బలనిరూపణకు 15రోజులా?
చెన్నై: తమిళనాడు కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన పళనిస్వామికి అసెంబ్లీలో బలనిరూపణ చేసుకునేందుకు గవర్నర్ విద్యాసాగర్‌రావు 15రోజుల గడువు ఇవ్వడాన్ని ప్రతిపక్ష నేత, డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే స్టాలిన్ తప్పుబట్టారు. బలనిరూపణకు 15రోజులు ఇవ్వడం చాలా ఎక్కువ గడువు అని, దీనివల్ల ఎమ్మెల్యేలకు తాయిలాలు ఎరవేసి.. కొనుగోలు చేసేందుకు అవకాశం ఏర్పడుతుందని ఆయన అన్నారు.
అలాంటి పరిస్థితి తలెత్తకుండా గవర్నర్ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. డీఎంకే ఎంపీ ఎలంగోవన్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి బలనిరూపణ కోసం 15 రోజులు ఇవ్వడాన్ని చూస్తే.. ఆయన మెజారిటీ నిరూపించుకుంటారని గవర్నర్‌కి కూడా నమ్మకం లేనట్టు కనిపిస్తోందని పేర్కొన్నారు. తమిళనాడులో పదిరోజులుగా నెలకొన్న హైటెన్షన్ రాజకీయ డ్రామాకు తెరదించుతూ.. మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు లేఖలు అందించిన పళనిస్వామిని ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ విద్యాసాగర్‌రావు ఆహ్వానించిన సంగతి తెలిసిందే.