న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ, ఎన్సీఆర్ పరిధిలో వాయు కాలుష్యం కట్టడికి అమలు చేస్తున్న గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్-4 ఆంక్షలను సడలించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. గాలి నాణ్యత మెరుగుపడే వరకు ఆదేశాలు జారీ చేయలేమని తెలిపింది. తమ ఆదేశాలు లేకుండా ఆంక్షలు తొలగించవద్దని సర్వోన్నత న్యాయస్థానం మరోసారి స్పష్టం చేసింది. దీనిపై గురువారం ని ర్ణయం తీసుకుంటామని తెలిపింది.
ఢిల్లీలో వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కాలుష్య స్థాయిలు ఎక్కువగా ఉన్నప్పటికీ ఢిల్లీలో పాఠశాలలు, కళాశాలలు తెరిచే అంశాన్ని పరిశీలించాలని సూచించింది. విద్యార్ధులు ఇంట్లో ఉండటం వల్ల కాలుష్య సమస్య తీరదని అభిప్రాయపడింది.
‘పెద్ద సంఖ్యలో విద్యార్థులకు తమ ఇళ్లలో ఎయిర్ ప్యూరిఫయర్లు లేవు, అందువల్ల ఇంట్లో కూర్చున్న పిల్లలకు, పాఠశాలకు వెళ్లే పిల్లలకు తేడా ఉండదు. అంతేగాక ఆన్‌లైన్ క్లాస్‌లలో పాల్గొనడానికి అందరి విద్యార్థులకు సౌకర్యాలు లేవు. ఇలాగే ఆన్‌లైన్ తరగతులు కొనసాగితే వారు వెనకబడిపోతారు. పాఠశాలలు, అంగన్‌వాడీలు మూసివేయడం వల్ల చాలా మంది విద్యార్ధులు మధ్యాహ్న భోజన సౌకర్యం కోల్పోతున్నారు. ’ అని జస్టిస్ ఎఎస్ ఓకా, జస్టిస్ ఏజీ మసీహ్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది.
చదవండి: షిండేనే మహారాష్ట్ర సీఎం!
ఈ మేరకు ఢిల్లీలో విద్యాసంస్థలు తెరిచే అంశాన్ని పరిశీలించాలని ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్‌కు సూచించింది. అదే విధంగా 1 నుంచి 10,11, 12 తరగతులకు శారీరక తరగతులపై నిషేధం కొనసాగించడంతోపాటు ఫిజికల్ క్లాసుల నిర్వహణపై రేపటిలోగా (మంగళవార) నిర్ణయం చెప్పాలని సీఏక్యూఎమ్‌ను(CAQM) ఆదేశించింది.
ఇక ఢిల్లీ పోలీసులపై సుప్రీంకోర్టు కొరడా ఝుళిపించింది. కాలుష్యాన్ని నివారించడంలో ఆంక్షలను సరిగా అమలు చేయకపోవడంపై సిటీ పోలీస్ కమిషనర్‌పై మండిపడింది. వాహనాల నియంత్రణకు చెక్‌పోస్టులు ఏర్పాటు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అనుమతులు లేని వాహనాలను అనుమతించిన అధికారులపై సీరియస్ అయ్యింది. ఆదేశాలు అమలు చేయని అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
యాక్షన్ ప్లాన్-4 అమలు సమాజంలో అనేక వర్గాలపై ప్రతికూల ప్రభావం చూపుతోందని సుప్రీం ఆవేదన వ్యక్తం చేసింది. నిర్మాణరంగంలో కార్మికులు, దినసరి కూలీలు పనులు కోల్పోయారని తెలిపింది. 12 సెక్షన్ ప్రకారం శ్రామికులు ఇబ్బంది పడకుండా ఉండేలా వివిధ అధికారులకు ఆదేశాలు జారీ చేసేందుకు సీఏక్యూఎమ్‌కు అన్ని అధికారాలు ఉన్నాయి. కావున వారిందరికీ ఉపశమనం కలిగేలా చర్యలు తీసుకోవాలని కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ (CAQM)కి సూచించింది.
Comments
Please login to add a commentAdd a comment