
న్యూఢిల్లీ: విద్యార్థులు తమ అడ్మిషన్‌ను రద్దు చేసుకున్నప్పుడు వారు కట్టిన ఫీజులు, ఒరిజినల్ సర్టిఫికెట్లను ఉన్నత విద్యా కళాశాలలు తిరిగి వెనక్కు ఇవ్వాల్సిందేనని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ అధికారి ఒకరు స్పష్టం చేశారు. లేకపోతే కళాశాలల గుర్తింపు, అనుమతులను రద్దు చేయడం సహా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
ఈ విషయమై ఇప్పటికే అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ), యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ)లకు సూచనలు చేశామనీ, విద్యార్థులను వేధించే కళాశాలలపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరామని అధికారి వెల్లడించారు. ఈ నిబంధనలు డీమ్డ్ వర్సిటీలుసహా ఏఐసీటీఈ, యూజీసీ నియంత్రణలో ఉండే అన్ని కళాశాలలకు వర్తిస్తాయన్నారు.