పీజీపై తగ్గుతున్న క్రేజ్‌ | Declining admissions to Post Graduate Course in Telangana | Sakshi
Sakshi News home page

పీజీపై తగ్గుతున్న క్రేజ్‌

Published Mon, Jan 22 2024 6:15 AM | Last Updated on Mon, Jan 22 2024 6:15 AM

Declining admissions to Post Graduate Course in Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సంప్రదాయ పోస్టు–గ్రాడ్యుయేట్‌ కోర్సుల్లో ప్రవేశాలు క్రమంగా తగ్గుతున్నా­యి. ఉన్న సీట్లలో కనీసం సగం భర్తీ అవ్వడం కూ­డా కష్టంగా ఉంది. డిగ్రీలో బీకాం వరకూ అత్యధిక ప్రాధాన్యతనిచ్చే విద్యార్థులు ఎంకామ్‌కు వెళ్లేందుకు ఇష్టపడటం లేదు. పీహెచ్‌డీ స్థాయి వరకూ వెళ్ళాలనుకునే వాళ్లు ఎంఎస్సీ కోర్సును ఎంచుకుంటున్నారు.

ఇక బీఏ కోర్సుల్లో చేరే వాళ్ళే తక్కువగా ఉంటుంటే, ఎంఏ వర­కూ వె­ళ్ళా­లనుకునే వాళ్ళు ఇంకా తక్కువ. గ్రూప్స్, సివిల్స్‌ రాయాలనుకునే విద్యార్థులు మాత్రమే ఇటువైపు వెళ్తున్నారు. ఈ మూడు ప్రధాన కోర్సులకు కలిపి రాష్ట్రంలో 50 వేల కన్వినర్‌ కోటా సీట్లు ఉంటే, గడచిన విద్యా సంవత్సరంలో చేరిన విద్యార్థులు కేవలం 20,484 మంది మా­త్రమే. అంటే కేవలం 40.96 శాతం సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. 

ఈ పరిస్థితికి కారణమేంటి? 
ఇంటర్‌ తర్వాత ఎక్కువ శాతం ఇంజనీరింగ్‌ వైపు వెళ్ళాలనే భావిస్తున్నారు. ఇంజనీరింగ్‌ తర్వాత ఏదైనా ప్రైవేటు కంపెనీల్లో స్థిరపడొచ్చని, లేదా విదేశీ విద్యకు వెళ్లచ్చని ఆలోచిస్తున్నారు. దాదాపు 4 లక్షల మంది ఇంటర్‌ పాసవుతుంటే, వీరిలో 90 వేల మంది ఇంజనీరింగ్‌ కోర్సుల్లో చేరుతున్నారు. మరో 20 వేల మంది ఇతర రాష్ట్రాల్లోని డీమ్డ్‌ వర్శిటీల్లోకి వెళ్తున్నారు. 40 వేల మంది వరకూ ఇంటర్‌తో విద్య ముగించి ఏదో ఒక వృత్తి, ఉద్యోగంలో స్ధిరపడుతున్నారు. ఇక బీఏ, బీకాం, బీఎస్సీ సహా ఇతర డిగ్రీ కోర్సుల్లో చేరే వారి సంఖ్య ఏటా 2.20 లక్షల వరకూ ఉంటోంది.

ఇందులోనూ కంప్యూటర్‌ నేపథ్యం ఉన్న బీకాం, ఆనర్స్‌ బీఏ వంటి కోర్సులకే ప్రాధాన్యమిస్తున్నారు. డిగ్రీ తర్వాత ఉన్న పరిజ్ఞానంతో ఏదో ఒక ఉద్యోగంలోకి వెళ్ళడానికి ఇష్టపడుతున్నారు. బీఎస్సీ చేసిన విద్యార్థులు కూడా ఫార్మా కంపెనీల్లో ఉద్యోగాల వైపు చూస్తున్నారు. పోస్టు–గ్రాడ్యుయేట్‌ చేసినా పెద్దగా ఉద్యోగాలు ఉండవనేది యువతలో ఉన్న అభిప్రాయం. లెక్చరర్‌గా వెళ్ళేందుకు మాత్రమే ఇది తోడ్పడుతుందనే భావన ఉంది. దీంతో డిగ్రీ చేసినా పీజీకి వెళ్ళడం లేదని ఇటీవల యూజీసీ జరిపిన అధ్యయనంలో వెల్లడైంది. 

పీజీలోని ప్రధాన కోర్సుల్లో విద్యార్థుల ప్రవేశాలు ... 


 

కొత్త కోర్సులైనా అంతేనా? 
పీజీ కోర్సులు నిర్వీర్యం అవ్వడం వల్ల దేశంలో పరిశోధన శక్తి పడిపోతోందని యూజీసీ హెచ్చరిస్తోంది. పీజీ వరకూ విద్యార్థులు వెళ్ళేలా అవసరమైన ప్రోత్సాహం ఇవ్వాలని పేర్కొంటోంది. ఇందులో భాగంగానే ఎంఎస్సీ డేటా సైన్స్, ఫుడ్‌ సైన్స్, న్యూట్రిషన్‌ వంటి కోర్సుల్లో మార్పులు చేశారు. సరికొత్త సిలబస్‌ను జోడించారు. పారిశ్రామిక అవసరాలకు తగ్గట్టుగా తీర్చిదిద్దుతున్నారు. అయినప్పటికీ పెద్దగా విద్యార్థులు ఆసక్తి చూపడం లేదు. పీజీలో మొత్తం 48 కోర్సులుంటే, వాటిలో జాగ్రఫీ, ఎంపీఎడ్, టూరిజం, లైబ్రరీ సైన్స్, ఇస్లామిక్‌ స్టడీస్, లింగ్విస్టిక్స్, ఫిలాసఫీ కోర్సుల్లో ప్రవేశాలు నామమాత్రంగానే ఉన్నాయి.

ఎంకాం, ఎమ్సెస్సీ స్టాటిస్టిక్స్, ఎమ్మెస్సీ కంప్యూటర్‌ సైన్స్‌ కోర్సుల్లో ఎన్ని మార్పులు చేసినా ఫలితం ఉండటం లేదు. స్టాటిస్టిక్స్‌లో గత ఏడది 417 సీట్లుంటే, కేవలం 358 మంది చేరారు. ఏంఏ రాజనీతి శాస్త్రంలో 639 మంది చేరారు. ఎమ్మెస్సీ మేథ్స్‌లో 1445కు మించి చేరలేదు. పోస్టు గ్రాడ్యుయేట్‌ కోర్సుల్లో చేరే వాళ్ళల్లో అమ్మాయిలే ఎక్కువ మంది ఉంటున్నారు. దీంతో పరిశ్రమల భాగస్వామ్యంతో పీజీ కోర్సులు నిర్వహించాలని యూజీసీ సూచిస్తోంది. పీజీ తర్వాత పరిశోధన రంగానికి పీజీ విద్యార్థులు వెళ్ళే సరికొత్త విధానంపై కసరత్తు చేయాలని సూచించింది. దీనిపై వచ్చే విద్యా సంవత్సరంలోగా సరికొత్త ప్రణాళిక సిద్ధం చేయాలని యూజీసీ భావిస్తోంది. 

ఉపాధి వైపే యువత మొగ్గు 
డిగ్రీ లేదా ఇంజనీరింగ్‌తోనే ఏదో ఒక ఉపాధి వైపు వెళ్ళాలని యువత భావిస్తోంది. పీజీ కోర్సుల తర్వాత ఉద్యోగాలు పెద్దగా ఉండవనే భావన కూడా పీజీ ప్రవేశాలు తగ్గడానికి కారణం. పీజీలో అనేక మార్పులకు అడుగులు పడుతున్నాయి. భవిష్యత్‌లో పీజీ అవసరం అన్న భావన విద్యార్థుల్లో తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. – ప్రొఫెసర్‌ ఆర్‌ లింబాద్రి (ఉన్నత విద్యా మండలి చైర్మన్‌)  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement