సాక్షి, విజయనగరం పూల్‌బాగ్: వైఎస్సార్ ఆసరా పథకం కింద డ్వాక్రా మహిళల అప్పు మొత్తాన్ని నాలుగు దఫాలుగా నేరుగా వారి చేతికే ఇస్తామన్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హామీపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఒక్కొక్కరికి రూ.50వేల మొత్తాన్ని నాలుగు దఫాలుగా చెల్లిస్తారు. వడ్డీ లేని రుణాలను కూడా ఇప్పిస్తామని చెప్పడం మరింత ఊరట కలిగిస్తోంది. ఈ ప్రకటనపై నియోజకవర్గంలో ఉన్న డ్వాక్రా మహిళలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయితే మా జీవితాల్లో వెలుగులు వస్తాయని చెబుతున్నారు.
చంద్రబాబును నమ్మి మోసపోయాం
పొదుపు మహిళల రుణాలు మాఫీ చేస్తానని చంద్రబాబు చెప్పడంతో బ్యాంక్‌లో రుణాలు కట్టలేదు. నేటికీ రుణాలు మాఫీ చేయలేదు. నెల నెలా వడ్డీలు కడుతున్నాం. బాబు మాటలు నమ్మి మోసపోయాం. ఐదేళ్ల పాలనలో మహిళలకు మాయ మాటలు చెప్పి మోసగిస్తున్నారు. జగనన్న ప్రకటించిన వైఎస్సార్ ఆసరా, చేయూత పథకాలతో మహిళలకు ఎంతో లబ్ది చేకూరుతుంది.
– కాదులూరి లీలాత్రి, బూర్లి పేట, 38వవార్డు, విజయనగరం.
బతుకులు బాగు పడతాయి..
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయితే మా బతుకులు బాగుపడతాయి. రుణాలన్నీ మాఫీ చేస్తానని మాయ మాటలు చెప్పి చంద్రబాబు ప్రభుత్వం మమ్మల్ని మోసం చేసింది. పొదుపు రుణాలు మాఫీ అయితే కష్టాల నుంచి బయట పడినట్లు అవుతుంది. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాకు న్యాయం చేస్తారని నమ్మకం ఉంది. మహిళల కోసం జగన్ ప్రకటించిన పథకాలు బాగున్నాయి.
– పండూరి మంగమ్మ, ఆబాద్‌వీధి, అశోక్‌నగర్
మహిళల జీవితాల్లో వెలుగు
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం అయితే మహిళల జీవితాల్లో వెలుగులు వస్తాయి. టీడీపీ మోసాలను మహిళలు ఇప్పుడిప్పుడే గుర్తిస్తున్నారు. మా కష్టాలను తెలుసుకున్న జగనన్న అప్పు మొత్తాన్ని నాలుగు దఫాలుగా నేరుగా చేతికే అందజేస్తామని హామీ ఇవ్వడం శుభపరిణామం. వడ్డీ లేని రుణాలను అందించడం వల్ల ఎంతో మేలు కలుగుతుంది.
– మహంతి లక్ష్మి, పూల్‌బాగ్‌కాలనీ, 3వవార్డు, విజయనగరం
టీడీపీకి గుణపాఠం తప్పదు..
చంద్రబాబు మాటలు నమ్మి బ్యాంక్ రుణాలు కట్టకపోవడంతో వడ్డీలు చెల్లించాలని బ్యాంక్ అధికారులు మా పై ఒత్తిడి తీసుకువస్తున్నారు. చివరికి చేసేదేమీ లేక వడ్డీతో సహా చెల్లిస్తున్నాం. హామీ నెరవేర్చలేనప్పుడు మాఫీ చేస్తానని మాయ మాటలు చెప్పడం ఎందుకు? ఇచ్చిన డబ్బులు వడ్డీ చెల్లించేందుకు కూడా సరిపోలేదు. టీడీపీకి ఈ సారి గుణపాఠం తప్పదు.
– పి.శ్రీదేవి, అశోక్‌నగర్, విజయనగరం
Comments
Please login to add a commentAdd a comment