పన్నీర్‌ను దెబ్బతీసింది వాళ్లే!
ముచ్చటగా మూడోసారి కూడా పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రి పదవి మూణ్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది. మూడోసారి ఆయన ముఖ్యమంత్రి పదవీకాలం నేటితో ముగిసిపోయింది. శశికళ నమ్మినబంటు పళనిస్వామి 31మంది మంత్రులతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.
నిన్నటివరకు తానే ముఖ్యమంత్రి అంటూ ధీమాగా ఉన్న పన్నీర్ సెల్వానికి ఎందుకు ఎదురుదెబ్బ తగిలింది? ఆయన అంచనా ఎక్కడ తప్పింది? సెల్వం ఆశించినట్టుగా అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు ఎందుకు మద్దతు ఇవ్వలేదు? అన్నదానిపై ఆసక్తికర విశ్లేషణలు తమిళ మీడియాలో వెలువడుతున్నాయి.
అన్నాడీఎంకేలో 20 మందిదాక రెబల్ ఎమ్మెల్యేలు ఉన్నట్టు ప్రచారం ఉంది. వారు పరోక్షంగా స్టాలిన్‌కు మద్దతు ఇస్తున్నట్టు కథనాలు కూడా వచ్చాయి. అక్రమాస్తుల కేసులో శశికళకు జైలుశిక్ష పడటంతో ఆ రెబల్ ఎమ్మెల్యేలు తన గూటికి చేరుతారని ఓపీఎస్ కోటి ఆశలు పెట్టుకున్నారు. కానీ, ఆయన ఆశలు తల్లకిందులయ్యాయి. రెబల్ ఎమ్మెల్యేలలో చాలామంది కొత్తవాళ్లే. వాళ్లు తెగించి పన్నీర్ గూటికి రాలేకపోయారు. ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం ఒకవేళ తమపై వేటు పడితే.. తిరిగి ఎన్నికలకు వెళ్లి గెలుపొందుతామా? అన్న నమ్మకం కూడా వారిలో చాలామందికి లేదని అంటున్నారు. అందుకే వారు భద్రంగా ఉండే మెజారిటీ వైపే మొగ్గుచూపారని చెప్తున్నారు. ఇది అన్నాడీఎంకేను ఐక్యంగా ఉంచడంలో సాయపడింది. ఈ ఐక్యత వల్లే పళనిస్వామి ముఖ్యమంత్రి కాగలిగారు.
ముఖ్యమంత్రి పదవి కోసం చివరివరకు పోరాడుతానని పన్నీర్ సెల్వం అంటున్నారు. పళనిస్వామి బలనిరూపణకు గవర్నర్ 15 రోజుల సమయమిచ్చారు. ఆలోపు ఏదైనా అద్భుతం జరిగి మూడింట రెండొంతుల మంది ఓపీఎస్‌కు జై కొడితే తప్ప ఆయన ఆశ నెరవేరే అవకాశం లేదు. ఇక పళనిస్వామి సీఎం కావడంతో ఓపీఎస్ రాజకీయ భవిష్యత్తు దాదాపు అంధకారమేనని భావిస్తున్నారు.