పాఠశాల చదువు.. మోయలేని బరువు..
* ఏటా ఫీజులను పెంచేస్తున్న ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లు
* ఈ సంవత్సరమూ 10 నుంచి 15 శాతం పెంపు
* పరీక్షలు పూర్తవకుండానే వచ్చే సంవత్సరానికి అడ్మిషన్లు
అమలాపురం : అర్హులైన వారికి.. ఉన్నత విద్య చదివే సందర్భంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ ఉంది. ఇంటర్, డిగ్రీలకు స్కాలర్ షిప్‌లున్నాయి. ప్రభుత్వ కళాశాలల్లోనేకాదు.. ప్రైవేట్ కాలేజీల్లో విద్యార్థులకు సైతం ఇవి వర్తిస్తున్నాయి. ఆ వెసులుబాటు లేనిదల్లా పాఠశాల విద్యకే. పాఠశాల విద్య ప్రభుత్వ స్కూళ్లలో ఉచితం కాగా.. ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఖరీదైన వ్యవహారంగా, సామాన్య, మధ్య తరగతి వర్గాలకు మోయలేని భారంగా మారిపోయింది. ఏటా పెంచినట్టే ప్రైవేట్ స్కూళ్లలో ఈ ఏడాది కూడా 10 నుంచి 15 శాతం ఫీజులు పెంచారు.
జిల్లాలో మరో వారం రోజుల్లో పాఠశాలస్థాయి పరీక్షలు పూర్తికానున్నాయి. తరువాత వేసవి సెలవులు మొదలవుతారుు. జూన్ పది తరువాత పాఠశాలలు, ప్రైవేట్ పాఠశాలలు తెరవనున్నారు. ప్రైవేట్ స్కూళ్ల యజమానులు ఇంకా పరీక్షలు పూర్తి కాకపోరుునా వచ్చే విద్యా సంవత్సరానికి అప్పుడే అడ్మిషన్లు ఆరంభించారు. కొత్తవారిని చేర్చుకునేందుకు పెద్ద కసరత్తే చేస్తున్నారు. విద్యార్థులను గుర్తించి తమ పాఠశాలల్లో చేర్చేందుకు పీఆర్వోలనే కాదు చివరకు ఉపాధ్యాయులను కూడా రంగంలోకి దింపారు. పనిలో పనిగా టా పెంచినట్టే ఈ ఏడాది కూడా 10 నుంచి 15 శాతం ఫీజులు పెంచివేశారు. కార్పొరేట్ స్కూళ్లలో ఈ పెంపు మరింత ఎక్కువగా ఉంది.
కార్పొరేట్ స్కూళ్లలో ఫీజుల వసూలు ఇలా..
నర్సరీ - యూకేజీ : రూ.19,000 నుంచి రూ.25,000
1 - 3 తరగతులు : రూ.20,000 నుంచి రూ.27,000
4 - 5 తరగతులు : రూ.23,000 నుంచి రూ.28,000
6 - 7 తరగతులు : రూ.25,000 నుంచి రూ.30,000
8 - 9 తరగతులు : రూ.27,000 నుంచి రూ.32,000
10వ తరగతి : రూ.29,000 నుంచి రూ.34,000
ఎన్నిరకాల బాదుళ్లో..
ఇవి కాకుండా కొత్తగా చే రే వారి నుంచి అడ్మిషన్ ఫీజుగా రూ.3 వేల నుంచి రూ.6 వేల వరకూ వసూలు చేస్తున్నారు. బస్సు చార్జీలుగా 5 కిలోమీటర్లలోపు రూ.5 వేలు, అంతకుమించిన దూరానికి రూ.8 వేల నుంచి రూ.10 వేల వరకూ వసూలు చేస్తున్నారు.
ఇక పుస్తకాలు, యూనిఫాంల పేరుతో జరుగుతున్న దోపిడీ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే యూకేజీ లోపు చదివే విద్యార్థికే రూ.30 వేలకు పైబడి అవుతుందంటే ప్రాథమిక విద్య ఎంత ఖరీదైన వ్యవహారంగా మారిందో అర్థం చేసుకోవచ్చు. ఏటా ఫీజులు పెంచుతున్నా అడ్డుకోవాల్సిన విద్యాశాఖాధికారులు మిన్నకుండడంతో ప్రైవేట్ స్కూల్ యజమాన్యాల ఆగడాలకు అడ్డూఅదుపూ లేకుండా పోయింది.
విద్యార్థులను చేర్చకుంటే ఇంక్రిమెంట్‌లు లేనట్టే..
ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్ల యూజమాన్యాలు కొత్తగా విద్యార్థులను చేర్చే బాధ్యతను ఆ సంస్థల పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ (పీఆర్వో)ల మీదనే కాక ఉపాధ్యాయులు మీద కూడా పెడుతున్నాయి.
ఉపాధ్యాయులు ఒక్కొక్కరూ ఇద్దరు, ముగ్గురు విద్యార్థులను చేర్పించాలని లక్ష్యంగా నిర్ణయించారు. అలా చేర్చకుంటే ఇంక్రిమెంట్‌లను రద్దు చేస్తామని బెదిరిస్తున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరికొన్ని యాజమాన్యాలు వేసవి సెలవులు ఇచ్చేది లేదనడంతో ఉపాధ్యాయులు లబోదిబోమంటున్నారు. ఇప్పటికైనా జిల్లా విద్యాశాఖాధికారులు ఫీజుల పెంపుపై స్పందించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.