శశికళ మరోసారి శపథం చేశారు. రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నానంటూ సంచలన ప్రకటన చేశారు. అన్నాడీఎంకేలో చేరి మళ్లీ అమ్మ పాలన తెస్తానంటూ హాట్ హాట్ కామెంట్స్ చేశారు. మరో రెండేళ్లలో అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో తమిళనాట కొత్త రాజకీయ సమీకరణాలకు తెరలేచింది. అసలు.. శశికళ ఎంట్రీ వెనుక కారణమేంటి..? ఇది ఆమె సొంత నిర్ణయమా.? లేక ఆమె వెనుక ఎవరైనా ఉన్నారా..?
తమిళనాడు దివంగత సీఎం జయలలిత నెచ్చెలి శశికళ మళ్లీ యాక్టివ్ అయ్యారు. రాజకీయాల్లో రీఎంట్రీకి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. తన మద్దతుదారులతో సమావేశమైన శశికళ కీలక ప్రకటన చేశారు. అన్నాడీఎంకే పార్టీలోకి తన రీఎంట్రీకి సమయం ఆసన్నమైందంటూ హాట్ కామెంట్స్ చేశారు. పార్టీలోకి తన పున:ప్రవేశం మొదలైందని చెప్పారు. ఇటీవలే వెలువడిన లోక్‌సభ ఎన్నికల్లో దారుణ పరాజయంతో ఏఐఏడీఎంకే పతనమవుతుందని భావించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే విజయం సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేసిన ఆమె.. తిరిగి అమ్మ పాలనకు నాంది పలుకుతామని వెల్లడించారు.
ఇదే క్రమంలో అన్నాడీఎంకే నేత పళనిస్వామిపై విమర్శలు గుప్పించారు శశికళ. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయడం లేదని మండిపడ్డారు. ప్రతిపక్ష పార్టీ నేతగా తాను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తానంటూ తేల్చిచెప్పారు. ఇక.. తమిళనాడు ప్రజలు తమవైపే ఉన్నారని తెలిపారు శశికళ. అన్నాడీఎంకే కథ ముగిసిపోలేదని.. తన రీ ఎంట్రీతో ఇప్పుడే ప్రారంభమయ్యిందంటూ తన మద్దతుదారుల్లో ఆమె ఉత్సాహం నింపారు.
ఎంజీఆర్, జయలలిత హయాంలో అన్నాడీఎంకే చెక్కుచెదరలేదని స్పష్టం చేశారు. కానీ.. ఇప్పుడు పార్టీలో జరుగుతున్న పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయని చెప్పారు. పార్టీలో కుల రాజకీయాలను కార్యకర్తలు సహించరంటూ ఇండైరెక్ట్‌గా పళనిస్వామిని టార్గెట్ చేశారు శశికళ. జయలలిత కుల ప్రాతిపదికన రాజకీయాలు చేసి ఉంటే 2017లో పళనిస్వామి సీఎం అయి ఉండేవారు కాదని విమర్శించారు. అయినా.. ఇప్పుడు పార్టీని బలోపేతం చేయడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు శశికళ. దీని కోసం ప్రయత్నాలను మొదలు పెట్టానని వివరించారు.
ఇప్పుడు.. శశికళ ఎంట్రీతో తమిళనాడు రాజకీయాల్లో కొత్త సమీకరణాలు మొదలయ్యే అవకాశం ఉంది. మరో రెండేళ్లలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో అన్ని పార్టీలు ప్రజల్లోకి వెళ్లడంపై వ్యూహాలు రచిస్తున్నాయి. డీఎంకేను గద్దె దించడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. నిజానికి.. లోక్‌సభ ఎన్నికల్లో అన్నాడీఎంకే ఒక్క సీటూ గెలవలేదు. చాలా చోట్ల మూడు, నాలుగు స్థానాల్లో నిలిచి డీఎంకేకు కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోయింది. ఇదే ఫలితం అసెంబ్లీ ఎన్నికల్లోనూ రిపీట్ అవుతుందంటూ ప్రచారం జరుగుతున్న సమయంలో శశికళ ఎంట్రీ హాట్ టాపిక్‌గా మారింది. అన్నాడీఎంకే విజయంతో మళ్లీ అమ్మ పాలన తీసుకొస్తానంటూ ప్రకటించడం సంచలనంగా మారింది.
శశికళ ఎంట్రీని పళనిస్వామి ఒప్పుకుంటారా..? అంటే కష్టమే అని చెప్పాలి. గతంలోనూ అన్నాడీఎంకేలో ఎంట్రీకోసం ప్రయత్నాలు చేసి ఆమె విఫలమయ్యారు. అప్పుడు పన్నీరు సెల్వం.. పళనిస్వామి ఒక్కటిగా ఉండి శశికళకు ఎంట్రీ లేకుండా చేశారు. ఆ తర్వాత పార్టీపై పట్టుపెంచుకున్న పళనిస్వామి.. పన్నీరు సెల్వంను సైతం బయటకునెట్టారు. కొందరు నేతలు అసంతృప్తిగా ఉన్నా.. ఇప్పటికిప్పుడు పళనిస్వామిని కాదని.. శశికళకు పార్టీ నేతలు పగ్గాలు అప్పగించే పరిస్థితి కూడా లేదు. మరికొందరు పన్నీరుసెల్వంను తిరిగి పార్టీలో చేర్చుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఫలితంగా పార్టీ బలోపేతం అవుతుందని భావిస్తున్నారు. ఇలాంటి సమయంలో శశికళ ఎంట్రీతో సీన్ ఎలా మారుతుందనేది ఆసక్తిగా మారింది.
మరోవైపు.. అన్నాడీఎంకేతో పాటు తమిళనాడులో బీజేపీ పరిస్థితి కూడా అంతంతమాత్రమే. లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి బొక్కాబోర్లా పడింది బీజేపీ. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నామలై గెలుస్తారంటూ విపరీతంగా పబ్లిసిటీ చేసినా.. చివరికి ఆ సీటును కూడా గెలుచుకోలేకపోయింది కమలం పార్టీ. అటు.. పార్టీలోని కీలక నేతల మధ్య కూడా సమన్వయ లోపం ఉంది. బీజేపీ కీలక నేత తమిళి సై, బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు అన్నామలై మధ్య విభేదాలు ఉన్నట్లు పార్టీలోనే చర్చ జరుగుతోంది. ఈ మధ్యే అమిత్ షా బహిరంగంగా తమిళి సైని వారించింది కూడా ఇదే విషయంపై అని ప్రచారం జరిగింది. అది నిజమో కాదో తెలియదు కానీ.. అమిత్ షా మాట్లాడిన తర్వాత.. అన్నామలై, తమిళి సై భేటీ అయ్యారు. తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని చెప్పుకునే ప్రయత్నం చేశారు.
ఈ క్రమంలోనే శశికళ ఎంట్రీ ఇవ్వడం యాథృచ్చికం కాదంటున్నారు విశ్లేషకులు. శశికళ ఎంట్రీ వెనుక బీజేపీ ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి. కేంద్రంలోని బీజేపీ పెద్దలతో టీటీవీ దినకరన్‌కు మంచి సంబంధాలు ఉన్నాయి. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లోనూ బీజేపీతో కూటమిగా ఏర్పడి దినకరన్ పార్టీ పోటీ చేసింది. దీంతో దినకరన్ ద్వారానే ఇప్పుడు శశికళను బీజేపీ రంగంలోకి దింపిందని అంతా భావిస్తున్నారు. పన్నీరుసెల్వం, దినకరన్, శశికళ చేరిన అన్నాడీఎంకే తో తమ పార్టీ పొత్తు పెట్టుకుంటే.. డీఎంకేను ఓడించడం పెద్ద కష్టమేమీ కాదన్నది బీజేపీ భావనగా తెలుస్తోంది.
మరి నిజంగానే శశికళ అన్నాడీఎంకేలోకి ఎంట్రీ ఇస్తుందా..? ఇచ్చినా ఆమె బీజేపీతో పొత్తు పెట్టుకుంటుందా.? ఈలోపు తమిళ రాజకీయాల్లో ఇంకెన్ని మార్పులు చోటు చేసుకుంటాయో వేచి చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment