ఓపీఎస్ ఆట ముగిసింది..కానీ!
తమిళనాడు ముఖ్యమంత్రిగా శశికళ నమ్మినబంటు ఎడపాడి పళనిస్వామి ఎన్నిక కావడం, ప్రమాణ స్వీకారం కోసం ఆయనను గవర్నర్ ఆహ్వానించడంతో.. ప్రస్తుతానికి ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఓ. పన్నీర్ సెల్వం ఆడుతున్న రాజకీయ చదరంగానికి తాత్కాలికంగా బ్రేక్ పడినట్టు అయింది.
జయలలితకు నమ్మినబంటు అయిన పన్నీర్ సెల్వం.. చిన్నమ్మ కోసం సీఎం పదవికి రాజీనామా చేసి.. ఆ వెంటనే తిరుగుబాటుతో రాజకీయ డ్రామాకు తెరలేపిన సంగతి తెలిసిందే. సెల్వానికి మొదట అనూహ్య మద్దతు లభించింది. అమ్మ సమాధి వద్ద మౌనదీక్షతో ఆయన ప్రారంభించిన ఈ రాజకీయ చదరంగం తమిళనాట తీవ్ర ఉత్కంఠ రేపింది. తన వ్యూహాలతో, ఎత్తులు-పైఎత్తులతో కొంతవరకు అన్నాడీఎంకే నేతలను చీల్చగలిగిన సెల్వం.. శశికళపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను పూర్తిగా ఉపయోగించుకోలేకపోయారు. ఆయన ఎంత ఒత్తిడి చేసినా మన్నార్‌గుడి కుటుంబం గుప్పిటను దాటి ఎమ్మెల్యేలు రాలేకపోయారు. ఇప్పటికే అన్నాడీఎంకేలో శశికళ కుటుంబానిదే ఆధిపత్యం. ప్రభుత్వంలో కూడా అదే పరిస్థితి ఉండొచ్చునని భావిస్తున్నారు.
ప్రస్తుతానికి అన్నాడీఎంకే ఎమ్మెల్యేలను తనవైపు తిప్పుకోలేకపోయిన సెల్వం.. భవిష్యత్తులో ఆ పార్టీకి వ్యతిరేక గళంగా కొనసాగుతూ పుంజుకునే అవకాశముందని భావిస్తున్నారు. మరోవైపు పన్నీర్ సెల్వం మద్దతుదారులు తమ వర్గాన్ని ఐక్యంగా కొనసాగించే ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఇప్పటివరకు పన్నీర్ గూటికి చేరిన ఎంపీలు, ఎమ్మెల్యేలను కలిపి ఉంచేందుకు త్వరలోనే నాయకుడిని ఎన్నుకుని ముందుకుసాగుతామని పన్నీర్ మద్దతుదారులు అంటున్నారు. తమదే నిజమైన అన్నాడీఎంకే అని వారు వాదిస్తున్నారు. జయలలిత పాలన కోసం ప్రజలు ఓటేశారని, చిన్నమ్మ కుటుంబసభ్యుల కనుసన్నలలో ఉండే ప్రభుత్వం కోసం కాదని వారు అంటున్నారు.