
కార్పొరేట్ సంస్థలపై నియంత్రణ లేదు: కోదండరాం
హైదరాబాద్: రాష్ట్రంలో కార్పొరేట్ స్కూళ్లు, కాలేజీలపై ప్రభుత్వానికి నియంత్రణ లేదని జేఏసీ చైర్మన్ కోదండరాం అన్నారు. శనివారం రావి నారాయణ రెడ్డి ఆడిటోరియంలో హైదరాబాద్ పేరెంట్స్ అసోసియేషన్ టీజేఏసీ ఆధ్వర్యంలో స్కూళ్లలో ఫీజుల దోపిడీపై ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్పొరేట్ స్కూళ్లు, కాలేజీలకు రాజకీయ అండదండలు ఉండటంతో వాటిని సర్కారు నియంత్రించ లేకుండా పోతోందన్నారు. వీటి వల్ల చిన్నా చితకా విద్యా సంస్థలు కనుమరుగై పోతున్నాయన్నారు.
కార్పొరేట్ విద్యాసంస్థల్లో విద్య అంటేనే ర్యాంకు అనే విధంగా పరిస్థితి తయారయిందని విమర్శించారు. ప్రభుత్వం ఫీజుల నియంత్రణకు సమగ్రమైన చట్టం చేయాలని సూచించారు. ప్రభుత్వం ఫీజుల పెంపుపై స్టడీ చేయాలనుకుంటే ముందుగా ఫీజులు పెంచరాదని అన్నారు. విద్యాహక్కు చట్టాన్ని అమలు చేయాలని కోరారు. ప్రభుత్వం విద్యాసంస్థలను బలోపేతం చేయాలని తెలిపారు. కార్యక్రమానికి న్యాయవాది రచనా రెడ్డి, వివిధ సంఘాల నాయకులు హాజరయ్యారు.