విలీనం తప్పదా! | Danger to the survival schools | Sakshi
Sakshi News home page

విలీనం తప్పదా!

Published Mon, Jun 23 2014 2:54 AM | Last Updated on Sat, Sep 2 2017 9:13 AM

విలీనం తప్పదా!

విలీనం తప్పదా!

- ప్రమాదంలో పాఠశాలల మనుగడ
- విద్యార్థులు లేకపోవటమే కారణం
- 272 ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య 20 లోపే
- 20 ఎయిడెడ్ పాఠశాలలదీ అదే పరిస్థితి

 ఏలూరు సిటీ : ప్రయివేట్, కార్పొరేట్ పాఠశాలలు దినదినాభివృద్ధి చెందుతుంటే సర్కారీ బడుల్లో రోజురోజుకూ విద్యార్థుల సంఖ్య పడిపోతోంది. కార్పొరేట్ స్కూల్స్‌కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తామంటూ పాలకులు బీరాలు పలుకుతూనే ఉన్నారు. కనీస సౌకర్యాలులేక ప్రభుత్వ పాఠశాలలు తల్లిదండ్రుల మన్ననలు పొందలేకపోతున్నాయి. ప్రభుత్వం విద్యారంగంపై ఎన్నో నిధులు వెచ్చిస్తున్నా ఫలితం ఉండటం లేదనే విమర్శలు ఉన్నాయి.

20 మంది పిల్లలు కూడా లేని ప్రాథమిక పాఠశాలలు జిల్లాలో 272 ఉన్నాయి. భవిష్యత్తులో ఈ పాఠశాలలు కనుమరుగయ్యే ప్రమాదం పొంచి ఉందనే సంకేతాలు వస్తున్నాయి. ఉన్నత పాఠశాలల స్థితి ఆశాజనకంగా ఉన్నా ప్రాథమిక పాఠశాలలు ఉసూరుమంటున్నాయి. నిపుణులైన బోధనా సిబ్బంది ఉన్నా విద్యార్థులు, తల్లిదండ్రులను ఆకట్టుకోలేక దిగాలుపడున్నాయి.
 
ఎయిడెడ్ స్కూల్స్‌కూ ప్రమాద ఘంటికలు
 జిల్లాలోని పలు ఎయిడెడ్ పాఠశాలలకూ ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. కనీస సంఖ్యలో విద్యార్థులు లేకుండానే పాఠశాలలు నడుపుతున్నారు. జిల్లాలో సుమారు 20 ఎయిడెడ్ ప్రాథమిక పాఠశాలల్లో 20మంది పల్లలు కూడా లేకుండా నీరసించిపోతున్నాయి. చింతలపూడి, లింగపాలెం, ఉంగుటూరు, పెదపాడు, ఏలూరు రూరల్, ఉండి, ఆకివీడు, కాళ్ళ, భీమవరం ప్రాంతాల్లోని ఎయిడెడ్ స్కూల్స్ కొన్నింటిలో పిల్లలు లేరని విద్యాశాఖ నివేదికలో వెల్లడైంది. ఇప్పటికే ఎయిడెడ్ స్కూల్స్‌లో టీచర్ పోస్టుల భర్తీపై నిషేధం ఉండడంతో ఉపాధ్యాయుల కొరత వేధిస్తోంది. టీచర్లు లేక పాఠశాలలు సైతం డీలాపడుతున్నాయి.
 
విలీనమే మార్గం
ప్రాథమిక పాఠశాలల్లో పిల్లలు లేరు. ప్రభుత్వ ఆదేశాలు రావటమే తరువాయి పిల్లలు లేని పాఠశాలలకు తాళాలు వేయటమే. రెండు, మూడు విలీనం చేసేస్తారు.  నాలుగైదు సంవత్సరాలుగా ఇదేతంతు జరుగుతోంది. ఈ ఏడాది చూస్తే జిల్లాలో 20మందికంటే తక్కువ పిల్లలు ఉన్న ప్రాథమిక పాఠశాలలు 272ఉంటే, 30మంది  కంటే తక్కువ ఉన్న పాఠశాలలు 165 వరకు ఉన్నాయి. ఈ జాబితాలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలే అధికంగా ఉన్నాయి. విద్యార్థులు ఎక్కువ ఉన్న పాఠశాలలకు సరిపడినంత మంది ఉపాధ్యాయులు లేకపోవటం, 10మంది పిల్లలకే ఇద్దరు ముగ్గురు టీచర్లు ఉన్న పరిస్థితీ ఉంది.

విద్యకు దూరమౌతున్న గిరిజన చిన్నారులు
జిల్లాలో గిరిజన సంక్షేమ పాఠశాలలు పరిస్థితి దారుణంగా ఉంది. గిరిజన ప్రాంతాల్లోని ప్రాథమిక పాఠశాలలు పిల్లలు లేక మూతపడే స్థితికి చేరుకున్నాయి. గత ఏడాది గిరిజన ప్రాంతాల్లో సుమారు 30 ప్రాథమిక పాఠశాలలను పిల్లలు లేని కారణంగా సమీప పాఠశాలల్లో విలీనం చేశారు. అంటే ఉన్న ఊరులో పాఠశాలకు వెళ్లే  పిల్లలు పక్క ఊరికి వెళ్లాల్సి ఉంటుంది.

ఈ విద్యాసంవత్సరంలో పరిస్థితి పరిశీలిస్తే గిరిజన సంక్షేమ శాఖ యాజమాన్యంలోని 72 ప్రాథమిక పాఠశాలల్లో కనీసం 20మంది పిల్లలు కూడా లేరు. జీలుగుమిల్లి మండలంలో 15 ప్రాథమిక పాఠశాలలు, బుట్టాయిగూడెం మండలంలో 50, పోలవరం మండలంలో 19, గోపాలపురం మండలంలో 3, కొయ్యలగూడెం మండలంలో 4, జంగారెడ్డిగూడెం మండలంలో 3, టి.నరసాపురం మండలంలో 9 పాఠశాలలు ఈ జాబితాలో ఉన్నాయి. గిరిజన చిన్నారులు ప్రభుత్వ పాఠశాలలకు దూరమౌతున్నారా? లేక గిరిజనులకు ప్రాథమిక విద్య దూరమౌతోందా? అనేది పరిశీలించాల్సి అంశం. ఇదే పరిస్థితి కొనసాగితే కొద్దికాలంలోనే ఆయా ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలలు లేని పరిస్థితి ఏర్పడినా ఆశ్చర్యపోనక్కరలేదు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement