పన్నీరు ఎవరికి? కన్నీరు ఎవరికి?
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రిగా ఎవరు కానున్నారు? ఇదే ప్రశ్న ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యమంత్రిగా రాజీనామా చేసి, శశికళకు లైన్ క్లియర్ చేసిన సెల్వం అనూహ్యంగా తిరుగుబాటు జెండా ఎగురవేయడంతో ఒక్కసారిగా తమిళనాడు రాజకీయ ముఖచిత్రం మారిపోయింది. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి గా ఉన్న ఆయన తన పదవిని మళ్లీ సాధిస్తారా.. తన సంచలన వ్యాఖ్యలతో సునామీ సృష్టించిన సెల్వం హీరోగా నిలుస్తారా.. ఇపుడిదే ఆసక్తి రేపుతోంది.
మరికొద్ది సేపట్లో గవర్నర్ విద్యాసాగర్ రావు రాజ్ భవన్ చేరుకోనుండటంతో ఈ ఉత్కంఠ మరింత పెరుగుతోంది. సీఎం పీఠాన్ని అధిష్టించేందుకు జయ నెచ్చెలి శశికళ, పురుచ్చిత్తలైవికి వీర విధేయుడు, పార్టీలో సౌమ్యుడుగా పేరొందిన సెల్వం మధ్య పోరు హోరాహోరీగా సాగుతోంది. ఈ ఎత్తులు, పై ఎత్తుల మధ్య తమిళ రాజకీయాలు మరింత రసవత్తరంగా మారాయి. మరోవైపు శశికళ క్రమంగా ఎంఎల్ఏలపై పట్టుకోల్పోతుండగా సెల్వం దూసుకుపోతున్నారు. ఒకనాటి ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలను మరపిస్తూ క్షణక్షణానికి కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.
ఈ నేపథ్యంలో శశికళకు అవకాశం ఇస్తారా.. లేక పన్నీరు రాజీనామాను వెనక్కి తీసుకొని ప్రస్తుత ప్రభుత్వాన్ని కొనసాగిస్తారా? లేదా బలనిరూపణకోసం గడువు ఇస్తారా? ఇదే ఇండియా టాక్? మరోవైపు పన్నీర్ సెల్వం టెంట్‌లోకి ఎమ్మెల్యేలు కుప్పలుగా వచ్చి పడుతున్న సంకేతాలు అందుతున్నాయి. అటునుంచి దీపా జయకుమార్ మద్దతుకోసం కూడా సెల్వం పావులు కదుపుతున్నారు. సస్పెన్స్ క్రైమ్ థిల్లర్ సినిమా స్టోరీని మరపిస్తున్న తమిళ రాజకీయ పరిణామాలు ఎవరిపై పన్నీరు చిలకరించనున్నాయి, ఎవరికి కన్నీరును మిగల్చనున్నాయో వేచి చూడాల్సిందే. అయితే ఓపిఎస్ యూ టర్న్ వెనక అసలు వ్యూహకర్తలు ఎవరు అనేది ప్రస్తుతానికి సస్పెన్స్.