ఈ ఫోటోలో బర్రెలు కాస్తున్న విద్యార్థి కడారి శివ. సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం అర్వపల్లి. ఓ ప్రైవేట్ పాఠశాలలో అతను 7వ తరగతి, అక్క నందీశ్వరి 8వ తరగతి చదువుతున్నారు. ఇంట్లో ఒకే స్మార్ట్‌ఫోన్ ఉంది. ఇద్దరూ పాఠాలు వినలేని పరిస్థితి. దీనితో నందీశ్వరి పాఠాలకు హాజరవుతుండగా.. శివ బర్రెలు కాయడానికి వెళుతున్నాడు. (పాపం పసివాళ్లు.. ఆన్‌లైన్ పాఠాల్లేవ్.. పనులే)
స్మార్ట్ ఫోన్లు లేక.. పశువులు కాస్తూ..
ఈ ఫొటోలో ఉన్నది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం కొత్తమారేడుబాకకు చెందిన విద్యార్థులు కల్లూరి సాయి, వర్షసాగర్. ఆన్‌లైన్ క్లాసులు వినడానికి స్మార్ట్‌ఫోన్‌లు లేక పశువులు కాసేందుకు వెళ్తున్నారు.
సిగ్నల్ సరిగా లేక పొలానికి..
నిర్మల్ జిల్లా కుంటాల మండలం దౌనెల్లికి చెందిన పుష్పలత –భూషణ్ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. ఇద్దరు బిడ్డలు రుత్విక, కార్తీక ఓ ప్రైవేటు పాఠశాలలో చదువుతున్నారు. గ్రామంలో సెల్‌ఫోన్ సిగ్నల్ సరిగా రాక ఆన్‌లైన్ క్లాసులు వినే పరిస్థితి లేదు. దానికితోడు ఇద్దరూ చిన్న పిల్లలు కావడంతో తల్లిదండ్రులు పొలానికి తీసుకెళ్తున్నారు.
తండ్రితో కలిసి పశువుల వెంట..
ఈ ఫోటోలోని విద్యార్థి మల్లెబోయిన వరుణ్. సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం అర్వపల్లిలోని ప్రభుత్వ పాఠశాలలో 6వ తరగతి చదువుతున్నాడు. పాఠశాలలు లేకపోవడం, ఆన్‌లైన్ క్లాసులకు హాజరవడంతో ఇబ్బందులతో తండ్రితో కలిసి పశువులు, మేకలు కాయడానికి వెళ్తున్నాడు. తల్లిదండ్రులతో కలిసి బావి వద్ద చిన్నచిన్న వ్యవసాయ పనులు చేస్తున్నాడు.
వీడియోలు చూస్తున్నాడని...
మంచిర్యాల జిల్లా ధర్మారం శివార్లలోని పొలాల వద్ద పత్తిచేనులో కలుపుమొక్కలు తీస్తున్న బాలుడి ఇతను. స్మార్ట్‌ఫోన్ ఇస్తే ఆన్‌లైన్ క్లాసులు వినకుండా వీడియోలు చూస్తున్నాడని, ఇంట్లో ఉండకుండా తిరుగుతున్నాడని.. అందుకే పత్తి చేనుకు తీసుకొచ్చి పనిచెప్పామని కుటుంబీకులు చెప్తున్నారు.
ఇంటిపెద్ద కరోనాకు బలవడంతో..
ఈ ఫొటోలో ఉన్న మహిళ నిర్మల, కుమారుడు నితిన్, కూతురు నిఖిత. వారిది సిద్ధిపేట జిల్లా గజ్వేల్ మండలం అక్కారం. ఆమె భర్త భాస్కర్ మూడు నెలల కింద కరోనా బారినపడి మృతి చెందాడు. ఆయన చికిత్స కోసమని చేసిన రూ.3 లక్షల అప్పులు తీర్చాల్సిన బాధ్యత, ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న ఇద్దరు పిల్లలు, వృద్ధురాలైన అత్తను పోషించాల్సిన బాధ్యత ఆమెపై పడింది. ఆన్‌లైన్ క్లాసులు సరిగా అర్థంకావడం లేదని పిల్లలు చెప్పడంతో.. ఆర్థిక ఇబ్బందులైనా తప్పుతాయన్న ఉద్దేశంతో వారిని వ్యవసాయ పనులకు తీసుకెళ్తున్నట్టు నిర్మల ఆవేదన వ్యక్తం చేసింది. బడులు తెరిస్తే పంపిస్తానని తెలిపింది.
తాంసిలో కలుపు మొక్కలు తీస్తున్న సాయితేజ
ఆదిలాబాద్ జిల్లా తాంసి మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో సాయితేజ 8వ తరగతి చదువుతున్నాడు. ఆన్‌లైన్ పాఠాలు వినడానికి సెల్‌ఫోన్ లేకపోవడంతో తల్లిదండ్రులతో కలిసి పంట చేనుకు వెళ్తున్నాడు. తల్లిదండ్రులతో కలిసి కలుపు మొక్కలు తీస్తూ కనిపించాడు.
పత్తి చేనులో కలుపుతీస్తూ..
మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం నాగారానికి చెందిన శ్రీను, వంశీ, అఖిల్, జైతు బుధవారం పత్తి చేన్లలో కలుపు తీస్తూ కనిపించారు. ఆన్‌లైన్ క్లాసులు వినడం లేదా? అని ప్రశ్నించగా.. ‘క్లాసులు సరిగా జరగడం లేదు, వ్యవసాయ పనులకే వెళ్తున్నాం’ అని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment