ఆన్‌లైన్‌ విద్యతో లక్ష్యాలు నెరవేరేనా! | Government teaching to students in three ways | Sakshi
Sakshi News home page

ఆన్‌లైన్‌ విద్యతో లక్ష్యాలు నెరవేరేనా!

Published Thu, Jul 23 2020 4:15 AM | Last Updated on Thu, Jul 23 2020 4:16 AM

Government teaching to students in three ways - Sakshi

కరోనాతో రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు మూతపడ్డ సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విద్యా సంవత్సరాన్ని కోల్పోకుండా ప్రభుత్వంతోపాటు ప్రైవేటు, కార్పొరేట్‌ పాఠశాలలు విభిన్న మార్గాల్లో విద్యార్థులకు విద్యను అందిస్తున్నాయి. ప్రధానంగా ఆన్‌లైన్‌ బోధనపై నిపుణులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఆన్‌లైన్‌ బోధన వల్ల ప్రయోజనం ఉండదని కొంతమంది చెబుతుండగా, మరికొందరు అదొక్కటే మార్గమంటున్నారు.   

సాక్షి, అమరావతి: కరోనాతో పాఠశాలలు మూతపడటంతో ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలు ఆన్‌లైన్‌ బాట పట్టాయి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం విద్యా వారధి పథకం ద్వారా విద్యార్థులకు బోధనను అందిస్తోంది. ఇందులో భాగంగా దూరదర్శన్‌ సప్తగిరి చానెల్‌ ద్వారా వివిధ సబ్జెక్టుల పాఠాలను టీచర్లతో బోధిస్తోంది. మరోవైపు ప్రైవేటు, కార్పొరేట్‌ పాఠశాలలు సెల్‌ఫోన్లు, ట్యాబ్‌లు,  కంప్యూటర్ల ద్వారా విద్యా బోధన చేస్తున్నాయి. బోధన పేరుతో విద్యార్థులపై ఒత్తిడిని పెంచుతున్నాయి. అంతేకాకుండా ఫీజులను కూడా అధికంగా వసూలు చేస్తూ విద్యార్థులు, వారి తల్లిదండ్రులను ఆందోళనకు గురి చేస్తున్నాయి.

మూడు మార్గాల్లో బోధన
► పిల్లలకు అనుగుణంగా హైటెక్, లోటెక్, నోటెక్‌ వినియోగించి బోధన సాగిస్తున్నాం. ఆన్‌లైన్‌లో మొత్తం సిలబస్‌ను, పాఠ్యపుస్తకాలను ఎన్‌సీఈఆర్‌టీ దీక్ష ప్లాట్‌ఫామ్‌లో పొందుపరిచాం. 
► స్పోకెన్‌ ఇంగ్లిష్‌ కోర్సు కింద వెబ్‌నార్‌ శిక్షణ నిర్వహిస్తున్నాం. టీచర్లు, పిల్లలకు అనుగుణంగా ‘అభ్యాస’ అనే యాప్‌ రూపొందించాం. 
► లో టెక్నాలజీ ఉన్నవారు దూరదర్శన్, ఆకాశవాణిల ద్వారా పాఠాలు వినేలా చేస్తున్నాం.  దూరదర్శన్‌ ద్వారా 1.80 లక్షల మంది విద్యార్థులు తమ అభ్యసనాన్ని కొనసాగిస్తున్నారు. 
► 1 నుంచి 6 తరగతి వరకు ఉన్న పిల్లలకు విద్యావారధి కింద 18 లక్షల వర్క్‌ బుక్స్‌ అందించాం. నోటెక్‌ (టెక్నాలజీ అందుబాటులో లేనివారు) విద్యార్థులకు వాహనాలు, టీచర్ల ద్వారా బోధన చేస్తున్నాం. 

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు బోధన ఇలా..
► ప్రభుత్వ పాఠశాలల్లో ఎక్కువ మంది పిల్లలు గ్రామీణ, నిరుపేద వర్గాలకు చెందిన వారే. దీంతో ప్రభుత్వం ఆయా విద్యార్థుల పరిస్థితులకు అనుగుణంగా బోధిస్తోంది. టెక్నాలజీ సౌకర్యం ఉన్నవారికి ఆన్‌లైన్‌లో పాఠ్యపుస్తకాలను అందుబాటులో ఉంచింది.
► మరికొందరికి టీవీలు, వీడియోల ద్వారా పాఠ్యాంశాలను అందిస్తోంది.
► డిజిటల్‌ (సెల్‌ఫోన్, ట్యాబ్, ల్యాప్‌టాప్, కంప్యూటర్‌) పరికరాలు లేని వారికి వర్క్‌ బుక్స్‌ అందించి వారికి వారానికి ఒకటి రెండు రోజులు స్కూళ్లలో టీచర్ల ద్వారా సందేహాలను నివృత్తి చేస్తోంది.  

కొంతవరకైనా స్కూళ్లు తెరవడం మంచిది 
► సప్తగిరి చానెల్‌ ద్వారా బోధించడం, వర్క్‌ బుక్స్‌ ఇవ్వడం వల్ల విద్యా సంవత్సరానికి సంబంధించి కొంత గ్యాప్‌ పూడుతుంది. 
► కార్పొరేట్, ప్రైవేట్‌ పాఠశాలలు డిజిటల్‌ బోధనతోపాటు పుస్తకాలను పంపిణీ చేస్తున్నాయి. 
► మామూలు విద్యా సంవత్సరంలో కంటే ఎక్కువగా ఆన్‌లైన్‌లో బోధిస్తున్నాయి. ఈ అంశం ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల పిల్లల మధ్య వ్యత్యాసాన్ని పెంచుతుంది. కాబట్టి ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకోవాలి. 
► పూర్తిగా కరోనా లేని ప్రాంతాలను గుర్తించి షిప్ట్‌ల పద్ధతిలో పాఠశాలలను నడపాలి. 
► ఆన్‌లైన్‌ బోధనలతోపాటు డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌ విధానం ఉండాలి.
► సిలబస్‌ను అవసరం మేరకు తగ్గించాలి.
  – జి.హృదయరాజు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఏపీటీఎఫ్‌ 

ఆన్‌లైన్‌ బోధన.. తరగతి బోధనకు ప్రత్యామ్నాయం కాలేదు 
► పాఠశాలలు ప్రారంభమయ్యే అవకాశం లేదు కాబట్టి ఆన్‌లైన్‌ బోధన ద్వారా ఈ పరిస్థితిని అధిగమించవచ్చని కొన్ని ప్రయత్నాలు మొదలుపెట్టారు.  అయితే ఆన్‌లైన్‌ బోధన.. తరగతి బోధనకు ప్రత్యామ్నాయం కాలేదు.  ఆన్‌లైన్‌ క్లాసుల కంటే ఉన్నంతలో టీవీ చానెల్‌ ద్వారా చెప్పడం వల్ల కొంత ఉపయోగం ఉంటుంది.
– బాబుల్‌ రెడ్డి, ప్రధాన కార్యదర్శి యూటీఎఫ్‌ 

ఆన్‌లైన్‌ బోధనతో ప్రయోజనం లేదు
► పాఠశాల విద్యకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అద్భుతంగా ఉన్నాయి. 
► సరైన జాగ్రత్తలు తీసుకుని పాఠశాలలు తెరవాలి. మాస్కులు, గ్లౌజులు కచ్చితంగా పెట్టుకు రావాలని విద్యార్థులకు సూచించాలి. అవసరమైతే వాటిని ప్రభుత్వమే అందించాలి. 
► ఆన్‌లైన్‌ బోధన వల్ల పూర్తి ప్రయోజనం లేదు.                 
 – కె.టి.శేఖర్, పేరెంట్, కాకినాడ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement