ఒకరికి తెలియకుండా ఒకరిని.. నాలుగు పెళ్లిళ్లు చేసుకున్న ఘనుడు | Man Marries Four Women At Narayanpet | Sakshi
Sakshi News home page

నిత్య పెళ్లి కొడుకు.. నలుగురిని వివాహం చేసుకున్న ఘనుడు

Published Sun, Aug 7 2022 10:58 AM | Last Updated on Sun, Aug 7 2022 2:24 PM

Man Marries Four Women At Narayanpet - Sakshi

సాక్షి, నారాయణపేట(మహబూబ్‌నగర్‌):  ఒకరికి తెలియకుండా మరొకరితో ఇలా నలుగురు అమ్మాయిలను పెళ్లి చేసుకున్న ఓ యువకుడి బండారం బయటపడింది. మొదటి భార్య సఖీ కేంద్రంలో ఫిర్యాదు చేయడంతో ఆ ప్రబుద్ధుడిని పోలీసులు అరెస్టు చేసిన సంఘటన శనివారం వెలుగుచూసింది. నారాయణపేట మండలం అప్పిరెడ్డిపల్లికి చెందిన వెంకట నర్సింహారెడ్డి  వ్యవసాయం చేస్తున్నట్లు గొప్పలు చెప్పుకుంటూ జులాయిగా తిరుగుతూ ఉంటాడు.

15ఏళ్ల క్రితం పెళ్లి చేయడానికి పెద్దలు ధన్వాడ మండలం రాంకిష్టాయపల్లికి చెందిన మహేశ్వరిని చూశారు. అయితే అప్పట్లో అమ్మాయి తరఫు పెద్దలకు ఇష్టలేక వద్దనుకున్నారు. అయినప్పటికీ అమ్మాయి చుట్టూ తిరిగి ప్రేమలో పడేసి 2009లో పెళ్లి చేసుకున్నాడు. వారికి ఒక అమ్మాయి, అబ్బాయి పుట్టాక.. 2014లో భార్యభర్తలు గొడవపడి విడిపోయారు. అయినప్పటికీ భార్యపై కిరోసిన్‌ పోసి హత్యాయత్నం చేయడంతో ఆమె త్రుటిలో తప్పించుకుంది. దీనిపై కేసు నమోదై జైలుకు వెళ్లి వచ్చాడు.  

► జైలు నుంచి వచ్చిన తర్వాత కోయిలకొండ మండలం పారుపల్లికి చెందిన ఓ యువతితో పరిచయం కావడంతో ఆమెకు మాయమాటలు చెప్పి వివాహం చేసుకున్నాడు. ఇతని తీరు నచ్చకపోవడంతో ఆమె విడాకులు తీసుకుని మరో అబ్బాయిని పెళ్లి చేసుకుని వెళ్లిపోయింది. 

► ఊట్కూర్‌ మండలం నమస్తాపూర్‌కు చెందిన భర్త నుంచి విడిపోయి కుమారుడితో ఒంటరిగా ఉంటున్న మరో మహిళను ట్రాప్‌ చేశాడు. ఆమెను ప్రేమిస్తున్నానని చెప్పి గుడిలో పెళ్లి చేసుకుని హైదరాబాద్‌లో కాపురం పెట్టారు. వీరికి మరో ఇద్దరు మగపిల్లలు పుట్టారు. కాగా, తరుచూ సొంత గ్రామానికి వచ్చి పోతున్న వెంకట నర్సింహారెడ్డి తన పక్క గ్రామమైన అప్పక్‌పల్లిలో మరో అమ్మాయితో పరిచయం పెంచుకున్నాడు. తనకు పెళ్లి కాలేదని, ఆమెను ప్రేమిస్తున్నానని మాయమాటలు చెప్పాడు.

► నెలరోజుల క్రితం కర్ణాటక రాష్ట్రం మొత్కుపల్లి దేవాలయంలో వివాహం చేసుకున్నాడు. ఈ పెళ్లి గురించి తెలిసిన మొదటి భార్య మహేశ్వరి వివరాలు సేకరించగా.. తాను కాకుండా ఒకరి గురించి మరొకరికి తెలియకుండా మరో ముగ్గురిని పెళ్లి చేసుకున్నట్లు తెలుసుకుంది. అందరితో ఫోన్‌లో మాట్లాడి వాడి నిజస్వరూపం బయటపెట్టింది. రెండు రోజుల క్రితం సఖీ కేంద్రానికి వెళ్లి ఫిర్యాదు చేయడంతో వారు పోలీసుల సహకారంతో విచారణ చేపట్టారు.

► ఈ మేరకు శనివారం ముగ్గురు భార్యలు నారాయణపేట పోలీసుస్టేషన్‌కు రాగా మరొకరు వేరే పెళ్లి చేసుకున్న కారణంగా రాలేదు. మొదటి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిత్యపెళ్లి కొడుకు వెంకట నర్సింహారెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. వీరు నలుగురే కాకుండా మరో ఇద్దరిని వివాహం చేస్తున్నట్లు తెలిసింది. పోలీసులు దీనిపై విచారణ చేపట్టారు.   

చదవండి: కన్నబిడ్డ హత్యకు వరుస ప్లాన్‌లు.. కసాయి తల్లిపై విచారణ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement