కర్నూలు(విద్య), న్యూస్‌లైన్ : ‘ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని రకాల వసతులూ కల్పిస్తున్నాం.. కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా ఫలితాలు సాధిస్తాం’ అని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం ఆ మేరకు చర్యలు తీసుకోవడంలో విఫలమవుతోంది. దీంతో గదులు, ప్రహరీలు, క్రీడలకు మైదానం లేక విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం కొన్ని పాఠశాలలకు గదులు మంజూరు చేసినా అధికారుల ఉదాసీనత, కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగా ఏళ్లు గడుస్తున్నా భవనాలు పూర్తి కావడం లేదు.
జిల్లాలో 79 ప్రభుత్వ, 140 మునిసిపల్, 335 జిల్లా పరిషత్, 2,154 మండల పరిషత్, 1,003 ఎయిడెడ్ పాఠశాలలు ఉన్నాయి. అందులో మంచినీటి సౌకర్యం లేని పాఠశాలల సంఖ్య 1450, మరుగుదొడ్లు లేని పాఠశాలలు 1380, వంటగదులు లేని పాఠశాలలు 1020, రక్షణ గోడలు లేని పాఠశాలలు 1010, ఆటస్థలాలు లేని పాఠశాలలు 1254, విద్యుత్ సౌకర్యం లేని పాఠశాలలు 890 ఉన్నాయి. ప్రహరీగోడలు, వాచ్‌మెన్ లేకపోవడంతో పాఠశాలలు రాత్రివేళల్లో అసాంఘిక కార్యక్రమాలకు నిలయాలు మారాయి. వంటగదులకు కేటాయించిన నిధులు సరిపోవడం లేదంటూ చాలా చోట్ల నిర్మాణాలు చేపట్టలేదు. ఆరుబయటే మధ్యాహ్న భోజనం వండుతుండటంతో క్రిమికీటకాలు పడే అవకాశం ఉందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
తాగునీటి సౌకర్యం ఉన్నా ట్యాంకులు శుభ్రం చేయకపోవడం, నీటిసరఫరా సరిగ్గా లేకపోవడం, నిర్వహణ లోపంతో విద్యార్థులు అనారోగ్యానికి గురవుతున్నారు. విద్యుత్ సౌకర్యం లేకపోవడంతో కంప్యూటర్ విద్య మూలనపడింది. మరుగుదొడ్లు, మూత్రశాలలు లేకపోవడంతో బాలికల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధిక శాతం పాఠశాలల్లో మైదానాలు లేకపోవడంతో విద్యార్థులు ఆటపాటలకు దూరమవుతున్నారు. మరికొన్ని చోట్ల పాఠశాలల స్థలాలు ఆక్రమణకు గురవుతున్నా పట్టించుకునే వారే కరువయ్యారు.
జిల్లాలోని పాఠశాలల్లో పరిస్థితి ఇదీ..
ఆదోని మండల పరిధిలోని మాంత్రికి గ్రామ ప్రాథమిక పాఠశాల గదుల నిర్మాణం అర్ధంతరంగా నిలిచిపోయింది. బల్లేకల్లు, పెద్దపెండేకల్లు, మదిరె గ్రామాల్లోని ప్రాథమిక పాఠశాలలో గదుల నిర్మాణాలు నత్తనడకన సాగుతున్నాయి.
ఆదోని మునిసిపల్ కమిషనర్ కార్యాలయం పక్కనే ఉన్న ఎన్‌ఎంహెచ్ స్కూల్‌లో విద్యార్థులకు తగ్గట్టుగా తరగతి గదులు లేవు. పట్టణంలోని అండర్‌పేట గర్ల్స్ హైస్కూల్‌కు ప్రహరీ లేకపోవడంతో చుట్టుపక్కల వారు పాఠశాల ఆవరణలోనే మల విసర్జన చేస్తున్నారు. దీంతో విద్యార్థులు నడిచేందుకు ఇబ్బందులు పడుతున్నారు.
బనగానపల్లి మండలంలోని పసుపల, నందివర్గం, కైప, రామతీర్థం, ఇల్లూరు కొత్తపేట, పట్టణంలోని జిల్లా పరిషత్ పాఠశాలలకు మరుగుదొడ్ల, తాగునీటి సౌకర్యాలు లేవు. నందివర్గం ఉన్నత పాఠశాల వద్ద ఇటీవలే మరుగుదొడ్లను నిర్మించినా, నాణ్యత లేక బీటలువారి నిరుపయోగంగా మారాయి. నందవరం, నందివర్గం, రామతీర్థం, ఇల్లూరు కొత్తపేట, టంగుటూరు, తిమ్మాపురం మరికొన్ని గ్రామాల్లో ప్రాథమిక పాఠశాలల అదనపు గదుల నిర్మాణానికి నిధుల మంజూరు చేయాలని ప్రతిపాదనలు పంపినా బుట్టదాఖలయ్యాయి.
డోన్‌పట్టణంలో కొత్తపేట, నెహ్రునగర్ కాలనీల్లోని జెడ్పీపాఠశాల్లో తరగతి గదులు లేక ఉన్న నాలుగు గదుల్లోనే క్లాసులు నడుపుతున్నారు.
ప్యాపిలి జెడ్పీ బాలుర హైస్కూలు, చిన్నపూజర్ల, వెంగళాంపల్లె గ్రామాల్లో పాఠశాలలల్లో క్రీడామైదానాల కొరత ఉంది.
బండ‘బడి’
Published Tue, Jan 14 2014 1:12 AM | Last Updated on Fri, Jul 26 2019 6:25 PM
Advertisement
Advertisement