నారాయణపేట జిల్లా ఊట్కూరు మండలం బాపూర్ శివారులోని సర్వే నం.30లో అక్రమ పట్టాలు చేసిన ప్రభుత్వ భూమి ఇదే..
నారాయణపేట జిల్లా ఉట్కూరు మండలం బాపూర్ శివారులోని సర్వే నం. 30/ఏఅ, ఖాతా నం. 635లో 4.20 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆనంద (భర్త పేరు వెంకట్‌రెడ్డి) అక్రమంగా పొందారు. ఆమె పేరుతో పట్టాపాసు పుస్తకాలు మంజూరయ్యాయి. హద్దులు తెలియకపోవడంతో అక్రమంగా పట్టా పొందిన ఈ భూమిని సాగు చేయడం లేదు. అయినా ‘రైతుబంధు’ ద్వారా పెట్టుబడి సాయం మాత్రం క్రమం తప్పకుండా పొందుతున్నారు. ఇలా 2018–19లో రూ.18వేలు, 2019–20లో రూ.22,500 తీసుకున్నారు. అలాగే సర్వే నం.30/ఆ ఖాతా నం.372లో లక్ష్మి (భర్త పేరు నాగరాజు) రెండెకరాలకు పట్టాపాసు పుస్తకాలు తీసుకున్నా సాగు చేయడంలేదు. 2018–19లో రూ.ఎనిమిది వేలు, 2019–20లో రూ.పది వేల పెట్టుబడి సాయం మాత్రం తీసుకున్నారు. ఇలాంటి రైతులు పదుల సంఖ్యలో ఉన్నారు. రెవెన్యూ అధికారుల అవినీతితో అక్రమ పట్టాలు పొందిన వీరు క్రమం తప్పకుండా పెట్టుబడి సాయం తీసుకుంటూనే ఉన్నారు.
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్/ ఊట్కూరు: తవ్విన కొద్దీ అక్రమాలు.. ఒకదాని తర్వాత మరొకటి.. ఎవరికీ అంతుబట్టకుండా ప్రభుత్వ భూములను కాజేసే కొందరు రెవెన్యూ ఉద్యోగులు.. వారికి సహకరించే మరికొందరు అధికారులు.. ఆలస్యంగా వెలుగుచూస్తున్న అక్రమాలతో నారాయణపేట జిల్లా ఉట్కూరు మండలం వార్తల్లోకెక్కింది. ప్రభుత్వ భూములు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకుని గుట్టుచప్పుడు కాకుండా వాటిని తమ కుటుంబ సభ్యుల పేతో పట్టాలు చేయడం.. ఇతరులకు అమ్ముకోవడం ఆ మండల రెవెన్యూ అధికారులు కొందరికి వెన్నతో పెట్టిన విద్యగా మారింది.
ఇదే మండలంలోని దంతన్‌పల్లి, ఊట్కూర్, బాపూర్ శివారులో ఎనిమిది సర్వే నెంబర్ల పరిధిలో ఉన్న 21.81ఎకరాలను తమ కుటుంబ సభ్యులు, బంధువుల పేర్లతో పట్టా చేసిన స్థానిక వీఆర్వో, ముగ్గురు వీఆర్‌ఏల ఉదంతం వెలుగుచూడక ముందే బాపూర్ శివారులో మరో 75 ఎకరాల ప్రభుత్వ భూములను ఇతరుల పేరిట పట్టా చేసినట్టు ఆలస్యంగా వెలుగు చూసింది. దీంతో ఆ మండలంలో ప్రభుత్వ భూ బదలాయింపు 96.81 ఎకరాలకు చేరింది. బాపూర్ శివారులోని సర్వే నం.157, 158, 164, 30లో ఉన్న 150 ఎకరాల్లో ప్రభుత్వ భూమి ఉండగా.. అందులో 75 ఎకరాల అన్యాక్రాంతమైందని 2018లోనే ఆ గ్రామస్తులు గుర్తించారు.
ఏడాది క్రితం భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమంలో భాగంగా రైతుల జాబితాను గ్రామసభలో చదవి వినిపించడంతో 75 ఎకరాలు అన్యాక్రాంతమైనట్లు నిర్ధారణకు వచ్చారు. ఇదే క్రమంలో కొందరు రెవెన్యూ ఉద్యోగులు ప్రభుత్వ భూమిని అక్రమంగా ఇతర రైతులకు పట్టాలు చేశారని అప్పట్లో కలెక్టర్ రొనాల్డ్‌రోస్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై సమగ్ర విచారణ చేపట్టి నివేదిక ఇవ్వాలంటూ అప్పటి తహసీల్దార్ తిరుపతయ్యను ఆదేశించారు. రెవెన్యూ అధికారులు రికార్డులను పరిశీలించి ఉన్నతాధికారులకు నివేదిక అందజేశారు. అయితే నామమాత్రంగా రికార్డులను పరిశీలించిన అధికారులు అక్రమార్కులను కాపాడారనే విమర్శలు ఇప్పటికీ వినిపిస్తున్నాయి.
ఇదిలా ఉండగా విచారణ అనంతరం గ్రామస్తులు మళ్లీ ఆందోళన చేపడతారనే ఉద్దేశంతో రెవెన్యూ అధికారులు అక్రమ పట్టాలు పొందిన రైతులకు హద్దులు కేటాయించలేదు. దీంతో పట్టా పాసు పుస్తకాలు తీసుకున్న రైతులు ఆ భూముల్లో సాగు చేయడం లేదు. అయితే పెట్టుబడిసాయం పొందడం గమనార్హం. సర్వే నం.30లోనే అత్యధికంగా సుమారు 80 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంటే.. అందులో 30 నుంచి 40 ఎకరాల వరకు ఇతరుల పేరిట పట్టా అయినట్టు విశ్వసనీయ సమాచారం. ఇక సర్వే నం.157, 158 164 లలో మిగిలిన మరో 30 ఎకరాలు అన్యాక్రాంతమైంది.
ఆది నుంచి అదే తీరు..!
ఊట్కూరు మండలంలో భూ అక్రమాలు కొత్తేమీ కాదు. అధికారుల పర్యవేక్షణ లోపమో.. అవినీతి కారణమో తెలియదు కానీ అక్రమాల పరంపర ఇంకా కొనసాగుతూనే ఉంది. 2009లో నకిలీ పట్టా పాసు పుస్తకాలు తయారు చేసిన ఐదుగురు వీఆర్వోలు వాటిని రైతులకు అమ్మిన విషయం సంచలనం రేపింది. ఈ సంఘటనలో వీఆర్వోలను సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు అక్రమ పట్టాలు పొందిన 36 మంది రైతులపై కేసు నమోదు చేశారు.
ఈ తతంగంలో సదరు వీఆర్వోలు కొందరు దళారులను నియమించుకుని వ్యవహారమంతా నడిపించారు. అప్పట్లో కలెక్టరేట్ నుంచి కొత్త పాసు పుస్తకాలను తెచ్చి రెవెన్యూ డివిజన్ అధికారి, తహసీల్దార్ సంతకాలను ఫోర్జరీ చేసి, స్టాంపులు వేసి దళారుల చేతుల మీదుగా బినామీ రైతులకు అందించారు.
ఒక పాసు పుస్తకానికి రూ.పది వేల నుంచి రూ.20 వేల వరకు డబ్బులు దండుకుని మండలంలోని పగిడిమారి, మొగ్దూంపూర్, అమీన్‌పూర్ తదితర గ్రామాల బినామీ రైతులకు అందించారు. నకిలీ పాస్ పుస్తకాలు పొందిన రైతులు మక్తల్ కో–ఆపరేటివ్ బ్యాంకు ద్వారా లక్షలాది రూపాయల రుణాలు పొందారు. అదే సమయంలో విషయం తెలుసుకున్న స్థానికులు కొందరు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. వారి ఆదేశాల మేరకు రెవెన్యూ సిబ్బంది మక్తల్ కో–ఆపరేటివ్ సొసైటీకి Ðవెళ్లి బ్యాంకులో బోగస్ పుస్తకాలను పట్టుకుని ఊట్కూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు 2009 ఆగస్టు 26న 36 మంది రైతులపై క్రిమినల్ కేసులు పెట్టారు. ఈ వ్యవహారంలో అప్పటి డిప్యూటీ తహసీల్దార్ ఉండటం గమనార్హం.
తాజాగా.. అదే స్థాయిలో ప్రభుత్వ భూమిని ఇతరుల పేరిట పట్టా చేసినట్లు తెలుస్తోంది. కాగా ఈ అక్రమార్కులకు ఉన్నతాధికారుల అండదండలున్నాయనీ.. అందుకే ప్రభుత్వ భూములు ఇతరుల పేరిట పట్టా చేస్తున్నా.. తమ పై స్థాయి అధికారులకు తప్పుడు నివేదికలు పంపుతూ అక్రమార్కులను కాపాడుతున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంలో ప్రస్తుత నారాయణపేట కలెక్టర్ హరిచందన దాసరి ఎలా స్పందిస్తారో అనే చర్చ జోరుగా సాగుతోంది. అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూములను స్వా«దీనం చేసుకుంటారా? లేదా? అక్రమార్కులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు..? అనేది జిల్లాలో హాట్‌టాపిక్‌గా మారింది.
ప్రభుత్వ భూమిపై సర్వే చేట్టాలి
మండలంలోని ఊట్కూర్, దంతన్‌పల్లి, బాపూర్ శివారులో ప్రభుత్వ భూమిని అక్రమంగా కుటుంబ సభ్యులపై పట్టాలు చేసుకున్న రెవెన్యూ సిబ్బందిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. మండలంలోని ప్రభుత్వ భూములపై మళ్లీ సర్వే చేపట్టి అక్రమంగా పట్టాలు చేసుకున్న వారి నుంచి భూమిని స్వా«దీనం చేసుకోవాలి. మిగులు భూమిని నిరుపేద దళితులు, జోగినీలకు పంపిణీ చేయాలి.
– హాజమ్మ, ఊట్కూరు
బాధ్యులపై చర్య తీసుకోవాలి
ప్రభుత్వం చేపట్టిన భూప్రక్షాళన కార్యక్రమం అవినీతి అధికారులకు వరంలా మారింది. మండలంలో అక్రమాలకు పాల్పడ్డ రెవెన్యూ సిబ్బంది, వారికి సహకరించిన అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ఊట్కూర్, దంతన్‌పల్లి, బాపూర్, పెద్దపొర్ల, చిన్నపొర్ల, మల్లెపల్లి, ఏర్గాట్‌పల్లి తదితర గ్రామాల్లో ప్రభుత్వ భూమిపై అధికారులు రిటైర్డ్ తహసీల్దార్‌తో దర్యాప్తు చేయించి.. భూమిని స్వా«దీనం చేసుకోవాలి.
– సలీం, రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షుడు, నారాయణపేట
విచారణ చేపడతాం
మండలంలో పలు చోట్ల ప్రభుత్వ భూమి అన్యాక్రాంతమైనట్టు ఫిర్యాదులు అందాయి. వీటన్నింటిపై విచారణ చేపట్టి అక్రమంగా ఇతరుల పేరిట పట్టాలు చేసిన ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకుంటాం. అక్రమంగా భూములు పొందిన వారిపైనా చర్యలు తప్పవు. ప్రభుత్వ భూమిని ఇతరుల పేరిట పట్టాలు చేయడం నేరం. ఈ విషయంలో ఎవరినీ ఉపేక్షించేది లేదు. సమగ్ర విచారణ చేపట్టి ఉన్నతాధికారులను నివేదిస్తాం.
– దానయ్య, తహసీల్దార్, ఊట్కూర్
Comments
Please login to add a commentAdd a comment