విదురుడిలా! వికర్ణుడిలా! | Raghav Sharma Article On Andhra Pradesh election Results | Sakshi
Sakshi News home page

విదురుడిలా! వికర్ణుడిలా!

Published Sun, Jun 2 2019 12:56 AM | Last Updated on Sun, Jun 2 2019 12:56 AM

Raghav Sharma Article On Andhra Pradesh election Results - Sakshi

ఎన్నికల్లో ఎవరు గెలుస్తారన్నది పది రోజుల క్రితం వరకు రాష్ట్రమంతా ఉత్కంఠ! ముఖ్యంగా పాత్రికేయుల్లో మిలియన్‌ డాలర్ల ప్రశ్న! ఎన్నికలు జరగడానికి నెలముందు హైదరాబాదు నుంచి టంకశాల అశోక్‌ గారు ఫోన్‌చేసి ‘అంధ్రప్రదేశ్‌లో ఎట్లుంది?’ అని అడిగారు. ‘కాస్త జగన్‌ వేవ్‌ కనిపిస్తోందండీ’ అన్నాను.

హైదరాబాద్‌లో ఉంటున్న మరో సీనియర్‌ జర్నలిస్ట్‌ (పీకాక్‌ క్లాసిక్స్‌) గాంధీ గారు ఫోన్‌ చేసి ‘ఏపీలో ఎలా ఉందండి’ అన్నారు. ‘కాస్త జగన్‌ వేవ్‌ ఉందండి’ అన్నా. ‘బీజేపీపై వ్యతిరేకత జగన్‌పైన ఏమైనా పడుతుందా?’ అని అడిగారు. ‘బీజేపీపైన వ్యతిరేకత ఉంటే అది ఆ ప్రభుత్వంలో భాగస్వామి అయిన టీడీపీపైనే ఉంటుంది కానీ జగన్‌పైన ఎలా ఉంటుంది’ అన్నాను. హైదరాబాదులోని మరో సీనియర్‌ జర్నలిస్ట్‌(80 ఏళ్లు) ఫోన్‌ చేసి ‘శర్మాజీ రాయలసీమలో ఎట్లా ఉంది?’ అని అడిగారు. ‘సీమ ప్రజలు టీడీపీ అంటే చాలా కోపంగా ఉన్నారు’ అన్నా. ‘ఎందుకు’ అని అడిగారు.

‘వైఎస్‌ సీఎంగా ఉన్నప్పుడు కృష్ణా నీళ్ళు రాయలసీమకు రావడానికి ముఖద్వారంలాంటి పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ సామర్థ్యాన్ని పెంచితే, దేవినేని ఉమ ప్రకాశం బ్యారేజిని దిగ్బంధం చేశారు. దాని వెనుక బాబు ఉన్నారు. గాలేరునగరి, హంద్రీనీవాలను పూర్తి చేయకుండా పట్టిసీమను పూర్తి చేశారు. టీడీపీకి అనంతపురం జిల్లాలో కొన్ని సీట్లు రావచ్చునేమో కానీ, మిగతా సీమలో రావు’ అని కరాఖండిగా చెప్పాను. ‘హంద్రీనీవాకు నీళ్లొది లారు కదా! చిత్తూరు జిల్లాలో పీలేరు వరకు నీళ్ళొచ్చాయట గదా’ అని అడిగారు.

‘నిజమే సార్‌.. ఎన్నికల ముందు కాలువల్లోకి కాసిని నీళ్లొదిలితే, ఆ నీళ్లను చూసి వెంటనే పంటలేసి, వేసిన పంటలన్నీ నెలరోజుల్లో పండిపోయి, ఆ వెంటనే దారిద్య్రమంతా తీరి పోయి రైతులు ఆనంద తాండవమాడతారా!?’ అని ప్రశ్నించాను. ‘సిద్దేశ్వరం అలుగు కోసం ఆందోళన చేసిన వేలాది మంది రైతులను అరెస్టులు చేస్తే అంతా మర్చిపోయి టీడీపీకి ఓట్లు గుద్దేస్తారా!? ’ అని అడిగేశాను. ‘లేదు శర్మాజీ... మహిళలంతా టీడీపీ పక్కే ఉన్నారు. డ్వాక్రా మహిళలకు డబ్బులు వేస్తున్నారు కదా!’ అని దింపుడు కళ్లం ఆశ వ్యక్తం చేశారు. ‘డ్వాక్రా రుణాలను రద్దు చేస్తానని, ఐదేళ్లూ కాలయాపన చేసి, ఇప్పుడు పసుపు కుంకుమ పేరుతో డబ్బులిస్తే ఓట్లేస్తారా సార్‌?’ అని ప్రశ్నించా. చివరగా ఆయన ఒక తీర్పు చెప్పారు ‘మీరన్నట్టు టీడీపీ ఓడితే అది జగన్‌ కోసం ఈవీఎంలను మోడీ ట్యాంపరింగ్‌ చేయించారని రుజువైనట్టే. ఒకవేళ టీడీపీ గెలిస్తే ట్యాంపరింగ్‌ జరగనట్టు భావించాలి’ అన్నారు. 

సామాన్యులా..సెఫాలజిస్టులా..!
ఏపీలో జగన్‌ వేవ్‌ ఉందని ముగ్గురు సీనియర్‌ జర్నలిస్టులతో ఇంత గట్టిగా నేనెలా చెప్పగలిగాను!? నేనేమీ సెఫాలజి స్టును కాను! క్షౌరశాలలో కూర్చున్నప్పుడు  ‘రంజిత్‌.. ఎట్లా ఉంది రాజకీయం’ అని అడిగాను. ‘అంతా జగనే అంటాండారు’ అన్నాడు. ‘ఎవరికి ఓటేస్తున్నావు రెడ్డెమ్మా’ అని మా పనిమనిషిని అడిగాను. ‘జగన్‌కేస్తాండాం’ అంది. ‘ఎందుకు?’ అని అడిగా. ‘ఏమో నాకు తెల్దు. మా వోళ్లంతా జగన్‌కే వెయ్యాలా అంటాండారు’ అన్నది. ‘ఎట్లా ఉంది రాజకీయం నారాయణా’ అని చెట్టుకింద ఉన్న స్కూటర్‌ మెకానిక్‌ను అడిగాను. ‘ఏం చెపుతాం సార్‌. ఎండలు మండిపోతాండాయి. టౌన్‌లో కెళ్లి స్పేర్‌పార్ట్స్‌ తెద్దామంటే వెళ్లలేకపోతున్నా. ఇంత ఎండల్లో జగన్‌ ఇన్ని నెలలు,  ఇన్ని మైళ్లు ఎట్ల నడిచినాడో? టౌన్‌లో కెళ్లకపోతే నాకైతే గడవదు కానీ, నడవకపోతే ఆయనకేం గడవదా!’ అన్నాడు. ఎన్నికల ఫలితాలకు ముందు పాలకొల్లు వెళ్లాను. నాపక్కన కూర్చున భీమవరానికి చెందిన ఒక రైతు (కాపు)ను ‘ఎవరు గెలుస్తారు?’ అని అడిగాను. ‘మా వాళ్లంతా జగనే రావచ్చంటున్నారండి’ అన్నాడు. తిరుగు ప్రయాణంలో నాపక్కన కూర్చున్న విద్యార్థులనడిగాను. ‘జగన్‌కు ఒక అవకాశం ఇవ్వాలనుకుంటున్నారండి’ అని చెప్పారు. జగన్‌ వేవ్‌ అప్పటివరకు రాయలసీమలో మాత్రమే అనుకున్నా. వీళ్ళతో మాట్లాడాక టీడీపీ కంచుకోటలు కూడా బద్దలవుతున్నాయని గ్రహించా. అయినా ఫలి తాల వరకు ఎదురుచూడక తప్పదు. 

మే నెల 23న మండిపోయే ఎండల్లో తెలుగు నాట కనీవినీ ఎరుగని ఒక టోర్నడో వచ్చింది. ఆ టోర్నడోలో చాలామంది టీడీపీ నేతలు కొట్టుకుపోయారు. సీమలోని 52 శాసనసభ స్థానాలకుగాను 49 స్థానాల్లో ఆపార్టీ ఓడిపోయింది. మూడే స్థానాలు దక్కించుకుంది. తొలి రౌండ్‌లో ఆ పార్టీ నేత బాబు కూడా వెనుకబడిపోయారు. ఎన్నికల గురించి నాతో మాట్లాడిన ఈ సామాన్యులే అసలు సిసలైన సెఫాలజిస్టులన్న విషయం అప్పుడే బోధపడింది. ఓట్ల లెక్కింపు పూర్తయ్యాక టంకశాల అశోక్, గాంధీగార్లతో ఫోన్‌లో మాట్లాడుతూ ‘జగన్‌ వేవ్‌ ఉందని పసిగట్టాను కానీ, ఇంత బలంగా ఉంటుందని  ఊహించలేకపోయా’ అన్నాను. జగన్‌ వేవ్‌ ఉందని మరికొంతమంది కూడా చెప్పారని వారు నిర్ధారించారు. ‘ప్రజలు జగన్‌ని ప్రతిపక్ష నేతగా కూడా తిరస్కరి స్తార’ని టీడీపీ నేతలు ప్రగల్భాలు పలికారు. కొందరు నాయకులు టీవీ కెమెరాల ముందుకొచ్చి మీసాలు మెలేశారు. మరి కొందరు తొడలు కొట్టారు. ఫలితాలతో తొడలు విరిగిన దుర్యోధనుడిలా పడిపోయారు. చాలా పత్రికలు, చానళ్లు ఫలితాలను పసిగట్టలేకపోయాయి. ఒక వేళ పసిగట్టినా, యాజమాన్యం మెప్పుకోసం చావుకోసం పాడిన జోలపాటలా విశ్లేషణలను వినిపించాయి. లగడపాటి చెప్పిన జోస్యాన్ని రాత్రీపగలు అనకుండా ప్రసారం చేశాయి. కొన్ని పత్రికలు అబద్ధాల ప్రయోగశాలలయ్యాయి. 

మహాభారతంలో విదురుడు, వికర్ణుడి పాత్రలు విశిష్టమైనవి. ద్రౌపదిని కౌరవ సభకు తీసుకురమ్మని ధుర్యోధనుడు ఆదేశిస్తే విదురుడు తిరస్కరిస్తాడు. ‘సభలో ద్రౌపది వేసిన ప్రశ్నలకు బుద్ధిమంతులంతా సమాధానం చెప్పాలి. ధర్మసందేహం తీర్చని రోజు సభలోని సజ్జనులందరికీ ఆ పాపం అంటుకుం టుంది’ అని హెచ్చరిస్తాడు. ద్రౌపదిని కురుసభకు తీసుకొచ్చినప్పుడు ‘భీష్ముడు, ద్రోణుడు, ధృత రాష్ట్రుడు, కృపుడువంటి పెద్దలు మౌనంగా ఉన్నారు. మిగిలిన ధర్మజ్ఞులైనా రాగద్వేషాలు మాని ఆలోచించి చెప్పండి’ అంటాడు వికర్ణుడు. కురుక్షేత్రంలో విదురుడు ఏ పక్షమూ వహించడు. సమాజంలో దారుణాలు జరుగుతున్నప్పుడు పత్రికలు, వార్తా చానళ్లు విదురుడి లాగా, వికర్ణుడిలా ప్రశ్నించాలి. రాజధాని నిర్మాణం పేరుతో పచ్చని పంటపొలాలను నాశనం చేసి, భూ కుంభకోణాలకు పాల్పడినప్పుడు, కాల్‌మనీ సెక్స్‌ రాకెట్‌ బైటపడినప్పుడు, మహిళా తహసీల్దార్‌ వనజాక్షిని ఇసుకలో పొర్లించి కొట్టినప్పుడు ఏ పత్రికలు, చానళ్లు ఎలా వ్యవహరించాయో అవి ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఇలాంటి దారుణమైన సంఘటనలపై పాత్రికేయులు నిజాల నిప్పులపైన కాల్చి నిగ్గుతేల్చాలి. మీడియా విదురుడు, వికర్ణుడి పాత్రను పోషించి ఉంటే నాటి పాలకులకు క్షేత్రస్థాయి వాస్తవాలు ఏమిటో కనీసం అర్థమయ్యేవి.

రాఘవ శర్మ
వ్యాసకర్త సీనియర్‌ పాత్రికేయులు, తిరుపతి మొబైల్‌ : 94932 26180

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement