‘రిమ్స్‌’ అప్రతిష్టపాలు | Drawbacks In Rims Medical College In Adilabad | Sakshi
Sakshi News home page

‘రిమ్స్‌’ అప్రతిష్టపాలు

Published Mon, Aug 13 2018 10:24 AM | Last Updated on Tue, Oct 9 2018 5:50 PM

Drawbacks In Rims Medical College In Adilabad - Sakshi

రిమ్స్‌ వైద్య కళాశాల

సాక్షి, ఆదిలాబాద్‌: వెనుకబడిన ఆదిలాబాద్‌ జిల్లాలో గిరిజనులకు వైద్య సదుపాయం కల్పించాలనే సదుద్దేశంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌.రాజశేఖరరెడ్డి ఆదిలాబాద్‌లో రిమ్స్‌ వైద్య కళాశాలను ఏర్పాటు చేశారు. 2008లో ఈ వైద్య కళాశాల ప్రా రంభమైంది. అప్పట్లో మొదటి బ్యాచ్‌ పూర్తయ్యే వరకు ఎంసీఐ ప్రతి సంవత్సరం అనుమతులు ఇచ్చేందుకు రిమ్స్‌లో తనిఖీలు నిర్వహించింది. 2008 నుంచి 2013 మధ్యలో ప్రతి సంవత్సరం జరిగిన తనిఖీల్లో పలు ఏడాదిల్లో ఎంసీఐ అనుమతి నిరాకరించడం, దానికి సంబంధించి లోపాలను తెలియజేస్తూ వాటిని సరిదిద్దుకుంటే మళ్లీ అనుమతినివ్వడం జరుగుతూ వచ్చాయి.

ఇలా అనేక ఒడిదుడుకులను దాటుతూ మొదటి బ్యాచ్‌ బయటకు వచ్చిన తర్వాత దీనికి పూర్తిస్థాయి గుర్తింపు లభించింది. ప్రతీ ఐదేళ్లకోసారి ఎంసీఐ బృందం వైద్య కళాశాలలో ఆయా ప్రమాణాలను కొనసాగిస్తున్నారా లేదా అనే పరిశీలన జరిపి మళ్లీ గుర్తింపునిస్తుంది. ఇప్పటికే రిమ్స్‌ నుంచి ఐదు ఎంబీబీఎస్‌ బ్యాచ్‌లు పూర్తి చేసుకున్నాయి. కాగా 2018 జూన్‌ 5న మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (ఎంసీఐ) బృందం మరోసారి రిమ్స్‌లో ప్రమాణాలను పరిశీలించేందుకు వచ్చింది.

దీంట్లో 22 లోపాలను గుర్తించి మరోసారి రిమ్స్‌కు అనుమతి నిరాకరించడంతో వైద్య కళాశాలలో విద్యార్థులు తమ భవితవ్యంపై ఆందోళనలో పడ్డారు. ప్రధానంగా ప్రస్తుతం హౌజ్‌సర్జన్‌ పూర్తిచేసిన వారు త్వరలో జరిగే పీజీ పరీక్షలు రాయాలంటే రిమ్స్‌కు ఎంసీఐ అనుమతినిస్తేనే సాధ్యమయ్యే పరిస్థితి. 2019లో రిమ్స్‌లో కొత్తగా ప్రవేశాలకు ఈ అనుమతితోనే ముడిపడి ఉంది. ఈ దృష్ట్యా విద్యార్థుల్లో డోలయామానం నెలకొంది. అనుమతి నిరాకరణ తర్వాత పలువురు హౌజ్‌సర్జన్‌లు రిమ్స్‌ డైరెక్టర్‌ అశోక్‌ను కలిసి ఈ విషయంలో ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
 
అంతర్గత లోపాలు బహిర్గతం..
రిమ్స్‌లో అంతర్గత లోపాలు మరోసారి బహిర్గ తం అయ్యాయి. ప్రధానంగా ఎంసీఐ ఎత్తిచూపిన 22 అంశాల్లో కీలక పదవుల్లో ఉన్న లోపాలు, దాం తోపాటు ప్రొఫెసర్లు, ట్యూటర్ల పోస్టుల ఖాళీలు ఆందోళన కలిగిస్తున్నాయి. అసోసియేట్‌ ప్రొఫెసర్‌గా ఉన్న డాక్టర్‌ అశోక్‌ ఆస్పత్రికి సంబంధించి కీలకమైన మెడికల్‌ సూపరింటెండెంట్‌ పోస్టు, వై ద్య కళాశాలకు సంబంధించి డైరెక్టర్‌ పోస్టును తన ఆదీనంలో ఉంచుకున్నారని నివేదికలు స్పష్టం చేయడం రిమ్స్‌లో ప్రధానంగా ఉన్నటువంటి లోపాన్ని ఎత్తిచూపింది. అసోసియేట్‌ ప్రొఫెసర్‌గా ఆయన తన బాధ్యతలను నిర్వర్తిస్తున్నట్లు లేదని స్పష్టం చేయడం గమనార్హం. డాక్టర్‌ అశోక్‌ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఆయన ఈ పదవికి అర్హులు కాదని పలువురు ఈ విషయంలో ఆరోపణలు చేస్తూ వచ్చారు.

అయినా ఇటు అధికార యంత్రాంగం కాని, అటు పాలకులు కానీ పట్టించుకున్న పాపాన పోకపోవడంతో ఈ వ్యవహారం అలాగే కొనసాగుతూ వస్తోంది. కీలకమైన మెడికల్‌ సూపరింటెండెంట్‌ బాధ్యతలు నిర్వర్తిస్తూ అటు డైరెక్టర్‌గా కొనసాగుతూ ఇటు అసోసియేట్‌ ప్రొఫెసర్‌ పోస్టుకు న్యాయం చేయడం లేదన్న అపవాదును ఆయన మూటగట్టుకున్నారు. ఇంత తతంగం జరుగుతున్నా ఉలుకూపలుకు లేకపోవడం చోద్యమే.

డీన్‌ పోస్టులో ఒకరున్నారని..
రిమ్స్‌ వైద్య కళాశాలలో డీన్‌ పోస్టు ప్రిన్సిపాల్‌ పోస్టువంటిది.. అలాంటి పోస్టులో ఓ మహిళా ప్రొఫెసర్‌ కొనసాగుతున్నారన్నది ఇప్పటికీ ఎవరికీ తెలియదు. ఎంసీఐ నివేదికలో ఈ రహస్యాన్ని బట్టబయలు చేసింది. తమ తనిఖీలో డీన్‌ రెగ్యులర్‌గా డ్యూటీలకు అటెండ్‌ కావడం లేదని వారు పేర్కొన్నారు. అదే సమయంలో జూన్‌ 5న తాము తనిఖీకి వచ్చినప్పుడు మధ్యాహ్నం 3గంటల వరకు ఆమె అందుబాటులో లేరని తెలిపారు. డీన్‌ ఎక్కడికి వెళ్లారని ప్రశ్నిస్తే హైదరాబాద్‌ డీఎంఈఆర్‌ ఆఫీసులో మీటింగ్‌కు వెళ్లారని చెప్పారని, ఆ సమయంలో డీఎంఈఆర్‌ రిమ్స్‌లో 12గంటలకు తమతో ఉన్నారని ఎంసీఐ సభ్యులు తెలపడం రిమ్స్‌లో రహస్యంగా జరుగుతున్న అనేక వ్యవహారాలను తేటతెల్లం చేస్తోంది.

అనేక డిక్లరేషన్‌ ఫారాలపై డీన్‌ సంతకం చేయాల్సి ఉండగా, వాటిపై సంతకాలు లేవని పేర్కొన్నారు. బయోకెమిస్ట్రి విభాగంలో ఆమె ప్రొఫెసర్‌గా కొనసాగుతున్న విషయం పలువురికి తెలియదని తెలుస్తోంది. గత కొంత కాలంగా ఆదిలాబాద్‌ రిమ్స్‌లో మెడికల్‌ సూపరింటెండెంట్‌గా, డైరెక్టర్‌గా, డీన్‌గా ఒక్కరే ఉన్నారనే ప్రచారం ఉంది. దీంతో ఈ పోస్టులో మరొకరు ఉన్నారనే విషయం ఎంసీఐ నివేదికతోనే తేటతెల్లమైంది. ఓ ప్రొఫెసర్‌ పోస్టులో ఇంతటి రహస్యాలు దాచిపెట్టడం వెనుక ఆంతర్యమేమిటో వారికే తెలియాలి.

ఫ్యాకల్టీలో ఖాళీలు..
రిమ్స్‌లో ప్రొఫెసర్, అసోసియేట్‌ ప్రొఫెసర్, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు సంబంధించి 35.84 శాతం ఖాళీలు ఉన్నట్లు ఎంసీఐ తన నివేదికలో పేర్కొంది. ప్రధానంగా ప్రొఫెసర్, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీలో నిర్లక్ష్యం వెనుక కొందరి ప్రయోజనం దాగివుందన్న విమర్శలు లేకపోలేదు. ప్రధానంగా ప్రొఫెసర్, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల్లో సీనియర్‌ వ్యక్తులు వచ్చిన పక్షంలో డైరెక్టర్‌గా వారికి అవకాశం దక్కే పరిస్థితి ఉంటుంది. దీంతోనే ఆ పోస్టుల భర్తీలో ఏదో కోణం దాగివుందన్న ఆరోపణలు ఉన్నాయి.

ట్యూటర్‌ పోస్టులు 80.64 శాతం ఖాళీలు ఉన్నట్లు తెలిపారు. ఇదిలా ఉంటే ఎంసీఐ తనిఖీకి వచ్చిన రోజు ఆస్పత్రిలో పనిచేసే 14 మంది రెగ్యులర్‌ వైద్యులు హాజరుకాకపోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతో రెసిడెంట్‌ డాక్టర్ల విషయంలో పోస్టుల ఖాళీలు అధికంగా ఉన్నట్లు ఎంసీఐ నివేదిక చూపిస్తోంది. కీలక బాధ్యతలో ఉన్న వ్యక్తితో ఈ రెగ్యులర్‌ డాక్టర్లకు కొంతమందికి పొసగకపోవడంతోనే వారు ఆరోజు హాజరుకాలేదనే ప్రచారం లేకపోలేదు.

వీటితోపాటు అనేక లోపాలు..
రిమ్స్‌లో కీలక బాధ్యతల్లో ఉన్న వ్యక్తుల లోపాలు, ఫ్యాకల్టీ ఖాళీలతోపాటు ఇతర లోపాలను కూడా ఎంసీఐ ఎత్తిచూపింది. ప్రధానంగా ఎంసీఐ తనిఖీకి బెడ్‌ ఆక్యుపెన్సి కేవలం 52.97 శాతం మాత్రమే ఉన్నట్లు తెలిపారు. ఓపీడీ రిజిస్ట్రేషన్‌ కౌంటర్‌ కంప్యూటరైజ్డ్‌ చేయలేదని స్పష్టం చేశారు. ఓజీ కోసం ప్రత్యేక క్యాజువాలిటీ లేదని తెలిపారు. సెంట్రల్‌ ఆక్సిజన్‌తోపాటు వాటిని పీల్చే పరికరాలు పనిచేయడం లేదని పేర్కొన్నారు. అనాటమిలో రెండు మృతదేహాలు మాత్రమే అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. ఇతర విభాగాల్లోనూ లోపాలను చూపించారు. వీటన్నిటిని నెలరోజుల్లో రెక్టిఫికేషన్‌ చేసుకోవాలి స్పష్టం చేశారు. కాగా కేవలం ఫ్యాకల్టీ విషయంలోనే ఎంసీఐ లోపం ఎత్తిచూపుతూ మళ్లీ వచ్చేసరికి దీన్ని సరిచేస్తామని తేలికగా చెబుతూ ఎంసీఐ తనిఖీలు నిరంతరం కొనసాగేవే అన్నట్లు రిమ్స్‌ వర్గాలు వ్యవహరించడం నిర్లక్ష్యాన్ని తేటతెల్లం చేస్తోంది.

మళ్లీ తనిఖీ ఉంటుంది..
రిమ్స్‌లో మళ్లీ ఎంసీఐ తనిఖీ ఉంటుంది. ప్రధానంగా ఫ్యాకల్టీ లేరని ఎంసీఐ నివేదికలో చూపించింది. ఈ లోపాలను సరిచేసుకుంటాం. మళ్లీ రూ.3లక్షల ఫీజు చెల్లిస్తాం. తద్వారా మళ్లీ తనిఖీలకు బృందం వస్తుంది. ప్రధానంగా ప్రొఫెసర్‌ 14, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ 10 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 10శాతం కంటే తక్కువ పోస్టులు ఖాళీగా ఉంటే ఎంసీఐ పెద్దగా ప్రాధాన్యత తీసుకోదు. రిమ్స్‌లో 18 శాతం ఖాళీలు ఉండడంతోనే ఈ పరిస్థితి ఎదురైంది. వాటిని సరిదిద్దుతాం. గతంలో పోస్టులను భర్తీ చేసినప్పటికీ పలువురు సెలవుల్లో ఉన్నారు. మరికొంతమంది బదిలీపై వెళ్లడం జరిగింది.  
– రిమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ అశోక్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement