ప్రైవేటు ఉద్యోగి అయిన సురేశ్ కుమారుడు వర్షిత్. ఓ కార్పొరేట్ స్కూల్లో 8వ తరగతి చదువుతున్నాడు. వార్షిక ఫీజు రూ.77 వేలు. అందులో ఇప్పటికే రూ.35 వేలు కట్టేశారు. కరోనా ఎఫెక్ట్‌తో ఉద్యోగం కోల్పోయి ఇబ్బందులు పడుతున్నామని,ఫీజు తగ్గించాలని ప్రిన్సిపాల్‌ను కోరినా ప్రయోజనం లేదు. మొత్తం చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నారు. ఫీజు కట్టకుంటే హాల్ టికెట్ ఇవ్వబోమని, పరీక్షలు రాయనివ్వమని అంటున్నారు. దీంతో ఏం చేయాలో అర్థంకాక సురేశ్ అప్పుల వేటలో పడ్డారు.
సాక్షి, హైదరాబాద్: ఇంతటి కరోనా సమయం లోనూ రాష్ట్రంలోని కార్పొరేట్ స్కూళ్లు, కాలేజీల దోపిడీ కొనసాగుతోంది. ఏదో ఒకలా ఫీజులు వసూలు చేసేందుకు అన్ని మార్గాల్లో ప్రయత్నాలు జరుగుతున్నాయి. టెన్త్ పరీక్షలు రద్దయినా.. మిగతా తరగతులకు పరీక్షలు ఉంటాయని విద్యార్థుల తల్లిదండ్రులకు మెసేజీలు పెడుతున్నాయి. ఫీజులు పూర్తిగా కట్టాలని ఒత్తిడి తెస్తున్నాయి. ఫీజుల కోసం టీచర్లతో ఫోన్లు చేయించడం, వినకుంటే పరీక్షలు రాయనివ్వబోమని, పైతరగతికి పంపబోమని బెదిరించడం చేస్తున్నాయి. అసలే కరోనా ప్రభావంతో ఆదాయం తగ్గి, ఖర్చులు పెరిగి ఇబ్బందులు పడుతున్న తల్లిదండ్రులు.. చివరికి అప్పులు చేసైనా ఫీజులు కడుతున్నారు. మరోవైపు పలు కాలేజీలు ఇంటర్ విద్యార్థులకు జేఈఈ కోచింగ్ పేరిట ప్రత్యక్ష బోధనకు రావాలని ఒత్తిడి తెస్తున్నాయి. వినకుంటే తల్లిదండ్రులను వేధిస్తున్నాయి.
‘ఫీజు’ బాధలో లక్షల మంది తల్లిదండ్రులు
కరోనా ఎఫెక్ట్, లాక్‌డౌన్ పరిస్థితులతో సుమారు లక్షన్నర వరకు ప్రైవేటు టీచర్లు, లెక్చరర్లు, మరో 2 లక్షల మంది వరకు ఇతర రంగాల వారు ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు దూరమయ్యారు. కుటుంబం గడవటమే కష్టంగా మారిన పరిస్థితుల్లో వారు పిల్లల ఫీజుల కోసం తంటాలు పడాల్సి వస్తోంది. పరీక్షల తర్వాత టీసీ తీసుకునేప్పటి వరకు ఫీజుల సొమ్మంతా చెల్లిస్తామంటున్నా యాజమాన్యాలు ఒప్పుకోవడం లేదు. ఇప్పుడు కడితేనే పిల్లలకు హాల్ టికెట్లు ఇస్తామని, పరీక్షలు రాయనిస్తామని అంటున్నాయి.
టెన్త్ విద్యార్థులపైనా..
పదో తరగతి విద్యార్థులకు ప్రభుత్వం పరీక్షలు రద్దు చేసింది. ఫార్మేటివ్ అసెస్‌మెంట్–1 (ఎఫ్‌ఏ) మార్కుల ఆధారంగా ఫైనల్ మార్కులు ఇచ్చే ఆలోచనలు చేస్తోంది. స్కూళ్లు ఇదే అదనుగా ఫీజు మొత్తం వసూలు చేసుకునే పనిలో పడ్డాయి. ఫీజులు కడితేనే ఎఫ్‌ఏ–1 మార్కులను ప్రభుత్వానికి పంపుతామని బెదిరిస్తున్నాయి. దీంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
సిబ్బంది అంతంతే.. అయినా పూర్తి ఫీజులు
రాష్ట్రంలో 1,586 ప్రైవేటు జూనియర్ కాలేజీలుంటే అందులో కార్పొరేట్ కాలేజీలే 700పైగా ఉన్నాయి. ప్రైవేటు స్కూళ్లు 10,807 ఉంటే.. అందులో 4 వేల వరకు బడా ప్రైవేటు స్కూళ్లు, మరో 2 వేల వరకు కార్పొరేట్ స్కూళ్లు, మిగతావి చిన్న పాఠశాలు. కాలేజీల్లో క్యాంపస్, బ్రాంచీని బట్టి రూ.50 వేల నుంచి రూ.1.85 లక్షల వరకు ఫీజు వసూలు చేస్తున్నాయి. స్కూళ్లలో రూ.20 వేల నుంచి రూ.లక్ష వరకు వసూలు చేస్తున్నాయి. అయితే కరోనా కారణంగా.. చాలా స్కూళ్లు, కాలేజీలు 75 శాతం సిబ్బందిని తొలగించి, మిగతా 25 శాతం మందితోనే క్లాసులు చెప్తున్నాయి. ప్రత్యక్ష బోధన మొదలైనా వారిని తిరిగి విధుల్లోకి తీసుకోలేదు. ఈ 25 శాతం మంది సిబ్బందికి కూడా అరకొర వేతనాలే చెల్లిస్తున్నాయి. కానీ విద్యార్థుల నుంచి మాత్రం పూర్తి ఫీజులు వసూలు చేస్తున్నాయి.
ఇంత జరుగుతున్న విద్యా శాఖ గానీ, ప్రభుత్వంగానీ పట్టించుకోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విద్యార్థుల నుంచి నెలవారీ ట్యూషన్ ఫీజులు తీసుకోవాలంటూ గతంలో జీవో 46 జారీ చేసినా.. అది అమలుకాలేదు. అసలు స్కూళ్లలో ఎందరు టీచర్లు ఉన్నారు, ఎందరిని తొలగించారు, ఆన్‌లైన్ బోధన ఎంత మంది చేశారు, విద్యార్థులకు ఏ మేర పాఠాలు జరుగుతున్నాయన్న దానిపై విద్యాశాఖ పట్టించుకున్న దాఖలాలు లేవన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలోని బడా, కార్పొరేట్ స్కూళ్లు, కాలేజీల్లో అడ్డగోలు ఫీజుల వసూళ్లపై ఇటు పాఠశాల విద్యా శాఖకు, అటు ఇంటర్ బోర్డుకు రోజూ పదుల సంఖ్యలో ఫిర్యాదులు కూడా వస్తున్నాయి. ఇప్పటికైనా ఫీజుల విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకుని, తగిన చర్యలు చేపట్టాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
ఇప్పుడు కూడా కార్పొరేట్ యాజమాన్యాల కక్కుర్తి..!
Published Sat, Apr 17 2021 2:30 AM | Last Updated on Sat, Apr 17 2021 11:17 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment