Tamil Nadu: I am AIADMK General Secretary, Says Sasikala - Sakshi
Sakshi News home page

అన్నాడీఎంకేలో వర్గపోరు.. నేనే అధినేత్రిని, మీడియాతో శశికళ వ్యాఖ్యలు

Published Fri, Jul 8 2022 1:20 PM | Last Updated on Fri, Jul 8 2022 2:04 PM

Tamil Nadu: Iam AIADMK General Secretary Says Sasikala - Sakshi

సాక్షి , చెన్నై : ‘‘ప్రధాన కార్యదర్శి పదవి ఇంకా నా చేతుల్లోనే ఉండగా, ఆ పీఠం కోసం మీలో మీకు ఘర్షణలేల’’.. అని అన్నాడీఎంకే బహిష్కృతనేత శశికళ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీపై ఆధిపత్యం కోసం ఎడపాడి పళనిస్వామి, పన్నీర్‌సెల్వం మధ్య హోరాహోరీ పోరు కొనసాగుతుండగా, మధ్యలో శశికళ నేనున్నాంటూ వచ్చేశారు. రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తూ పార్టీ శ్రేణులను కలుసుకుంటున్న చిన్నమ్మ విళుపురంలో మీడియాతో మాట్లాడుతూ, అన్నాడీఎంకే ఏ ఒక్కరి సొత్తు, ప్రయివేటు సంస్థ కాదని ఆమె అన్నారు.

ప్రజలకు సేవ చేసేందుకు ఎంజీ రామచంద్రన్‌ ఆ పార్టీని స్థాపించారని ఆమె గుర్తు చేశారు. జయలలిత రాజకీయ జీవితంలో వెన్నంటి నిలిచిన కాలంలో ఆమె ఆనేక విషయాలు తనతో పంచుకున్నారని చిన్నమ్మ వెల్లడించారు. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిని తానేనని, ప్రజలు చూపిన మార్గంలో తాను పయనిస్తున్నానని చెప్పారు. కొత్తగా ప్రధాన కార్యదర్శిని ఎన్నుకోవడం వ్యక్తిగత హోదాలో కుదరదు, పార్టీ కార్యకర్తలే తీర్మానించాలని స్పష్టం చేశారు. పార్టీలో చోటుచేసుకుంటున్న పరిణామాలను ప్రజలు గమనిస్తున్నారు, ద్రోహులను ప్రజలు క్షమించరని ఆమె హెచ్చరించారు. అదును చూసి సరైన బదులిస్తానని వ్యాఖ్యానించారు. 
చదవండి: భారీ వర్షాలు.. నదిలో కొట్టుకుపోయిన కారు.. 9 మంది మృతి

ఆ పదవుల కాలం చెల్లిపోలేదు : కోర్టు 
అన్నాడీఎంకే సమన్వయ కమిటీ కన్వీనర్, కో కన్వీనర్లుగా పన్నీర్‌సెల్వం, ఎడపాడి పళనిస్వామిల పదవీకాలం ముగిసిపోలేదని మద్రాసు హైకోర్టు గురువారం ఓ కేసు విచారణ సందర్భంగా స్పష్టం చేసింది. ఆయా పదవుల్లో వారిద్దరూ కొనసాగుతున్నట్లేనని తెలిపింది. ఈనెల 11వ తేదీన తాము తలపెట్టినది సర్వసభ్య ప్రత్యేక సమావేశమని, పార్టీలో కన్వీనర్, కో కన్వీనర్‌ పదవులు ప్రస్తుతం లేవని ఎడపాడి వ్యాఖ్యానించారు. 

పార్టీ కార్యాలయానికి అదనపు బందోబస్తు.. 
అన్నాడీఎంకేలో వర్గపోరు రోజురోజుకూ వేడెక్కుతున్న దశలో అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్‌ యంత్రాంగం అప్రమత్తమైంది. చెన్నై రాయపేటలోని పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద గతంలో ఎన్నడూ లేని రీతిలో భారీ బందోబస్తును పెట్టింది. యధావిధిగా బందోబస్తులో ఉండే పోలీసులు కాకుండా ఎస్‌ఐ నేతృత్వంలో 10 మందితో కూడిన సాయుధ పోలీసులు బుధవారం రాత్రి నుంచి బందోబస్తుగా నలిచి ఉన్నారు. సర్వసభ్య సమావేశంలో గొడవలు లేవనెత్తేలా అసాంఘిక శక్తులు జొరబడకుండా ఎడపాడి పళనిస్వామి జాగ్రత్త పడుతున్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఆహ్వాన పత్రాలను పంపుతున్నారు. ఆ పత్రికను స్కాన్‌ చేస్తేనే ప్రవేశం కల్పించేలా తీసుకున్న ఈ చర్యలు ఎడపాడి వర్గీలను సంతోష పెడుతుండగా, పన్నీర్‌ మద్దతుదారులు డీలాపడిపోయారు. 

పిల్‌పై రూ.25 వేల జరిమానా 
రెండాకుల గుర్తుపై నిషేధం విధించాలని కోరుతూ ప్రజా ప్రయోజన వాజ్యం దాఖలు చేసిన వ్యక్తిపై మద్రాసు హైకోర్టు రూ.25 వేల జరిమానా విధించింది. అన్నాడీఎంకే రెండాకుల చిహ్నంపై నిషేధం విధించాలని ఆ పార్టీ మాజీ నేత పీఏ జోసెఫ్‌ మద్రాసు హైకోర్టులో ఇటీవల ఓ పిటిషన్‌ వేశారు. ఆ పిటిషన్‌లోని వివరాలు ఇలా ఉన్నాయి. ‘అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పదవి కోసం మాజీ ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి రూ.5 వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు ఒక వారపత్రికలో వార్త వచ్చింది. ఈనెల 11వ తేదీన జరగనున్న సర్వసభ్య సమావేశంలో ప్రధాన కార్యదర్శిగా ఎంపిక కోసం ఆయన మరో రూ.1000 కోట్లు వెచ్చిస్తున్నట్లు ఆ పత్రికలో పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో ఈపీఎస్, ఓపీఎస్‌ల మధ్య సాగుతున్న రాజకీయపోరు కులపరమైన పోటీగా మారింది. దీంతో రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. ఈ కారణంగా అన్నాడీఎంకే  రెండాకుల గుర్తుపై నిషేధం విధించి పార్టీకి వ్యతిరేకంగా చర్యలు తీసుకునేలా ఎన్నికల కమిషన్‌ను ఆదేశించాలి’.. అని పేర్కొన్నారు. ప్రధాన న్యాయమూర్తి మునీశ్వరనా«థ్‌ భండారీ, న్యాయమూర్తి ఆర్‌ మాలా బెంచ్‌ ముందుకు విచారణకు వచ్చింది. మీరసలు పార్టీ సభ్యులా అంటూ తొలుత ప్రశ్నించారు. ప్రచారం కోసం పిల్‌ వేసిన జోసెఫ్‌పై రూ.25 వేలు జరిమానా విధిస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం వ్యాజ్యాన్ని తోసిపుచ్చారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement