PG Seat
-
తెలంగాణలో ఎంబీబీఎస్ చేస్తే.. పీజీలో ‘స్థానికులే’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎంబీబీఎస్ కోర్సు చదివిన వారిని మెడికల్ పీజీ సీట్ల భర్తీలో స్థానికులుగా పరిగణించాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ధర్మాసనం తేల్చిచెప్పింది. అలాగే, తెలంగాణ వెలుపల ఎంబీబీఎస్ పూర్తి చేసిన అభ్యర్థులకు రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం ‘స్థానికత’ వర్తింపజేయాలని ఆదేశించింది. తెలంగాణ మెడికల్ కాలేజీల (పీజీ), పీజీ (ఆయుష్) కోర్సుల నిబంధనలు 2021ను సవరిస్తూ అక్టోబర్ 28న రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీఓలు 148, 149లను చట్ట వ్యతిరేకమని కోర్టు కొట్టివేసింది. తెలంగాణ మెడికల్ కాలేజీల (పీజీ మెడికల్ కోర్సులలో ప్రవేశం) నిబంధనలు 2021లోని రూల్ Vఐఐఐ ( జీజీ)లో ప్రభుత్వం చేసిన సవరణను సవాల్ చేస్తూ మంచిర్యాలకు చెందిన డాక్టర్ ఎస్ సత్యనారాయణ, హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ వీ రజిత హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. స్థానికత అంశంపైనే మరో 96 పిటిషన్లు కూడా దాఖలయ్యాయి. వీటిని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జే శ్రీనివాసరావు ధర్మాసనం సుదీర్ఘంగా విచారించి ఈ నెల 4న తీర్పును రిజర్వ్ చేసింది. మంగళవారం తుదితీర్పును ప్రకటించింది. ఈ తీర్పు 2024–25 విద్యా సంవత్సరానికి మాత్రమే వర్తిస్తుందని ప్రకటించింది. ప్రభుత్వం తీసుకొచి్చన జీవో 148, 149 చట్ట వ్యతిరేకమని పిటిషనన్ల తరఫు న్యాయవాదులు వాదించారు. ఈ జీవోల ప్రకారం 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు తెలంగాణలో చదవడంతో పాటు ఇక్కడ బ్యాచిలర్ మెడికల్ డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులను మాత్రమే పీజీ మెడికల్ అడ్మిషన్లలో స్థానికులుగా పరిగణిస్తున్నారని తెలిపారు. ఇతర రాష్ట్రాల్లో ఎంబీబీఎస్ పూర్తి చేసినా, తామంతా తెలంగాణకు చెందినవారమే అయినందున స్థానిక అభ్యర్థులుగా గుర్తించేలా ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఫలితాలు వచ్చాక మార్పులు సరికాదుఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 95 నేపథ్యంలో రాష్ట్రపతి ఉత్తర్వులు తెలంగాణకు వర్తించవని, రాష్ట్రపతి ఉత్తర్వులను అన్వయించుకోలేదన్న ప్రభుత్వ వాదనను ధర్మాసనం తప్పుబట్టింది. విద్యకు సంబంధించి రాష్ట్రపతి ఉత్తర్వులు అమల్లో ఉంటాయని ప్రకటించింది. ఈ సందర్భంగా 2023లో ఇదే హైకోర్టు ఇచ్చిన తీర్పును ఉదహరించింది. రాష్ట్ర విభజన తర్వాత ఏర్పాటుచేసిన మెడికల్ కాలేజీల్లో జాతీయ కోటా (15 శాతం) పోను.. మిగిలిన కన్వీనర్ కోటా సీట్లు (85 శాతం) స్థానిక విద్యార్థులకే కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీఓ 72ను సమర్థిస్తూ గత సెప్టెంబర్‌లో డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును సమర్ధించింది. ఆ తీర్పు రాష్ట్రపతి ఉత్తర్వులు 1974ను ఉల్లంఘించలేదని స్పష్టం చేసింది. 148, 149 జీఓలు రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధంగా ఉన్నాయని, రాష్ట్ర విద్యా సంస్థల నియంత్రణ చట్టంలోని సెక్షన్ 3(2)కు విరుద్ధమని ప్రకటించింది. పీజీ మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు ఆగస్టు 11న పరీక్ష నిర్వహించి, 23న ఫలితాలు ప్రకటించిన తర్వాత అడ్మిషన్ నిబంధనలు మార్చడాన్ని ధర్మాసనం తప్పుబట్టింది. ఒకసారి నియామక ప్రక్రియ ప్రారంభమయ్యాక మధ్యలో మార్పులు సరికాదని తేల్చి చెప్పింది. ఎంబీబీఎస్‌తో పాటు బీఏఎంఎస్, బీహెచ్ఎంఎస్ పూర్తి చేసిన పిటిషనర్లకు కూడా స్థానికత వర్తిస్తుందని తుది తీర్పులో ప్రకటించింది. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం స్థానికత, రాజ్యాంగంలోని ఆర్టికల్ 371డీ, ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 95తో పాటు పలు తీర్పులను తీర్పులో ప్రస్తావించింది. -
పీజీపై తగ్గుతున్న క్రేజ్
సాక్షి, హైదరాబాద్: సంప్రదాయ పోస్టు–గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాలు క్రమంగా తగ్గుతున్నాయి. ఉన్న సీట్లలో కనీసం సగం భర్తీ అవ్వడం కూడా కష్టంగా ఉంది. డిగ్రీలో బీకాం వరకూ అత్యధిక ప్రాధాన్యతనిచ్చే విద్యార్థులు ఎంకామ్‌కు వెళ్లేందుకు ఇష్టపడటం లేదు. పీహెచ్డీ స్థాయి వరకూ వెళ్ళాలనుకునే వాళ్లు ఎంఎస్సీ కోర్సును ఎంచుకుంటున్నారు. ఇక బీఏ కోర్సుల్లో చేరే వాళ్ళే తక్కువగా ఉంటుంటే, ఎంఏ వరకూ వెళ్ళాలనుకునే వాళ్ళు ఇంకా తక్కువ. గ్రూప్స్, సివిల్స్ రాయాలనుకునే విద్యార్థులు మాత్రమే ఇటువైపు వెళ్తున్నారు. ఈ మూడు ప్రధాన కోర్సులకు కలిపి రాష్ట్రంలో 50 వేల కన్వినర్ కోటా సీట్లు ఉంటే, గడచిన విద్యా సంవత్సరంలో చేరిన విద్యార్థులు కేవలం 20,484 మంది మాత్రమే. అంటే కేవలం 40.96 శాతం సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. ఈ పరిస్థితికి కారణమేంటి? ఇంటర్ తర్వాత ఎక్కువ శాతం ఇంజనీరింగ్ వైపు వెళ్ళాలనే భావిస్తున్నారు. ఇంజనీరింగ్ తర్వాత ఏదైనా ప్రైవేటు కంపెనీల్లో స్థిరపడొచ్చని, లేదా విదేశీ విద్యకు వెళ్లచ్చని ఆలోచిస్తున్నారు. దాదాపు 4 లక్షల మంది ఇంటర్ పాసవుతుంటే, వీరిలో 90 వేల మంది ఇంజనీరింగ్ కోర్సుల్లో చేరుతున్నారు. మరో 20 వేల మంది ఇతర రాష్ట్రాల్లోని డీమ్డ్ వర్శిటీల్లోకి వెళ్తున్నారు. 40 వేల మంది వరకూ ఇంటర్‌తో విద్య ముగించి ఏదో ఒక వృత్తి, ఉద్యోగంలో స్ధిరపడుతున్నారు. ఇక బీఏ, బీకాం, బీఎస్సీ సహా ఇతర డిగ్రీ కోర్సుల్లో చేరే వారి సంఖ్య ఏటా 2.20 లక్షల వరకూ ఉంటోంది. ఇందులోనూ కంప్యూటర్ నేపథ్యం ఉన్న బీకాం, ఆనర్స్ బీఏ వంటి కోర్సులకే ప్రాధాన్యమిస్తున్నారు. డిగ్రీ తర్వాత ఉన్న పరిజ్ఞానంతో ఏదో ఒక ఉద్యోగంలోకి వెళ్ళడానికి ఇష్టపడుతున్నారు. బీఎస్సీ చేసిన విద్యార్థులు కూడా ఫార్మా కంపెనీల్లో ఉద్యోగాల వైపు చూస్తున్నారు. పోస్టు–గ్రాడ్యుయేట్ చేసినా పెద్దగా ఉద్యోగాలు ఉండవనేది యువతలో ఉన్న అభిప్రాయం. లెక్చరర్‌గా వెళ్ళేందుకు మాత్రమే ఇది తోడ్పడుతుందనే భావన ఉంది. దీంతో డిగ్రీ చేసినా పీజీకి వెళ్ళడం లేదని ఇటీవల యూజీసీ జరిపిన అధ్యయనంలో వెల్లడైంది. పీజీలోని ప్రధాన కోర్సుల్లో విద్యార్థుల ప్రవేశాలు ... కొత్త కోర్సులైనా అంతేనా? పీజీ కోర్సులు నిర్వీర్యం అవ్వడం వల్ల దేశంలో పరిశోధన శక్తి పడిపోతోందని యూజీసీ హెచ్చరిస్తోంది. పీజీ వరకూ విద్యార్థులు వెళ్ళేలా అవసరమైన ప్రోత్సాహం ఇవ్వాలని పేర్కొంటోంది. ఇందులో భాగంగానే ఎంఎస్సీ డేటా సైన్స్, ఫుడ్ సైన్స్, న్యూట్రిషన్ వంటి కోర్సుల్లో మార్పులు చేశారు. సరికొత్త సిలబస్‌ను జోడించారు. పారిశ్రామిక అవసరాలకు తగ్గట్టుగా తీర్చిదిద్దుతున్నారు. అయినప్పటికీ పెద్దగా విద్యార్థులు ఆసక్తి చూపడం లేదు. పీజీలో మొత్తం 48 కోర్సులుంటే, వాటిలో జాగ్రఫీ, ఎంపీఎడ్, టూరిజం, లైబ్రరీ సైన్స్, ఇస్లామిక్ స్టడీస్, లింగ్విస్టిక్స్, ఫిలాసఫీ కోర్సుల్లో ప్రవేశాలు నామమాత్రంగానే ఉన్నాయి. ఎంకాం, ఎమ్సెస్సీ స్టాటిస్టిక్స్, ఎమ్మెస్సీ కంప్యూటర్ సైన్స్ కోర్సుల్లో ఎన్ని మార్పులు చేసినా ఫలితం ఉండటం లేదు. స్టాటిస్టిక్స్‌లో గత ఏడది 417 సీట్లుంటే, కేవలం 358 మంది చేరారు. ఏంఏ రాజనీతి శాస్త్రంలో 639 మంది చేరారు. ఎమ్మెస్సీ మేథ్స్‌లో 1445కు మించి చేరలేదు. పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సుల్లో చేరే వాళ్ళల్లో అమ్మాయిలే ఎక్కువ మంది ఉంటున్నారు. దీంతో పరిశ్రమల భాగస్వామ్యంతో పీజీ కోర్సులు నిర్వహించాలని యూజీసీ సూచిస్తోంది. పీజీ తర్వాత పరిశోధన రంగానికి పీజీ విద్యార్థులు వెళ్ళే సరికొత్త విధానంపై కసరత్తు చేయాలని సూచించింది. దీనిపై వచ్చే విద్యా సంవత్సరంలోగా సరికొత్త ప్రణాళిక సిద్ధం చేయాలని యూజీసీ భావిస్తోంది. ఉపాధి వైపే యువత మొగ్గు డిగ్రీ లేదా ఇంజనీరింగ్‌తోనే ఏదో ఒక ఉపాధి వైపు వెళ్ళాలని యువత భావిస్తోంది. పీజీ కోర్సుల తర్వాత ఉద్యోగాలు పెద్దగా ఉండవనే భావన కూడా పీజీ ప్రవేశాలు తగ్గడానికి కారణం. పీజీలో అనేక మార్పులకు అడుగులు పడుతున్నాయి. భవిష్యత్‌లో పీజీ అవసరం అన్న భావన విద్యార్థుల్లో తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. – ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి (ఉన్నత విద్యా మండలి చైర్మన్) -
3ముప్పై అడిగితే
రిమ్స్ క్యాంపస్, న్యూస్‌లైన్: ఇద్దరు కేంద్ర మంత్రులు.. మరో ఇద్దరు రాష్ట్ర మంత్రులు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అందులోనూ ఒకరు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి. అయినా జిల్లా పెద్దాస్పత్రి అయిన రిమ్స్‌కు మేలు చేసేందుకు తమ పరపతిని ఏమాత్రం ఉపయోగించలేదు. ఫలితంగా రిమ్స్ వైద్య కళాశాలకు పీజీ సీట్ల కేటాయింపులో తీవ్ర అన్యాయం జరిగింది. 13 విభాగాలకు సంబంధించి 30 సీట్లు మంజూరు చేయాలని కోరగా ఫిజియాలజీ విభాగంలో 3 సీట్లు మాత్రమే కేటాయించారు. రిమ్స్ ఏర్పాటును తమ ఘనతగా ప్రచారానికి ఉపయోగించుకుంటున్న మంత్రులు, ఇతర అధికార పార్టీ ప్రజాప్రతినిధులు దాని అభివృద్ధి విషయంలో ఏమాత్రం శ్రద్ధ చూపడంలేదు. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో జిల్లాలో రిమ్స్ ఏర్పాటు కాగా తమ ఘనతగానే ఇప్పటికీ నాయకులు చెప్పుకొంటున్నారు. వాస్తవానికి వైఎస్ అనంతరం దాని గురించి ఎవరూ పెద్దగా పట్టించుకోవడంలేదు. ఆరేళ్లు గడిచినా పూర్తికాని నిర్మాణ పనులే దానికి నిదర్శనం. 13 డిపార్టుమెంట్లలో 30 పీజీ సీట్లు మంజూరు చేయాలని కోరుతూ రిమ్స్ అధికారులు భారతీయ వైద్య మండలికి ప్రతిపాదనలు పంపారు. ఆ మేరకు మండలి సభ్యులు ఇటీవల రిమ్స్‌ను పరిశీలించారు. అయితే సీట్ల మంజూరు విషయంలో కేంద్రంపై ఒత్తిడి తేవడంలో రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా జిల్లాకు చెందిన వైద్య ఆరోగ్య మంత్రి కోండ్రు మురళీమోహన్ విఫలం కావడంతో రాష్ట్రానికి అతి తక్కువ పీజీ సీట్లు మంజురయ్యాయి. మొత్తం 105 సీట్లు మంజురైతే వాటిలో 23 మాత్రమే ప్రభుత్వ వైద్య కళాశాలలకు మంజురు చేశారు. అందులో శ్రీకాకుళం రిమ్స్ వైద్య కళాశాలకు మొహమాటానికన్నట్లు 3 సీట్లు మాత్రమే కేటాయించడంపై అటు వైద్య విద్యార్థులు, ఇటు అధికారులు పెదవి విరుస్తున్నారు. జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులు శ్రద్ధ చూపకపోవడం వల్లే ఈ అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంత్రులు ఏం చేస్తున్నట్లు? జిల్లా నుంచి కిల్లి కృపారాణి, వైరిచర్ల కిశోర్‌చంద్ర దేవ్ కేంద్ర మంత్రులు ఉన్నారు. అలాగే కోండ్రు మురళీమోహన్, శత్రుచర్ల విజయరామరాజు రాష్ట్ర మంత్రులుగా అధికార భోగం అనుభవిస్తున్నారు. వీరంతా కలిసి కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ఉంటే పీజీ సీట్ల కేటాయింపులో అన్యాయం జరిగేది కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా వైద్య ఆరోగ్య శాఖకే మంత్రిగా ఉన్న కోండ్రు మురళీ మోహన్ ఉదాసీనత వహించారన్న అసంతృప్తి వ్యక్తమవుతోంది. జిల్లాకు అన్యాయం జరుగుతుంటే ఇంత మంది మంత్రులు ఏం చేస్తున్నట్లని పలువురు ప్రశ్నిస్తున్నారు. పీజీ సీట్ల రెండో జాబితా విడుదలయ్యే అవకాశాలున్నప్పటికీ ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం చూస్తుంటే ఈ మూడు సీట్లతే సరిపెడతారన్న అనుమానం వ్యక్తమవుతోంది. ప్రస్తుతానికి ఆ మూడే: రిమ్స్ డెరైక్టర్ రిమ్స్ వైద్య కళాశాలలో మొత్తం 13 డిపార్టుమెంట్లకు 30 పీజీ కోర్సు సీట్ల కోసం ప్రతిపాదనలు పంపాం. అయితే 3 సీట్లే మంజూరు చేశారు. తర్వాత రెండో జాబితా వచ్చే అవకాశమున్నా అదనపు సీట్లు ఇస్తారో లేదో తెలియదని రిమ్స్ డెరైక్టర్ టి.జయరాజ్ ‘న్యూస్‌లైన్’తో అన్నారు.