వక్ఫ్‌ కళ్లకు గంతలు..! | Waqf Complex Commercial Rent Fraud In Mahabubnagar | Sakshi
Sakshi News home page

వక్ఫ్‌ కళ్లకు గంతలు..!

Published Sun, Feb 23 2020 10:43 AM | Last Updated on Sun, Feb 23 2020 10:43 AM

Waqf Complex Commercial Rent Fraud In Mahabubnagar - Sakshi

మహబూబ్‌నగర్‌లోని వక్ఫ్‌బోర్డు కాంప్లెక్స్‌ షాపుల సముదాయం  

పాలమూరు పట్టణం నడిరోడ్డున... మహబూబ్‌నగర్‌–రాయచూర్‌ ప్రధాన రహదారిపై కోట్లాది రూపాయల విలువైన ‘వక్ఫ్‌’ కాంప్లెక్స్‌. అందులో 18 బ్లాకులు.. వాటి పరిధిలో అబ్బురపడే విధంగా మొత్తం 463 షాపులు. నిత్యం వినియోగదారులతో కిటకిటలాడే బ్లాకులు..అక్కడి మార్కెట్‌ విలువ ప్రకారం నెలకు ఒక్కో షాపు కిరాయి రూ. 3వేల నుంచి రూ. 20వేలపైనే. సగటున రూ.5 వేల చొప్పున లెక్కేసుకున్నా ప్రతినెలా రూ.23.15లక్షలు ఉండాలి. కానీ అధికారిక లెక్కల ప్రకారం ప్రస్తుతం ఆయా షాపుల నుంచి వక్ఫ్‌ బోర్డు ప్రధాన కార్యాలయానికి అందుతోన్న అద్దె కనిష్టంగా రూ.350. గరిష్టంగా రూ.10వేలు.

ఇందులో సగటున రూ.3వేల చొప్పున లెక్కించినా.. ప్రతి నెల రూ. 13.89లక్షలు రావాలి. కానీ.. ప్రస్తుతం అందుతోంది కేవలం అక్షరాల రూ.4,43,308 మాత్రమే. మార్కెట్‌ విలువ ప్రకారం రావాల్సిన.. ప్రస్తుతం వసూలవుతున్న కిరాయిలను పరిశీలిస్తే ఆ కాంప్లెక్స్‌లో కొనసాగుతున్న అద్దె బాగోతం ఇట్టే తెలుస్తుంది. ప్రతి నెలా రూ.23.15లక్షల వరకు వసూలు కావాల్సిన అద్దె కేవలం రూ.4.43లక్షలు మాత్రమే ఎందుకు వసూలవుతుందో సమాధానం అధికారులే చెప్పాలి. వక్ఫ్‌ అధికారులు దుకాణాలపై నిర్ణయించిన అద్దెపై అనేక విమర్శలు వస్తున్నాయి. 

సాక్షి , మహబూబ్‌నగర్‌: పాలమూరు బస్టాండ్‌కు కూతవేటు దూరంలో ఉన్న కోట్లాది రూపాయలు విలువ చేసే కాంప్లెక్స్‌ను ప్రస్తుతం రాష్ట్ర వక్ఫ్‌ బోర్డు అధికారులు గాలికొదిలేశారు. ఆ కాంప్లెక్స్‌లో అద్దె మాయాజాలంతో పాటు బినామీ బాగోతమూ వెలుగుచూసినా అటువైపు కన్నెత్తిచూడడం లేదు. అంతేకాదూ.. ఎనిమిది షాపులు ఇతరులకు విక్రయించినట్లు ఆరోపణలు వెలువెత్తి, కాంప్లెక్స్‌కు చెందిన ఓ వ్యక్తిపై ఆరు నెలల క్రితమే పోలీసు కేసు నమోదైనా ఒక్కసారి కూడా ఆరా తీసిన పాపాన పోలేదు. కాంప్లెక్స్‌లో జరుగుతోన్న అక్రమాల గురించి స్థానిక వక్ఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ రాష్ట్ర శాఖకు నివేదించినా ఇంత వరకు ఎలాంటి అధికారుల తీరుపై పుర ప్రజలే విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

వక్ఫ్‌ నిబంధనల ప్రకారం.. లీజు పొందిన పదకొండు నెలల తర్వాత సదరు లీజుదారుడు మళ్లీ రెన్యూవల్‌ చేయించుకోవాల్సి ఉంటుంది. ఆ సమయంలో అద్దె కూడా పదిశాతం పెంచాలి. అయితే ఈ నిబంధన కొన్నేళ్ల నుంచే అమలుకు నోచుకుంటోంది. ప్రస్తుతం ఆ ప్రాంతంలో కాంప్లెక్సేతర దుకాణాల అద్దె రూ.15వేల పైనే ఉండడం.. వక్ఫ్‌ కాంప్లెక్స్‌లో మాత్రం గరిష్టంగా రూ. 10వేలు కూడా దాటకపోవడం గమనార్హం. 

షాపు ఒకరిది.. నిర్వహణ మరొకరిది.. 
నిబంధనల ప్రకారం లీజుదారులెవరూ తమ దుకాణాలను సబ్‌ లీజుకు ఇవ్వకూడదు. అలా చేసిన వ్యక్తి లీజును రద్దు చేసే అధికారం వక్ఫ్‌ బోర్డు అధికారులకు ఉంది. కానీ స్థానిక కాంప్లెక్స్‌లో పలువురు తమ దుకాణాలను ఇతరులకు సబ్‌ లీజుకు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం సుమారు 300 దుకాణాలు సబ్‌ లీజుపై కొనసాగుతున్నట్లు సమాచారం. కొందరు లీజుదారులు దుకాణాల నిర్వహణ భారమైనందున తమ వ్యాపారంలో మరొకరిని కలుపుకున్నామని.. సబ్‌ లీజుకు మాత్రం ఇవ్వలేదని సమాధానం చెబుతున్నారు. వాస్తవానికి లీజుదారులు తమ పేరిట మంజూరైన దుకాణాలను సబ్‌ లీజుకు ఇచ్చి వారి నుంచి ప్రతి నెల రూ. వేలల్లో వసూలు చేస్తున్నారు. అదే వక్ఫ్‌బోర్డుకు మాత్రం తాము వసూలు చేసిన దాంట్లో 30శాతం మాత్రమే అద్దె రూపంలో చెల్లిస్తున్నట్లు స్థానిక వక్ఫ్‌ అధికారులు గుర్తించారు.  క్షేత్రస్థాయిలో సమగ్ర విచారణ జరిపితేనే తప్ప వాస్తవాలు వెలుగులోకి రావనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.  

తెరచాటున విక్రయాలు? 
అటు వైపు కన్నెత్తి చూడని అధికారుల తీరును అదునుగా చేసుకున్న ఓ వ్యక్తి తన పేరిట మంజూరైన ఎనిమిది షాపులను ఇతరులకు విక్రయించినట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న స్థానిక వక్ఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ ముహమ్మద్‌ గౌస్‌ గతేడాది జనవరిలోనే సదరు వ్యక్తిపై పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అదే సమయంలో సదరు వ్యక్తిపై పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ కూడా నమోదు చేశారు. తర్వాత ఏమైందో తెలియదు కానీ ఇంత వరకు ఆ విచారణలో అడుగు ముందుకు పడలేదు. ఇంత జరిగినా రాష్ట్రస్థాయి అధికారులెవరూ ఈ అక్రమ వ్యవహారంపై విచారణ చేపట్టకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

స్థానికంగా జరుగుతోన్న అక్రమాల వెనక రాష్ట్రాధికారుల పాత్ర కూడా ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఓ పక్క సీఎం కేసీఆర్‌ వక్ఫ్‌ ఆస్తుల పరిరక్షణ కోసం కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసినా.. క్షేత్రస్థాయిలో మాత్రం అధికారుల తీరు అందుకు భిన్నంగా ఉందనే అభిప్రాయాలు ఉన్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి వక్ఫ్‌ ఆస్తుల పరిరక్షణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని పుర ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు.   

రాష్ట్ర అధికారులకు నివేదించాం
మహబూబ్‌నగర్‌లోని వక్ఫ్‌ కమర్షియల్‌ కాంప్లెక్స్‌లో జరుగుతోన్న అక్రమ వ్యవహారాలపై వచ్చిన ఫిర్యాదులపై ఇది వరకే విచారణ చేపట్టాను. ఇందులో  పలు అక్రమాలు వెలుగుచూశాయి. వాటికి సంబంధించిన నివేదికను రాష్ట్ర వక్ఫ్‌బోర్డు అధికారులకు పంపించాను. వక్ఫ్‌ ఆస్తులను విక్రయించడం, కొనడం చట్టరీత్యా నేరం. లీజుదారులు కూడా తమ దుకాణాలను సబ్‌ లీజుకు ఇవ్వకూడదు. – ముహమ్మద్‌ గౌస్, వక్ఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement