ఫీ'జులుం' భరించలేం | Sakshi story on fees in corporate Schools and colleges | Sakshi
Sakshi News home page

ఫీ'జులుం' భరించలేం

Published Tue, Jul 31 2018 3:06 AM | Last Updated on Sat, Sep 15 2018 5:39 PM

Sakshi story on fees in corporate Schools and colleges

ఓ కార్పొరేట్‌ స్కూల్‌ అయితే పుస్తకాలు, బ్యాగ్‌లు, బూట్లు కూడా వారి దగ్గరే కొనాలంటోంది.బయట మార్కెట్లో రూ.800 ఉన్న బ్యాగ్‌కు స్కూల్‌ లోగో తగిలించి ఏకంగా రూ.2,000కి అమ్ముతున్నారు. పుస్తకాల ధరలు అయితే మరీ దారుణం. అన్యాయంగా దోచుకుంటున్నారని తెలిసినా సరే.. చదువుకున్న వారు సైతం  పిల్లల కోసం మాట్లాడకుండా వచ్చేస్తున్నారు.

‘రాజధాని అమరావతిలోని ఓ ప్రముఖ కార్పొరేట్‌ స్కూల్‌లో మా అబ్బాయి ఏడో తరగతి చదువుతున్నాడు. స్కూల్‌ ఫీజు కట్టడానికి వెళ్తే రూ.2,000 పెంచారు. మరో రూ.4,000 కడితే చిప్‌తో కూడిన పాఠాల సిలబస్‌ ఇస్తామన్నారు. దీని ద్వారా రోజూ చదవాల్సిన పాఠాలు, టెస్టులతో ఎప్పటికప్పుడు ఫెర్ఫామెన్స్‌ను మీకు తెలియజేస్తామన్నారు. అయితే.. ఏదైనా సబ్జెక్టులో వెనుకబడి ఉంటే ప్రత్యేక శిక్షణ ఇస్తారా అని అడిగితే అలాగేమీ ఉండదన్నారు.

అయితే, చిప్‌ అక్కర్లేదు అని చెప్పి వచ్చేశాను. తీరా చూస్తే మా అబ్బాయిని ఏ1 గ్రూపు నుంచి ఏ4 గ్రూపులోకి మార్చారు. మర్నాడు స్కూల్‌కి వెళ్లి గ్రూపు ఎందుకు మార్చారు అని అడిగితే చిప్‌ తీసుకున్న వాళ్లని ఏ1, ఏ2 గ్రూపుల్లో.. చిప్‌ తీసుకోని వాళ్లని ఏ3, ఏ4ల్లోకి మార్చామన్నారు. మా అబ్బాయి మానసికంగా ఎక్కడ కుంగిపోతాడోనన్న ఉద్దేశంతో.. వాళ్లతో వాదించలేక రూ.4,000 కట్టి వచ్చేశాను.’ – కార్పొరేట్‌ స్కూళ్లలో పరిస్థితిపై ఇదీ ఓ విద్యార్థి తండ్రి ఆవేదన
 

సాక్షి, అమరావతి : ఏటా ఏదో ఒక పేరు చెప్పి వేలకు వేలు ఫీజులు పెంచేసి.. తల్లిదండ్రులను పీల్చి పిప్పిచేస్తున్నారు. టెన్త్‌లోపు పిల్లలకు ఏటా ఏదో రూపంలో రూ.2,000 తక్కువ కాకుండా ఫీజులు పెంచేసి పిండేస్తున్నారు. అదే పెద్దస్థాయి కార్పొరేట్‌ స్కూళ్లలో అయితే ఈ మొత్తం రూ.5,000 పైనే దాటుతోంది.

ఇంటర్‌కు వచ్చేసరికి ఈ దోపిడీ మరీ దారుణంగా ఉంటోంది. ఏటా కనీసం రూ.10,000 తక్కువ కాకుండా ఫీజులు పెంచేస్తున్నారని తల్లిదండ్రులు వాపోతున్నారు. డే స్కాలర్‌గా అయితే ఏడాదికి సుమారు లక్ష రూపాయలు అవుతుంటే అదే హాస్టల్‌లో ఉండి చదివిస్తే రూ.2.25 లక్షలు తక్కువ కావడంలేదని తల్లిదండ్రులు గగ్గోలు పెడుతున్నారు. ఇలా ఏటా ఫీజులు పెంచేస్తుండడంతో తల్లిదండ్రులు బడ్జెట్‌ సమకూర్చుకోలేక అప్పుల పాలవుతున్నారు.

మరీ ఇంత దారుణమా?
ఈ ఒక్క ఏడాదిలోనే ఇంటర్, స్కూల్‌ విద్యార్ధుల తల్లిదండ్రులు రూ.5,068 కోట్లు అదనంగా చెల్లించారంటే నమ్ముతారా? ఈ ఏడాది పెరిగిన ఫీజులపై ‘సాక్షి’ క్షేత్రస్థాయిలో పరిశీలించగా పలు ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి.

గతేడాదితో పోలిస్తే టెన్త్‌లోపు విద్యార్థుల తల్లిదండ్రులకు విద్యా వ్యయం సగటున 18 శాతం పెరిగితే ఇంటర్‌ విద్యార్థులకు 27 శాతం వరకు పెరిగింది. ఫీజులతో పాటు ఈ ఏడాది పుస్తకాలు, రవాణా వ్యయం, యూనిఫాం, బూట్లు వంటి వాటి ధరలు భారీగా పెరిగిపోయాయి. ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీల్లో చదివే వారికి ఫీజుల పెంపు లేకపోయినా పెరిగిన పుస్తకాలు, రవాణా, యూనిఫాం వంటి వాటివల్ల వారికి కూడా అదనపు ఖర్చులు తప్పడంలేదు.  

పాఠశాలల్లో..
ప్రతీ పాఠశాలలో గత ఏడాది ఫీజులు సగటున రూ.30,000 వరకు ఉండగా ఈ ఏడాది రూ.35,000 వరకు పెరిగాయి. అలాగే, పుస్తకాల వ్యయం రూ.3,200 నుంచి రూ.4,000 వరకు చేరుకున్నాయి. యూనిఫాం (మూడు జతలు) రూ.1,800 నుంచి రూ.2,750, బూట్లు (రెండు జతలు) రూ.3,000 నుంచి రూ.4,000కు పెరిగాయి.

ఇక రవాణా, బ్యాగులు వంటి ఇతర ఖర్చులను లెక్కలోకి తీసుకుంటే గతేడాది కంటే రెట్టింపయ్యాయి. ఈ విధంగా చూస్తే గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఒక్కో విద్యార్థిపై సగటున రూ.7,350 వరకు భారం పెరిగింది. అదే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు రూ.2,350 వరకు ఖర్చు పెరిగినట్లు అంచనా.

స్కూల్‌ విద్యార్థులపై పెరిగిన భారం రూ.3,167కోట్లు పైనే
2017–18 సామాజిక, ఆర్థిక సర్వే ప్రకారం రాష్ట్రంలో 69,61,058 మంది విద్యార్ధులు స్కూళ్లలో చదువుతున్నారు. ఇందులో ప్రైవేటు పాఠశాలల్లో సుమారు 30.62 లక్షల మంది చదువుతుంటే ప్రభుత్వ పాఠశాలల్లో 38.98 లక్షల మంది చదువుతున్నారు.

ఈ లెక్కన చూస్తే ప్రైవేటు పాఠశాలల్లో చదివిస్తున్న తల్లిదండ్రులపై ఈ ఏడాది రూ.2,251.20 కోట్లు భారం పడినట్లు అంచనా. ప్రభుత్వ పాఠశాలల్లో చదివిస్తున్న వారికి రూ.916.2 కోట్లు అదనపు భారమైంది. ఈ విధంగా చూస్తే మొత్తం రూ.3,167.4 కోట్లు తక్కువ కాకుండా భారం పెరిగిందని లెక్కగా తేలింది. అదే పెద్దస్థాయి కార్పొరేట్‌ స్కూల్స్‌లో ఉన్న ఫీజులను లెక్కలోకి తీసుకుంటే ఈ మొత్తం పెరుగుతుందని విద్యారంగ నిపుణులు పేర్కొంటున్నారు.


కాలేజీల్లో...
ప్రైవేట్‌ స్కూళ్ల వ్యవహారం ఇలా ఉంటే.. కార్పొరేట్‌ కాలేజీల తీరు మరోలా ఉంది. ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌లు, ఆన్‌లైన్‌ టెస్టుల పేరుతో ఫీజులు గుంజడం ఎక్కువైందని తల్లిదండ్రులు వాపోతున్నారు. సామాన్య స్థాయి పైవేటు కాలేజీల్లో ఇంటర్మీడియట్‌ ఫీజులు గతేడాది పోలిస్తే సగటున రూ. 55,000 నుంచి రూ.65,000కు పెరిగాయి. అలాగే పుస్తకాలు, రవాణా, బ్యాగ్‌లు వంటి ఇతర ఖర్చులు తీసుకుంటే రూ.24,800 నుంచి రూ.36,200  పెరిగాయి.

2017–18 సామాజిక, ఆర్థిక సర్వే ప్రకారం రాష్ట్రంలో మొదటి, రెండవ సంవత్సరం చదువుతున్న ఇంటర్‌ విద్యార్థుల సంఖ్య 10,05,958గా ఉంది. ఇందులో ప్రైవేటు కాలేజీల్లో చదువుతున్న వారు సుమారుగా 7,54,530 గా ఉంటే ప్రభుత్వ కాలేజీల్లో 2,51,428 చదువుతున్నారు. ఇలా పెరిగిన ఖర్చులను లెక్కలోకి తీసుకుంటే ప్రభుత్వ కాలేజీల్లో చదువుతున్న తల్లిదండ్రులపై ఈ ఏడాది సుమారు రూ.285 కోట్ల అదనపు భారం పడితే ప్రైవేటు కాలేజీల్లో చదువుతున్న వారు రూ.1,900.7 కోట్లు అదనంగా చెల్లించాల్సి వచ్చింది.

ఇది కేవలం డేస్కాలర్స్‌ కింద పరిగణనలోకి తీసుకొని లెక్కిస్తేనే ఇలా ఉందని, అదే రెసిడెన్షియల్‌ విద్యార్థుల భారాన్ని కూడా తీసుకుంటే ఈ మొత్తం మూడు రెట్లు అవుతుందంటున్నారు. ప్రైవేటు స్కూళ్లు, కాలేజీలు ఇలా వేల రూ. కోట్లు  వసూలు చేస్తున్న నేపథ్యంలో విద్యా వ్యవస్థపై నియంత్రణ ఉండాలని తల్లిదండ్రులు డిమాండ్‌ చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement