జార్ఖండ్‌లో కొత్తగా కొలువు దీరిన సీఎం హేమంత్ సోరెన్ నేతృత్వంలోని ప్రభుత్వం నేడు (జూలై 8) అసెంబ్లీలో బల పరీక్షను ఎదుర్కోనుంది. ఈ క్రమంలో సోమవారం అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు కానుంది. సభలో విశ్వాస పరీక్ష పూర్తయిన వెంటనే సోరెన్ తన మంత్రివర్గాన్ని కూడా విస్తరించనున్నారు. కొత్త క్యాబినెట్‌లో సీఎం సతీమణి కల్పనా సోరెన్‌కు చోటు దక్కే అవకాశాలున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఎవరి బలం ఎంత?
కాగా 81 సీట్లున్న అసెంబ్లీలో ప్రస్తుతం 76 మంది సభ్యులున్నారు. అసెంబ్లీ బల పరీక్షలో నెగ్గాలంటే 41 ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ప్రస్తుతం అసెంబ్లీలో జేఎంఎం కూటమికి 45 మంది ఎమ్మెల్యేలున్నారు దీంతో సునాయసంగా సోరెన్ గెలిచే అవకాశాలు ఉన్నాయి.
కాంగ్రెస్, రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ)తో కూడిన జేఎంఎం నేతృత్వంలోని కూటమికి 45 మంది ఎమ్మెల్యేలు ఉండగా.. బీజేపీకి 24 మంది ఉన్నారు. అధికార కూటమిలో జేఎంఎం 27 మంది ఎమ్మెల్యేలతో అతిపెద్ద పార్టీగా ఉంది, కాంగ్రెస్ పార్టీ 17 మంది ఎమ్మెల్యేలతో రెండవ స్థానంలో ఉంది. జార్ఖండ్‌లో ఆర్జేడీకి ఒకే ఒక్క ఎమ్మెల్యే ఉన్నారు.
ఇద్దరు ఎమ్మెల్యేలు నలిన్ సోరెన్, జోబా మాఝీ ప్రస్తుతం ఎంపీలుగా ఎన్నికవ్వడంతో జేఎంఎం బలం 27కు తగ్గింది, అదే విధంగా జామా శాసనసభ్యురాలు సీతా సోరెన్ బీజేపీలో చేరారు. ఇక ఇటీవల జేఎంఎం మరో ఇద్దరు ఎమ్మెల్యేలను (బిషున్‌పూర్ ఎమ్మెల్యే చమ్రా లిండా, బోరియో ఎమ్మెల్యే లోబిన్ హెంబ్రోమ్) పార్టీ నుంచి బహిష్కరించింది.
అదేవిధంగా, జార్ఖండ్ అసెంబ్లీలో బీజేపీ బలం 24కి తగ్గింది, పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు.. బగ్మారా నుంచి ధులు మహ్తో, హజారీబాగ్‌కు ప్రాతినిధ్యం వహించిన మనీష్ జైస్వాల్ లోక్‌సభ ఎన్నికల్లో ఎంపీలుగా గెలిచారు. ఇక కాంగ్రెస్‌లో చేరిన మండు ఎమ్మెల్యే జైప్రకాష్ భాయ్ పటేల్‌ను కాషాయ పార్టీ బహిష్కరించింది.
కాగా జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) నేత హేమంత్ సోరెన్ మూడోసారి ముఖ్యమంత్రిపీథాన్ని అధిరోహించిన విషయం తెలిసిందే. భూకుంభకోణం కేసులో అరెస్టయి ఇటీవలే బెయిలుపై విడుదలైన హేమంత్.. 5 నెలల తర్వాత మళ్లీ జూలై 4న సాయంత్రం జార్ఖండ్ 13వసీఎంగా ప్రమాణం చేశారు. ఝార్ఖండ్ రాజధాని రాంచీలో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ ఆయనతో ప్రమాణం చేయించారు.
ఇక 2013లో తొలిసారిగా జార్ఖండ్‌కు హేమంత్ ముఖ్యమంత్రి అయ్యారు. 2019లో రెండోసారి బాధ్యతలు చేపట్టారు. గురువారం మూడోసారి ముఖ్యమంత్రి అయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment