రెండు నెలలు ఓపిక పట్టండి
వచ్చేది మన ప్రభుత్వమే.. మీ సమస్యలన్నీ తీరిపోతాయి ప్రజలకు వైఎస్ జగన్ భరోసా
వరుసగా మూడోరోజు ‘పశ్చిమ’లో రోడ్ షో
ప్రతిచోటా వెల్లువెత్తిన ప్రజాభిమానం
ప్రజా సమస్యలు తెలుసుకొంటూ వారికి ధైర్యం చెబుతూ సాగిన పర్యటన
గొంతు సహకరించకపోవడంతో ఎక్కడా ప్రసంగించని జగన్
‘‘కొద్దిరోజులు ఓపిక పట్టండమ్మా.. రెండు నెలల్లో మన ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది.. అందరికీ మంచి జరుగుతుంది.. మీ సమస్యలన్నీ తీరిపోతాయి’’ అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి తనను కలిసి తమ బాధలు చెప్పుకొన్న వృద్ధులు, మహిళలకు ధైర్యం చెప్పారు. వరుసగా మూడోరోజు పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించిన ఆయన ఆదివారం తణుకు, తాడేపల్లిగూడెం నియోజకవర్గాల్లో విస్తృతంగా రోడ్‌షో నిర్వహించారు.
తణుకు శివారు పైడిపర్రులో ఉదయం 10 గంటల నుంచి మొదలైన రోడ్‌షో రాత్రి 10 గంటల వరకూ ఆగకుండా నిరంతరాయంగా సాగింది. అడుగడుగునా జనం ‘అడుగో జగన్’ అంటూ ఆయన్ను చూసి కేరింతలు కొట్టారు. మహిళలు, వృద్ధులు, విద్యార్థులు ఆయన్ను చూసేందుకు ఎగబడ్డారు.
మీ నాన్న పెట్టిన పథకం వల్లే బతుకుతున్నాను..
ఎండ మండుతున్నా లెక్క చేయకుండా జనం గంటల తరబడి రోడ్లపై జగన్ కోసం నిలబడి ఆయన కోసం ఎదురుచూశారు. తణుకులో వృద్ధురాలు రంగమ్మ తన ఇంటి మెట్ల నుంచి కిందకు దిగడానికి యత్నిస్తుండగా.. అది చూసిన జగన్‌మోహన్‌రెడ్డి వెంటనే కారు దిగి ఆమె వద్దకు వెళ్లి బాగోగులు అడిగి తెలుసుకున్నారు. ‘మీ నాన్నగారు చాలా మంచి పనులు చేశారయ్యా.. నువ్వు కూడా ముఖ్యమంత్రి అయ్యి అవన్నీ చేయాలి.. నూరేళ్లు చల్లగా ఉండు బాబూ..’ అని ఆమె ఆప్యాయంగా దీవించింది.
‘జాగ్రత్తమ్మా.. అంతా మంచి జరుగుతుంది’ అంటూ జగన్ ఆమెను హత్తుకున్నారు. తణుకు రైల్వే స్టేషన్ రోడ్డులో ఒక ఆస్పత్రిలో నుంచి బయటకు వచ్చిన వృద్ధురాలు దుర్గ తన మనుమరాలు ప్రవల్లికతో కలిసి బయటకు వచ్చి జగన్ కోసం రోడ్డు పక్కన నిలబడింది. ఆయన రాగానే రెండు చేతులు పట్టుకుని ‘బాబూ మీ నాన్నగారు పెట్టిన పథకం వల్లే నేను గుండె ఆపరేషన్ చేయించుకుంటున్నాను. రేపు ఆపరేషన్ చేస్తున్నారు. మీ వల్లే బతుకున్నానంటూ’ కంట తడి పెట్టింది. చలించిపోయిన జగన్.. అందరికీ మంచి జరుగుతుందమ్మా అంటూ వారికి ధైర్యం చెప్పి ముందుకు కదిలారు.
మీ పిల్లల్ని బడికి పంపితే.. మీకు డబ్బులిస్తాం..
తణుకు పాతూరులో స్థానికులు చాలా ఏళ్ల నుంచి తమకు ఇళ్లు లేవని, అద్దె ఇళ్లల్లో ఉంటున్నామని వాపోయారు. జగన్‌మోహన్‌రెడ్డి వారికి ధైర్యం చెబుతూ ‘రెండు నెలలు ఓపిక పట్టండి.. ఆ తర్వాత మన ప్రభుత్వం వస్తుంది. అప్పుడు అందరికీ మంచి చేస్తా. మీ అందరికీ అండగా ఉంటా’ అని హామీ ఇచ్చారు. పలుచోట్ల విద్యార్థులు ఆయనతో చేయి కలిపేందుకు పోటీపడ్డారు. అందరినీ దీవించి వారికి ఆటోగ్రాఫ్‌లు ఇచ్చిన జగన్ ఏం చదువుతున్నారు, బాగా చదువుకోండని చెప్పారు.
మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకంతో ఇంకా బాగా చదువుకోవచ్చని చెప్పారు. తణుకు సజ్జాపురంలో కొందరు మహిళలు ఆయన వద్దకు వచ్చి చాలీ చాలని కూలీలతో బతుకుతున్నామని, కూలీ చాలక తమ పిల్లలతో కూడా పనిచేయించక తప్పడం లేదని ఆవేదన వెళ్లబుచ్చారు. ‘‘మీరేం అధైర్యపడొద్దు.. మీ పిల్లల్ని నేను చదివిస్తా. మీరు వాళ్లను బడికి పంపిస్తే చాలు.. ఒక్కొక్కరికి రూ.500 చొప్పున కుటుంబానికి ఇద్దరికి వెయ్యి రూపాయిలు మీ బ్యాంక్ ఎకౌంట్‌లో వేస్తా’’ అని జగన్ అనడంతో వారు ఆనందంతో పొంగిపోయారు. తర్వాత కొందరు ముఠా కార్మికులతో జగన్ మాట కలిపారు.
రోజుకు ఎంత కూలి వస్తుందన్నా అని వారిని అడగ్గా వారు రూ.200 వస్తుందని, సంపాదించిందంతా ఇంటి అద్దె కట్టడానికే సరిపోతుందని ఆవేదనగా చెప్పారు. త్వరలో మీ కష్టాలు తీరతాయి.. రెండు నెలలు ఓపిక పట్టండి అని చెప్పి ఆయన అక్కడి నుంచి ముందుకుసాగారు.
జనంతో కిక్కిరిసిన రహదారులు: ఇరగవరం కాలనీలో రెండు కాళ్లూ కోల్పోయిన వికలాంగురాలు కొడమంచిలి పాపాయమ్మ ట్రై సైకిల్‌పై ఉండి జగన్‌మోహన్‌రెడ్డితో కరచాలనానికి దగ్గరకొచ్చే ప్రయత్నం చేస్తుండగా ఆయనే కారుదిగి ఆమె వద్దకెళ్లి మోకాళ్లపై నిలబడి మాట్లాడారు. ‘ఏమ్మా ఎలా ఉన్నావు. నీ పేరేమిటి. పెన్షన్ వస్తుందా’ అని కుశల ప్రశ్నలు అడిగారు.
తాడేపల్లిగూడెం మసీదుపేటలో ముస్లిం మహిళలు జగన్‌మోహన్‌రెడ్డిని చూసి ఆనంద భాష్పాలతో ‘మమ్మల్ని గుర్తించి ఇక్కడి నుంచి మీ పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇచ్చారయ్యా. మా సంక్షేమం గురించి ఆలోచించు బాబూ’ అని కోరారు. తమ సాంప్రదాయం ప్రకారం శాలువా కప్పి టోపీ బహూకరించారు. ముస్లింలకు న్యాయం చేస్తానని జగన్ వారికి మాటిచ్చారు. తాడేపల్లిగూడెం పాతూరు సాయంత్రం నుంచి జనంతో నిండిపోయింది. ప్రజలంతా రోడ్లపైకి వచ్చి ఆయనకు స్వాగతం పలికారు. ప్రతిచోటా ఆగిన జగన్ అందరినీ పలుకరించి వారి పేర్లు తెలుసుకుంటూ, సమస్యలు వింటూ, ధైర్యం చెబుతూ ముందుకెళ్లారు.
గొంతు సమస్యతో ప్రసంగాలకు విరామం
జగన్‌మోహన్‌రెడ్డికి గొంతు సమస్య ఏర్పడడంతో పరీక్షించిన వైద్యులు రెండురోజులు ప్రసంగించవద్దని సూచించారు. దీంతో శని, ఆదివారాల్లో ఆయన ఎక్కడా ప్రసంగించలేదు. మైకు ప్రసంగాలు చేయకపోయినా ప్రతి ఒక్కరినీ పలుకరిస్తూనే ఉన్నారు. రోడ్‌షోలో జగన్‌మోహన్‌రెడ్డి వెంట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ తెల్లం బాలరాజు, నరసాపురం పార్లమెంటు నియోజకవర్గ సమన్వయకర్త ముదునూరి ప్రసాదరాజు, తణుకు, తాడేపల్లిగూడెం సమన్వయకర్తలు చీర్ల రాధయ్య, తోట గోపి, మాజీ ఎమ్మెల్యేలు ఆళ్ల నాని, పాతపాటి సర్రాజు తదితరులున్నారు.
నేటి నుంచి ‘తూర్పు’లో జగన్ పర్యటన
సాక్షి ప్రతినిధి, కాకినాడ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం నుంచి తూర్పు గోదావరి జిల్లాలో ‘వైఎస్సార్ జనభేరి’ నిర్వహించనున్నారు. ఈ పర్యటన వివరాలను పార్టీ రాష్ట్ర కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురామ్, పార్టీ జిల్లా అధ్యక్షుడు కుడుపూడి చిట్టబ్బాయి ఆదివారమిక్కడ తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు మీదుగా సోమవారం సాయంత్రం ఆరు గంటలకు రాజమండ్రి క్వారీ మార్కెట్ సెంటర్‌కు జగన్ చేరుకుంటారు. అక్కడ బహిరంగ సభ లో ప్రసంగిస్తారు.
నేటి నుంచి ‘తూర్పు’లో జగన్ పర్యటన
సాక్షి ప్రతినిధి, కాకినాడ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం నుంచి తూర్పు గోదావరి జిల్లాలో ‘వైఎస్సార్ జనభేరి’ నిర్వహించనున్నారు. ఈ పర్యటన వివరాలను పార్టీ రాష్ట్ర కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురామ్, పార్టీ జిల్లా అధ్యక్షుడు కుడుపూడి చిట్టబ్బాయి ఆదివారమిక్కడ తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు మీదుగా సోమవారం సాయంత్రం ఆరు గంటలకు రాజమండ్రి క్వారీ మార్కెట్ సెంటర్‌కు జగన్ చేరుకుంటారు. అక్కడ బహిరంగ సభ లో ప్రసంగిస్తారు.