3ముప్పై అడిగితే
Published Wed, Feb 12 2014 1:58 AM | Last Updated on Sat, Sep 2 2017 3:35 AM
రిమ్స్ క్యాంపస్, న్యూస్‌లైన్: ఇద్దరు కేంద్ర మంత్రులు.. మరో ఇద్దరు రాష్ట్ర మంత్రులు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అందులోనూ ఒకరు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి. అయినా జిల్లా పెద్దాస్పత్రి అయిన రిమ్స్‌కు మేలు చేసేందుకు తమ పరపతిని ఏమాత్రం ఉపయోగించలేదు. ఫలితంగా రిమ్స్ వైద్య కళాశాలకు పీజీ సీట్ల కేటాయింపులో తీవ్ర అన్యాయం జరిగింది. 13 విభాగాలకు సంబంధించి 30 సీట్లు మంజూరు చేయాలని కోరగా ఫిజియాలజీ విభాగంలో 3 సీట్లు మాత్రమే కేటాయించారు. రిమ్స్ ఏర్పాటును తమ ఘనతగా ప్రచారానికి ఉపయోగించుకుంటున్న మంత్రులు, ఇతర అధికార పార్టీ ప్రజాప్రతినిధులు దాని అభివృద్ధి విషయంలో ఏమాత్రం శ్రద్ధ చూపడంలేదు. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో జిల్లాలో రిమ్స్ ఏర్పాటు కాగా తమ ఘనతగానే ఇప్పటికీ నాయకులు చెప్పుకొంటున్నారు. వాస్తవానికి వైఎస్ అనంతరం దాని గురించి ఎవరూ పెద్దగా పట్టించుకోవడంలేదు. ఆరేళ్లు గడిచినా పూర్తికాని నిర్మాణ పనులే దానికి నిదర్శనం.
13 డిపార్టుమెంట్లలో 30 పీజీ సీట్లు మంజూరు చేయాలని కోరుతూ రిమ్స్ అధికారులు భారతీయ వైద్య మండలికి ప్రతిపాదనలు పంపారు. ఆ మేరకు మండలి సభ్యులు ఇటీవల రిమ్స్‌ను పరిశీలించారు. అయితే సీట్ల మంజూరు విషయంలో కేంద్రంపై ఒత్తిడి తేవడంలో రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా జిల్లాకు చెందిన వైద్య ఆరోగ్య మంత్రి కోండ్రు మురళీమోహన్ విఫలం కావడంతో రాష్ట్రానికి అతి తక్కువ పీజీ సీట్లు మంజురయ్యాయి. మొత్తం 105 సీట్లు మంజురైతే వాటిలో 23 మాత్రమే ప్రభుత్వ వైద్య కళాశాలలకు మంజురు చేశారు. అందులో శ్రీకాకుళం రిమ్స్ వైద్య కళాశాలకు మొహమాటానికన్నట్లు 3 సీట్లు మాత్రమే కేటాయించడంపై అటు వైద్య విద్యార్థులు, ఇటు అధికారులు పెదవి విరుస్తున్నారు. జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులు శ్రద్ధ చూపకపోవడం వల్లే ఈ అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మంత్రులు ఏం చేస్తున్నట్లు?
జిల్లా నుంచి కిల్లి కృపారాణి, వైరిచర్ల కిశోర్‌చంద్ర దేవ్ కేంద్ర మంత్రులు ఉన్నారు. అలాగే కోండ్రు మురళీమోహన్, శత్రుచర్ల విజయరామరాజు రాష్ట్ర మంత్రులుగా అధికార భోగం అనుభవిస్తున్నారు. వీరంతా కలిసి కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ఉంటే పీజీ సీట్ల కేటాయింపులో అన్యాయం జరిగేది కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా వైద్య ఆరోగ్య శాఖకే మంత్రిగా ఉన్న కోండ్రు మురళీ మోహన్ ఉదాసీనత వహించారన్న అసంతృప్తి వ్యక్తమవుతోంది. జిల్లాకు అన్యాయం జరుగుతుంటే ఇంత మంది మంత్రులు ఏం చేస్తున్నట్లని పలువురు ప్రశ్నిస్తున్నారు. పీజీ సీట్ల రెండో జాబితా విడుదలయ్యే అవకాశాలున్నప్పటికీ ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం చూస్తుంటే ఈ మూడు సీట్లతే సరిపెడతారన్న అనుమానం వ్యక్తమవుతోంది.
ప్రస్తుతానికి ఆ మూడే: రిమ్స్ డెరైక్టర్
రిమ్స్ వైద్య కళాశాలలో మొత్తం 13 డిపార్టుమెంట్లకు 30 పీజీ కోర్సు సీట్ల కోసం ప్రతిపాదనలు పంపాం. అయితే 3 సీట్లే మంజూరు చేశారు. తర్వాత రెండో జాబితా వచ్చే అవకాశమున్నా అదనపు సీట్లు ఇస్తారో లేదో తెలియదని రిమ్స్ డెరైక్టర్ టి.జయరాజ్ ‘న్యూస్‌లైన్’తో అన్నారు.
Advertisement