టీడీపీ మాజీ ఎమ్మెల్యే, తాడిపత్రి మున్సి పల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డిపై( J. C. Prabhakar Reddy) ఫిల్మ్ ఛాంబర్‌లో నటి మాధవీలత(Madhavi Latha) ఫిర్యాదు చేశారు. మా ట్రెజరర్ శివ బాలాజికి(Siva Balaji) పిర్యాదు పత్రాన్ని ఆమె అందజేశారు. న్యాయం కోసం పోరాటం చేస్తానని తన సోషల్‌మీడియాలో ఆమె పేర్కొన్నారు.
లేఖలో మాధవీలత పేర్కొన్న అంశాలు
'జేసీ ప్రభాకర్‌రెడ్డిపై ఫిల్మ్ ఛాంబర్‌తో పాటు మానవ హక్కుల సంఘానికి, పోలీసులకు ఫిర్యాదు చేశాను. జేసీ ప్రభాకర్ రెడ్డి నా మీద చాలా దారుణంగా మాట్లాడారు. నా మీద వచ్చిన వ్యాఖ్యలపై ఇండస్ట్రీ కూడా ఖండించలేదు. అందుకే 'మా'కు ఫిర్యాదు చేశాను. మా ట్రెజరర్ శివబాలాజీకి కాల్ చేస్తే వెంటనే స్పందించారు. నా ఫిర్యాదును మా అధ్యక్షులు మంచు విష్ణు దృష్టికి కూడా తీసుకెళ్లారు. నేను ఎంత కఠినంగా మాట్లాడిన నిజాలు మాట్లాడుతాను. సినిమా వాళ్లను అందరూ అవమానిస్తారు. కానీ, రాజకీయాల్లోకి వెళ్లి సినిమా వాళ్ల సత్తా చాటుతున్నాం. వ్యక్తిత్వ హననం చేస్తూ సినిమా వాళ్లపై ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదు.' అని ఆమె అన్నారు.
మేము సినిమాల్లో నటిస్తే.. వాళ్లు సమాజంలో నటిస్తున్నారు: శివ బాలాజీ
లేఖపై శివ బాలాజీ ఇలా స్పందించారు. 'మాధవీలత చాలా బాధతో ఉన్నారని అర్థమైంది. ఒక మహిళను బాధపెట్టడం ఎవరికీ మంచిది కాదు. ఒక పోస్టర్ చూసి అపార్థం చేసుకుని ఆమెపై తప్పుడు వ్యాఖ్యలు చేయడం మంచిది కాదు. రాజకీయ నాయకులు ప్రజా సమస్యలపై మాట్లాడడం మానేసి ఇతరుల వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడుతున్నారు. ఎంతో మంది నటీనటులు పొలిటిషియన్స్ అయ్యారు. కానీ ఏ పొలిటిషియన్ కూడా పేరున్న యాక్టర్ కాలేదు. మేము కెమెరా ముందే నటిస్తాం. రాజకీయ నాయకులు సమాజంలో కూడా నటిస్తారు. ఇండస్ట్రీ జోలికి రాజకీయ నాయకులు రావొద్దు. మాధవిలత ఫిర్యాదుపై కమిటీలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం'. అని ఆయన అన్నారు.
(ఇదీ చదవండి: చాలా సిగ్గుపడుతున్నా.. సైఫ్‌కు క్షమాపణలు చెప్పిన ఊర్వశి రౌటేలా)
సినీ నటి, బీజేపీ నేత మాధవీలతపై జేసీ ప్రభాకర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. ఆమె పెద్ద వ్యభి చారి అని, ఇలాంటి వ్యక్తులతోనా తమకు నీతులు చెప్పించేది అంటూ ఆయన ఒక సందర్భంలో ఫైర్ అయ్యారు. ఆయన మాట్లాడిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
మాధవిపై జేసీ వ్యాఖ్యలు ఎందుకు చేశారు..?
నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకుని డిసెంబర్ 31న తాడిపత్రిలోని జేసీ పార్కులో ‘మహిళలకు మాత్రమే’ అంటూ జేసీ ప్రభాకర్‌రెడ్డి ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటుచేశారు. దీనిపై మాధవీలత స్పందిస్తూ.. ఇలాంటి వేడుకలకు వెళ్లకూడదని, తిరుగు ప్రయాణంలో అర్థరాత్రి వేళ ఏదైనా జరిగితే ఎవరు కాపాడతారని, జేసీ పార్కులో వేడుకలకు వెళ్లొద్దని సూచించారు. దీంతో జేసీ ఒక్కసారిగా భగ్గుమన్నారు.
బెదిరేది లేదని ఘాటుగానే మాధవి రియాక్షన్
అయితే, జేసీ పరుష వ్యాఖ్యల నేపథ్యంలో సినీనటి మాధవీలత కూడా సోషల్‌మీడియాలో ఘాటుగానే స్పందించారు. మహిళల మాన, ప్రాణ రక్షణ గురించి మాట్లాడటం తప్పయితే తనపై వెయ్యి కేసులు పెట్టినా భయపడబోనన్నారు. తెరమీద కనిపించే వాళ్లందరూ వ్యభిచారులేనని అనడం ఆయన కుసంస్కారానికి నిదర్శనమన్నారు. తండ్రి అలా మాట్లాడినా యువ ఎమ్మెల్యేగా ఉన్న అస్మిత్‌రెడ్డి ఖండించలేని స్థితిలో ఉన్నారని ఆమె గుర్తుచేశారు. జేసీ ప్రభాకర్‌రెడ్డిని ప్రేమించే సైకోలెవరికీ తాను భయపడబోనన్నారు. తనను కిడ్నాప్ చేయాలనుకున్నా, మర్డర్ చేయాలనుకున్నా తాను బెదిరేది లేదన్నారు. ఈ వయసులో ఇలా మాట్లాడ్డానికి ఆయన సిగ్గుపడాలని, ఈ భాషను భరిస్తున్న ఆయన భార్యాపిల్లలకు ధన్యవాదాలన్నారు.
మాధవికి క్షమాపణలు చెప్పిన జేసీ
తన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు రావడంతో జేసీ ప్రభాకర్ రెడ్డి వెనక్కి తగ్గారు. సినీ నటి మాధవీలతకు బహిరంగ క్షమాపణలు చెప్పారు. 'ఆవేశంలో నోరు జారాను,టంగ్ స్లిప్ అయింది..సారీ'అని జేసీ అన్నారు. క్షమాపణలు చెప్పిన తర్వాత కూడా మాధవి కన్నీళ్లు పెట్టుకుని ఒక వీడియో పంచుకుంది. 'మహిళల మాన, ప్రాణ రక్షణ గురించి మాట్లాడినందుకు తనను అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని వాపోయింది. మామూలుగా ఉందామని చాలా ప్రయత్నించా.. కానీ నావల్ల కావడం లేదంటూ..' కన్నీళ్లు పెట్టుకుంది.
Comments
Please login to add a commentAdd a comment