ముంబై : మహరాష్ట్ర సీఎం ఎవరనే ఉత్కంఠ కొనసాగుతోంది. దేవేంద్ర ఫడ్నవిస్‌నే సీఎంను చేయాలని బీజేపీ భావిస్తుండగా.. ఏక్‌నాథ్ షిండే అడ్డు పడుతున్నారు. అయితే.. ఫలితాలు వెలువడ్డాక సీఎం రేసులో తాను ఉన్నానంటూ సంకేతాలిచ్చిన ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్.. ఇప్పుడు ఫడ్నవిస్‌కే మద్దతు ఇవ్వబోతున్నారంటూ అక్కడి మీడియాలో కథనాలు వస్తునాయి. ఈలోపు.. బీహార్ మోడల్‌ను తెరపైకి తెచ్చారు ఓ ఎంపీ.
బీహార్ మోడల్ ప్రకారం.. ఏక్‌నాథ్ షిండేని సీఎంగా కొనసాగించాలని ఆ వర్గం నేత నరేష్ మ్హస్కే డిమాండ్ చేస్తున్నారు. . అలా జరిగితే.. తన మిత్ర పక్షాల్ని రాజకీయావలసరాల కోసం వాడుకుని, ఆపై వదిలేస్తుందనే విమర్శలకు బీజేపీ ధీటైన సమాధానం ఇచ్చినట్లు అవుతుందని నరేష్ అంటున్నారు.
బీహార్ మోడల్ ఏంటంటే..
2020 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాలేదు. 243 స్థానాలకు గానూ.. ఆర్జేడీ 75 సీట్లు దక్కించుకోగా, బీజేపీ 74, జేడీ(యూ) 43 స్థానాలు దక్కించుకుంది. అయితే.. బీజేపీ జేడీయూ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసి.. నితీశ్ కుమార్‌ను సీఎంను చేసి పెద్ద త్యాగమే చేసింది. ఆ టైంలో శివసేన పత్రిక సామ్నా ఈ పరిణామంపై సెటైర్లు కూడా వేసింది.
2019 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 105 సీట్లతో అతిపెద్ద పార్టీగా నిలవగా, శివసేన 56, ఎన్సీపీ 54 స్థానాలు దక్కించుకున్నాయి. అయితే సీఎం పదవిని బీజేపీ వదులుకోకపోవడంతో.. ఎన్సీపీ, శివసేన, కాంగ్రెస్‌లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఆ తర్వాత.. శివసేన నుంచి ఏక్‌నాథ్ షిండే వర్గం చీలికతో బీజేపీ తిరిగి ప్రభుత్వం ఏర్పాటు చేయగా.. షిండేనే బీజేపీ సీఎంను చేసింది.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అధికార మహాయుతి కూటమి ఘన విజయం సాధించింది. 288 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ 132 సీట్లను కైవసం చేసుకుని అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించింది. అయితే, సీఎం విషయమే ఇంకా ఓ కొలిక్కి రాలేదు.
బీజేపీ అధిష్టానం దేవేంద్ర ఫడ్నవీస్‌కు సీఎం బాధ్యతల్ని అప్పగించేందుకు మొగ్గు చూపుతుంది. అజిత్ పవార్ నేతృత్వరంలోని ఎన్సీపీ సైతం ఫడ్నవీస్‌కు ముఖ్యమంత్రి పీఠం కట్టబెట్టడాన్ని సమర్థిస్తోంది. కానీ, శివసేన నేతృత్వంలోని ఏక్ నాథ్ షిండే మాత్రం సీఎం సీటు తనకే కావాలని పట్టుబడుతున్నారు. షిండే వర్గం నేతలు ఇదే విషయంపై కుండబద్దలు కొడుతున్నారు.
ఈ తరుణంలో సోమవారం (నవంబర్ 25న) మహాయుతి కూటమి వర్గం కీలక నేతలు దేవేంద్ర ఫడ్నవీస్, ఏక్‌నాథ్ షిండే,అజిత్ పవార్‌లు బీజేపీ పెద్దలతో భేటీ అయ్యారు. ఈ భేటీలో మహరాష్ట్ర సీఎం ఎవరనేది బీజేపీ పెద్దలు రాత్రికల్లా తేల్చే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment