chiefminister
-
షిండేనే మహారాష్ట్ర సీఎం.. తెరపైకి బీహార్ మోడల్!
ముంబై : మహరాష్ట్ర సీఎం ఎవరనే ఉత్కంఠ కొనసాగుతోంది. దేవేంద్ర ఫడ్నవిస్‌నే సీఎంను చేయాలని బీజేపీ భావిస్తుండగా.. ఏక్నాథ్ షిండే అడ్డు పడుతున్నారు. అయితే.. ఫలితాలు వెలువడ్డాక సీఎం రేసులో తాను ఉన్నానంటూ సంకేతాలిచ్చిన ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్.. ఇప్పుడు ఫడ్నవిస్‌కే మద్దతు ఇవ్వబోతున్నారంటూ అక్కడి మీడియాలో కథనాలు వస్తునాయి. ఈలోపు.. బీహార్ మోడల్‌ను తెరపైకి తెచ్చారు ఓ ఎంపీ. బీహార్ మోడల్ ప్రకారం.. ఏక్నాథ్ షిండేని సీఎంగా కొనసాగించాలని ఆ వర్గం నేత నరేష్ మ్హస్కే డిమాండ్ చేస్తున్నారు. . అలా జరిగితే.. తన మిత్ర పక్షాల్ని రాజకీయావలసరాల కోసం వాడుకుని, ఆపై వదిలేస్తుందనే విమర్శలకు బీజేపీ ధీటైన సమాధానం ఇచ్చినట్లు అవుతుందని నరేష్ అంటున్నారు. బీహార్ మోడల్ ఏంటంటే..2020 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాలేదు. 243 స్థానాలకు గానూ.. ఆర్జేడీ 75 సీట్లు దక్కించుకోగా, బీజేపీ 74, జేడీ(యూ) 43 స్థానాలు దక్కించుకుంది. అయితే.. బీజేపీ జేడీయూ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసి.. నితీశ్ కుమార్‌ను సీఎంను చేసి పెద్ద త్యాగమే చేసింది. ఆ టైంలో శివసేన పత్రిక సామ్నా ఈ పరిణామంపై సెటైర్లు కూడా వేసింది.2019 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 105 సీట్లతో అతిపెద్ద పార్టీగా నిలవగా, శివసేన 56, ఎన్సీపీ 54 స్థానాలు దక్కించుకున్నాయి. అయితే సీఎం పదవిని బీజేపీ వదులుకోకపోవడంతో.. ఎన్సీపీ, శివసేన, కాంగ్రెస్‌లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఆ తర్వాత.. శివసేన నుంచి ఏక్నాథ్ షిండే వర్గం చీలికతో బీజేపీ తిరిగి ప్రభుత్వం ఏర్పాటు చేయగా.. షిండేనే బీజేపీ సీఎంను చేసింది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అధికార మహాయుతి కూటమి ఘన విజయం సాధించింది. 288 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ 132 సీట్లను కైవసం చేసుకుని అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించింది. అయితే, సీఎం విషయమే ఇంకా ఓ కొలిక్కి రాలేదు.బీజేపీ అధిష్టానం దేవేంద్ర ఫడ్నవీస్‌కు సీఎం బాధ్యతల్ని అప్పగించేందుకు మొగ్గు చూపుతుంది. అజిత్ పవార్ నేతృత్వరంలోని ఎన్సీపీ సైతం ఫడ్నవీస్‌కు ముఖ్యమంత్రి పీఠం కట్టబెట్టడాన్ని సమర్థిస్తోంది. కానీ, శివసేన నేతృత్వంలోని ఏక్ నాథ్ షిండే మాత్రం సీఎం సీటు తనకే కావాలని పట్టుబడుతున్నారు. షిండే వర్గం నేతలు ఇదే విషయంపై కుండబద్దలు కొడుతున్నారు. ఈ తరుణంలో సోమవారం (నవంబర్ 25న) మహాయుతి కూటమి వర్గం కీలక నేతలు దేవేంద్ర ఫడ్నవీస్, ఏక్నాథ్ షిండే,అజిత్ పవార్లు బీజేపీ పెద్దలతో భేటీ అయ్యారు. ఈ భేటీలో మహరాష్ట్ర సీఎం ఎవరనేది బీజేపీ పెద్దలు రాత్రికల్లా తేల్చే అవకాశం ఉంది. -
స్వగ్రామంలో సీఎంపై దాడి.. షాక్‌లో పోలీసులు..
పాట్నా: బీహార్ సీఎం నితీశ్ కుమార్‌కు ఆయన స్వగ్రామంలోనే చేదు అనుభవం ఎదురైంది. నితీశ్ కుమార్ భక్తియార్‌పూర్‌లో పర్యటిస్తుండగా ఓ యువకుడు దాడి చేశాడు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. వివరాల ప్రకారం.. సీఎం నితీశ్ భక్తియార్‌పూర్‌లోని స్థానిక ఆసుపత్రి కాంప్లెక్స్‌లో రాష్ట్రానికి చెందిన స్వాతంత్య్ర సమరయోధుడు శిల్పాద్ర యాజీ విగ్రహానికి నివాళులు అర్పిస్తుండగా దాడి జరిగింది. నితీశ్‌ను లక్ష్యంగా చేసుకున్న యువకుడు సెక్యూరిటీని దాటుకుని వెళ్లి మరీ దాడి చేశాడు. ఈ క్రమంలో భద్రతా సిబ్బంది యువకుడిని అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ అతడు దాడికి చేయడం గమనార్హం. అనంతరం యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు తెలిపారు. On-Camera, Nitish Kumar Attacked By Man During Function At Hometown https://t.co/X9oc6FYD3U pic.twitter.com/aX7eOz0oqn — NDTV (@ndtv) March 27, 2022 -
పన్నీరు ఎవరికి? కన్నీరు ఎవరికి?
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రిగా ఎవరు కానున్నారు? ఇదే ప్రశ్న ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యమంత్రిగా రాజీనామా చేసి, శశికళకు లైన్ క్లియర్ చేసిన సెల్వం అనూహ్యంగా తిరుగుబాటు జెండా ఎగురవేయడంతో ఒక్కసారిగా తమిళనాడు రాజకీయ ముఖచిత్రం మారిపోయింది. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి గా ఉన్న ఆయన తన పదవిని మళ్లీ సాధిస్తారా.. తన సంచలన వ్యాఖ్యలతో సునామీ సృష్టించిన సెల్వం హీరోగా నిలుస్తారా.. ఇపుడిదే ఆసక్తి రేపుతోంది. మరికొద్ది సేపట్లో గవర్నర్ విద్యాసాగర్ రావు రాజ్ భవన్ చేరుకోనుండటంతో ఈ ఉత్కంఠ మరింత పెరుగుతోంది. సీఎం పీఠాన్ని అధిష్టించేందుకు జయ నెచ్చెలి శశికళ, పురుచ్చిత్తలైవికి వీర విధేయుడు, పార్టీలో సౌమ్యుడుగా పేరొందిన సెల్వం మధ్య పోరు హోరాహోరీగా సాగుతోంది. ఈ ఎత్తులు, పై ఎత్తుల మధ్య తమిళ రాజకీయాలు మరింత రసవత్తరంగా మారాయి. మరోవైపు శశికళ క్రమంగా ఎంఎల్ఏలపై పట్టుకోల్పోతుండగా సెల్వం దూసుకుపోతున్నారు. ఒకనాటి ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలను మరపిస్తూ క్షణక్షణానికి కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో శశికళకు అవకాశం ఇస్తారా.. లేక పన్నీరు రాజీనామాను వెనక్కి తీసుకొని ప్రస్తుత ప్రభుత్వాన్ని కొనసాగిస్తారా? లేదా బలనిరూపణకోసం గడువు ఇస్తారా? ఇదే ఇండియా టాక్? మరోవైపు పన్నీర్ సెల్వం టెంట్‌లోకి ఎమ్మెల్యేలు కుప్పలుగా వచ్చి పడుతున్న సంకేతాలు అందుతున్నాయి. అటునుంచి దీపా జయకుమార్ మద్దతుకోసం కూడా సెల్వం పావులు కదుపుతున్నారు. సస్పెన్స్ క్రైమ్ థిల్లర్ సినిమా స్టోరీని మరపిస్తున్న తమిళ రాజకీయ పరిణామాలు ఎవరిపై పన్నీరు చిలకరించనున్నాయి, ఎవరికి కన్నీరును మిగల్చనున్నాయో వేచి చూడాల్సిందే. అయితే ఓపిఎస్ యూ టర్న్ వెనక అసలు వ్యూహకర్తలు ఎవరు అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. -
యంగ్ టైగర్ ముఖ్యమంత్రి అట?
అరచేతిలో ప్రపంచాన్ని చూపిస్తున్న ప్రముఖ సెర్చి ఇంజీన్ దిగ్గజం గూగుల్ మరోసారి తప్పులో కాలేసింది. టాలీవుడ్ హీర్ నందమూరి నటవారసుడు, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ను ముఖ్యమంత్రిని చేసేసింది. అవును..గూగుల్ ట్రాన్స్‌లేట్ ఆప్షన్ లో తారక్ (Tarak) అని టైప్ చేసినపుడు ముఖ్యమంత్రి అని తర్జుమా చేస్తోంది. దీంతో తెలుగు సినీలోకం గర్వించ దగ్గ నటుడు, మాజీ ముఖ్యమంత్రి, నందమూరి తారక రామారావు సినీ వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న జూ. ఎన్టీఆర్ ఇపుడు ముఖ్యమంత్రిగా అవతరించారు. వివిధ భాషలకు సంబంధించిన అర్ధాలను తెలుసుకోవడానికి ఉపయోగించే ఈ టూల్ తమ అభిమాన నటుడి పేరుకి ముఖ్యమంత్రి అర్థాన్ని చెబుతుడడంతో ఫ్యాన్స్ ఒకింత ఆశ్చర్యంతో పాటూ...మరింత సంతోషానికి లోనవుతున్నారట. తాత సినీ వారసత్వాన్ని అందిపుచ్చుకొన్న యంగ్ హీరో ఆయన రాజకీయ వారసత్వాన్ని కూడా అందుకోనున్నాడంటూ వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి తిరుగులేదని... గూగుల్ నిజం చేసిందంటూ ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారట! అయితే గూగుల్ ట్రాన్స్‌లేట్ పై గతంలో కూడా విమర్శలు చెలరేగాయి. ఈ నేపథ్యంలో లీగల్ నోటీసులు కూడా జారీ అయ్యాయని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రాంతీయ భాషలపై పట్టులేకపోవడం వలనే ఇది జరిగిందని, ఒక్క 'తారక్' విషయంలోనే కాదు, అనేక పదాల అనువాదం విషయంలోనూ నెటిజన్లు ఇబ్బంది పడ్డ సందర్భాలు ఉన్నాయంటూ భిన్న స్పందనలు వ్యక్తమవుతున్నాయి. ఏదైమైనా 'తారక్' అనే పదానికి 'ముఖ్యమంత్రి' అని తర్జుమా చేయడం విశేషమే. మరి దీనిపై గూగుల్ ఎలా స్పందిస్తుందో చూడాలి. కాగా జూ. ఎన్టీఆర్ ని అభిమానుల ముద్దుగా తారక్ అని పిలుచుకుంటారు. జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ కాంబినేషన్లో వస్తున్న జనతా గ్యారేజ్ చిత్రంతో బిజీగా ఉన్నాడు. సెప్టెంబర్ 2న విడుదల కానున్న ఈ చిత్రంలో మోహన్ లాల్, సమంత, నిత్యామీనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే.