► ప్రిస్కిప్షన్లలో స్పష్టతకు ఎంసీఐ ఆదేశాలు
► గతంలో సుప్రీం కోర్టు ఆదేశాలిచ్చినా బేఖాతర్
► జనరిక్ మందులు రాయని వైద్యులు
► కమీషన్‌ల కోసమేనని ఆరోపణలు
ఆదిలాబాద్: వైద్యులు పెద్ద అక్షరాలతో, జనరిక్ మందులనే ప్రిస్కిప్షన్‌లో రాయాలని ఇటీవలే ప్రధాని మోదీ పేర్కొన్నారు. జనరిక్ మందులనే రాయాలని గతంలోనే సుప్రీంకోర్టు వైద్యులకు సూచించింది. అయిప్పటికీ ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఎక్కడా ఈ నిబంధనలు అమలు కావడం లేదు. ఈ నిబంధనలు కచ్చితంగా అమలు చేయాల్సిందేనని ఎంసీఐ (మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా) శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది.
ఇక నుంచి వైద్యులు తప్పనిసరిగా జనరిక్ మందులే రాయాలని, పెద్ద అక్షరాలతోనే అందరికీ అర్థమయ్యే రీతిలో రాయాలని ఆదేశించింది. నిబంధనలు పాటించని వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఉమ్మడి జిల్లాలోని ఏ ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో పెద్ద అక్షరాలతో మందుల చీటీలు రాయడం లేదు. జనరిక్ మందులు కూడా రాయడం లేదు. జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రిలో కొంతమందే జనరిక్ మందులు రాస్తున్నారు. మిగతావారు ప్రైవేట్ మందులు రాసిస్తున్నారు.
ఎవరికీ అర్థంగాని రాత..
సాధారణంగా మనం జ్వరం లేదా ఏ అనారోగ్య సమస్యతో అయినా ఆస్పత్రికి వెళ్తే అక్కడ వారు ఇచ్చే కేషీట్ నుంచి మొదలు డిశ్చార్జ్ రిపోర్టు వచ్చేంతవరకు వారు రాసే ప్రిస్కిప్షన్ ఎవరికీ అర్థం కాదు. చదవడానికి ప్రయత్నించినా సమయం వృథా అవుతుంది. చాలా మంది వైద్యులు ఎవరికీ అర్థంకాని రీతిలో గొలుసుకట్టు రాత రాస్తున్నారు. ఇది వారి మందుల దుకాణం యజమానికే తెలుస్తుంది.
చాలా ఆస్పత్రులు, క్లినిక్‌ల వద్ద ప్రత్యేకంగా మందుల దుకాణాలుంటాయి. సదరు వైద్యుడికి ఆ మెడికల్ షాపు కమీషన్ ఇస్తుంది. డాక్టర్లు రాసిచ్చే చిట్టీలు డాక్టర్‌కు సంబంధం ఉన్న మెడికల్ షాపులోనే తీసుకోవాలి. ఇతర షాపులకు వెళ్లినా ఈ చీటి వారికి అర్థం కాదు. చిట్టీలోని మొదటి అక్షరాన్ని గుర్తించి లేదా వారు ముందే అనుకున్న కోడ్ భాషను బట్టి మందులు ఇస్తున్నారు.
కమీషన్‌ల కోసమే..
చాలామంది వైద్యులకు వారు రాసిన మందులపైనే మందుల దుకాణం యజమానులు కమీషన్‌లు ఇస్తుంటారు. ఎంత ఎక్కువ మొత్తంలో మందులు రాసి రోగి చేత ఎక్కువ మందులు కొనిపిస్తారో అంత ఎక్కువగా కమీషన్ వైద్యుడికి ఇస్తారు. ఈ కమీషన్‌ల కోసం కక్కుర్తి పడే కొందరు వైద్యులు రోగికి అవసరం లేకపోయినా అధికంగా మందులు రాస్తుంటారు. ఇది ప్రతీచోట జరుగుతున్న తంతు.
ఒకవేళ రోగి తనకు ఐదు రోజుల మందులు మాత్రమే రాసివ్వండి అంటే వారిని బెదిరించి రోగం తగ్గాలా? వద్దా? అంటూ వైద్యులు భయపట్టించడం గమనార్హం. ఎలాగైనా ఈ విధానానికి చెక్ పెట్టాలనే ప్రభుత్వం అందరికీ సులువుగా అర్థమయ్యే భాషలో పెద్ద అక్షరాలతో మందుల చీటీలు రాయాలని ఆదేశించింది.
క్రమశిక్షణ చర్యలు..
ఈ నిబంధనలు తక్షణమే అమలు చేయాలని, లేనిపక్షంలో క్రమశిక్షణ చర్యలు తీసుకోనున్నట్లు ఎంసీఐ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల వైద్యులు ఏమేరకు ఈ నిబంధనలు పాటిస్తారనేది ప్రశ్నార్థకమే. గతంలోనే సుప్రీంకోర్టు వైద్యుల చీటిరాతపై ఆదేశాలిచ్చినప్పటికీ క్షేత్రస్థాయిలో అమలుకావడం లేదు. ఎంసీఐ సూచించినట్లుగా దీనిపై విస్తృతప్రచారం కల్పించాలనీ, ఈ ఆదేశాలు అమలయ్యేలా చర్యలు చేపట్టాలని అన్ని రాష్ట్రాల ఆరోగ్య కార్యదర్శులను, వైద్యకళాశాలల డైరెక్టర్‌లకు ఎంసీఐ లేఖలు రాసింది.
ఈ నేపథ్యంలో జిల్లా కేంద్రంలోని రిమ్స్ వైద్యకళాశాలలో నిత్యం 1500 మంది రోగులు వస్తుంటారు. వీరికి మందుల చిట్టీలు అర్థంకాని రీతిలో వైద్యులు రాస్తుంటారు. రిమ్స్‌కు ఆనుకుని ఉన్న జనరిక్ ఔషధ కేంద్రంలో తక్కువ మందులు రాసి, ప్రైవేట్ ఆస్పత్రుల్లో లభించే మందులే ఎక్కువగా రాస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఇలా రాయడం ద్వారా వారికి కమీషన్‌లు వస్తున్నాయని వినిపిస్తోంది. ఎంసీఐ ఆదేశాలు ప్రభుత్వ ఆస్పత్రుల నుంచి అమలయ్యేలా చూడాలని పలువురు కోరుతున్నారు.
ప్రైవేట్ ఆస్పత్రులు ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేయడమే కాకుండా రోగులకు అర్థంకాని రీతిలో మందుల చీటీలు రాస్తున్న వారిపై కఠినంగా వ్యవహరించాల్సిన అవసర ఎంతైనా ఉంది. అనుకున్నట్లుగానే ఎంసీఐ నిబంధనలు అమలు చేస్తే ఇక రోగులకు వైద్యులు ఏ మందులు రాసిస్తున్నారో అర్థం చేసుకుంటారు. దీంతో వారు మోసపోయే అవకాశం కూడా ఉండదు.