ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి అంకమరావు తల్లి వరమ్మ
నెల్లూరు జిల్లా కుడుములదిన్నెపాడుకు చెందినగడ్డమడుగు గోపాల్ పేదరికంలో మగ్గుతున్నా అన్ని కష్టాలు ఓర్చుకొని తన కొడుకునుబాగా చదివించాడు. తండ్రి కష్టం నిత్యం కళ్లారా చూసిన అంకమరావు అందుకు తగ్గట్టే చిన్నప్పటి నుంచి చదువులో మేటిగా నిలిచాడు. కష్టపడి ఇంటర్ పూర్తి చేసి ఎన్నో ఆశలతో ఇంజనీరింగ్‌లో చేరాడు. ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం ద్వారా పూర్తిగా డబ్బులు రాకపోవటం, తన కోసం తండ్రి అప్పులు చేస్తూ.. రెక్కలు ముక్కలు చేసుకొని పని చేయటం చూసి తట్టుకోలేకపోయాడు. ఉరి వేసుకొని తనువు చాలించాడు.
రాష్ట్ర వ్యాప్తంగా ఇలా లక్షలాది మంది విద్యార్థులు ప్రభుత్వ తీరుతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు కోట్లలో పేరుకు పోతున్నాయి. నిధులు విడుదల చేస్తున్నామని చెబుతున్నా, కాలేజీలకు సకాలంలో జమ కావడం లేదు. దీంతో ఎంతో మంది విద్యార్థులకు కాలేజీల యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. చదువు పూర్తయి ఉద్యోగం వేటలో ఉన్న నిరుద్యోగులపై ఈ పరిణామం పిడుగు పడినట్లైంది. చాలా మంది నిరుద్యోగులకు 2017 – 18 సంవత్సరానికి రావాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చివరి దఫా కాలేజీలకు అందలేదు. పీజీ చదువుతున్న వారికి కూడా సరిగా ఇవ్వటం లేదు. అందరి కంటే ఇంజనీరింగ్ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థుల పరిస్థితి దయనీయంగా ఉంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, సంక్షేమ రెసిడెన్షియల్ కాలేజీలు, నవోదయ కాలేజీల్లో చదువుకున్న విద్యార్థులకు పూర్తి స్థాయి ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వాలని ఆదేశాలు ఉన్నాయి. అయినా వీరికి కూడా రూ.35 వేలకు మించి ప్రభుత్వం ఇవ్వడం లేదు. ప్రభుత్వ ఆదేశాల కాపీని జత చేసి అర్జీలు ఇచ్చినా పట్టించుకోవడం లేదు. గత సంవత్సర బకాయిలు ఇటీవలే విడుదల చేశామని ప్రభుత్వం చెబుతున్నా కూడా అది కాలేజీలకు అందలేదు. – సాక్షి అమరావతి / సాక్షి ప్రతినిధి, నెల్లూరు
వైఎస్సార్ హయాంలో ఇలా..
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్న సమయంలో బీసీలు, ఈబీసీలకు పూర్తి స్థాయిలో ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇచ్చారు. అంతకు ముందు బీసీ, ఈబీసీలకు ఫీజు రీయింబర్స్‌మెంట్ ఉండేది కాదు. ఎస్సీ, ఎస్టీలకు కేంద్ర ప్రభుత్వం ఫీజులు కొంత వరకు చెల్లిస్తుండటంతో 2004లో వైఎస్సార్ అధికారంలోకి రాగానే ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలతో పాటు బీసీ, ఈబీసీలందరికీ ఫీజు రీయింబర్స్‌మెంట్ పూర్తి స్థాయిలో ఇచ్చారు. దీంతో వందల కోట్లలో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ ఒక్క సారిగా వేల కోట్లలోకి వెళ్లిపోయింది.
ప్రభుత్వం తీరిది..
ప్రతి సంవత్సరం నాలుగు క్వార్టర్లలో ప్రభుత్వం ఫీజులు కాలేజీలకు చెల్లిస్తోంది. ఉదాహరణకు 2018 –19 సంవత్సరానికి రెండు క్వార్టర్లు రీయింబర్స్‌మెంట్ చెల్లించారు. మొదటి క్వార్టర్‌లో రూ. 576.25 కోట్లు చెల్లించాల్సి ఉండగా రూ.537.10 కోట్లు మాత్రమే చెల్లించింది. అంటే రూ.39.15 కోట్లు మొదటి క్వార్టర్‌కు బకాయి ఉంది. ఇక రెండో క్వార్టర్‌లో రూ.618.33 కోట్లు చెల్లించాల్సి ఉండగా రూ.485.05 కోట్లు మాత్రమే చెల్లించింది. అంటే రూ.133.28 కోట్లు ఇంకా చెల్లించాలి. రెండు క్వార్టర్‌లకు కలిపి ఈ సంవత్సరంలో ఇంకా రూ.162.43 కోట్లు విద్యార్థులకు ప్రభుత్వం బకాయి ఉంది. ఇంకా రెండు క్వార్టర్ల ఫీజులు చెల్లించాలి. 75 శాతం హాజరు ఉన్నట్లు కాలేజీ నుంచి జిల్లా సాంఘిక సంక్షేమ అధికారికి వివరాలు అందాలి. లేకుంటే చివరి క్వార్టర్ ఫీజు రీయింబర్స్‌మెంట్ రిలీజ్ కావడం లేదు. హాజరుతో సంబంధం లేకుండానే బకాయిలు ఉంటున్నాయి. నాలుగో క్వార్టర్ రిలీజ్‌లో జాప్యం కారణంగా వేలాది మంది విద్యార్థులకు ఏడాది వృధా అవుతోంది. ప్రభుత్వ ఈ విషయాన్ని ఏమాత్రం పరిగణలోకి తీసుకోవడం లేదు. హాజరు లేదని కొర్రీలు వేస్తోంది. పైకి మాత్రం ఫీజు రీయింబర్స్‌మెంట్ పూర్తి స్థాయిలో ఇస్తున్నామని అబద్ధాలు చెబుతోంది.
ఇంజినీరింగ్ విద్యార్థులపై పెనుభారం
రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీలు 321 ఉన్నాయి. ఈ కాలేజీల్లో సుమారు 90 వేల మంది విద్యార్థులు ఉన్నారు. వీరితో కలిపి మొత్తం ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు అర్హులైన వారు (ఇంటర్ నుంచి పీజీ వరకు అన్ని కోర్స్‌లు కలిపి) 16,00,054 మంది ఉన్నారు. 8,352 కాలేజీల్లో చదువుతున్న వీరికి ప్రభుత్వ నిర్దేసించిన మేరకు ఏటా ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద రూ.2,555.26 కోట్లు చెల్లించాలి. ఈ లెక్కన ఒక్కో ఇంజినీరింగ్ విద్యార్థికి ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద ప్రభుత్వం చెల్లిస్తున్నది రూ.35 వేలు మాత్రమే. అది కూడా సకాలంలో ఇవ్వడం లేదు. సగటున రూ.65 వేలు సొంతంగా చెల్లిస్తున్నారు. ఇతర కోర్సుల విద్యార్థులదీ ఇదే పరిస్థితి.
ఆ ఫీజే ప్రాణం తీసింది..
బేల్దారి పని చేసే మాకు ఇద్దరు పిల్లలు. పెద్ద కుమారుడు అంకమరావు 10వ తరగతి వరకు కలిగిరి జెడ్పీ హైస్కూల్‌లో 9.5 జీపీఏతో పాసయ్యాడు. వింజమూరులోని వివేకానంద జూనియర్ కళాశాలలో ఇంటర్ చదివాడు. 9.8 జీపీఏ వచ్చింది. నాన్నా.. ఇంజినీరింగ్ చదువుతా అన్నాడు.. మాలాగా కష్టపడటం వద్దనుకుని సరేనన్నాము. 2016లో నెల్లూరులోని గీతాంజలి ఇంజనీరింగ్ కళాశాలలో మెకానికల్ ఇంజనీరింగ్ కోర్సులో సీటు వచ్చింది. కళాశాల యాజమాన్యం సంవత్సరానికి రూ.65 వేలు ఫీజు చెల్లించాలన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ ద్వారా అంతా వస్తుందనుకున్నాము. కానీ కేవలం రూ.30 వేలు మాత్రమే వస్తుందని, మిగిలిన రూ.35 వేలు ఫీజు సొంతంగా చెల్లించాలని కాలేజీ వాళ్లు చెప్పారు. తొలుత రూ.20 వేలు కట్టాము. మొదటి సంవత్సరంలో చేరాడు. హాస్టల్ ఖర్చు భరించలేమని నేను (గోపాల్) నెల్లూరుకు వెళ్లి ఓ ఇల్లు అద్దెకు తీసుకున్నా.
నెల్లూరులోనే బెల్దారి పనులు చేసుకుంటూ అంకమరావును కాలేజీకి పంపేవాడిని. నా భార్య వరమ్మ ఊళ్లోనే ఉంటూ వ్యవసాయ కూలి పనులకు వెళ్తుండేది. మూడు నెలలు కాలేజీకి వెళ్లాడు. మిగిలిన ఫీజు చెల్లించాలని చెప్పాడు. చూద్దాం.. కడదాములే అని చెప్పాము. ఇద్దరు ముగ్గురిని అప్పు అడిగాం. లేదన్నారు. ఎలాగైనా అప్పు తెస్తామని చెప్పాను. సరేనన్నాడు. అంతలోనే ఏమనుకున్నాడో ఏమో.. బిడ్డడు అదే ఏడాది సెప్టెంబర్ 5వ తేదీన ఇంట్లో మేమెవ్వరం లేనప్పుడు ఉరేసుకుని మమ్మల్ని వదిలి కనిపించనంత దూరం వెళ్లిపోయాడు. చేతికందొచ్చిన కొడుకు ఇలా మమ్మల్ని వదిలి కానరాని లోకాలకు వెళ్లిపోతాడని కలలో కూడా ఊహించలేదు. ఇంజనీరయ్యి మిమ్మల్ని బాగా చూసుకుంటా అనేవాడు. ఆ చదువు చదివించకపోయుంటే పిల్లాడు మా కళ్ల ముందే ఉండేవాడు. పెద్దోడు ఇలా అయిపోయాక మాకు దిక్కుతోచడం లేదు. చిన్నోడి భవిష్యత్ కోసం కన్నీళ్లు దిగమింగుకుంటూ జీవిస్తున్నాం. చిన్నోడు కలిగిరిలో ఎనిమిదవ తరగతి చదువుతున్నాడు. మాకు సెంటు భూమి కూడా లేదు. ఇప్పుడుంటున్నది కూడా పూరిల్లే.
– గోపాల్, వరమ్మ దంపతులు, కుడుములదిన్నెపాడు,కృష్ణారెడ్డిపాలెం పంచాయతి, కలిగిరి మండలం, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా
అదే జరిగితే మా బతుకులే మారిపోతాయి
నాకు ఇద్దరు పిల్లలు. రోజూ కూలినాలీ చేసుకొని కుటుంబాన్ని పోషించుకోవాల్సిన పరిస్థితి మాది. నా పిల్లల్లో అమ్మాయి సరళ కొండాపురంలోని మోడల్ స్కూల్‌లో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ సక్రమంగా ఇచ్చివుంటే కార్పొరేట్ కళాశాలలో చేర్పించేవాళ్లం. సొంత నగదుతో ఆ కళాశాలలో చేర్పించే తాహతు లేదు. వైఎస్.రాజశేఖరరెడ్డి గారు బతికున్నప్పుడు మాలాంటి అనేక మంది పేద కుటుంబాలకు చెందిన పిల్లలు అన్ని సౌకర్యాలున్న కార్పొరేట్ కాలేజీల్లో చదువుకునేవారు. దానికయ్యే డబ్బంతా ప్రభుత్వమే చెల్లించేది. కానీ ఇప్పటి ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ సక్రమంగా ఇవ్వడం లేదు. పేద పిల్లలు నాణ్యమైన విద్యకు దూరమవుతున్నారు. చదివించే స్థోమత లేనివారు పిల్లలను మధ్యలోనే చదువు మాన్పించి పనులకు పంపాల్సి వస్తోంది. మాలాంటి పేదోళ్ల కష్టాలు కళ్లారా చూసిన రాజన్న బిడ్డ జగన్ ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని బాగా అమలు చేస్తానని చెబుతున్నాడు.
ఈ పథకం ద్వారా పేద విద్యార్థులు ఉచితంగా ఉన్నత చదువులు చదువుకోవచ్చు. ఎన్ని లక్షలు ఖర్చు అయినా సరే ఇస్తానంటున్నాడు. అంతా ప్రభుత్వంమే భరించేలా చేస్తానంటున్నాడు. పైగా హాస్టల్ ఖర్చులకు మెస్ చార్జీల కింద ఏటా రూ.20 వేలు అదనంగా ఇస్తానని చెబుతుండటం చాలా చాలా మంచిది. ఇదే జరిగితే మా లాంటి పేదోళ్ల జీవితాలే మారిపోతాయి. నా కూతురును, ఇప్పుడు 10వ తరగతి చదువుతున్న నా కొడుకు వెంకట్‌ను ఉన్నత చదువు చదివిస్తాను. జగన్ చెబుతున్న మాటలపై మాకు పూర్తిగా నమ్మకం ఉంది. ఎందుకంటే వాళ్ల నాయన రాజశేఖరరెడ్డి గారు పేదోళ్ల కోసం ఈ పథకాన్ని బాగా అమలు చేశాడు. ఆయన కంటే రెండడుగులు ముందుకు వేసి పేదోళ్లను చదివిస్తానని జగన్ కసిగా చెబుతుండటం రోజూ చూస్తున్నాం. అందుకే ఆయన (జగన్) ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నాం.
– కొప్పర్తి సుజాతమ్మ, సాయిపేట ఎస్సీ కాలనీ, కొండాపురం, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా
డబ్బులు కట్టి సర్టిఫికెట్లు తీసుకున్నా...
‘నేను విజయవాడలోని సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీలో 2017లో ఫైనల్ ఇయర్ ఈసీఈ పూర్తి చేశా. నాకు హైదరాబాద్‌లోని ఓ ప్రై వేట్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా ఉద్యోగం వచ్చింది. సర్టిఫికెట్లు ఇవ్వాలని కాలేజీ యాజమాన్యాన్ని బతిమాలినా ఇవ్వలేదు. ఫీజు రీయింబర్స్‌మెంట్ ఫైనల్ క్వార్టర్ రాలేదు. కాలేజీకి రావాల్సిన ఫీజు ఇంకా రూ.26 వేలు ఉంది. డబ్బులు చెల్లిస్తే సర్టిఫికెట్లు ఇస్తామన్నారు. మాది నిరుపేద కుటుంబం. మా అమ్మా నాన్నలు వేరే వారి దగ్గర అప్పు తెచ్చిచ్చారు. డబ్బులు కట్టి సర్టిఫికెట్లు తీసుకున్నాను. గవర్నమెంట్ ఫీజు రీయింబర్స్‌మెంట్ డబ్బులు కాలేజీ అకౌంట్‌లోకి వేయగానే నా డబ్బులు వెనక్కి ఇస్తామన్నారు. ఇప్పటికి ఏడాదిన్నరైంది. ఆ డబ్బులు రాలేదు.
– అన్నాబత్తుల సురేష్‌కుమార్, పోరంకి, కృష్ణా జిల్లా
సర్టిఫికెట్లు ఇవ్వలేదు
నేను ఏలూరులోని కట్టమంచి రామలింగారెడ్డి పీజీ కాలేజీలో ఎంఏ పొలిటికల్ సైన్స్ చదివాను. నాకు కాలేజీ వారు సర్టిఫికెట్లు ఇవ్వలేదు. 2017 – 18 సంవత్సరానికి రావాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్ రాలేదు. కాలేజీ వారు రాజమండ్రిలోని ఆదికవి నన్నయ యూనివర్సిటీ నుంచి సాంఘిక సంక్షేమ శాఖకు లేఖలు రాయించారు. అయినా స్పందించ లేదు. గత ఏడాది మార్చిలో మా కోర్స్ పూర్తయింది. మొత్తం 16 మందిమి పొలిటికల్ సైన్స్ క్లాస్‌లో ఉన్నాము. ఎవ్వరికీ ఫీజు రీయింబర్స్‌మెంట్ రాలేదు. కారణమూ చెప్పలేదు.
– జె శ్రావణి, కాకినాడ.
పేదలచదువుకుపూచీ నాది : వైఎస్ జగన్
బంగారు భవిష్యత్తు ఉన్న విద్యా కుసుమం నేలరాలిన వైనంపై తండ్రి గోపాల్.. ప్రజా సంకల్ప యాత్రలోప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌కు వివరించి.. కొడుకు ఫొటో చూపించి కుమిలిపోయాడు. గోపాల్ మాటలు విన్న వైఎస్ జగన్ తీవ్రంగా చలించిపోయారు. ఇలాంటి కష్టం భవిష్యత్తులో ఏకుటుంబానికి రాకూడదని బలంగా నిర్ణయించుకున్నారు. సమగ్ర మార్పులు, చేర్పులతో ఆర్థిక ఇబ్బందులు లేని ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించారు. ఇందుకోసం ఎన్నికోట్లు అయినా ఖర్చు చేస్తామన్నారు.
పేదవాడి చదువుకు అయ్యే ఖర్చును ప్రభుత్వమేపూర్తిగా భరిస్తుంది.
ఎన్ని లక్షల రూపాయలైనా సరే ఫీజు రీయింబర్స్‌మెంట్ చేస్తాం.
అంతే కాకుండా మెస్ చార్జీల (వసతి, భోజనం కోసం)కోసం అదనంగా ప్రతి విద్యార్థికి ఏటా రూ.20 వేలు ఇస్తాం.
పిల్లల చదువుల కోసం తల్లిదండ్రులు అప్పుల పాలై ఆత్మహత్యల వరకు వెళ్ల కూడదనేది మా ఆలోచన.
పిల్లల చదువును ప్రభుత్వం చూసుకుంటుందనే భరోసా కల్పిస్తాం. దీంతో పిల్లల చదువుల గురించి తల్లిదండ్రులు ఆలోచించకుండా సంతోషంగా వారి పనులు వారు చేసుకునే అవకాశం కలుగుతుంది.
పేదల చదువుల కోసం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఒక అడుగు ముందుకు వేస్తే, ఆయన స్ఫూర్తితో నేను రెండడుగులు ముందుకు వేస్తా.
- వైఎస్ జగన్
Comments
Please login to add a commentAdd a comment