ఎంతెంతదూరం..చాలా చాలా దూరం..  | Your children education is my responsibility says YS Jagan | Sakshi
Sakshi News home page

ఎంతెంతదూరం..చాలా చాలా దూరం.. 

Published Mon, Jan 7 2019 5:38 AM | Last Updated on Mon, Jan 7 2019 5:38 AM

Your children education is my responsibility says YS Jagan - Sakshi

‘ఎంతెంత దూరం.. చాలా చాలా దూరం..’అని గతంలో గ్రామీణ ప్రాంతాల్లో పాట పాడుకుంటూ పిల్లలు ఆడుకునే వారు. ఓ చిన్నారి కళ్లు కనిపించకుండా గంతలు కడితే.. మరొకరు ఒక వస్తువును ఆ చుట్టు పక్కల దాచేస్తారు.ఆ తర్వాత కళ్లకు కట్టిన గంతలు విప్పుతారు.ఆ చిన్నారి ఈ పాట పాడుకుంటూ దాచినవస్తువును కనుక్కోవడానికి వెతుక్కుంటూ బయలు దేరుతుంది. ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాల పరిస్థితీ అలాగే మారింది. అది ఎక్కడుందో వెతుక్కోవాల్సిన దుస్థితి.   

►చంద్రబాబు హయాంలో భారంగా మారిన పాఠశాల విద్య 
►రేషనలైజేషన్‌ పేరిట పెద్ద సంఖ్యలో పాఠశాలల మూత 
►కార్పొరేట్‌ విద్యా సంస్థల కోసం ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేస్తున్న సర్కారు 
►వేలకు వేలు ఫీజులు భరించలేక చదువులకు దూరమవుతున్న పేద పిల్లలు 
►నవరత్నాల్లోని ‘అమ్మ ఒడి’తో పిల్లల చదువులకు వైఎస్‌ జగన్‌ భరోసా  
►పిల్లల్ని బడికి పంపించే ప్రతి తల్లికీ ఏడాదికి రూ.15 వేలు తమ చిన్నారుల చదువుకు ఆసరాగా ఉంటుందంటున్న తల్లిదండ్రులు 

రాష్ట్రంలో పాఠశాల విద్య సామాన్య, మధ్య తరగతి కుటుంబాల వారికి దూరం అవుతోంది. పిల్లలకు చదువు చెప్పించాలంటేనే తల్లిదండ్రులు బెంబేలెత్తుతున్నారు. ఎల్‌కేజీ, యూకేజీల్లో చేర్పించాలన్నా వేలకు వేలు ఫీజులు కట్టాల్సిందే. ప్రయివేటు, కార్పొరేట్‌ సంస్థలను ప్రోత్సహించేలా చంద్రబాబు ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేస్తూ వస్తోంది. రేషనలైజేషన్‌ పేరిట మూసేయడమేగాక.. సరపడా టీచర్లను నియమించకుండా, మౌలిక సదుపాయాలు కల్పించకుండా ప్రభుత్వ పాఠశాలలను అధ్వానంగా మార్చింది. ఇక్కడ చదువుతున్న పేద పిల్లలకు సరైన విద్య అందించకుండా వారిని ప్రయివేటు వైపు వెళ్లేలా చేస్తోంది. క్రమేణా ప్రభుత్వ పాఠశాలలను మూత వేయించి వాటి స్థానే కార్పొరేట్‌ సంస్థలకు పెద్దపీట వేసేలా కార్యక్రమాలు చేస్తోంది.   

రేషనలైజేషన్‌ పేరిట స్కూళ్ల మూత 
నాలుగున్నరేళ్లుగా తెలుగుదేశం ప్రభుత్వం రేషనలైజేషన్‌ పేరిట దాదాపు ఐదు వేల పాఠశాలలను మూత వేయించింది. ఇందులో అత్యధికం ప్రాథమిక పాఠశాలలే. ప్రతి కిలోమీటర్‌కు ఒక ప్రాథమిక పాఠశాల, ప్రతి మూడు కిలోమీటర్లకు ఒక ప్రాథమికోన్నత పాఠశాల, ఐదు కిలోమీటర్లకు ఒక ఉన్నత పాఠశాల ఉండాలన్నది ప్రభుత్వ నిబంధన. ఒకటో తరగతిలో చేరే బాలబాలికలకు వయసు ఐదేళ్లు మాత్రమే ఉంటాయి కాబట్టి వారికి సమీపంలోనే స్కూలు ఉండాలి. కానీ చంద్రబాబు అధికారంలోకి రాగానే మూడు కిలోమీటర్లలో ఉన్న ప్రాథమిక పాఠశాలలన్నింటినీ విలీనం పేరిట ఒక్కటిగా చేసి.. మిగతా స్కూళ్లను మూసేయించారు. ఆయా స్కూళ్లలో తగినంత మంది విద్యార్థులు లేరన్న సాకుతో వాటిని మూయించారు.

ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ కుటుంబాలున్న ప్రాంతాలు, గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లోని స్కూళ్లు మూత పడటంతో అక్కడ చదువుతున్న వేలాది మంది పిల్లలకు పాఠశాలలు దూరమయ్యాయి. దగ్గరలోని ప్రయివేటు పాఠశాలలకు వెళ్లి చదువుకోవడానికి తగినంత ఆర్థిక స్తోమత లేక తల్లిదండ్రులు వారిని స్కూళ్లకు పంపడం మాన్పిస్తున్నారు. అంతే కాకుండా దాదాపు ఐదు వేలకు పైగా ప్రాథమికోన్నత పాఠశాలలను ప్రాథమిక పాఠశాలలుగా డీగ్రేడ్‌ చేశారు. అక్కడి 6, 7, 8 తరగతుల్లోని విద్యార్థులు దూరంలోని ఇతర స్కూళ్లకు వెళ్లలేక.. దగ్గరలోని ప్రయివేటు స్కూళ్లను ఆశ్రయించాల్సి వస్తోంది. 98 హైస్కూళ్లనూ రేషనలైజేషన్‌ పేరిట యూపీ స్కూళ్లుగా డీగ్రేడ్‌ చేశారు. తమ పిల్లలను చదువులు మాన్పించడం సరికాదని భావించే తల్లిదండ్రులు అప్పులు చేసి మరీ ప్రయివేటు స్కూళ్లకు పంపిస్తున్నారు. ఆయా స్కూళ్లలో ఫీజుల భారం మోయలేక, అప్పులు కూడా దొరకని వారి పిల్లలు మధ్యలోనే చదువులకు స్వస్తి చెబుతున్నారు.  
ఒలింపిక్స్‌ నిర్వహిస్తారట.. 
పాఠశాలల్లో క్రీడా వసతులను మెరుగు పరచడం లేదు గానీ, అమరావతిలో ఒలింపిక్స్‌ నిర్వహిస్తామని సీఎం ప్రకటించడం ఆశ్చర్యపరిచింది. తిరుపతిలో నిర్వహించిన ఇండియన్‌ సైన్స్‌ కాంగ్రెస్‌ సమావేశాల్లో.. రాష్ట్రానికి చెందిన వారు నోబుల్‌ బహుమతి తెచ్కుకుంటే రూ.100 కోట్లు ఇస్తామని చంద్రబాబు ప్రకటించి అందరినీ విస్మయపరిచారు. పాఠశాలల్లో కనీస సదుపాయాలు కల్పించకుండా, ఉన్నత విద్యాసంస్థల్లో పరిశోధనలకు వీలుగా ల్యాబ్‌లు ఇతర సౌకర్యాలు కల్పించకుండా, బోధన, బోధనేతర సిబ్బందిని నియమించకుండా చంద్రబాబు ఇలా ప్రకటించడం ఆశ్చర్యపరిచింది. 

ఆ ధైర్యంతోనే పిల్లల్ని చదివిస్తున్నా.. 
నాకు ఇద్దరు పిల్లలు. పెద్దోడు కొండేటి సాయి 5వ తరగతి, చిన్నోడు కొండేటి నవీన్‌ 3వ తరగతి చదువుతున్నారు. నా భర్త నాలుగేళ్ల కిందట ఇల్లు వదిలి వెళ్లిపోయాడు. నేను కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాను. కుటుంబ పోషణే కష్టంగా ఉన్న నాకు.. పిల్లల చదువులు పెనుభారంగా మారాయి. వారిని కూడా చదువు మాన్పించి పనులకు పంపితే తప్ప ఇల్లు గడవని పరిస్థితి. కానీ అమ్మ ఒడి పథకం ద్వారా జగనన్న ఆర్థికంగా చేయూతనిస్తే పిల్లల చదువులు ముందుకు సాగుతాయి. ఆ ఆశతోనే వారి చదువులను కొనసాగిస్తున్నాను. లేదంటే ఇప్పటికి మాన్పించేదాన్ని.  


జగనన్నపై నమ్మకం ఉంది 
మా గ్రామంలో ఎక్కువ మంది ఉపాధి కూలీలే. నాకు ముగ్గురు ఆడపిల్లలు. ఎంతో కష్టపడి వారిని చదివిస్తున్నా. జగనన్న ప్రకటించిన నవరత్నాలలోని అమ్మ ఒడి పథకం గురించి విన్నాక చాలా ధైర్యం వచ్చింది. ఎన్ని కష్టాలొచ్చినా పిల్లల చదువులను మాన్పించలేదు. అమ్మ ఒడి పథకంతో నా చిన్నారుల చదువులకు భరోసా దొరికిందని ధైర్యంగా వారిని బడికి పంపుతున్నాను. అన్న రాగానే వారి చదువుల బాధ్యతను తీసుకుంటాడన్న నమ్మకం ఉంది.  


నేను మళ్లీ చదువుకుంటాను.. 
మాది చాలా పేద కుటుంబం కావడంతో మా అమ్మానాన్న నన్ను చదివించలేకపోయారు. ఏడో తరగతిలోనే బడి మానేసి.. వారికి చేదోడువాదోడుగా ఉంటున్నా. నాన్న అప్పల్రాజు రోజూ ఇటుకల పనులకు, అమ్మ అప్పమ్మ కూలి పనులకు వెళుతూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. నాకు చదువుకుందామన్న కోరిక ఉన్నా ఆర్థిక పరిస్థితులు ఆ కోరికను తీర్చుకోనివ్వడం లేదు. జగనన్న ప్రకటించిన నవరత్నాల్లోని అమ్మ ఒడి పథకంతో ఎటువంటి ఆర్థిక ఇబ్బందుల్లేకుండా పిల్లల్ని చదివించుకోవచ్చని చెబుతున్నారు. పిల్లల్ని బడికి పంపితే ఏటా రూ.15,000 ఇస్తారని తెలిసి చాలా సంతోషం వేసింది. జగనన్న త్వరగా ముఖ్యమంత్రి అయ్యి.. నాలాంటి పేద పిల్లలను చదివించాలని కోరుకుంటున్నా.  

మాలాంటి పేదలకు ‘అమ్మ ఒడి’ వరం 
మేం నిరుపేద గిరిజనులం.. రెక్కాడితేగానీ డొక్కాడని బతుకులు మావి. మాకు ముగ్గురు కుమార్తెలు. పెద్ద కుమార్తె డిప్పల అప్పలమ్మను పేదరికం కారణంగా బడికి పంపలేకపోయాము. పనుల్లో మాకు చేదోడు వాదోడుగా ఉంటోంది. పారమ్మ ఒకటో తరగతి, అనిత రెండో తరగతి చదువుతున్నారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన నవరత్నాలులోని ‘అమ్మ ఒడి’ పథకం అమలైతే.. మా పెద్ద బిడ్డను కూడా బడికి పంపిస్తాం. పిల్లలను బడికి పంపితే ఆర్థిక సాయం అందిస్తానని జగన్‌ చెబుతున్నారు. అదే జరిగితే కూలికెళితే తప్ప పూట గడవని మాలాంటి నిరుపేదలందరూ ఎంతో సంతోషిస్తారు. 

కార్పొరేట్‌లో ఫీజుల మోత 
కార్పొరేట్‌ పాఠశాలల్లో ఫీజులపై నియంత్రణ లేకపోవడంతో ఆయా యాజమాన్యాలు ఇష్టానుసారం ఫీజులు పెంచేస్తున్నాయి. నగర, పట్టణ ప్రాంతాల్లోని స్కూళ్లే కాకుండా మండల స్థాయి స్కూళ్లలోనూ ఫీజులు భారంగా మారాయి. ఎల్‌కేజీ, యూకేజీ నుంచే వేలల్లో ఫీజులు వసూలు చేస్తున్నారు. విశాఖపట్నం, తిరుపతి, విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, కర్నూలు ఇలా పలు నగరాల్లోని కార్పొరేట్‌ స్కూళ్లు 30 వేల నుంచి లక్ష వరకు ఫీజుల కింద విద్యార్థుల నుంచి వసూలు చేస్తున్నాయి. ఇవి కాకుండా పుస్తకాలు, యూనిఫాంలు.. తదితరాల పేరిట వేలకొద్దీ డబ్బు వసూలు చేస్తున్నాయి. పుస్తకాలకు రూ.15 వేలు, యూనిఫాంకు రూ.7 వేలు, ఇతర సామగ్రి అంటూ మరో 2 వేలు దండుకుంటున్నాయి. ఈ ఫీజులు భరించలేని విద్యార్థుల తల్లిదండ్రులు ఆస్తులు అమ్ముకుంటూ, అప్పులు చేస్తున్నారు.   

చంద్రబాబు 2014 ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాలు 
►టీడీపీ అధికారంలోకొస్తే పేద పిల్లలకు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందిస్తాం 
►కాలేజీ విద్యార్థులకు ఐపాడ్‌లు, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా విద్యావిధానంలో మార్పులు చేస్తాం.  
►ప్రతి కిలోమీటర్‌కు ఒక ఎలిమెంటరీ స్కూలు, మూడు కిలో మీటర్లకు ఒక యూపీ స్కూలు, ఐదు కిలోమీటర్లకో హైస్కూలు పెడతతాం (వాస్తవానికి ఉన్న స్కూళ్లను మూయించారు). 
►ఏటా విద్యాసంవత్సరానికిమూడు నెలల ముందే డీఎస్సీనినిర్వహించి టీచర్లను నియమిస్తాం. 

ఇదీ బాబు ప్రభుత్వ నిర్వాకం 
►పాఠశాలల్లో సదుపాయాల కల్పన పేరిట నాలుగున్నరేళ్లలో ప్రభుత్వం విద్యాభివృద్ధి నిధులను తెలుగుదేశం నేతలకు పప్పు బెల్లాల కింద పంచిపెట్టింది. 
►స్కూళ్లలో బయోమెట్రిక్‌ యంత్రాలు, హెచ్‌ఎంల నుంచి పైస్థాయి అధికారులకు ట్యాబ్‌ల పంపిణీ, పాఠశాలలకు ఫర్నీచర్‌ సరఫరా, మరుగుదొడ్ల నిర్మాణం.. ఇలా అన్ని వ్యవహారాల్లో భారీగా నిధులు దండుకున్నారు.  
►నాలుగున్నరేళ్లలో సర్వశిక్ష అభియాన్‌ నిధులతో పాటు ఇటు బడ్జెట్‌ నిధులనూ ఇష్టానుసారంగా తమ వారికి కాంట్రాక్టుల పేరిట కట్టబెట్టిన ప్రభుత్వం.. తాజాగా హైబ్రిడ్‌యాన్యుటీ అంటూ కొత్త కమీషన్ల వ్యవహారానికి తెరలేపింది. రూ.4,800 కోట్లతో మౌలిక సదుపాయాల పేరిట కాంట్రాక్టులు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసింది.  
►ప్రభుత్వ స్కూళ్లను ప్రయివేటు, స్వచ్ఛంద, ఆధ్యాత్మిక సంస్థలకు అప్పగించి వారికి కోట్లాది రూపాయలు దోచిపెడుతోంది. ఈషా ఫౌండేషన్, రిషివేలీ, ప్రథమ్‌ తదితర సంస్థలకూ పాఠశాలలను అప్పగించింది. ఎవరి మార్గంలో బోధన చేయాలో అర్థంకాక టీచర్లు, ఏది నేర్చుకోవాలో తెలియక విద్యార్థులు తలలు పట్టుకుంటున్నారు.  
►మధ్యాహ్న భోజన పథకంలో వివిధ సరకుల కొనుగోలు కాంట్రాక్టులను కేంద్రీకృతం చేసి.. కందిపప్పు తదితరాల కొనుగోలులో కోట్ల కొద్దీ ని«ధులను పక్కదారి పట్టిస్తున్నారు. కోడిగుడ్ల సరఫరాలో తెలుగుదేశం నేతలు కాంట్రాక్టర్లుగా మారి పిల్లల కడుపుకొడుతున్నారు. 
►పాఠ్యపుస్తకాలు, యూనిఫాంల పంపిణీలో అక్రమాలకు అంతే లేదు. ఆప్కో మాటున దుస్తుల పంపిణీలో టీడీపీ నేతలు అక్రమాలకు పాల్పడుతున్నారు.  
►వాస్తవ పరిస్థితికి భిన్నంగా గణాంకాలు చూపిస్తూ విద్యాభివృద్ధిలో రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో ఉందంటూ అబద్ధాలు చెబుతోంది.  
►విద్యాభివృద్ధిలో ముందంజలో ఉన్నామని చెప్పి.. రాష్ట్రానికి రావాల్సిన సర్వశిక్ష అభియాన్‌తో పాటు ఇతర నిధులకూ కేంద్రం కోతపెట్టడానికి కారణమయ్యారు.
 
కొత్త చట్టాలతో మరింత ప్రమాదం  
కార్పొరేట్, ప్రయివేట్‌ సంస్థలను ప్రోత్సహించడానికి ప్రభుత్వం ఏకంగా ఒక ప్రత్యేక చట్టాన్ని తెస్తోంది. సెల్ఫ్‌ ఫైనాన్స్‌డ్‌ ఇండిపెండెంట్‌ స్కూల్స్‌ పేరిట తెస్తున్న ఈ చట్టంతో ఇక చదువులు మరింత భారంగా మారనున్నాయి. పెద్దపెద్ద కార్పొరేట్‌ సంస్థలు మాత్రమే పాఠశాలలు స్థాపించేలా నిబంధనలు పెట్టింది. ప్రభుత్వ పాఠశాలలను మూసేసి.. వాటి ఆస్తులను ప్రయివేటుకు అప్పగించేలా ప్రభుత్వం పావులు కదుపుతోంది. ఇప్పటికే రేషనలైజేషన్‌ పేరిట మూతవేసిన స్కూళ్లలో 200 పాఠశాలలను బ్రిడ్జి ఇంటర్నేషనల్‌ సంస్థకు అప్పగించేందుకు ప్రభుత్వం ఒప్పందం కూడా చేసుకుంది. 

మీ పిల్లల చదువుకు నాదీ భరోసా
 
తెలుగుదేశం ప్రభుత్వం గత నాలుగున్నరేళ్ల పాలనలోప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేయడమే కాకుండాపాఠశాల విద్యను భారంగా మార్చింది. ఆ భారం మోయలేక చదువులు మాన్పిస్తున్న నిరుపేద, మధ్యతరగతికుటుంబీకులు ఎంతో మంది నాకు కష్టాలు చెప్పుకున్నారు. అందుకే ప్రతి తల్లి తన పిల్లలను బడికి పంపితే చాలు. ఏ బడికి అయినా ఫరవాలేదు. ఏడాదికి రూ.15 వేలు ఇస్తాను.‘అమ్మ ఒడి’ పథకం కింద ఆ తల్లి ఖాతాలో జమ చేస్తాం.పేదింటి పిల్లల చదువులకు ఏ తల్లిదండ్రులూ భయపడాల్సిన అవసరం లేదు.  


సంవత్సరానికి రూ.15,000 
 –  వైఎస్‌ జగన్‌  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement