సాక్షి, హైదారబాద్: ‘కారణం చెప్పకుండా పిల్లల్ని ఒక్కసారిగా చదువుకి దూరం చేస్తే.. తల్లిదండ్రుల మనసు ఎంత క్షోభిస్తుందో అర్థం చేసుకోండి’ అంటూ ఆమె చెమర్చిన కళ్లతో ప్రశ్నిస్తుంటే.. నగరంలో పలువురు తల్లిదండ్రుల కళ్లు తడిదేరాయి. ఎందరో మధ్యతరగతి పేరెంట్స్‌కి పిల్లల కోసం చదువు‘కొనే’ తమ కష్టాలు గుర్తొచ్చాయి కార్పొరేట్ స్కూళ్ల కాఠిన్యంపై ధ్వజమెత్తారు సినీ సెలబ్రిటీ జంట శివబాలాజీ, స్వప్నమాధురి దంపతులు. కొన్ని స్కూళ్ల యాజమాన్యాల నిర్వాకాలను తప్పనిసరి భరించే ఎందరో పేరెంట్స్‌కు భిన్నంగా సిటీలో తొలిసారిగా స్కూల్‌పై ఈ తరహా పోరాటం చేసిన పేరెంట్స్‌గా, స్కూల్ నుంచి తీసేసిన వందలాది మంది పిల్లలకు అండగా నిలిచారు.. తీసేసిన పిల్లల్ని తిరిగి చేర్చుకునేలా చేసి గెలిచారు. ఈ నేపథ్యంలో స్వప్నమాధురితో సంభాషించినప్పుడు.. పంచుకున్న విషయాలు ఆమె మాటల్లోనే..
♦ప్రీ మిడ్‌టర్మ్ పరీక్షల కోసం రివిజన్స్ జరుగుతున్న సమయంలో.. స్కూల్లో ఎనిమిదేళ్లుగా చదువుతున్న మా పిల్లల్ని ఆకస్మికంగా ఆన్‌లైన్ క్లాసులకు దూరం చేశారు. కారణం ఏంటని ఫ్రంట్ ఆఫీస్ వాళ్లకి ఫోన్ చేసి అడిగాం. అకౌంట్ డిపార్ట్‌మెంట్‌ని కాంటాక్ట్ చేయమన్నారు. అక్కడ నుంచీ రిప్లై లేదు.
♦మన సైడ్ నుంచి ఏ తప్పు ఉండకూడదని కంటిన్యూగా ఫోన్స్ చేస్తున్నా ‘నో రెస్పాన్స్’.. ఫ్రంట్ ఆఫీస్‌కి కాల్ చేసి ఫోన్ చేసి, మెయిల్‌కి రిప్లై రావడం లేదంటే.. ఫీజు విషయమై ఉంటుందన్నారు. (శివ బాలాజీ ఫిర్యాదుపై హెచ్‌ఆర్‌సీ స్పందన)
♦ఏదైనా సరే మాకు చెప్పాలి కదా.. ఏదీ చెప్పకుండా సడెన్‌గా ఇలా చేయడం ఏమిటనడిగితే ప్రిన్సిపాల్‌తో మాట్లాడిస్తామని చెబుతూ వచ్చారు. అదీ జరగలేదు.
♦కొంత మంది తల్లిదండ్రులు గ్రూప్‌గా ఏర్పడి ఫీజులు తగ్గించమని అడగడం, ఆ గ్రూప్‌లో నేనూ ఉండటం వల్లే ఇలా చేశారని ఆ తర్వాత వారి స్పందన ద్వారా అర్థమైంది.
ఫీజు తగ్గించమని అడగడం తప్పా?
♦కరోనా కారణంగా ప్రస్తుతం చాలా మంది ఆర్థిక పరిస్థితులు బాగోలేవు. ఆన్‌లైన్ క్లాసులంటే.. ల్యాప్ టాప్ కొనాలి. పనులు మానేసి కొన్ని గంటల పాటు సమయాన్ని పిల్లలతో గడపాలి.. ఇవన్నీ సమస్యలున్నాయి. కాబట్టి ఫీజు తగ్గించమని అడగడానికి వందల మంది పేరెంట్స్ కలిసి గ్రూప్‌గా ఏర్పడ్డారు.
♦ఆ గ్రూప్‌లో నన్నూ యాడ్ చేశారు. మేమైతే ఫస్ట్ టర్మ్ ఫీజు పూర్తిగా కట్టేశాం అయినా కానీ కట్టలేని వారి గురించీ ఆలోచించాలి కదా.. అందులోనూ వీరెవరూ మొత్తం ఫీజు కట్టం అనలేదు. కాస్త తగ్గించమన్నారంతే.
♦వాళ్లకు కనీసం రెస్పాన్స్ ఇవ్వాలి కదా? తగ్గిస్తున్నామనో.. తగ్గించమనో చెప్పాలి కదా? జూన్‌లో గ్రూప్ తరఫున మెయిల్ పెడితే ‘మీరు గ్రూప్‌గా అడిగితే అసలు మేం కన్సిడర్ చేయం’ అంటూ ఆగస్టు 12న రిప్లై వచ్చింది.
♦దాంతో పర్సనల్‌గా డైరెక్టర్, ప్రిన్సిపాల్‌ని అడ్రస్ చేస్తూ ఒక లెటర్ రాశాం. పేరెంట్స్‌ని తప్పుగా చూడవద్దు. ఈ సమస్య లేకపోతే ఎవరూ ఇలాంటి రిక్వెస్ట్ పెట్టేవారు కాదు అంటూ నచ్చజెప్పే ప్రయత్నం చేశాం.
♦విచిత్రమేమిటంటే నేనేమీ నా పిల్లల ఫీజు విషయంలో తగ్గించాలని అడగలేదు. అయినా నా పిల్లలతో పాటు గ్రూప్‌లో ఉన్న వందలాది మంది పిల్లల్ని క్లాసులకు దూరం చేశారు. పైగా..‘మిగతా పేరెంట్స్‌ని ఫీజు కట్టకుండా ఆపుతున్నారు మీ మీద యాక్షన్ తీసుకుంటా’మంటూ మాకు మెయిల్ పెట్టారు.
♦నా పిల్లల్ని ఎందుకు తీశారు? కమ్యూనికేషన్ ఎందుకు బ్లాక్ చేసేశారు? మొత్తం ఫీజు కట్టేశాక కూడా నా తప్పు ఏమిటి? ఒక పేరెంట్‌గా నేను అడిగితే నా మీద పర్సనల్‌గా ఎందుకు యాక్షన్ తీసుకుంటామంటున్నారు? అంటూ ప్రశ్నలు అడిగితే రిప్లై లేదు. దాదాపు 3 వారాల పాటు చూసి ఇక వేరే గత్యంతరం లేక మానవ హక్కుల కమిషన్‌ని ఆశ్రయించాం.
హక్కులేమీ లేవా?
పిల్లలను స్కూల్లో చదివించే తల్లిదండ్రులకు తమకంటూ కొన్ని హక్కులు ఉంటాయి కదా. ‘మీ వైపు నుంచి ఈ తప్పు జరిగింది.. దాంతో మీ పిల్లల్ని తీసేస్తున్నాం’ అంటూ నోటిస్ ఇచ్చి దానికి స్పందించకపోతే అప్పుడు యాక్షన్ తీసుకోవచ్చు.
►అంతేగాని ఏకపక్షంగా చెప్పాపెట్టకుండా తీసేసి ఎందుకు అలా చేయాల్సి వచి్చందో కూడా సమాచారం ఇవ్వకపోతే ఎలా? ‘ఈ విషయంలో స్కూల్ తప్పేమీ లేదని తేలింది. స్వప్పమాధురి, శివబాలాజీ మీడియా పబ్లిసిటీ కోసమే డ్రామా ఆడుతున్నారు’ అంటూ మిగిలిన పేరెంట్స్‌ను తప్పుదారి పట్టించేలా స్కూల్ నుంచి మెయిల్స్ పెట్టారు. పిల్లల భవిష్యత్‌తో డ్రామాలు ఆడతామా? అంత అవసరం మాకేంటి?
వదిలేది లేదు..
ప్రస్తుతం చాలా మంది తీసేసిన పిల్లల్ని తిరిగి క్లాసుల్లోకి తీసుకున్నారు. అయినప్పటికీ దీన్ని వదిలేది లేదు. మా పిల్లల్ని ఎందుకు తీసేశారు? మాకు కారణం కావాలి. మాకు నగరం నుంచి తెలుగు రాష్ట్రాల నుంచి ఫోన్లు వస్తున్నాయి.. ఎందరో తల్లిదండ్రులు ఫోన్ చేస్తూ కరోనా నేపథ్యంలో తమ కష్టాలు, స్కూళ్ల యాజమాన్యాలతో తమకు ఏర్పడుతున్న సమస్యలు చెబుతున్నారు. వారందరికీ మనోధైర్యం ఇచ్చేలా హెచ్‌ఆర్సీ జడ్జిమెంట్ రావాలి. ప్రతి స్కూల్‌కి ఇదొక పాఠం అవ్వాలి. కష్టపడి పిల్లల్ని చదివించే పేరెంట్స్‌ని అవస్థలు పెట్టడం తప్పు అని స్కూల్స్ తెలుసుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment