొనుగోలు చేయాల్సిందేనని తల్లిదండ్రులపై ఒత్తిడి చేస్తున్నాయి. లేనిపక్షంలో మీ పిల్లలు గ్రేడ్లు, మార్కులు కోల్పోవాల్సి వస్తుందని..చదువులో వెనకబడతారని హెచ్చరికలు జారీచేస్తుండడం గమనార్హం.
ఇదో తరహా వ్యాపారం..
ఇటీవల మనోహర్‌కు తన కుమార్తె 8వ తరగతి చదివే పాఠశాల నుంచి మెసేజ్ వచ్చింది. ట్యాబ్లెట్ ద్వారా విద్యార్థిని పాఠాలు వినేందుకు రూ.25 వేల ఫీజు చెల్లించాలని కోరింది. ఇందులో రూ.7500 ట్యాబ్లెట్ ఖర్చు అని పేర్కొంది. ఫీజు చెల్లించని పక్షంలో ట్యాబ్లెట్ ఇవ్వబోమని చెప్పింది. ఈ ట్యాబ్లెట్‌లో పాఠ్యాంశాలకు సంబంధించి ప్రీ లోడెడ్ కంటెంట్, అత్యుత్తమ సాఫ్ట్‌వేర్ ఉందని నమ్మించింది. ఈ ట్యాబ్లెట్ భవిష్యత్‌లో ఈ–ఎగ్జామ్స్ రాసేందుకు కూడా ఉపయుక్తంగా ఉంటుందని పేర్కొనడం గమనార్హం.
అంతటా అదే సీన్..
ప్రైవేటు పాఠశాలలే కాదు.. కేంద్రీయ విద్యాలయాలు సైతం ఇదే రీతిన ఎలక్ట్రానిక్ గ్యాడ్జట్ల వ్యాపారానికి తెరలేపడం గమనార్హం. ల్యాప్‌ట్యాప్‌లయితేనే మేలని..ఫోన్ల ద్వారా అయితే స్పష్టత ఉండదని కొన్ని పాఠశాలల యాజ మాన్యాలు చెబుతున్నాయి. పాఠశాలల నయా వ్యాపారంతో ఇద్దరు ముగురు పిల్లలున్న వారికి మూడు ల్యాప్‌ట్యాప్ లు కొనుగోలు చేయడం గగనమౌతోంది. తాజా ట్రెండ్ నేపథ్యంలో తెలంగాణా రికగ్నైజ్డ్ స్కూల్స్ మేనేజ్‌మెంట్స్ అసోసియేషన్ (టీఆర్‌ఎస్‌ఎంఏ) కూడా రంగంలోకి దిగింది. ఎలక్ట్రానిక్ ఉపకరణాలు కొనుగోలు చేయాలనుకున్న తల్లిదండ్రులకు లోన్లు ఇప్పిస్తున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. ఇంత జరుగుతున్నా... జిల్లా విద్యాశాఖ అధికారులు మాత్రం తమకు పాఠశాలల యాజమాన్యా లు చేస్తున్న ఎలక్ట్రానిక్ గాడ్జెట్ల వ్యాపారంపై తమకు ఎ లాంటి ఫిర్యాదులు అందలేదని పేర్కొనడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment