సాక్షి, నారాయణపేట: స్థానిక మార్కెట్‌యార్డులో ఏర్పాటు చేసిన పెసర కొనుగోలు కేంద్రంలో కొందరు దళారులు రైతుల్లా అవతారమెత్తి పెసర ధాన్యాన్ని విక్రయించినట్లు బయటపడిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయాన్ని కలెక్టర్ వెంకట్రావ్ సీరియస్‌గా తీసుకుని లోతుగా, పారదర్శకంగా విచారించాలని ఆదేశించారు. ఈ మేరకు ఉన్నతాధికారులు ప్రత్యేకంగా అయిదు బృందాలను నియమించి నేటినుంచి రంగంలోకి దించనున్నారు. ఈ విషయం తెలిసి తమ బాగోతం ఎక్కడ బయటపడుతుందోనని అక్రమార్కుల గుండెల్లో దడ మొదలైంది.
రైతుల పేర విక్రయాలు
అరుగాలం కష్టించి పండించిన పంటలకు ప్రభుత్వం గిట్టుబాటు ధరలను కల్పించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. అందులో భాగంగానే నారాయణపేట వ్యవసాయ మార్కెట్ యార్డులో పెసర కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. రైతులు గిట్టుబాటు ధర పొందుతూ లాభాలు పొందుతుండటం చూసిన దళారులు సహించ లేక వారు కూడా రైతుల్లా అవతారమెత్తారు.
కర్ణాటక రాష్ట్రం నుంచి తక్కువ ధరకు పెసరను కొనుగోలు చేసి పేటకు వచ్చి ఎక్కువ ధరకు విక్రయించడం ప్రారంభించారు. తెలిసిన రైతుల కు నయనో భయానో డబ్బులు చెల్లిస్తూ వారి పట్టాపాసుపుస్తకాలపై పెసరను విక్రయించారు. ఆనోటా ఈనోటా విషయం కాస్త కలెక్టర్ దృష్టికి వెళ్లగా అధికారులను అప్రమత్తం చేయడంతో వారి బోగోతం బయటపడింది. ఈ విషయాన్ని కలెక్టర్ సీరియస్‌గా తీసుకుని రెవెన్యూ, వ్యవసాయశాఖ అధికారులను కదిలించారు. నాలుగు రోజులుగా పెసర కొనుగోలు కేంద్రంలో జరిగి న విక్రయాలపై వారు ఆరా తీయిస్తున్నారు. ఎవరి స్థాయిలో వారు విచారణ మొదలెట్టారు.
416 మంది పత్రాల పరిశీలన
కొనుగోలు కేంద్రానికి రైతులు పెసర ధాన్యాన్ని తీసుకొని వెళ్లే సమయంలో గ్రామ రెవెన్యూ, గ్రామ వ్యవసాయశాఖ అధికారిలతో ధ్రువీకరణ పత్రాలను తీసుకెళ్లాలి. దళారి రైతులు పంటలు వేసినా.. వేయకపోయినా.. ధ్రువీకరణ పత్రాలపై సదరు అధికారులను బెదిరిస్తూ సంతకాలు చేయించుకొని తీసుకెళ్లినట్లు సమాచారం. కలెక్టర్ ఆదేశాలతో సోమవారం నుంచి ఇద్దరు ఏఈఓలు, ఒక వీఆర్వో, మార్కెట్ అధికారులు సైతం రైతులు తెస్తున్న పెసర ధాన్యాన్ని పూర్తిస్థాయిలో పరిశీలించ సాగారు.
దీంతో దళారుల బాగోతం ఒక్కొక్కటి బయటపడుతోంది. తహసీల్దార్ రాజు, జిల్లా మార్కెటింగ్ అధికారిణి పుష్పామ్మ పరిశీలించి అక్కడ ఉన్న తమ సిబ్బంది విచారణలో తెలిన బోగస్ పెసర 37 బస్తాలను సీజ్ చేసిన విషయం తెలిసిందే. దీంతో రైతులు ఇప్పటిరకు 8 వేల బస్తాల పెసరను విక్రయించిన 416 మంది వివరాలను పూర్తి స్థాయిలో అధికారులు సేకరించారు. వాటిని గురువారం నుంచి వ్యవసాయశాఖ అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.
నేటి నుంచి గ్రామాల్లోకి బృందాలు
కలెక్టర్ ఆదేశాలతో శుక్రవారం నుంచి గ్రామాల్లోకి అధికారుల బృందాలు పర్యటించేందుకు సిద్ధమయ్యారు. పెసర ధాన్యం విక్రయాలపై వి చారించేందుకు గాను కలెక్టర్ ఐదు బృందాలను నియమించారు. బృందంలో వ్యవసాయశాఖ అ ధికారి, డిప్యూటీ తహసీల్దార్‌తో పాటు గ్రామా లకు వెళ్లే సమయంలో ఆ గ్రామ రెవెన్యూ అ ధికారి, ఏఈఓ, వీఆర్‌ఏలను తీసుకెళ్తారు.
రైతులు వేసిన పంటలపై సమగ్ర సర్వే రిపోర్టును వారి వెంబడి తీసుకెళ్లనున్నారు. ఆ సర్వేలో రైతులు పంటవేయకుండా విక్రయించినట్లు తెలితే వారిపై చర్యలు తీసుకునేందుకు వెనకాడొద్దని కలెక్టర్ ఆదేశించినట్లు తెలుస్తోంది.
దళారుల గుండెల్లో దడ
ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో రైతుల అవతారమెత్తి దళారులు విక్రయించిన పెసరపై పూర్తిస్థాయిలో విచారించి నివేదికలను సమర్పించాలని కలెక్టర్ ఐదు బృందాలను ఏర్పాటుచేయడంతో దళారుల గుండెలో దడ పుడుతోంది. ఆ బృందాలు ఈ నెల 28 వరకు క్షేత్రస్థాయిలో రైతుల వద్దకు చెరుకొని వివరాలను సేకరించనున్నారు.
వీఆర్వో, వీఏఓలతో రైతులు వేసిన పంట పొలాలను పరిశీలిస్తారు. ఒక వేళ పంటను వేయకుండా పెసరను విక్రయించినట్లు తెలితే వాటిని సీజ్ చేయడంతో పాటు డబ్బులు వేయకుండా చూడాలని అధికారులకు ఆదేశించినట్లు సమాచారం. ఏదేమైనా ఈ వ్యవహారం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment