ఎల్లుండే బలనిరూపణ.. రిసార్ట్‌కు ఎమ్మెల్యేలు!
చెన్నై: తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి పళనిస్వామి ఈ నెల 18న (శనివారం) అసెంబ్లీ వేదికగా బలాన్ని నిరూపించుకోబోతున్నారు. ఈమేరకు బలనిరూపణ తేదీ ఖరారైంది. శనివారం ప్రత్యేకంగా రాష్ట్ర శాసనసభ ఇందుకోసం సమావేశం కానుంది. ఈ సమావేశంలో పళనిస్వామి మెజారిటీ నిరూపించుకోవాల్సి ఉంటుంది.
మరోవైపు పళనిస్వామి ప్రమాణస్వీకార వేడుకలో పాల్గొన్న అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు తిరిగి కువత్తూరులోని గోల్డెన్ బే రిసార్ట్‌కు వెళ్లారు. బలనిరూపణ జరిగేవరకు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు ఇక్కడ బస చేయనున్నట్టు తెలుస్తోంది. రాజ్‌భవన్‌లో కొత్త సీఎం, మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు అక్కడి నుంచి నేరుగా రిసార్ట్‌కు వచ్చేశారు. పన్నీర్ సెల్వం తిరుగుబాటు చేసిననాటి నుంచి శశికళ వర్గం అన్నాడీఎంకే ఎమ్మెల్యేలను ఇక్కడ ఉంచిన సంగతి తెలిసిందే.
అసెంబ్లీ వేదికగా బలపరీక్షకు గవర్నర్ 15రోజుల గడువు ఇచ్చినప్పటికీ.. ఈ తంతును సాధ్యమైనంత తొందరగా పూర్తిచేసి.. మెజారిటీ చాటుకోవాలని పళనివర్గం భావిస్తున్నది. తమకు ప్రస్తుతం 124 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని ఆ వర్గం చెబుతున్నది. బలపరీక్ష నాటికి పన్నీర్ గూటికి చేరిన మిగత ఎమ్మెల్యేలు కూడా తమవైపు వస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నది. మరోవైపు చివరివరకు ముఖ్యమంత్రి పదవి కోసం చివరివరకు ప్రయత్నిస్తానని ప్రకటించిన పన్నీర్ సెల్వం.. పళని బలపరీక్షలో నెగ్గకుండా ఏమైనా ఎత్తులు వేస్తారా? మరింత మంది ఎమ్మెల్యేలను తనవైపు లాక్కోగలుగుతారా? అన్నది వేచి చూడాలి.