‘లోకల్’ అర్హత ఉండి రాష్ట్రం వెలుపల ఎంబీబీఎస్ చేసినా స్థానికులే
మెడికల్ పీజీ సీట్ల భర్తీపై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు
2024–25 విద్యా సంవత్సరానికి మాత్రమే తీర్పు పరిమితం
ప్రభుత్వం జారీచేసిన జీఓ 148, 149 చట్ట విరుద్ధమని ప్రకటన
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎంబీబీఎస్ కోర్సు చదివిన వారిని మెడికల్ పీజీ సీట్ల భర్తీలో స్థానికులుగా పరిగణించాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ధర్మాసనం తేల్చిచెప్పింది. అలాగే, తెలంగాణ వెలుపల ఎంబీబీఎస్ పూర్తి చేసిన అభ్యర్థులకు రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం ‘స్థానికత’ వర్తింపజేయాలని ఆదేశించింది. తెలంగాణ మెడికల్ కాలేజీల (పీజీ), పీజీ (ఆయుష్) కోర్సుల నిబంధనలు 2021ను సవరిస్తూ అక్టోబర్ 28న రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీఓలు 148, 149లను చట్ట వ్యతిరేకమని కోర్టు కొట్టివేసింది.
తెలంగాణ మెడికల్ కాలేజీల (పీజీ మెడికల్ కోర్సులలో ప్రవేశం) నిబంధనలు 2021లోని రూల్ Vఐఐఐ ( జీజీ)లో ప్రభుత్వం చేసిన సవరణను సవాల్ చేస్తూ మంచిర్యాలకు చెందిన డాక్టర్ ఎస్ సత్యనారాయణ, హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ వీ రజిత హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. స్థానికత అంశంపైనే మరో 96 పిటిషన్లు కూడా దాఖలయ్యాయి. వీటిని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జే శ్రీనివాసరావు ధర్మాసనం సుదీర్ఘంగా విచారించి ఈ నెల 4న తీర్పును రిజర్వ్ చేసింది.
మంగళవారం తుదితీర్పును ప్రకటించింది. ఈ తీర్పు 2024–25 విద్యా సంవత్సరానికి మాత్రమే వర్తిస్తుందని ప్రకటించింది. ప్రభుత్వం తీసుకొచి్చన జీవో 148, 149 చట్ట వ్యతిరేకమని పిటిషనన్ల తరఫు న్యాయవాదులు వాదించారు. ఈ జీవోల ప్రకారం 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు తెలంగాణలో చదవడంతో పాటు ఇక్కడ బ్యాచిలర్ మెడికల్ డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులను మాత్రమే పీజీ మెడికల్ అడ్మిషన్లలో స్థానికులుగా పరిగణిస్తున్నారని తెలిపారు. ఇతర రాష్ట్రాల్లో ఎంబీబీఎస్ పూర్తి చేసినా, తామంతా తెలంగాణకు చెందినవారమే అయినందున స్థానిక అభ్యర్థులుగా గుర్తించేలా ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఫలితాలు వచ్చాక మార్పులు సరికాదు
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 95 నేపథ్యంలో రాష్ట్రపతి ఉత్తర్వులు తెలంగాణకు వర్తించవని, రాష్ట్రపతి ఉత్తర్వులను అన్వయించుకోలేదన్న ప్రభుత్వ వాదనను ధర్మాసనం తప్పుబట్టింది. విద్యకు సంబంధించి రాష్ట్రపతి ఉత్తర్వులు అమల్లో ఉంటాయని ప్రకటించింది. ఈ సందర్భంగా 2023లో ఇదే హైకోర్టు ఇచ్చిన తీర్పును ఉదహరించింది.
రాష్ట్ర విభజన తర్వాత ఏర్పాటుచేసిన మెడికల్ కాలేజీల్లో జాతీయ కోటా (15 శాతం) పోను.. మిగిలిన కన్వీనర్ కోటా సీట్లు (85 శాతం) స్థానిక విద్యార్థులకే కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీఓ 72ను సమర్థిస్తూ గత సెప్టెంబర్‌లో డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును సమర్ధించింది. ఆ తీర్పు రాష్ట్రపతి ఉత్తర్వులు 1974ను ఉల్లంఘించలేదని స్పష్టం చేసింది. 148, 149 జీఓలు రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధంగా ఉన్నాయని, రాష్ట్ర విద్యా సంస్థల నియంత్రణ చట్టంలోని సెక్షన్ 3(2)కు విరుద్ధమని ప్రకటించింది.
పీజీ మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు ఆగస్టు 11న పరీక్ష నిర్వహించి, 23న ఫలితాలు ప్రకటించిన తర్వాత అడ్మిషన్ నిబంధనలు మార్చడాన్ని ధర్మాసనం తప్పుబట్టింది. ఒకసారి నియామక ప్రక్రియ ప్రారంభమయ్యాక మధ్యలో మార్పులు సరికాదని తేల్చి చెప్పింది. ఎంబీబీఎస్‌తో పాటు బీఏఎంఎస్, బీహెచ్‌ఎంఎస్ పూర్తి చేసిన పిటిషనర్లకు కూడా స్థానికత వర్తిస్తుందని తుది తీర్పులో ప్రకటించింది. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం స్థానికత, రాజ్యాంగంలోని ఆర్టికల్ 371డీ, ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 95తో పాటు పలు తీర్పులను తీర్పులో ప్రస్తావించింది.
Comments
Please login to add a commentAdd a comment