మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని భగీరథకాలనీకి చెందిన లావణ్య చదువులో మేటి. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుకున్న ఈ బాలిక ఈసారి పదో తరగతి పరీక్ష ఫలితాల్లో 9.8 జీపీఏతో ఉత్తీర్ణత సాధించింది. మధ్యతరగతి కుటుంబానికి చెందినందున ప్రైవేట్ కాలేజీలో చదువుకునే ఆర్థికస్తోమత లేదు. ఇది తెలుసుకున్న ఓ వ్యక్తి లావణ్య తండ్రి కృష్ణకుమార్‌కు ఫోన్ చేసి ‘నేను హైదరాబాద్‌కు చెందిన ఓ కార్పొరేట్ కాలేజీ నుంచి మాట్లాడుతున్నాను.
మీ కూతురిని మా కాలేజీలో చేర్పిస్తే చదువుకయ్యే ఖర్చునంతా మేమే భరిస్తాం..’ అని హామీ ఇచ్చారు. దీంతో కార్పొరేట్ చదువు ఉచితంగా అందుతుందనే ఉద్దేశంతో ఆ తండ్రి అందుకు అంగీకరించారు. ఇలా ఉత్తమ ఫలితాలు సాధించిన ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులందరికీ ఇలాంటి ఫోన్‌కాల్స్ వస్తూనే ఉన్నాయి. వారి ప్రతిభను తెలుసుకున్న ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాతో పాటు హైదరాబాద్‌కు చెందిన కార్పొరేట్, ప్రైవేట్ జూనియర్ కాలేజీల ఏజెంట్లు విద్యార్థుల ఫోన్ నంబర్లు సేకరించి
ఆయా కాలేజీల్లో అడ్మిషన్లు తీసుకునేలా గాలం వేస్తున్నారు.
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: జిల్లాలో అప్పుడే ఇంట ర్మీడియెట్ అడ్మిషన్ల హడావుడి మొదలైంది. ప్రస్తుతం ఆయా కాలేజీల పోటాపోటీ ప్రచారాలు.. ఫోన్ కాల్స్‌తో అడ్మిషన్ల ప్రక్రియ ఊపందుకుంది. విద్య వ్యాపారంలో ట్రెండ్ మార్చిన కార్పొరేట్ కాలేజీలు వినూత్న పద్ధతిలో మొదలుపెట్టాయి. పదో తరగతి చదువుతున్న విద్యార్థుల వివరాలు స్థానిక పాఠశాలల నుంచి తెప్పించుకున్న కాలేజీ యాజమాన్యాలు.. అడ్మిషన్ల కోసం తల్లిదండ్రులకు ఫోన్లు చేస్తూ ఆకర్షించేందుకు శతవిధాలా యత్నిస్తున్నాయి. విద్యార్థుల ఇళ్లకు వెళ్లి అడ్మిషన్లు చేయించుకునేందుకు జిల్లాలో ప్రధాన పట్టణాలు, మండల కేంద్రాల్లో డిగ్రీ పూర్తి చేసిన కొందరిని నియమించుకున్నాయి. కొందరిని వేతనాల వారీగా, ఇంకొందరిని పర్సంటేజీల రూపంలో డబ్బు చెల్లిస్తున్నాయి. మరికొన్ని కాలేజీలైతే.. ఏకంగా తమ ఏజెంట్లకు ప్రచారకర్తల పదవులతో గుర్తింపు కార్డులూ జారీ చేసేశాయి.
కేవలం ఉమ్మడి జిల్లా పరిధిలోని మహబూబ్‌నగర్, వనపర్తి, నాగర్‌కర్నూల్, జోగుళాంబ గద్వాల, నారాయణపేట జిల్లా కేంద్రాల్లో బడా కాలేజీ యాజమాన్యాలు ఇప్పటికే పదుల సంఖ్యలో ఏజెంట్లను నియమించుకోవడం గమనార్హం. ఇప్పటికే రంగంలో దిగిన ఆయా కాలేజీల ఏజెంట్లు అడ్మిషన్లతో హోరెత్తిస్తున్నారు. ఈ విషయంలో లక్ష్యాలను నిర్దేశించుకుని.. విద్యా సంవత్సరం ప్రారంభం అయ్యేలోగా వాటిని పూర్తి చేసేలా కసరత్తు చేస్తున్నారు. ఇటీవల విడుదలైన పదో తరగతి పరీక్ష ఫలితాల్లో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా నుంచి 41,364 మంది విద్యార్థులు పాసయ్యారు. వీరిలో చాలావరకు ప్రైవేట్ కా>లేజీల వైపే మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో 110 ప్రైవేట్ జూనియర్ కాలేజీలు ఉన్నాయి. జిల్లాకు చెందిన ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలు గ్రూపుతో పాటు విద్యార్థులకు ఇచ్చే ఇతర పరీక్షల శిక్షణను బట్టి ఏడాది రూ. పది వేల నుంచి రూ.40వేల వరకు ఫీజు వసూలు చేస్తున్నాయి.
పాలమూరు టు హైదరాబాద్!
స్థానికంగా ఉన్న ప్రైవేట్ కాలేజీలే గాక హైదరాబాద్‌కు చెందిన పలు కార్పొరేట్ కాలేజీలు సైతం పాలమూరు జిల్లాపై దృష్టి సారించాయి. పదో తరగతి పరీక్ష ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులను గుర్తించి వారిని తమ కాలేజీల్లో చేర్పించుకునేందుకు ఏజెంట్లను నియమించుకున్నాయి. మంచి ఫలితాలు సాధించిన వారికి ఉచిత విద్య, వసతి వల వేస్తున్నాయి. మిగతా విద్యార్థులకు వచ్చిన జీపీఏను బట్టి ఫీజు వసూలు చేస్తున్నాయి.
సాధారణంగా ఎంపీసీ విద్యార్థులు ఎంసెట్, ఐఐటీ, ఏఐఈఈఈ, జేఈఈ, ఎన్‌ఈటీ, సీఏ కోర్సుల వైపు మొగ్గు చూపుతారు. బైపీసీ విద్యార్థులు బీ–ఫార్మసి, ఎంబీబీఎస్, బీయూఎంఎస్, కోర్సుల వైపు; ఎంపీసీ, సీఈసీ విద్యార్థులు సీఏ, సివిల్స్ కోసం యత్నిస్తుంటారు. వీరిలో సంబంధిత కోర్సులు.. వాటి కాలానికనుగుణంగా ఫీజు వసూలు చేస్తున్నాయి. ఇంటర్మీడియెట్‌లో కేవలం ఫస్టియర్ వరకే ఎంసెట్, ఐఐటీ ఎంట్రెన్స్ శిక్షణ తీసుకోవాలనుకుంటున్న విద్యార్థులను ‘ఇన్‌కేర్’ బ్యాచ్‌గా విభజించి రూ.1.05లక్షల నుంచి రూ. 1.4లక్షల వరకు ఫీజు నిర్ణయించుకున్నాయి. అదే జిల్లాకు చెందిన ప్రైవేట్ కాలేజీలయితే సాధారణ ఫీజుతోపాటు అదనంగా మరో రూ.40వేలు తీసుకుంటున్నాయి.
వీరికి రెండో సంవత్సరంలో ఎలాంటి శిక్షణ ఉండదు. ఐఐటీ, ఏఐఈఈఈ ఎంట్రెన్స్ శిక్షణ తీసుకోవాలనుకుంటున్న విద్యార్థులను ‘స్పార్క్’ బ్యాచ్‌గా విభజించి ఫస్టియర్‌తో పాటు సెకండియర్ సగం విద్యా సంవత్సరం వరకు శిక్షణ ఇస్తారు. వీరి నుంచి హైదరాబాద్‌కు చెందిన కార్పొరేట్ కాలేజీలు ఏటా రూ.1.25లక్షలు, జిల్లాకు చెందిన కాలేజీలు రూ.50వేల వరకు ఫీజు వసూలు చేస్తున్నాయి. చదువులో వెనకబడిన వారిని రెగ్యులర్ బ్యాచ్‌గా విభజించి కేవలం వార్షిక పరీక్షలో పాస్ అయ్యేలా బోధిస్తారు. వీరి నుంచి కార్పొరేట్ కాలేజీలైతే రూ.60వేల నుంచి రూ.లక్ష.. జిల్లాకు చెందిన కాలేజీలు అదనంగా రూ.20వేల వరకు వసూలు చేస్తారు. మెరిట్ విద్యార్థులను ‘జూనియర్ ఫాస్ట్ ట్రాక్’ బ్యాచ్ కింద చేర్చి.. వారికి ఐఐటీ, ఏఐఈఈఈ, జేఈఈ, ఎన్‌ఈటీ ఎంట్రెన్స్‌కు శిక్షణ ఇస్తారు. వీరి నుంచి ఏటా రూ. 1.35లక్షల వరకు ఫీజు నిర్ణయించారు.
రూ.5వేలకే సీటు బుకింగ్
నాణ్యమైన విద్య.. అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తామంటూ పదో తరగతి విద్యార్థులు.. వారి తల్లిదండ్రులను ఆకర్షిస్తున్న హైదరాబాద్‌కు చెందిన కార్పొరేట్, ప్రైవేట్ కాలేజీలు రూ.ఐదు వేలకే అడ్మిషన్ ఖాయం చేసేస్తున్నాయి. టెన్త్ ఫలితాల్లో సాధించిన జీపీఏను బట్టి విద్యార్థులకు ఫీజు మినహాయింపు ఉంటుందని చెబుతున్నాయి. జిల్లాలోని ప్రభుత్వ కాలేజీల్లో నాణ్యమైన విద్య అందకపోవడం.. చెప్పుకోదగ్గ కాలేజీలు లేకపోవడం.. తల్లిదండ్రులందరూ తమ పిల్లలను పెద్ద కాలేజీల్లో చదువు చెప్పించాలనే ఆశను ఆసరాగా చేసుకుని పలు కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ఇలా గాలం వేస్తున్నాయి. కాలేజీలు పునఃప్రారంభమైన తర్వాత సీట్లు దొరుకుతాయో లేదోనని విద్యార్థుల తల్లిదండ్రులూ ఇప్పట్నుంచే సీట్లు ఖరారు చేసుకుంటున్నారు. కాగా, కార్పొరేట్ విద్యాసంస్థలు ఒక్కో ఏజెంట్‌కు ప్రతి అడ్మిషన్‌పై రూ.ఐదు వేల నుంచి రూ.పది వేల వరకు చెల్లిస్తున్నాయి. జిల్లాకు చెందిన ప్రైవేట్ కాలేజీలు మాత్రం రూ.2,500 నుంచి రూ.నాలుగు వేల వరకు (విద్యార్థులు చెల్లించే ఫీజును బట్టి) ఇస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment